సబ్ ఫీచర్

మహిళల్లో మణిపూస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్ర్తి జాతి ఆణిముత్యం, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధురాలు, కవయిత్రి, ‘్భరత కోకిల’గా పేరుపొందిన సరోజినినాయుడు 1879 ఫిబ్రవరి 13న అఘోరనాథ్ చటోపాధ్యాయ, వరద సుందరిదేవి దంపతులకు హైదరాబాద్‌లో జన్మించింది. చిన్న వయసులోనే ఆంగ్ల భాషలో ప్రావీణ్యం సంపాదించి అనేక కవితలను రాసి మధురంగా చదివేది. పనె్నండు సంవత్సరాల వయసులోనే మద్రాస్ విశ్వ విద్యాలయం నుండి మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణురాలైంది. ఆ తర్వాత ఉన్నత విద్యాభ్యాసానికై ఇంగ్లాండ్ వెళ్లి కింగ్స్ కళాశాలలోను, కేంబ్రిడ్జి యూనివర్సిటీలోను చదువుకుంది. ఇంగ్లాండ్ నుండి తిరిగి వచ్చాక ప్రముఖ సంఘ సంస్కర్క కందుకూరి వీరేశలింగం ఆధ్వర్యంలో ముత్యాల గోవిందరాజులునాయుడిగారిని కులాంతర వివాహం చేసుకుంది. మానవ జీవితానికి కుల, మతాల కన్నా మానవత్వమే ముఖ్యమని విశ్వసించేది.
సరోజినినాయుడు మానవ సేవే మాధవ సేవ అని నమ్మి సామాజిక సేవ రంగంలో విశేష కృషి చేసింది. మహిళలకు విద్య అవసరం అని చెప్పి మహిళల్లో చైతన్యానికి కృషి చేసింది. మహాత్మాగాంధీజీకి విశ్వాసపాత్రురాలిగా స్వాతంత్య్రోద్యమంలో చురుకుగా పాల్గొన్నది. తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయక, కుటుంబాన్ని కూడా వదిలి స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని జైలుశిక్షను అనుభవించిన గొప్ప దేశభక్తురాలు సరోజిని. 1925లో కాన్పూర్‌లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి తొలి మహిళా అధ్యక్షురాలిగా తన విశిష్ట సేవలను అందించింది. ముఖ్యమైన పట్టణాలను తిరుగుతూ తన ఉపన్యాసాలు ద్వారా ప్రజలలో దేశభక్తి భావాన్ని నూరిపోసింది. హిందూ ముస్లింలు ఐకమత్యంతో స్వాతంత్య్రం సమరంలో ముందుకెళ్లాలని ఉద్బోధించింది. అనుకున్నది నిర్మొహమాటంగా కచ్చితంగా చెప్పగలిగే ధీశాలి సరోజినినాయుడు. స్వాతంత్య్రోద్యమం గురించే కాకుండా భారతీయ సంస్కృతి గురించి, స్ర్తి విమోచనం కోసం, అస్పృశ్యత నివారణ కోసం గంగా ప్రవాహంలా అనర్గళంగా ఉపన్యసించేది. ఆమె ఉపన్యాసాలను ప్రజలు ఎంతో ఆసక్తితో వినేవారు. ఆమె గొంతు, భాష ఎంతో తియ్యనైనది. అందుకే ఆమెను నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పిలిచేవారు.
సరోజినినాయుడు గొప్ప వక్త మాత్రమే కాకుండా మంచి కవయిత్రి కూడా. గోల్డెన్ త్రేషోల్డ్ అనే పద్య కావ్యంతో పాటు బర్డ్స్ ఆఫ్ టైమ్, ది బ్రోకెన్ వింగ్స్, లేడీ ఆఫ్ లేక్, ఫెదర్ ఆఫ్ ది డాన్ వంటి ఉత్తమ రచనలు చేసింది. మెహర్ మునీర్ అనే ఆంగ్ల నాటకాన్ని కూడా రాసింది. బాంగిల్ సెల్లర్స్ లాంటి పద్య కవితలు పాఠ్యపుస్తకాలలో కూడా పొందుపరచబడినవి. భారతదేశం స్వాతంత్య్రం పొందిన తర్వాత దేశంలో మొదటి మహిళా గవర్నర్‌గా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి నియమించబడి ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నది. 1949 మార్చి 2న సరోజినినాయుడు పరమపదించారు. ఆమె దేశానికి చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1964లో ఒక తపాల బిళ్లను విడుదల చేసింది. ఆమె పేరుతో సరోజిని కంటి ఆసుపత్రిని కూడా స్థాపించారు. సరోజినినాయుడు నివసించిన ఇంటికి ఆమె తదనంతరం తన మొదటి కవితా సంపుటి అయిన గోల్డెన్ త్రెషోల్డ్ పేరు పెట్టారు. ప్రస్తుతం అందులో హైదరాబాద్ యూనివర్సిటీ నెలకొల్పారు. మహిళా లోకానికి వనె్న తెచ్చిన మహోన్నత వ్యక్తిత్వం ఆమెది. సరోజినినాయుడి స్ఫూర్తితో నేటి మహిళలు రాజకీయ, సామాజిక సేవా రంగాలలో రాణించాలి. రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక, సాహిత్య రంగాలలో ఆమె చేసిన కృషి అనన్య సామాన్యం. ఆమె అడుగుజాడలు అందరికీ ఆదర్శప్రాయం.

- కందుకూరి భాస్కర్