సబ్ ఫీచర్

అందుకే.. అది సినీ స్వర్ణయుగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమాల్లో చిన్న డైలాగ్ ఆర్టిస్టే అయినా -పెద్ద జీవితాన్ని చూశాడు శ్రీరామమూర్తి. అందుకే ఆయన లోతైన మాటల్లో తాత్వికత కనిపిస్తుంది. ‘కళామతల్లి నీడలో ఓ వెలుగు వెలగాలనే అంతా వస్తారు. కాకపోతే -అదృష్టాన్ని బట్టి కొందరు ఎదుగుతారు. కొందరు చరిత్ర సృష్టిస్తారు. అంతమాత్రాన -వెనుకున్న వాళ్లంతా మనుషులు కాదని కాదు. అది -స్వర్ణయుగం కాలంలోనే మేం చూశాం. స్టార్ ఇమేజ్‌వున్న పెద్ద తారలైనా సన్నివేశం, సందర్భాన్ని బట్టి జూ.ఆర్టిస్టులతోనూ సమానమన్న భావన కలిగించేవారు. వాళ్లనూ పైకి తీసుకొచ్చేందుకు సహకరించేవారు. ఆనాటి గొప్ప వాతావరణం ఇప్పుడుంటుదని నేననుకోను. అందుకే -ఆ కాలాన్ని స్వర్ణయుగంగా ఇప్పటివాళ్లూ పరిగణిస్తున్నారు’ అంటారు శ్రీరామమూర్తి. పాత్ర చిన్నదైనా పెద్ద పెద్ద చిత్రాల్లో చేసిన శ్రీరామమూర్తి మరికొన్ని జ్ఞాపకాలు వెనె్నల పాఠకులకు ఈవారం ముచ్చట్లు.
దర్శకుడు కోడి రామకృష్ణ వద్ద దాదాపు 15 సినిమాలకు పనిచేశా. ఆ టైంలో ఆయన చేసిన సినిమాల్లో తమిళ నటులెవరైనావుంటే వాళ్లకి తెలుగులో డైలాగులు నేర్పడం నా పనే. అలాగే దర్శకుడు కోదండరామిరెడ్డి చేసిన చిత్రాల్లో -ఏకైక బిళ్ల బంట్రోతును నేనే. బిళ్ల బంట్రోతు పాత్రలన్నీ నాకే రావడం యాదృచ్ఛికం -అంటూ నవ్వేశారు శ్రీరామమూర్తి. ‘వాహిని స్టూడియోలో జరిగిన సంఘటన ఇది. బిళ్ల బంట్రోతు పాత్ర చేస్తున్నా. ఆ టైంలో -నిర్మాత, జూనియర్ ఆర్టిస్టుల మధ్య గొడవ తలెత్తింది. ఆ సినిమా హీరో కృష్ణంరాజు. ఆయనొస్తే.. గొడవ సమసిపోయేది. కానీ ఆయన రావడం ఆలస్యమైంది. గొడవ పెద్దదైంది. డైలాగ్ ఆర్టిస్టునైనా -నన్నూ సమ్మెకు సహకరించమని కోరారు జూనియర్లు. మరోపక్క దర్శకుడు షాట్‌కు రమ్మంటూ పిలుస్తున్నాడు. జూ.ఆర్టిస్టుల సమస్య కొలిక్కొస్తేనే సెట్‌లోకి వస్తానన్నాను. నేనూ జూనియర్ ఆర్టిస్టుగా ఇబ్బందులు చూస్తున్నానని, వాళ్లకు న్యాయం చేయాలని కోరాను. దర్శక నిర్మాతలు మొదట నాపై కోపగించారు. కొద్దిసేపటికి సమస్య పరిష్కారమైంది. ఆ తరువాతే నేను షాట్‌కు వెళ్ళా. అప్పుడే -హీరో కృష్ణంరాజు వచ్చారు. నన్ను ఆలింగనం చేసుకొని -నేను చేయాల్సిన పరిష్కారాన్ని నువ్వే చేశావ్ అంటూ భుజం తట్టారు. సమస్య పరిష్కారం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేయటం నాకెంతో ధైర్యాన్నిచ్చింది. అప్పట్లో హీరోలు అంత ఉన్నతంగా ఆలోచించటమే కాదు, వర్కర్లపట్ల ఆదరణతో ఆలోచించేవారు’ అంటూ గుర్తు చేసుకున్నారు శ్రీరామమూర్తి.
