సబ్ ఫీచర్

స్వరబాల సరస్వతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిండుకుండ తొణకదు. స్ర్తికి ఎన్ని కష్టాలొచ్చినా, వాటిని భరిస్తూ తన స్థాయిని పెంచుకుంటూ నలుగురిలో మణిలా మెరిసినోళ్లు మనమధ్యే ఎంతమందో. అలాంటి జాబితాలో ఓ స్వరరత్నాన్నీ చెప్పుకోవాలి. ఆమె -రావు బాలసరస్వతీదేవి. తొలి నేపథ్య గాయనిగా చరిత్ర సృష్టించి తెలుగు సినీ జగత్తులో ధృవతారగా ఎదిగిన అపర సరస్వతి. మద్రాస్ ఆకాశవాణి కేంద్రం ద్వారా తొలిసారిగా పాట ప్రక్రియను పరిచయం చేశారామె. అదేవిధంగా 1948లో విజయవాడ రేడియో కేంద్రం ప్రారంభించినప్పుడూ ఆమె స్వరంతోనే ప్రేక్షకులు తొలిగీతాన్ని విన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆమె జీవితంలో ఎన్నో మేలిమి ముచ్చట్లు. అందులో కొన్ని ఈ వారం వెనె్నల పాఠకులకు.
గుంటూరు జిల్లా బాపట్లలో పార్థసారథిరావు, విశాలాక్షి దంపతుల సంతానం -బాలసర్వస్వతి. 1928 ఆగస్టు 28న జన్మించారు. ఆమె తండ్రికి గుంటూరులో రత్నాటాకీస్ ఉండేది. సంగీతంపట్ల మక్కువ వున్న కుటుంబం. రత్నా టాకీస్‌లో మూకీ సినిమాలు ప్రదర్శించేవారు అప్పట్లో. ఆ చిత్రాలకు వెనుకనుండి నేపథ్య వ్యాఖ్యానం ఉండేది. మధ్యమధ్యలో పాట పాడగలిగినవాళ్లు ఎవరైనావుంటే, మైకులో పాట పాడుతూ, ఆ శబ్దాన్ని, దృశ్యాన్ని ప్రేక్షకుడికి ఆనందం కలిగించేలా అందించేవారు. అటువంటి మూకీ చిత్రాలకు తన పాటను ప్రేక్షకులకు వినిపించడంతో ప్రారంభమైంది రావు బాలసరస్వతీదేవి ప్రస్థానం. ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు కొత్తదైన శైలిలో సంతోషాన్ని అందించాలన్న తండ్రి ఆశను నెరవేరుస్తూ వచ్చారు నాలుగున్నరేళ్ల వయసునుండే. మూకీ సినిమా ప్రేక్షకులకు నచ్చడంలేదని ఆయనకు అర్థమైందా.. వెంటనే ఓ అద్భుతమైన పద్య నాటకాన్ని ప్రదర్శింపజేసి ప్రేక్షకులను సంతృప్తిపరచేవారు ఆయన. అంతగా ప్రేక్షకులను ప్రేమించారాయన. వ్యాపార దృక్పథం లేక కేవలం ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకోవడంతో వ్యాపారం సరిగా సాగక నష్టాలొచ్చాయి. చివరికి ఆ థియేటర్ అమ్మవలసిన పరిస్థితి. కానీ సంగీత సరస్వతి ఆ ఇంటిలోనే కొలువైంది కదా! ఓసారి కపిలవాయి రామనాథశాస్ర్తీ నాటకం ప్రదర్శిస్తున్నారు. ఆయన పాడుతుంటే ఆ పాట నాకూ వచ్చంటూ నాలుగున్నరేళ్ల బాలసరస్వతి యాగీ చేసింది. తానూ స్టేజీపైకి వెళ్లి పాడతానంది. ఇదంతా గమనించిన