సబ్ ఫీచర్

వంటింట్లో వలంటీర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అత్తగారూ మామగారూ వచ్చారని మా అమ్మాయి రమ్మనడంతో, రైలెక్కి వాళ్ళ ఊరు చేరాను. వారిని చూసి 3, 4 సంవత్సరాలైంది. ఆ రోజు ఆదివారం మా అల్లుడు వచ్చి నన్ను ఇంటికి తీసుకెళ్ళాడు. అంతా ఇంట్లోనే ఉన్నారు. నే వెళ్ళేసరికి ఉపాహర సమయం కావచ్చింది. నేను స్నానాదులు ముగించుకుని వచ్చేసరికి అంతా నా కోసం టేబుల్ చుట్టూతా కాచుక్కూర్చున్నారల్లే వుంది.
‘‘అదేంటర్రా! మీరు కానిచ్చైకపోయారూ! సారీ అన్నయ్యగారూ! వదినగారూ!’’ అన్నాను, నా ఆలస్యానికి సిగ్గుపడుతూ. అమ్మాయి వాళ్ళ అత్తగారు ‘‘అదేంటి వదినగారూ! అందరం కలిసి తింటే అదో తుత్తీ’’ అంది సాగదీస్తూనూ. అందరం ఆ అనుకరణకు నవ్వాం. హాట్ ప్యాక్‌లోంచి ఘుమఘుమలాడే సేమ్యా ఉప్మా పైకే కనిపించే పచ్చి బఠానీలు, క్యారెట్ ముక్కలూ, కరివేప, కొత్తిమీర, జీడిపప్పుతో నోరూరిస్తుండగా అంతా ‘బ్రహ్మార్పణం..’ అంటూ ప్రార్థన చేసేసి, ఎవరివారే వడ్డించుకుంటూ కావాల్సిన చెట్నీలు, నెయ్యి, కారప్పొడీ డైనింగ్ టేబుల్‌మధ్యలో ఉన్న చక్రాన్ని తిప్పుకుంటూ వేసుకుంటూ తినడం ప్రారంభించారు.
అంతా తినేశాక మా అమ్మాయి అందరికీ కాఫీ కలపను వంట గదిలోకెళ్లింది. వెనకాలే మా అల్లుడు పెద్ద ట్రేలో కప్పులన్నీ సర్దసాగాడు. వాళ్ల అత్తగారు చట్నీ తీసుకెళ్లి ఫ్రిజ్‌లోపెట్టి, కారప్పొడి, నేతి గినె్న వాటి స్థానాలకు చేర్చారు. వాళ్ళ మామగారు అంతా నీళ్ళు త్రాగిన గ్లాసులన్నీ ఒకదాన్లో ఒకటి వేసి పక్కన పెట్టగా, మా మనవరాలు ఆ గ్లాసులూ, అంతా తిన్న ప్లేట్లన్నీ తీసుకెళ్లి షింక్‌లో వేసింది. మనవడు ఒక పేపర్ టవల్ తీసుకుని టేబులంతా కాసిని నీళ్ళు చిలకరించి తుడిచాడు. నేను తెల్లబోయి అంతా చూస్తున్నాను.
కాఫీ ట్రే మా అల్లుడు తెచ్చి టేబుల్‌మీద పెట్టగా అంతా ఎవరికి కావాల్సినంత పంచదార కలుపుకుని త్రాగేశారు. నా కూతురు నాకు కేటాయించిన గదిలోకొచ్చి కూర్చుంది. నా ఆరో గ్యం అన్నయ్య, వదినల ఉద్యోగాల గురించీ మాట్లాడసాగింది. నేను ఉండబట్టలేక ‘‘ఏంటే అమ్మాయ్! ఇలా పెద్దవాళ్ళచేతా, అల్లుడి చేతా పనులు చేయిస్తున్నావ్!’’ అన్నాను ఆశ్చర్యంగా.
