సబ్ ఫీచర్

ప్రజాహితం కోసమే ఈ చట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పౌరసత్వ సవరణ చట్టం (సి.ఎ.ఎ) లోక్‌సభలో ఆమోదం పొందిన దగ్గరనుంచీ ప్రతిపక్ష పార్టీలు అన్నీ కలసి దుర్మార్గమైన, దుష్ఠమైన చర్యలతో కూడిన వ్యతిరేక ఉద్యమాలను, హింసా విధానాలను చూస్తుంటే వీరికి మాతృభూమిపై ప్రేమ, భారతీయులపై మమకారాలు అభిమానం లేవు అన్న విషయం స్పష్టంగా కనపడుతున్నది.
మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్‌లు ఏర్పడ్డాయి. ముస్లిం మతస్థులు ఎక్కువగా ఉన్న ఆ దేశాలలోని మన దేశస్థులైన హిందువులు, సిఖ్, బౌద్ధ, జైన్, క్రైస్తవ మతాల వారు, మైనారిటీలుగా మారిపోయారు. అప్పుడు జరిగిన మత కలహాల మారణ హోమాల మూలంగా ప్రాణాలు అరచేత పెట్టుకొని చాలామంది అక్కడి మైనారిటీ మతస్థులు భారత్‌కు తిరిగి వచ్చారు. కాని కొంతమంది మాత్రం తాము పుట్టిపెరిగిన మాతృభూమి జన్మస్థలంపై ప్రేమతో ప్రాణాలకు తెగించి అక్కడి ప్రభుత్వాల సెక్యులర్ భావనపై గంపెడంత ఆశతో ఆ దేశాలలో స్థిరపడ్డారు.
అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూగారు నవంబర్ 15, 1950లో పార్లమెంటులో ప్రసంగిస్తూ ‘విభజన సమయంలో మన దేశానికి వచ్చిన మన సోదరులందరికీ ఇక్కడి పౌరసత్వం ఇవ్వవలసిందే’ అని తీర్మానించారు. వీరుకాక ఇకముందు ఎవరైనా తమ మానప్రాణాలు, గౌరవాన్ని కాపాడుకొని జీవితాన్ని సాగించటానికి వచ్చే ముస్లిమేతరులకు తప్పనిసరిగా రక్షణ కల్పించి భారతీయ పౌరసత్వాన్ని ఇవ్వాల్సిన అవసరాన్ని కూడా నొక్కివక్కాణించారు.
పాకిస్తాన్‌లోని మైనారిటీ మతస్థుల వర్గాలకు రక్షణ కల్పించేందుకు ప్రధాని జవహర్‌లాల్‌నెహ్రూ, పాకిస్తాన్ ప్రధాని లియాకత్ ఆలీలు 1950 ఏప్రిల్‌లో ఒప్పందంపై సంతకాలు చేశారు. ఆ తరువాత పరిణామక్రమంలో ఇస్లామిక్ ఛాందసవాదం పెరగడంతో ఇస్లామిక్ రిపబ్లిక్‌లుగా అవతరించింది. ముస్లిమేతర మతస్థులను భారత్‌కు పోకుండా అడ్డుకొని వారు వెళ్ళిపోతే మా దేశంలోని వీధులు, మూత్రశాలలు ఎవరు శుభ్రం చేస్తారు’ అని మానవత్వానికి మచ్చతెచ్చే హేయమైన విధంగా ప్రవర్తించి ఒప్పందాన్ని తుంగలో తొక్కారు.
మైనారిటీ స్ర్తిలను అపహరణ చెయ్యడం, బలవంతపు మత మార్పిడులు, ప్రార్థనా మందిరాల కూల్చివేతలు, మత దూషణలకు పాల్పడ్డారంటూ దాడిచేసి చంపడం నిత్యకృత్యాలయ్యాయి. దీనిమూలంగా పాకిస్తాన్‌లో ఉన్న హిందువులు ఇతర మైనారిటీ మతస్థులు 15% నుంచి 1.6% తగ్గిపోయారు. బంగ్లాదేశ్‌లో కూడా 22% నుంచి 8% తగ్గిపోయారు.