నాటకం ప్రదర్శిస్తున్న రామనాధశాస్ర్తీ, మధ్యలో దిగివచ్చి ఎత్తుకొని మరీ స్టేజీపైకి తీసుకెళ్లి పాట పాడమని ప్రోత్సహించారు. ‘నమస్తే మత్ప్రాణనాధ’ అంటూ పాడిన పాటకు నాటకం చూసేవాళ్లంతా మంత్రముగ్ధులైపోయారు. ఆ వయసులోనే హిజ్‌మాస్టర్ వాయిస్ (హెచ్‌ఎంవి) కంపెనీ తండ్రికి పరిచయస్థులవ్వడంతో భక్తికుచేల, భక్తప్రహ్లాద రికార్డులను ఇప్పించారు ఆరేళ్ల వయసులోనే. రికార్డింగ్‌లో వౌత్ పైన వుంది. బాలసరస్వతి ఎక్కడో కింద చిన్నపిల్లలా నిలబడింది. వౌత్ అందడంలేదని హాస్యనటుడు లంక సత్యం సోదరుడు కామేశ్వరరావు ఎత్తుకోగా, వౌత్ దగ్గరికి వెళ్లి పాట పాడారామె. దర్శకుడు సి పుల్లయ్య సతీ అనసూయ- భక్తధ్రువ మార్కండేయ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఆ చిత్రంలో సతీ అనసూయ చిత్రానికిగాను గంగ పాత్రలో నటించి మెప్పుపొందారామె. ‘ఏది దారి నాకు ఇచ్చట, ఈ కలుష భూతముల పాలయితిని’ అని పాడిన ఆ పాటలు సూపర్‌హిట్ అయ్యాయి. ఓ రకంగా అప్పట్లో నేపథ్యగానం లేదు కనుక ఓవైపు నటిస్తూ, మరోవైపు పాడాలి. ఈ పాటను మాత్రం పరిగెత్తుతూ పాడారట ఆమె. అలా చాలా కష్టంగా అనిపించింది అంటూ గుర్తు చేసుకున్నారామె. తమిళ దర్శకుడు కె సుబ్రహ్మణ్యం భక్త కుచేల చిత్రాన్ని తమిళంలో రూపొందిస్తూ చిన్నికృష్ణుడిగా, తరువాత కుచేలుని కూతురుగా రెండు పాత్రలు ఇచ్చి ప్రోత్సహించారు. బాలయోగిని చిత్రం రూపొందించే సమయంలో బంగారు పతాకాలు అందుకున్నారు. ఆ చిత్రం విడుదలయ్యాక కూడా అనేక అవార్డులు, రివార్డులు తీసుకున్నారు. ఆ చిత్రం నుండే సరస్వతి కాస్త బాలసరస్వతిదేవి అయింది. కోయంబత్తూరు సెంట్రల్ స్టూడియోవారు తుకారాం చిత్రాన్న రూపొందించే సమయంలో ఓ సంవత్సరంపాటు కాంట్రాక్టు తీసుకున్నారు. తుకారం కూతురిగా ఆ చిత్రంలో నటించారు. ఎస్.పి.లక్ష్మణస్వామి కథానాయకుడిగా నటించిన మహానంద చిత్రంలో కూడా అనేక పాటలు పద్యాలు ఆలపించారు. శాస్ర్తియ సంగీతంలో శిక్షణ లేకపోయినా వినికిడి జ్ఞానంతోనే తమిళంలో అద్భుతంగా ఆలపించారు. కౌమార ప్రాయం వచ్చేసరికి 1940లో ఇల్లాలు చిత్రంలో సంగీత దర్శకుడు ఎస్.