సబ్ ఫీచర్

లంకెబిందెలు అలా దొరికాయి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుట్టేవాడి నుదుటిన రాత రాశాకే -్భమీదకు పంపుతాడు పుట్టించేవోడు.
భూమీదికెళ్లాక -వీడేం చేయాలన్నది నుదుటిమీదున్న స్క్రిప్ట్‌లోనే ఉంటుంది. రాసినోడికి ముందే తెలిసిన ఆ విషయం -రాయించుకున్నోడికి జీవితాన్ని చదవడం మొదలెట్టాక
తెలుస్తుంది. అప్పుడనుకుంటాం -ఓహో నా రాత ఇలా రాశావా! అని. అందుకే -జీవితం ఎక్కడో మొదలై ఎక్కడో ముగుస్తుంది. అదొక నిరంతర పోరాటం. అది పూర్తయితే
-తెలుసుకోడానికేమీ ఉండదు. నాదీ అలాంటి పోరాటమే.
జీవితాన్ని -1500 సినిమాల్లో చూసీ చూసీ.. దాని తీరు తెన్నులను అర్థం చేసుకుని ఈ మాటంటున్న మహానుభావుడే ఈవారం మన వెనె్నల అతిథి. అతను -గంటా శ్రీరామమూర్తి. స్క్రీన్‌ని తేరిపార చూస్తే ఎక్కడో ఒకచోట ఠక్కున కనిపించి మాయమయ్యే నటుడతను.
విజయనగరం జిల్లా బొబ్బిలి తాలూకా బలిజపేట దగ్గర గంగాడలో 1948లో పుట్టాడు శ్రీరామమూర్తి. తండ్రి గంటా సూరపనాయుడు. ఆదర్శ రైతుగా తలలో నాల్కలా మెలిగేవాడు ఆ వూళ్లో. తల్లి సత్యవతమ్మ. అక్కా, తమ్ముడు -శ్రీరామమూర్తి తోబుట్టువులు. ఊళ్లోనే ఎస్సెల్సీసీ చదివాడు. బాల్యంనుంచే నాటకం మోజైంది. చిన్న చదువైనా అప్పట్లో గౌరవమెక్కువే కనుక, నాగార్జునసాగర్ ప్రాజెక్టులో ఎల్డీసీ ఉద్యోగం వచ్చింది. నాటకాలు రాయడమేకాక తన దర్శకత్వంలో ప్రదర్శించడమంటే మరీ ఇష్టమైంది. ఊళ్లోవున్నపుడే -యువకులంతా కలిసి యువజన సంఘం ఏర్పాటు చేశారు. చదువు చెప్పిన టీచర్లనే -యువజన సంఘంలో ప్రదర్శనకు నాటకాలు కావాలని ఆడిగారు. అలా ‘లంకెబిందెలు’ దొరికాయి. పక్కూళ్లోని మాస్టారు రాసిన నాటకమది. ఆ నాటకంలో వేషం కట్టిన శ్రీరామమూర్తి.. నటనంటే ‘పిచ్చోడు’ అనిపించుకున్నాడు. తరువాత చైర్మన్ చలమయ్య, ఆడది, దొంగ వీరడు, సమర్పణ నాటకాలు ప్రదర్శించారు. ఆ అనుభవంతోనే నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఉద్యోగంలో ఉన్నపుడే గుంటూరు, నరసరావుపేట, సత్తెనపల్లి, ముప్పాళ్ల పట్టణాల్లో నాటకాలేశారు. ‘సమర్పణ’తో ఉత్తమ నటుడు అవార్డు అందుకుని గుంటూరులో మహానటుడు ఎన్టీఆర్ చేతులమీదుగా అవార్డు అందుకున్నారు. అదే -శ్రీరామమూర్తి జీవితానికి ఓ మలుపైంది.
ఎన్టీఆర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నాడంటే -గొప్పనటుడే లెక్క. అందుకే -ఆ ఊపుతో సినిమాల్లో ప్రయత్నించాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా -1972లో మద్రాస్ వెళ్లిపోయాడు. ప్రతాప్ ఆర్ట్స్ కార్యాలయంలో దాసరి నారాయణరావు పరిచయం. అప్పటికాయన దర్శకుడిగా ‘తాతామనవుడు’ సినిమా మొదలెట్టే సందర్భం. శ్రీరామమూర్తిలోని రచయిత, దర్శకుడిని దాసరి గుర్తించారు. అప్పటినుంచీ ‘కవీ’ అన్న పిలుపు మొదలైంది. అదే స్థిరపడిపోయింది. ఇప్పటికీ సినిమా పరిశ్రమలో శ్రీరామమూర్తి అంటే ఎవ్వరికీ తెలీదు. ‘కవి’.. అంటే ఓ అతనా అనేస్తారు. అంతగా కవి పేరు మార్మోగించేశారు దాసరి. ‘అందుకే ఆయన నాకు గురుతుల్యుడు’ అంటాడు వినమ్రంగా శ్రీరామమూర్తి.

