సబ్ ఫీచర్

మాతృభాష పరిరక్షణకు మరో సత్యాగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమ్మభాషను కాపాడుకొనేందుకు, స్వాభిమానాన్ని చాటుకొనేందుకు అవసరమయ్యే నిర్మాణాత్మక ఉద్యమ సారథ్యానికి విజయవాడలో ఇటీవల జరిగిన 4వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు దిశానిర్దేశం చేశాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధనను నిర్బంధం చేయడంపై ఈ మహాసభల్లో నిరసన వ్యక్తమైంది. 2019 సంవత్సరాన్ని ‘అంతర్జాతీయ మాతృభాషల పరిరక్షణ సంవత్సరం’గా ఐక్యరాజ్యసమితి ప్రకటించిన నేపథ్యంలో మహాసభల వేదిక తెలుగు మేధావుల గుండె తలుపులు తట్టే లక్ష్యంతో ప్రతిధ్వనించింది. ఉభయ తెలుగు రాష్ట్రాల రచయితలు, భాషాభిమానులు, వివిధ రంగాల మేధావులు తరలివచ్చి- అమ్మభాషకు అనాదిగా ఉన్న మహోన్నత వారసత్వ ప్రాభవాన్ని చాటి చెప్పారు. తెలుగు భాషా పరిశోధనకు మార్గదర్శి కొమర్రాజు లక్ష్మణరావు, వ్యావహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి, తెలుగు భాష పరిరక్షణకు ఎనలేని సేవలందించిన సురవరం ప్రతాపరెడ్డిలను తెలుగుజాతి వైతాళికులుగా గుర్తించి, వారి స్మృత్యర్థం మహాసభలో ప్రాంగణాలను ఏర్పాటు చేయడం సముచితం. రచయితలు, మేధావులు, రాజకీయ ప్రముఖుల ప్రసంగాలతో, చర్చలతో, విశేష కార్యక్రమాలతో మహాసభలు స్ఫూర్తివంతంగా కొనసాగాయి.
భాషాపరిరక్షణోద్యమానికి మరింత ఉత్తేజవంతంగా సమాయత్తం కావలసిన అవసరాన్ని ఈ మహాసభలు గుర్తు చేశాయి. భాషాప్రయుక్త రాష్ట్రాల ఆవిర్భావానికి నాంది పలికిన తెలుగు భాష మహోన్నతిని నీరుకార్చేలా ఎవరు ఏ ప్రయత్నాలు చేసినా ఎదురొడ్డి, భాషాసంస్కృతుల సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలని మహాసభ పిలుపుయిచ్చింది. ప్రాచీన కవులకు, మహాపండితులకు, యుగకర్తలైన సాహితీవేత్తలకు నివాళిగా తెలుగు సాహితీ చైతన్య ప్రాభవ దీప్తితో ఉమ్మడి రాష్ట్రంలోను, ప్రత్యేక రాష్ట్రాల ఆవిర్భావం తరువాత కూడా తెలుగు రచయితల మహాసభలు నిర్వహించబడుతూనే వున్నాయి. జాతి చరిత్రను నిర్మించగలిగే శక్తి యుక్తుల కోసం రచయితలు ఎప్పటికప్పుడు మేధావి వర్గంతో చేతులు కలిపి సారధ్యం వహించవలసిందే.