ఇటువంటి విపత్కర పరిస్థితులకు నిలవలేక శరణార్థులుగా మన దేశానికి వస్తున్న ముస్లిమేతరులకు ఆశ్రయం కల్పించడం మనదేశం యొక్క ప్రథమ కర్తవ్యం.
2003లో డిసెంబర్ 18న రాజ్యసభలో అప్పటి ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ నాయకులు మన్మోహన్‌సింగ్‌గారు ఈ వలస వస్తున్న శరణార్థులకు ఆశ్రయం కల్పించి పౌరసత్వాన్ని ఇవ్వాలని అప్పటి ఎన్డీయే ప్రభుత్వాన్ని కోరడం ఈ సందర్భంగా మనం గుర్తుచేసుకోవాలి. ఇప్పటి వ్యతిరేక ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహిస్తున్న సి.పి.ఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ప్రకాష్‌కారత్‌గారు కూడా 2012లో ప్రధానమంత్రిగా ఉన్న మన్మోహన్‌సింగ్‌గారికి బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ నుంచి తరలివస్తున్న లక్షలాది శరణార్థులకు పౌరసత్వం ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేయాలి అని కోరారు.
మరి ఇప్పుడు ఆ రెండు జాతీయ పార్టీలవారే ఈ పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించడం వారి దివాలాకోరు రాజకీయాలకు పరాకాష్ఠ. ఇది రాజ్యాంగ వ్యతిరేకమని, ముస్లిం వ్యతిరేకమని మానవ హక్కులకు గొడ్డలిపెట్టు అని ఆక్రోశిస్తూ నానా రభస రాద్ధాంతం చేస్తున్నారు.
పౌరసత్వ సవరణ చట్టం వివరాలు ఈవిధంగా ఉన్నాయి. మన దేశం సరిహద్దులో ఉన్న మూడు ముస్లిమ్ దేశాలలోని మతపరమైన అణిచివేతకు గురి అవుతున్న మైనారిటీ వర్గ ప్రజలకు మాత్రమే ఇది ఉద్దేశించబడినది. వారి బాగోగులకు ప్రయోజనాలకు ఇది ఉపయోగించబడుతుంది. ఆ దేశాలలోని అధిక సఖ్యాకులైన ముస్లింలు మతపరమైన ఇబ్బందులకు అణచివేతకు గురయ్యే అవకాశం లేదు కనుక వారిని మైనారిటీలలో చేర్చలేదు. అదీగాక ఈ చట్టం రాజకీయ, ఆర్థిక శరణార్థులకు సంబంధించినది కాదు. ప్రతిపక్షంవారు చెబుతున్నట్లు అధికరణం 14, 15లను ఈ చట్టం అతిక్రమించలేదు. దీనికి ఇతర మతస్థులకు చెందిన వారి దేశీయకరణ లేదా పౌరసత్వ మంజూరు ప్రక్రియకు ఎలాంటి సంబంధం లేదు. ఈ సవరణ అధికారణ 14ను ఏ మాత్రం ఉల్లంఘించలేదు. కనుక ముస్లిం మతస్థులకు ఈ చట్టం ఎటువంటి అపరాధం కలిగించదు. పొరుగు దేశాలయిన బంగ్లాదేశ్‌లో ఎన్.ఆర్.సి., ఆఫ్ఘనిస్థాన్‌లో ఈ తజికిరా, పాకిస్తాన్‌లో ఎన్.ఎ.డి.ఆర్.ఎ.లాంటి పౌరసత్వ చట్టాలు ఉన్నప్పుడు మన దేశంలోని సి.ఎ.ఎ. చట్టం ఉండి తప్పలేదు కదా. మనదేశం ఏమీ సత్రం కాదుకదా.. కనుక ప్రతిపక్ష వాదనలు ఆరోపణలు అర్థరహితము అని చెప్పవచ్చును.
పౌరసత్వ సవరణ చట్టం కేవలం కొందరికి కొత్తగా పౌరసత్వాన్ని కల్పించడానికే ఉద్దేశించబడినది. అంతేగాని ఎవరి పౌరసత్వాన్ని రద్దుచేయడానికి కాదు అని అర్థం చేసుకోవాలి. ఆ విధంగానే జాతీయ జనాభా పట్టిక (ఎన్.పి.ఆర్.)కు, జాతీయ పౌర పట్టిక (ఎన్.ఆర్.సి.)కి ఎటువంటి సంబంధం లేదు. ఈ పై విషయాలను దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తే సి.ఎ.ఎ, ఎన్.ఆర్.సి, ఎన్.పి.ఆర్.ల గురించి విపక్షాలు చేస్తున్న దుష్పప్రచారం అర్థరహితములైనవి అని స్పష్టమవుతున్నాయి.