దాదాపు 1500 చిత్రాల్లో నటించిన అనుభవం శ్రీరామమూర్తిది. దాసరి నారాయణరావు దర్శకత్వంలో 60 నుంచి 70 చిత్రాల్లో నటించారు. ‘బాపు, ఎ కోదండరామిరెడ్డి, కోడి రామకృష్ణ, ముత్యాల సుబ్బయ్య, కె రాఘవేంద్రరావు, మల్లికార్జునరావులాంటి దర్శకులెందరో తనకు అవకాశాలిచ్చి ఆదరించారు’ అని గుర్తు చేసుకుంటాడు శ్రీరామమూర్తి.
1972లో దాసరి డైరెక్షన్‌లో తొలిసారి తాతామనవడు చిత్రంలో నటించే అవకాశమొచ్చింది. తొలి సీనే మహానటుడు ఎస్వీఆర్‌తో కాంబినేషన్. అయినాకానీ బెదరలేదు కవి. దర్శకుడు చెప్పింది చెప్పినట్టే చేసేశాడు. ‘మీ భార్య చనిపోయింది. దహన సంస్కారాలు చేయడానికి మేం వచ్చాం’ అన్నది ఆ సన్నివేశంలో ఎస్వీఆర్‌తో చెప్పే డైలాగ్. అలా మొదటి అవకాశంలోనే ఎస్వీఆర్‌తో నటించడం ఓ మధురానుభూతి అంటూ గుర్తు చేసుకున్నారు. మద్రాస్‌లో వుండగా సినిమా అవకాశాలు లేనపుడు నాటకాలు ప్రదర్శించారు. సమాజం కోసం చావు, మెట్లు విరిగిన మేడ, ఆత్మవిశ్వాసం, దొంగ దొరకడు, ప్రేమపక్షులు నాటకాలకు మంచి ఆదరణ లభించింది. సమాజంకోసం చావు నాటకంలో తండ్రిగా, పోరంబోకు పొలిటికల్ లీడర్‌గా నటించారు. అపుడు జైఆంధ్రా మూమెంట్ జరుగుతోంది. ఇందిరాగాంధీ మద్రాస్ సందర్శించారు. ఆమెతో దగ్గిరకు వెళ్లి మాట్లాడే అవకాశం జమున, గుమ్మడి, జగ్గయ్యలకు లభించింది. వారి ముగ్గురి వెనుక కవి కూడా వెళ్లాడు. ‘నేను జైఆంధ్రా మూమెంట్‌కు సహకరిస్తున్నట్టు రాసిన కవితను ఆమె ముందు చదివి వినిపించాను. పోలీసులు ఒక్కసారిగా చుట్టుముట్టేశారు. 20 లాఠీ దెబ్బలు కొట్టారు. బెరుకు లేకుండా అలానే నిలబడ్డాను. చివరకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ జగ్గయ్య కల్పించుకుని -మా సినిమా వ్యక్తే అని చెప్పడంతో వదిలేశారు’ అంటూ ఆనాటి సంఘటనను గుర్తు చేసుకున్నాడు శ్రీరామమూర్తి.
ఎవరికైనా చేసే వృత్తిపట్ల ధర్మం, నమ్మకం ఉండాలన్నది ఆయన బలంగా నమ్ముతూ చెప్పే మాట. ‘నేను, నా స్నేహితుడు చంద్రవౌళి (నటుడు) పరిశ్రమను నమ్ముకునే వచ్చాం. ఇద్దరం కలిసే ఉండేవాళ్లం. ఎన్నో చిత్రాల్లో కలిసి నటించాం. అలాగే చిడతల అప్పారావు, మేము కూడా చాలా చిత్రాల్లో కలిసి నటించాం. పరిశ్రమలో వేషాలు వెయ్యడం తప్ప నాకేం తెలీదు. మొదట్లో పారితోషికంగా ఐదు రూపాయలు ఇచ్చేవారు. అందులో 2 రూపాయలు ఖర్చయితే, మూడు రూపాయలు మిగిలేవి. నా పెళ్లయ్యేనాటికి నా పారితోషికం రోజుకు 12 రూపాయలు. తరువాత దాసరి నారాయణరావు గొప్ప దర్శకుడయ్యాక నాకు అనేక అవకాశాలు లభించాయి. దాసరి హృదయమున్న మనిషి. గొప్ప మేధావి. ఏ మనిషికి కష్టమొచ్చినా ఆదుకునే వ్యక్తి. నా జీవితంలో ప్రతి సంఘటన ఆయనతోనే ముడిపడివుంది. ఆయన మేధావితనం, హృదయమార్దవం, ఎదుటి వ్యక్తి ఎటువంటి స్థితిలో వున్నాడో