నాల్గవ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల గౌరవాధ్యక్షుడు డా.మండలి బుద్ధప్రసాద్ తన అధ్యక్షోపన్యాసంలో- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఆంగ్ల మాధ్యమాన్ని విద్యార్థులపై రుద్దుతూ, తెలుగు మాధ్యమాన్ని రద్దు చేయడం బాధాకరమైనదని, ఈ పరిస్థితుల్లో తెలుగు భాషను ఎలా పరిరక్షించుకోవాలన్న విషయమై అంతా ఆలోచించాలని కోరారు. ఇప్పుడు స్వపరిపాలన ద్వారా ఆంగ్ల బానిసత్వంలోకి మనల్ని నెట్టివేస్తూ, తెలుగును నిషేధించే పరిస్థితులొచ్చాయని, మహాసభలకు తరలివచ్చిన ప్రతి ఒక్కరూ భాషాసత్యాగ్రహులుగా మారాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ప్రజలంతా తమ భాషాసంస్కృతుల సార్వభౌమత్వాన్ని కాపాడుకొనేందుకు భాషా సత్యాగ్రహులుగా మారేలా తెలుగు భాషకు గుడికట్టాలని ఆయన అభ్యర్థించారు. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర భాషా సాంస్కృతికశాఖ సౌజన్యంతో కృష్ణాజిల్లా రచయితల సంఘం గతంలోనూ మహాసభలు నిర్వహించింది. అప్పుడు కూడా ప్రాథమిక విద్యకు మాతృభాషను మాధ్యమంగా ఉంచాలని, పిల్లల్లో మాతృభాషపట్ల ప్రేమ, గౌరవాలను పెంచేలా ద్వేష రహితమైన విద్యావ్యవస్థ ఉండాలని మహాసభ ఆకాంక్షించింది. తెలుగు చదవటం, తెలుగులో మాట్లాడటం, తెలుగులో ఆలోచించటం ఇవి తెలుగువారి మనోవికాసానికి తోడ్పడే ముఖ్యాంశాలుగా తెలుగు రచయితలు, భాషావేత్తలు, సాహిత్యాభిమానులు, రాజకీయ పార్టీలు మేధావులు నేటికీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఏకత్రాటిపై తెలుగు భాషోన్నతి, భాషాపరిరక్షణ లక్ష్యానికి అంకితమవుతున్నారు. ఇంటి తల్లి పలుకును, బడి చదువు భాషగా, ఏలుబడి భాషగా వర్ధిల్లచేయాలనే తపన సర్వత్రా నెలకొని వుంది. భాషోద్యమాలు రూపుదిద్దుకొంటున్నాయి.
విద్యను కేవలం ఉపాధి కల్పించే సాధనంగా భావిస్తూ ప్రస్తుత ఏపీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవటం పట్ల మహాసభలలో కొందరు మేధావులు ప్రత్యక్షంగా తీవ్ర ఆందోళనను వ్యక్తం చేశారు. ఆంగ్లం లేకుండా ఉన్నతస్థాయికి చేరుకొన్న దేశాల వివరాలను పలువురు రచయితలు, మేధావులు తమ ప్రసంగాలలో ఉదహరించారు. అమ్మ భాషను రక్షించుకోవటానికి స్వాభిమానం చాటుకొనే శక్తివంతమైన భాషోద్యమ నిర్మాణ అగత్యం వచ్చిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు మాధ్యమం కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉండగా, ఇరుగు పొరుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు తెలుగు భాష నిర్మూలనకు తప్పక చర్యలు చేపట్టి తెలుగుకు మరింత దుస్థితి కలిగే ప్రమాదం పొంచి వుందని రాష్ట్రేతర తెలుగుభాషా సంఘాల అధ్యక్షులు, అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు వచన, పద్యకవులు తమ సాహితీ ప్రక్రియలలో మాతృభాషా మాధుర్యంతోపాటు ప్రస్తుత స్థితిగతుల పట్ల అసంతృప్తి, నిరసన, ఆగ్రహావేశాలను ప్రదర్శింపచేసారు. ఊరూరా తెలుగు వేదికల ఏర్పాటుకు పిలుపుయిచ్చారు. బలవంతంగా ఆంగ్లంలో చదివించటం వల్ల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అవుతుందని హెచ్చరించారు. 11 తీర్మానాలు ఆమోదించటంతో మహాసభ తొలి మెట్టుగా విజయవంతమైంది.
మహాసభల్లో తెలుగు మాధ్యమంపైనే ఎక్కువ చర్చ జరగడంతో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇదంతా జరిగిందనే గుసగుసలు లేకపోలేదు. సాంకేతికంగా పదాలు లేని భాష, అభివృద్ధి చెందని భాష అధునాతన శాస్ర్తియ సాంకేతిక ఉపాధి, ఉద్యోగాలకు పొందటానికి ఎలా తోడ్పడగలదని, ముందుగా తెలుగు భాషాభివృద్ధి సాధించాలని కొందరు అభిప్రాయాలు వ్యక్తంచేసారు. సంపన్నులు, పెద్దలు, ప్రముఖులు తమ పిల్లలను ఎక్కడ చదివిస్తున్నారో తాము ముందుగా ఆలోచించుకొని మాట్లాడాలన్నారు. తెలుగు భాషకు వచ్చిన ప్రమాదం ఏదీ లేదని, మాతృభాషను మృతభాషగా చేయటం అసాధ్యమని దీనిపై ఎవరూ ఎటువంటి ఆందోళన చేయవలసిన అవసరం లేదని కొందరు వ్యక్తిగత అభిప్రాయాలు వ్యక్తంచేసారు. ఏది ఏమైనా 2020 నూతన సంవత్సర ఆరంభంలో తొలి వేకువ మరింత వివాదగ్రస్తం కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరైన చర్యలను సత్వరం చేపట్టాలి.

-జయసూర్య