‘‘అంతా తింటున్నాం కదా, పనులు చేస్తే తప్పేంటి! అందరికీ నీవే చేయడం మొదలెడితే ఎప్పటికి బయటపడేట్లు? ఐనా అందరూ తలో చెయ్యేస్తే పని ఎంత సులువుగా ఉంటుందో చూడూ!’’ అంటూ మా అత్తగారు, ఇలా వాలంటీర్లను ఏర్పరచారు. ఈ పనంతా నేనొక్కదానే్న చేస్తే..? అని అంటూండగా వాళ్ళ అత్తగారు పిలవడంతో లేచి వెళ్తూ, ‘‘నీవూ రావే అమ్మా! డైనింగ్ టేబుల్ వద్ద కూర్చుందాం’’ అంది. నేనూ నా బీపీ మాత్రలు అవీ మింగేసి, లేచి హాల్లోకెళ్ళను.
అక్కడ నేను చూసిన దృశ్యం నాకు మహావింతగా అనిపించింది. వాళ్ల మామగారు గోంగూర వలుస్తున్నాడు. అత్తగారు కూరలు తరుగుతున్నారు, మా మనవడు నిచ్చెనేసుకుని ఫాన్లని తుడుస్తున్నాడు. మనవరాలూ బట్టలు ఐరన్ చేస్తోంది. అల్లుడు వేస్ట్ పేపర్లు, పాత న్యూస్‌పేపర్లూ, ఇంకా పనికిరాని చెత్తా, రీసైకిల్‌కేసే వస్తువులూ అన్నీ బ్యాగుల్లో సర్దుతున్నాడు. మా అమ్మాయి వంట గదిలో బియ్యమూ పప్పూ అవీ కుక్కర్లో పెట్టే పనిచూస్తున్నది.
‘‘రండి వదినగారూ! కూర్చోండి’’ అంటూ ఆహ్వానించింది ఆమె. ‘‘రా చెల్లెమ్మా!’’ అంటూ అన్నయ్యగారు ఆహ్వానించారు, వాళ్ల మామగారు. నేనూ కాసిని గోంగూర కాడలు తీసి ఆకులు వలుస్తుండగా, ఆ కబురూ ఈ కబురూ అంతా చెప్పుకుంటూండగా, ఒక్క గంటలో వంటంతా అయపోయి అన్నీ హాట్ ప్యాక్‌లో సర్దేశాక, ‘‘ఇహ పదండి, అంతా కారెక్కండి. మాల్‌కెళ్లి ఎవరికి కావాల్సినది వారు కొనుక్కొచ్చేదాం. మీరూ రండి అత్తయ్యగారూ! కొత్తగా ఒక మాల్ పెట్టారు అన్నీ ఒకేచోట కొనేయొచ్చు’’ అంటూ అల్లుడు కారు తీశాడు.
కార్లో వెళుతుండగా మా అమ్మాయి అత్తగారు నాతో మెల్లిగా చెప్పారు. ‘‘మీకు కాస్తంత కొత్తగా ఉందేమో! మేం వచ్చాక ఈ ఏర్పాటు చేశాం వదినగారూ! అంతా మా కోడలు చేసేసరికి అలసిపోతున్నది. గృహిణి ఐనంత మాత్రాన అందరి పన్లూ నెత్తినేసుకుని రాత్రింబవళ్ళూ వంటింటికి అంకితమైపోవాలా? ఏం కాస్తంత విశ్రాంతి కావద్దుటండీ! అందుకే అందరం తలో పనీ చేసేసి అంతా కలిసి హాయిగా ఇలా బయటికెళ్ళి, ప్రతి ఆదివారం కావాల్సినవన్నీ తెచ్చుకుంటుంటాం. మిగతా రోజుల్లోనూ అందరం తలో పనీ అందుకుంటాం. ఎవరి పన్లమీద వారెళ్ళిపోతుంటారు. మేం మాకు తోచిన గుడికో, పార్కుకో వెళతాం. ఇదంతా