గమనించే శక్తి ఆయనకున్నాయని నేను నమ్మాను. ఏ సినిమాకు సంబంధించిన కథా చర్చల్లోనైనా ఖచ్చితంగా నన్ను సలహా అడిగేవారు. ఎందుకంటే నేనెన్నో నాటకాలు రాసి, నా దర్శకత్వంలోనే ప్రదర్శించాను కనుక. ఎవరినీ ఏనాడూ ఏదీ యాచించలేదు అన్న నమ్మకంతో నాపై దృఢమైన నమ్మకం ఆయనకు ఉండేది. నిక్కచ్చిగా వ్యవహరిస్తానని ప్రతి విషయంలో ప్రోత్సహించేవారు. ఒకసారి కృష్ణంరాజుతో బాపయ్య దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాను. అందులో కోట శ్రీనివాసరావుకు ముగ్గురు అసిస్టెంట్లు. ఒకరు రాళ్ళపల్లికాగా, మరొకరు లాయర్ అశోక్, మూడో వేషం కృష్ణంరాజు ప్రత్యేకంగా నన్ను పిలిపించి వేయించారు. ఆ రోజుల్లోనే పారితోషికంగా 25 వేలు ఇప్పించడం చాలా గొప్ప విషయం. అప్పట్లో మద్రాస్‌లో ఇంతమంది ఆర్టిస్టులూ లేరు, దర్శకులూ లేరు.
మోహన్‌గాంధి దర్శకత్వంలో కృష్ణంరాజు హీరోగా సినిమా చేస్తున్నారు. నాది కానిస్టేబుల్ పాత్ర. సినిమా షూటింగ్‌లో ఉండగా ఆ రోజు నాకు అవకాశం వస్తుందో లేదో తెలీదు. మరో షూటింగ్‌లో పాల్గొనాలి. అందుకేవెళ్లి కృష్ణంరాజుకు ఈ విషయాన్ని చెప్పాను. ఆయన నన్ను వెళ్లి మరో సినిమా షూటింగ్‌లో పాల్గొనమన్నారు. నేను వెళ్లాక దర్శకుడు పోలీసు పాత్రధారి ఎక్కడ అని అడిగారు. వెంటనే కృష్ణంరాజు అతను రేపు వస్తాడు, ఈ రోజు నాపై సోలో సన్నివేశాలు చిత్రీకరించండి. రేపు అతను వచ్చాక అతని కాంబినేషన్‌లో చేద్దాం అని నన్ను కాపాడారు. అప్పటి స్టార్లు అలా తమకన్నా చిన్న నటులను పెద్దమనసుతో ఆదుకునేవారు. అలాంటి ఎన్నో సందర్భాలు నా జీవితంలో వున్నాయి.

దాసరి నారాయణరావు దర్శకత్వంలోనే ఊరంత్రా సంక్రాంతి షూటింగ్. దాదాపు 15 రోజులపాటు షూటింగ్ చేయాలి. చిడతల అప్పారావు, నేను ఉన్నాం. మేము ఒక్కరోజు వేరే షూటింగ్‌కు వెళ్లాలి. కానీ అక్కినేనికి ఇబ్బంది అవుతుందని అలాగే ఉండిపోయాం. మా ఇబ్బంది దర్శకుడికి చెప్పుకున్నాం. ఆయన ఒక చిన్న పథకం చెప్పారు. అక్కినేనికి మొదటిగా నమస్కారం పెడితే సంస్కారం కోసం నమస్తే అంటారు. రెండోసారి పెడితే ఆయనకు కోపం వస్తుంది. మేద్దరం మాత్రం అక్కినేనికి ఆ రోజు కనిపించినపుడల్లా నమస్కారం పెడుతూనే ఉన్నాం. ఆయనకు కోపం వచ్చింది. వెంటనే దర్శకుడి దగ్గరికి వెళ్లి వీళ్లిద్దరూ ఈ రోజు నాకు కనపడకూడదు అని అన్నారట. ఇంకేం ఉంది మాక్కావల్సింది అదే. వెంటనే మరో షూటింగ్‌కు వెళ్లిపోయి మర్నాడు ఊరంతా సంక్రాంతి షూటింగ్‌కు హాజరయ్యాం. చిన్న ఆర్టిస్టులకు ఇటువంటి అడ్జెస్ట్‌మెంట్లు అనేకం ఉంటాయి. వాటన్నింటినీ సమన్వయం చేయగలిగినవాడే నిజమైన దర్శకుడని నా అభిప్రాయం’ అంటూ ముచ్చట్లను గుర్తు చేసుకున్నారు శ్రీరామమూర్తి.
*
(వచ్చేవారం మరికొన్ని ముచ్చట్లు)

-సరయు శేఖర్, 9676247000