సబ్ ఫీచర్

అతిథివోలె వుండి వుండి...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ భాషకు, యాసకు, గోసకు కావ్య గౌరవం చేకూర్చిన అచ్చమైన ప్రజాకవి, పద్మవిభూషణుడు, మన కాలంనాటి వేమన, కాళోజీ నారాయణరావు. వలస పాలనపై ఎక్కుపెట్టిన ధిక్కార స్వరం కాళోజీ. కాళోజీ జన్మదినం సెప్టెంబర్ 9వ తేదీని తెలంగాణ ప్రభుత్వం ‘తెలంగాణ భాషాదినోత్స వం’గా ప్రకటించడం అభినందనీయం. తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తిచాటిన అతి తక్కువమంది కవులలో కాళోజీ అగ్ర గణ్యుడు. వేమన తర్వాత ప్రజాకవిగా పేరొందింది కాళోజీ మాత్రమే. హైదరాబాదు సంస్థానంలో నివసించే కన్నడ, మరాఠీ, ఉర్దూ భాషల కలయిక గల ప్రాంతంలో కాళోజీ జన్మించారు. 1914వ సంవత్సరం సెప్టెంబరు 9న వరంగల్ జిల్లా మడికొండలో జన్మించారు. తల్లి కన్నడ, తండ్రి మహారాష్ట్రీయులు తెలంగాణలో స్థిరపడ్డారు. కాళోజీ తల్లిదండ్రుల పేర్లు రమాబాయి, తండ్రి కాళోజీ రంగారావు. కాళోజీ నారాయణరావుగారి పూర్తిపేరు రఘువీర్ నారాయణ లక్ష్మీకాంత్ శ్రీనివాసరావు రామ్‌రాజా కాళోజీ నారాయణరావు. అందుకే కాళోజీకి కన్నడం, మరాఠి, తెలుగు, హిందీ, ఉర్దూ భాషల్లో మంచి ప్రావీణ్యం ఉంది.
ఆయనకు భాషా సంకుచిత్వం లేదు కానీ ఉద్యమాలే చిన్నప్పటినుంచి ఆయన ఊపిరి. ఆ కాలంలో జరిగిన చాలా ఉద్యమాలతో కా ళోజీకి అనుబంధం ఉంది. గణపతి ఉత్సవాలు, ఆర్యసమాజం ఉద్యమం, గ్రంథాలయ ఉద్యమం, ఆంధ్ర మహాసభలు, రజాకార్ల వ్యతిరేక ఉద్యమాలు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, తెలంగాణ ఉద్యమం ఇలా పలు ఉద్యమాలలో పాలుపంచుకున్నారు. ఒకసారి ఓ పోలీస్ అధికారి కాళోజీని పట్టుకుని, ‘పోచమ్మ దగ్గర నీవే ఉంటావు, గణపతి దగ్గర నీవే ఉంటావు, ఆర్య సమాజంలో నీవే ఉంటావు. ఏందీ నీ కథ’ అని ప్రశ్నించాడట. దానికి కాళోజీ ఘాటుగానే జవాబిచ్చారు. ‘పౌర సమాజానికి ఎక్కడ అన్యాయం జరిగినా, ప్రజల పక్షాన పోరాడతానని’ చెప్పిన వ్యక్తి కాళోజీ. ఎందుకంటే చిన్నప్పటినుంచే అన్యాయాన్ని ఎదిరించాడు.
కాజీపేట పాఠశాలలో చదివేటప్పుడు గణపతి నవరాత్రులకు నాటి నిజాం ప్రభుత్వం పాఠశాలలకు సెలవు ఇచ్చేందుకు నిరాకరించ గా, పాఠశాలలో చదివే 1200 మంది విద్యార్థుల చేత మూకుమ్మడి సెలవు పత్రాలు రాయించిన ఘనత కాళోజీదే. వైవిధ్య భరితమైన రచనలు చేయగలగటం కవిశక్తికి నిదర్శనం. తాత్విక జిజ్ఞాసతో కాళోజీ రాసిన మినీ కవితలకు వచ్చినంత ప్రచారం ఇతరులు రాసిన మినీ కవితలకు రాలేదు. లోక్‌నాయక్ మరణించినప్పుడు రాసిన కవిత దీనికి ఉదాహరణగా పేర్కొనవచ్చు. ‘పుట్టుక నీది/ చావు నీది/ బతుకంతా దేశానిది’అన్న మూడు పంక్తుల కవిత, బహుశా అవి కాళోజీకే అన్వయిస్తుందేమో!
