సబ్ ఫీచర్

క్రీడలకు నాయకుల గ్రహణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ జనాభాలో మనది రెండవ స్థానం. 2020నాటికి ప్రథమ స్థానంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే, అంతర్జాతీయ స్థాయిలో క్రీడలలో మన స్థానం ఎక్కడ అంటే భూతద్దం పెట్టి వెతుక్కోవాల్సిందే. దీని కారణం క్రీడలకు, క్రీడాకారులకు తగిన ప్రోత్సాహం, కనీస సౌకర్యాలు లేకపోవడమే. అన్ని క్రీడలకు సంబంధించిన సంఘాలు మన దేశంలో ఉన్నాయి. అయితే, అవి రాజకీయ నాయకులకు, మాజీ బ్యూరోక్రాట్స్‌కు పునరావాస కేంద్రాలుగా మారుతున్నాయి. ఆయా క్రీడలలో మంచి ప్రతిభ కనపరచిన క్రీడాకారుల నేతృత్వంలో పనిచేస్తున్న క్రీడాసంఘాలు లేవు.
మన జాతీయ క్రీడ హాకీ. ఒకానొకప్పుడు భారతీయులతో హాకీ ఆడటం అంటే, తమకు ఓటమి తప్పదనే భావనలో ప్రత్యర్థి జట్లు ఉండేవి. అయితే, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. దానికి కారణం, జాతీయ హాకీ సంఘంలో రాజకీయాలు ముదిరి పాకానపడటమే. గత ఐదు సంవత్సరాలలో నలుగురు హాకీ కోచ్‌లను మార్చారు. ఈ విధంగా కోచ్‌లను తరచు మార్చడంవలన హాకీ జట్టును పటిష్టవంతంగా తీర్చిదిద్దే అవకాశం లేకుండా పోతున్నది. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ పరిస్థితి అయితే, మరింత దారుణంగా ఉంది. ఈ సంఘానికి ఎప్పుడు ఎన్నికలు జరిగినా అవి వివాదాస్పదమే. కోర్టు గడపతొక్కకుండా ఒలింపిక్ అసోసియేషన్‌కు ఎన్నికలు జరిగిన దాఖలాలు లేవు. రాష్ట్రాలలోఉన్న ఒలింపిక్ అసోసియేషన్‌ల పరిస్థితి కూడ దాదాపుగా అంతే ఉంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్‌కు జరిగిన ఎన్నికలలో అధ్యక్ష పదవికోసం తెలుగుదేశం పార్టీ ఎంపీలు సి.ఎం.రమేష్, గల్లా జయదేవ్‌లు పోటీపడ్డారు. చివరకు కోర్టులను కూడా ఆశ్రయించారు. పార్టీ పరువు బజారున పడుతుందనే భయంతో, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కలుగచేసుకొని, ఈ వివాదాన్ని పరిష్కరించారు. దాదాపుగా అన్ని రాష్ట్రాల ఒలింపిక్ అసోసియేషన్లలో ఇదే పరిస్థితి నెలకొని ఉంది. బాట్మింటన్, అర్చరీ, బాక్సింగ్, ఒక్కటేమిటి అన్ని క్రీడా సంఘాలలో రాజకీయ నాయకులు తిష్టవేసి, తమ ప్రచారం, హోదాకోసం ఈ క్రీడా సంఘాలను వినియోగించుకొంటున్నారు.
ప్రస్తుతం మన దేశంలో అత్యంత ప్రాచుర్యం కలిగిన క్రీడలలో క్రికెట్‌దే అగ్రస్థానం. ఎక్కువ ప్రాచుర్యం కలిగి ఉండటంతోపాటు, కోట్లాది రూపాయల నిధులు కూడ ఉండటంతో, పలువురు రాజకీయ నాయకులు క్రికెట్ సంఘాలలోకి ప్రవేశిస్తున్నారు. వీరిలో క్రికెట్ అభివృద్ధికి కృషిచేస్తున్న వారికన్నా, స్వయం సమృద్ధికి పాటుపడుతున్నవారే ఎక్కువ.
భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ప్రస్తుతం గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. నరేంద్రమోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన 2014 సాధారణ ఎన్నికలకు ముందు బిజెపి ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎంపికైన తరువాత, అధ్యక్ష బాధ్యతలు అమిత్‌షాకు అప్పగించారు. నిత్యం పార్టీ రాజకీయాలలో తలమునకలై ఉండే, అమిత్‌షా క్రికెట్ అభివృద్ధికి ఏమాత్రం కృషిచేయగలరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్‌పవార్ రాష్ట్ర స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు క్రికెట్ సంఘాల అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ముంబాయి క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. దేశాన్ని ప్రభావితం చేయగల నాయకులలో పవార్ ఒకరు. అయినప్పటికీ ఆయన మాత్రం తన పదవిని వదులుకోవడానికి ఇష్టపడరు.
ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ చైర్మన్‌గా కొనసాగుతున్న రాజీవ్‌శుక్లా కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నాయకుడు. ఆయన ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిగా, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ఉపాధ్యక్షుడిగా కూడ కొనసాగుతున్నారు. మాజీ కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింథియా మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. పార్లమెంట్ సభ్యుడు కూడ అయిన ఆయన, పార్లమెంట్ సమావేశాలు, రాష్ట్రంలో పార్టీని పటిష్టపరచడం వంటి కార్యక్రమాలలో నిత్యం బిజిబిజీగా ఉంటారు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ఫైనాన్స్ కమిటీ ఛైర్మన్‌గా ఆయన వ్యవహరిస్తున్నారు.
జమ్మూ-కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా రెండున్నర దశాబ్దాలుగా ఆ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు. అయితే, క్రికెట్ అసోసియేషన్ చైర్మన్ పదవిని మాత్రం వదలక పోవడం గమనార్హం. నిధుల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలు రావడంతో ప్రస్తుతం ఆయనపై విచారణ జరుగుతున్నది. ఇటీవల జమ్మూ-కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఆయనను తొలగించి, కార్యవర్గానికి ఎన్నికలు జరిపారు. తన పదవీ కాలం ఇంకా రెండు సంవత్సరాలు ఉన్నప్పటికీ తనను పదవినుంచి తొలగించారని, ఇది చెల్లదంటూ ఆయన కోర్టుకెక్కారు. కోర్టు ఇచ్చిన స్టే ఆధారంగా ఆయన జమ్మూకాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్‌లో ట్రబు ల్ షూటర్‌గా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జెట్లీని పిలుస్తారు. 2013 వరకు ఆయన ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు. భారత క్రికెట్ కంట్రో ల్ బోర్డ్‌లో ఏ సమస్య వచ్చినా, అందరి కళ్ళు అరుణ్‌జెట్లీ వైపు చూస్తాయి.
హిమాచల్‌ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షునిగా బిజెపి ఎం.పి. అనురాగ్‌ఠాకూర్ వ్యవరిస్తున్నారు. ఆయన హిమాచల్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ప్రేమ్‌కుమార్ దూ మాల్ కుమారుడు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ కార్యదర్శిగా ఉన్న ఆయన, తన సొంత రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధికి కృషిచేస్తున్నారు. రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అమిన్ ప్రధాన్, బిజెపి నాయకుడు. రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే మద్దతుదారుడు. ఐపిఎల్ మాజీ చీఫ్ లలిత్‌మోడీకి బద్ధ విరోధి.
ఆంధ్ర క్రికెట్ అసోయేషన్ అధ్యక్షుడు గోకరాజు గంగరాజు. ప్రముఖ పారిశ్రామికవేత్త. 2014 ఎన్నికలలో ఆయన బిజెపి తరఫున నరసాపురం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అమితాబ్‌చౌదరి 2014లో బిజెపిలో చేరారు. ఆయన గతంలో జార్ఖండ్ ముక్తిమోర్చా పార్టీలో కీలకమైన పాత్ర పోషించారు. కాంగ్రెస్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు రణ్‌జిబ్‌బిస్వాల్ ప్రస్తుతం ఒడిషా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఉన్నారు. ఆయన ఒడిషా మాజీ ఉప ముఖ్యమంత్రి బసంత్ బిస్వాల్ కుమారుడు. బరోడా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షునిగా వడోదర మహారాజ సమర్‌జిత్‌సింగ్ గైక్వాడ్ ఉన్నారు. ఆయన భారతీయ జనతాపార్టీ మద్దతుదారుడు. ఈ విధంగా పలు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు క్రీడా సంఘాలలో తిష్ఠవేయడం క్రీడల అభివృద్ధికి ప్రధాన ప్రతిబంధకంగా మారింది.

- పొనుగుపాటి భార్గవరామ్