నరేంద్ర మోదీగారు రెండవసారి అధికారాన్ని అత్యధిక మెజారిటీతో చేపట్టిన తరువాత గత ఎనిమిది నెలల్లోనే సాహసవంతమైన దేశ భద్రతకు, ప్రజల అభివృద్ధికి సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్ అంటూ ఎన్నో బృహత్తర చట్టాలు తెచ్చి భారతీయులందరి ఆదరాభిమానాలను పొందారు. వీటిలో ముఖ్యమైనవి ఆర్టికల్ 370 రద్దు, రామజన్మభూమిలో రామాలయ నిర్మాణానికి మార్గం సుగమం కావటం. ఈ రెండు సమస్యల విముక్తికి మన దేశంలోని ప్రతి భారతీయుడు గత 70 సంవత్సరాల నుంచి నిరీక్షిస్తున్నారు. ఇన్నాళ్ళకి శ్రీ నరేంద్రమోదీగారి నాయకత్వంలో సఫలీకృతమయ్యాయి.
స్వాతంత్య్రం వచ్చిన దగ్గరనుంచి ఓటు బ్యాంకు లక్ష్యంగా కొన్ని జాతీయ పార్టీలు మన దేశంలోని మైనారిటీ వారిని ఒక ప్రత్యేక వర్గంగా చూపుతూ వారిలో లేనిపోని బేధాభిప్రాయాలను సృష్టించి కొన్ని ప్రత్యేకమైన రాయితీలు, చట్టసంబంధమైన సడలింపులు ఇచ్చి వారిని అమాయకులను చేసి తాము అధికార పీఠాల్ని ఎక్కి కోట్ల రూపాయలు అక్రమంగా కూడబెట్టి దేశానికి చీడపురుగులవలె దాపురించారు.
ఇప్పుడు ప్రజలలో పూర్తి చైతన్యం వచ్చింది. మోదీగారు తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టం యొక్క వివరాలను పూర్తిగా అధ్యయనం చేసి తమ దేశానికి, తమకు ఉపయోగపడుతుంది అని పూర్తి మద్దతు తెలుపుతున్నారు. భారతీయ ముస్లిమ్‌లు చాలా సౌమ్యులు. తోటి ఇతర మతస్థులతో కలిసి సంఘీభావంతో జీవనం సాగించుటకు వీరు ఎల్లప్పుడు సిద్ధమే. జామామసీద్ ఇమామ్, యూ.పీ. ఇమామ్ మరియు దేశంలోని సగటు మైనారిటీ మతస్థులు అందరూ సి.ఎ.ఎ. బిల్లుకు మద్దతు తెలుపుతున్నారు. ప్రతిపక్ష పార్టీలు ఎంత ఎక్కువగా వ్యతిరేక ప్రచారం చేస్తుంటే అంతకంటే ఎక్కువగా సి.ఎ.ఎ. చట్టానికి దేశ ప్రజల మద్దతు రావటం గమనించవలసిన విషయం. గమ్మత్తు ఏమిటంటే వందేమాతరం పాడని మూర్ఖులు, మన రాజ్యాంగాన్ని గౌరవించని మత ఛాందస్సులు కూడా ఇప్పుడిప్పుడే భారతదేశంపై ప్రేమ, మాతృభూమిపై మమకారం చూపడం నిజంగా ఒక గొప్ప చారిత్రాత్మకమైన శుభ పరిణామం. కుల, ప్రాంత, భాషా విబేధాలు మరచి అందరం భారతీయులం అనే భావన దేశ ప్రజలందరి హృదయాలలో వెల్లివిరియటానికి కారణం పౌరసత్వ సవరణ చట్టం అమలులోకి తేవడం అనేది అక్షర సత్యం. ఇదే మన దేశ భద్రతకు, దేశ అభివృద్ధికి శ్రీరామరక్ష.

- జన్నాభట్ల నరసింహప్రసాద్, 79959 00497