చాలావరకు కాళోజీది ఆగ్రహజ్వాలలో పుటం పెట్టిన కవిత్వంగా చెప్పుకోవాలి. ఆగ్రహం ఆవేదనగా, అనుభూతిగా మారిన సందర్భాలకు కొదవలేదు. తెలుగు భాషను కాదని పరభాషా వ్యామోహంలో ఉన్నవారిని చూచి 1942లో తన కవిత ద్వారా హెచ్చరిస్తారు. ‘‘తెలుగు బిడ్డవురోరి/ తెలుగు మాట్లాడుటకు, సంకోచ పడతావు సంగతేమిటిరా?/ అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు/ సకలించు ఆంధ్రుడా చావవెందుకురా?’’ అంటారు.
మానవ జాతి ప్రతినిధిగా చైతన్యాన్ని ఎందరిలో తీసుకొని రాగలిగాడు. తన భావాలకనుగుణంగా కవితలు రచించడంలో దిట్ట. ఆయన కవితలో ఏ ఇజానికీ తావుండదు. ‘‘దగాకోరు దుండగీలు దర్జాగా బ్రతుకుచుండగా, సక్రమ మార్గామానవు సహించువాడెవ్వడు?’ అవనిపై జరిగేటి అవకతవకలు చూసి ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు అంటాడు. కాళోజీ గొప్ప ఉదార ప్రజాస్వామ్యవాది ఆశావాది కూడా. ‘‘ఉదయం కాదే కాదనుకోవడం నిరాశ, ఉదయించి అట్లానే ఉండాలనుకోవడం దురాశ’’అనే సందేశమిస్తాడు. అందుకే కాళోజీ అనగానే ‘నా గొడవ’, నా గొడవ అనగానే కాళోజీ’’ గుర్తుకువస్తాడు అందరికి.
నిజాం వ్యతిరేక పోరాటంలో కాళోజీ మొత్తం మూడుసార్లు జైలుశిక్ష కూడా అనుభవించారు. 1938లో నాలుగు రోజులు, 1943లో రెండున్నర ఏండ్లు, 1947 సెప్టెంబరు 3నుండి, 1948 సెప్టెంబరు వరకు జైలుశిక్ష అనుభవించారు.
అందుకే కాళోజీని శ్రీశ్రీ ‘‘తెలంగాణ లూయి అరాగాన్’’ అన్నాడు. ‘‘నా గొడవ’’ పేరుతో 12 సంపుటాలు వచ్చాయి. ప్రజల గొడవను తన గొడవగా చెప్పారు. 1946లో నిజాం ప్రభుత్వం కమ్యూనిస్ట్ పార్టీని నిషేధించగా, దాన్ని నిరసిస్తూ ‘తీర్పు’ కవితను వెలువరించారు. ‘‘ప్రాంతేతరులు దోపిడీ చేస్తే పొలిమేర దాకా తన్ని తరుముతాం- ప్రాంతంవాడు దోపిడీ చేస్తే ప్రాణంతోనే పాతరేస్తం’’అన్నాడు కాళోజీ. ఈ విధంగా తన ధిక్కార స్వరాన్ని తన ఎన్నో కవితల ద్వారా వినిపించాడు. 1958నుండి 1960 వరకూ శాసన మండలి సభ్యునిగా పనిచేశారు. వీరి సేవలను గుర్తించి 1996లో వీరికి ‘పద్మవిభూషణ్’ పురస్కారం లభించింది. వీరి రచనల్లో నా భారతదేశ యాత్ర, నా గొడవ (1953), తెలంగాణ ఉద్యమ కవితలు, ఇది నా గొడవ (1995) అనేకం ప్రసిద్ధి పొందాయి. అందుకే కాళోజీగారు ‘తెలంగాణ వైతాళికుడు’గా పేరుపొందాడు. సమాజంలోని వర్తమాన నగ్నసత్యాలను కథావస్తువుగా తీసుకుని ప్రజాకవిగా పేరుపొందిన వీరు 2002 నవంబరులో మరణించారు. మనందరం కూడా వీరిని స్ఫూర్తిగా తీసుకుని సమాజ వికాసానికీ, భాషావికాసానికి తోడ్పాటునందిద్దాం. వీరి ఆశయాలను కొనసాగిద్దాం.

- కె.రామ్మోహన్‌రావు