మా ప్లానేనండి! ఆ పిల్ల అలా రోజస్తమానం పనిచేసుకుంటూ ఉంటుంటే, ఊరికే కూర్చుని మాకు మాత్రమేం తోస్తుంది చెప్పండీ! చూడండి వదినగారూ! ఆడవాళ్ళమైన మనమే కనీసం మన ఇంటి ఆడపిల్లలకు సాయం చేయకపోతే మరెవరు చేస్తారు? ఒలింపిక్స్‌లో సైతం పాల్గొని దేశ ప్రతిష్ఠను పెంచుతున్న మన జాతి ఆడవాళ్ళను చూసి మనం గర్వపడటం లేదూ! అలాంటిది మన ఇంటి ఆడపిల్లలను యంత్రాల్లా, పూర్వంలా వం టింటి కుందేళ్ళను చేయడం ధర్మమా! ఏం మగవాళ్ళైనంత మాత్రాన ఇంటి పనులకు సాయం చేయకూడదా! వాళ్ళలాగానే ఆడపిల్లలూ ఉద్యోగాలు చేయట్లేదూ, అలాంటప్పుడు మగ పిల్లలు ఇంట్లో పనులకు సాయం చేస్తే తప్పేముంది! అందుకే మేం ఈ నిర్ణయం తీసుకున్నాం. మా కోడ్లు కాస్తంత ఊపిరి పీల్చుకుంటూ తనకు ఇష్టమైన సంగీత పరిజ్ఞానాన్ని పెంచుకుంటున్నది. ఎంత బాగా వీణ వాయిస్తున్నదో రాత్రికి వినండి’’ అని నాతో చెప్తుం టే, మా ఇంటి పరిస్థితి తల్చుకుని ఆ మనస్సంత అదోలా ఐపోయింది. మా కోడలు సాప్ట్‌వేర్ ఇంజనీరు. రాత్రింబవళ్లూ ఆఫీస్ పనే కాక అందరికీ తలో ఐటం చేయాలి, ఏ ఒక్కరూ ఒక్క పనీ అందుకోరు. ఏ ఒక్కరికీ ఒకే కూర నచ్చదు. కోడలు ఉదయానే్న లేచి అన్ని పన్లూ చేసి అందరి టిఫిన్ బాక్సులూ సర్దుతుంది. వెళ్లబోయే ముందు అంతా లేచి తలో రుచీ అడుగుతారు. కొడుక్కు ఇడ్లీలోకి కొబ్బరి పచ్చడంటాడు. మనవడు ‘్ఛ ఇడ్లీ ఏంటే ఆ పిండితోనే ఊతప్పమన్నా వెయ్. లంచ్ బాక్స్‌లోకి కాస్త పాస్తానో, పిజానో చేయొచ్చుగా!’ అంటాడు. మనవరాలు ‘ఉప్మా’ అంటుంది. లంచ్‌బాక్స్‌లో పెట్టిన కూరలు ఎవరికీ నచ్చవు. విసుక్కుంటూ పోతారు. ఎవ్వరికీ తనతో సహా బాధ్యతే లేదు. రోజూ వేపుకు తింటారు. చివరి నిముషం వరకూ ‘బిజీ బీలా’ తిరుగుతూ, ఇంత టిఫినైనా నోట్లో వేసుకోకుండా, కోడలు పరుగులు పెడుతూ వెళ్తుంది స్కూటరెక్కి. తానెప్పుడైనా ఆమె గురించీ ఆలోచించిందా! ఒక్కమారైనా ఏదైనా చిన్న సాయం చేసిందా! ఇంట్లో వాళ్ళను కాస్తంత సర్దుకుపొమ్మని సలహా ఐనా ఇచ్చిందా! ఈ పెద్దవాళ్ళకున్న ఆలోచనా జ్ఞానం తనకు లేకపోవడం ఎంత సిగ్గుచేటూ! మా ఇంట్లోనూ ‘వంటగది వాలంటీర్లను తయారుచేసి తీరుతాను’ అనే ఒక దృఢ నిశ్చయానికి వచ్చి తిరుగు ప్రయాణమయ్యాను.

- హైమా శ్రీనివాస్