రాజేశ్వరరావుతో కలిసి కలిసి నటించారు. వారిద్దరూ కలిసి ఆలపించిన అనేక పాటలు అప్పట్లో సూపర్‌హిట్ అయ్యాయి. ఆ చిత్రంలో కథానాయిక కాంచనమాల ఓ పాట పాడాలి. కానీ ఆమె పాడలేకపోతోంది. ఆమెకు ఓ రకంగా ఆ పాట నేర్పించి మరీ ఆ చిత్రంలో పాడించారు రావుబాలసరస్వతీదేవి. తనకు బాణీ రాకపోతే రావుబాలసరస్వతిని పిలిచి పాడించుకొని అర్థంచేసుకొని పాడేవారట ఆమె. మద్రాసు ఆకాశావాణి ద్వారా వేల పాటలు ఆలపించి సంగీత అభిమానులను ఉర్రూతలూగించారు. ముఖ్యంగా రాజేశ్వరరావుతో కలిసి పాడిన అన్ని పాటలు వారిద్దరి గళాలకు మధురంగా కుదిరేవి. వెన్నముద్దలు తిన్నంత మెత్తగా ఉన్నాయి రుూ పాటలు అని మంగళంపల్లి బాలమురళీకృష్ణ చేత ప్రశంసలు పొందారు. ముఖ్యంగా కలగంటి కలగంటి, పాట పాడుమా కృష్ణా, ఈ ప్రేమ ఎల కలిగెను నాలో అని సన్యాసిరాజు, వింజమూరి శివరామారావు, బాలాంత్రపు రజనీకాంతారావుల లలితగీతాలన్నీ అద్భుతంగా ఆలపించేవారు. ఆ తోటలోనొకటి ఆరాధనాలయము, బంగారు పాపాయి, సృష్టిలో తీయనిది స్నేహమేనోయి, నల్లనివాడా నే గొల్లకన్యనోయ్, నిండు పున్నమి పండు వెనె్నలలో లాంటి పాటలు రావుబాలసరస్వతీదేవికి అభినవ సరస్వతీదేవిగా గుర్తింపు తెచ్చాయి.
చిన్నప్పుడు ఓ ఆంగ్లో ఇండియన్ ఇంటికి వచ్చి చదువు నేర్పేవారు. స్కూలుకు వెళుతున్నపుడు బండివాడు ఆలపించే జానపదగీతాలను మననం చేసుకుంటూ ఉండేవారు. 1940లో ఇల్లాలు చిత్రంలో నటించేప్పుడు రాజేశ్వరరావుకు 17 ఏళ్ళు, బాలసరస్వతికి 12 ఏళ్లు. ‘గోపాలబాలుడు నా పాలికి రాడే.. రానేరాడు రానేరాడు’ అనే జావళి సువర్ణమాల చిత్రంలో ఆలపించగా అది ఓ ప్రభంజనంలా మారింది. 1943లో చిత్తూరు నాగయ్య రూపొందించిన భాగ్యలక్ష్మి చిత్రంకోసం కమలా కోట్నిస్‌కు తొలిసారిగా నేపథ్యగానాన్ని ‘తినె్నమీది చిన్నోడా’ అనే పాటతో తెలుగు చిత్రసీమలో ప్రారంభించారామె. ఇక అప్పటినుండి మేరా గీత్, అపవాదు, పెళ్లిసందడి, దాంపత్యం, వీరకంకణం, తెనాలి రామకృష్ణ, జయసింహ, రాజీ నా ప్రాణం, శాంతి, ప్రియురాలు, మానవతి, స్వప్నసుందరి, చెంచులక్ష్మి, సంఘం చెక్కిన శిల్పాలు చిత్రాల్లో వారు ఆలపించిన పాటలన్నీ మధుర మధుకళికలు అని చెప్పవచ్చు. ముఖ్యంగా దేవదాసులో వారు ఆలపించిన తానే మారెనా నమ్మే మారెనా, అందం చూడవయా ఆనందించవయా.. అందాల రుూ సొగసు నీదెనయా అన్న పాటలు సి.ఆర్.సుబ్రరామన్ నేతృత్వంలో ఆలపించారు.
ఇల్లాలు చిత్రంలో కథానాయిక కాంచనమాల ఓ పాట పాడాలి. కానీ ఆమె పాడలేకపోతోంది.
ఆమెకు ఓరకంగా ఆ పాట నేర్పించి మరీ ఆ చిత్రంలో పాడించారు రావుబాలసరస్వతీదేవి. తనకు బాణీ రాకపోతే రావుబాలసరస్వతిని పిలిచి పాడించుకొని అర్థం చేసుకొని పాడేవారట ఆమె.

-సరయు శేఖర్, 9676247000