మరోసారి దాసరి నారాయణరావు దర్శకత్వంలో కృష్ణ, జయప్రద జోడీగా ‘బండోడు గుండమ్మ’ షూటింగ్ జరుగుతోంది. ఆ చిత్రంలో శ్రీరామమూర్తి పోలీసు కానిస్టేబుల్. స్క్రిప్ట్ ప్రకారం హీరో వెంబడే కానిస్టేబుల్ తిరుగుతుండాలి. అలా హీరో కృష్ణ వెంబడే శ్రీరామమూర్తి కానిస్టేబుల్ వేషంలో ఉండేవాడు. అయితే ఒకరోజు -శ్రీరామమూర్తికి వేరే షూటింగ్‌కు వెళ్లాల్సిన అవసరమొచ్చింది. కానీ, ‘ఇక్కడ హీరోపై చిత్రీకరించే సన్నివేశంలో కంటిన్యుటీ ఉండాలి. లేదంటే, మళ్లీ హీరో కాల్షీట్లు దొరక్కపోతే రసాభాస అవుతుంది. ఏంచేయాలో నాకు అర్థం కాలేదు. సరాసరి పెద్ద దిక్కైన దాసరినే ఉపాయం కోరాను. సరే, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్లమని భరోసా ఇచ్చారు. శ్రీరామమూర్తి వెళ్లిపోయాక మరొక వ్యక్తిని పోలీసు వేషం వేయించి పక్కన నిలబెట్టారు. షాట్ రెడీ అయింది. షాట్‌లో పోలీస్ పాత్రధారి మారిపోవడాన్ని కృష్ణ గుర్తు పట్టేశారు. ఎవరితను? ఇప్పటిదాకా వున్నది మరొక వ్యక్తి కదా? అప్పుడే మారిపోయాడా? అని అడిగేశారు. దానికి దాసరి అడ్జెస్ట్ చేసుకుందాం అని చెప్పబోయారు. వెంటనే కృష్ణ అందుకుని, భవిష్యత్‌లో గొప్ప దర్శకుడివి కావాల్సిన వాడవు. నీవిలా చిన్న చిన్న తప్పిదాలు చేస్తే ఎలా? మొదటినుంచీ ఉన్న పాత్రధారి వచ్చాకే ఈ సీన్ తీద్దాం. మరొకరిని పెడితే సీన్‌లో కంటిన్యూటీ దెబ్బతింటుంది. అవసరమైతే అతనితోవున్న సీన్లు రేపు చేద్దాం అన్నారు. హీరోలు అంత మర్యాదగా ఉంటే, దర్శకులు మాలాంటి చిన్న వాళ్లపై కనికరంతో ఉండేవారు అని చెప్పుకొచ్చారు శ్రీరామమూర్తి.
‘కోడలుపిల్ల’ షూటింగ్ ఎం మల్లికార్జునరావు దర్శకత్వంలో జరుగుతోంది. కృష్ణ, కెఆర్ విజయ హీరో హీరోయిన్లు. వీనస్ స్టూడియోలో ఆ రోజు కెఆర్ విజయపై రేప్ సీన్ చేయాలి. ఆ పాత్రధారిని నేనే. కానీ అప్పటికే కెఆర్ విజయ పెద్ద స్టార్. ఆమెతో ఇలాంటి సీన్లో నటించాల్సి రావడం ఓరకంగా నాకు భయమేసింది. తప్పదుగా అని ఆలోచించుకుంటూ ఓ మూలన అలాగే నిలబడిపోయాను. దర్శకుడేమో విసుక్కుంటున్నాడు. వచ్చి సీన్‌లో నటించమంటున్నాడు. కానీ నా అడుగులు ముందుకు పడటం లేదు. ఇదంతా గమనించారు కెఆర్ విజయ. సెట్‌లోనుంచి పక్కకు తీసుకెళ్లారు నన్ను. ‘ఏంటి? రేప్ సీన్ అని భయపడుతున్నావా? లేక నేను నీకు ఆడదానిలా కనిపించటం లేదా? పెద్ద పెద్ద హీరోలే ఇలాంటి సీన్లు కోసం చూస్తుంటారు. అలాంటిది నువ్వేంటయ్యా, అంత వణికిపోతున్నావ్’ అంటూ నటనలోని తాదాత్మ్యత గుర్తుకొచ్చేలా చిన్న పిల్లాడికి చెప్పినట్టు చెప్పారు. ఇది సినిమా, అలాంటి భయాలు పెట్టుకుంటే పెద్ద ఆర్టిస్ట్ ఎలా అవుతావ్? సంకోచాలు వదిలి పాత్రను రక్తికట్టించు’ అంటూ కర్తవ్య బోధ చేసి -ఓకె షాట్ రెడీ సార్ అని డైరెక్టర్‌తో అంటూ సెట్‌లోకి వెళ్లిపోయిందావిడ. ఎంత స్టార్ ఇమేజ్‌కి ఎదిగినా ఒద్దికైన మనసుతో ఉండే అలాంటి తారల పక్కన కొంతసేపే కనిపించినా, వాళ్లతో నటించే అవకాశం నిజంగా నా అదృష్టం’ అంటారు శ్రీరామమూర్తి. ‘అప్పటి హీరోయిన్లు చిన్న నటులతోనైనా కోఆపరేట్ చేస్తూ నటించేవాళ్లు. చిన్నా, పెద్దా భేషజం వారికి ఏనాడూ ఉండేది కాదు. ఇప్పటివాళ్లలా ఉండటం లేదు. మొదటి సినిమాలోనే జూ.ఆర్టిస్టులను అంటరాని వ్యక్తులుగా చూస్తారు. అది భరించలేని విషయం. జీవితంలో అందరూ గొప్పవాళ్లం అవ్వాలనుకుంటారు. తల్లిదండ్రులు కూడా అదే కోరుకుంటారు. కానీ ఎవరి తలరాత ఎవరూ మార్చలేరు.
పరిశ్రమలో మహర్జాతక హీరో నందమూరి తారకరామారావు, దర్శకుడు నా గురువు దాసరేనని నా అభిప్రాయం. అలాంటి జాతకం భవిష్యత్‌లో ఎప్పుడూ ఎవరికీ రాదనే నమ్ముతా. వాళ్లిద్దరూ పరిశ్రమకు రెండు సింహాలు అనిపించేది. అప్పట్లోనే జెడ్ క్యాటగిరీ సెక్యూరిటీ వున్నది ఒక్క ఎన్టీఆర్‌కే. ఆయన్ని కలవాలంటే చాలా కష్టమయ్యేది. ఉదయానే్న నిద్రలేచి వ్యాయామాలు చేసి, తిరుపతినుంచి వచ్చే అభిమానుల బస్సుల కోసం ఎదురు చూసేవారు. ప్రతిరోజూ ఆయన ఇంటిముందు పండగ వాతావరణమే. అందరినీ పలకరించి యోగక్షేమాలు విచారించి ఇంట్లోకి వెళ్లేవారు. వారితోపాటుగా నేనూ రెండు మూడుసార్లు ఆయన ఇంట్లోకి వెళ్లాను. అందరూ వెళ్లిపోయినా నేను అలాగే నిలబడిపోయాను. ఆయన మేనేజర్ మీసాల సత్యనారాయణ ఉండేవారు. ఎన్టీఆర్ షూటింగ్‌కు వెళ్తూ ఇంకా ఉన్నావేంటి.. వెళ్లలేదా? అన్నారు. ‘నేను గుంటూరులో మీ చేతులనుండి ఉత్తమ నటుడి అవార్డు తీసుకున్నా. సినిమాల్లో వేషాలకోసం వచ్చానని చెప్పాను. అవకాశాలు నేనొక్కడ్నే ఇప్పించలేను బ్రదర్, మీ ప్రయత్నాలు మీరు చేయాలి అంటూ పంపేశారు. ప్రయత్నాలు ఎన్నో చేసినా చాన్స్‌లు రాలేదు. రెండోసారి మళ్లీ తిరుపతి అభిమానులతోపాటుగా ఇంట్లోకి వెళ్లా. మళ్లీ అంతా వెళ్లినా నేనుండిపోయాను. ఎన్టీఆర్ మళ్లీ అడిగారు. వేషాలకోసమే వచ్చానని చెప్పాను. సరే అంటూ ఓ నాలుగు కంపెనీలకు సిఫారసు చేసి కొన్ని వేషాలిప్పించారాయన ’ అంటూ గుర్తు చేసుకున్నారు శ్రీరామమూర్తి.
సినీ పరిశ్రమలో అమ్మగా వ్యవహరించే గయ్యాళి సూర్యకాంతమ్మ. షూటింగ్‌కు వస్తూనే ఎన్నో రుచికరమైన ఆహార పదార్థాలు పెద్ద పెద్ద క్యారేజీలనిండా తెచ్చి అందరికీ పెట్టేవారని మనకు తెలిసిన విషయమే. కానీ నేను చూసిన మరో అన్నదాత కృష్ణంరాజు అంటారు శ్రీరామమూర్తి. ప్రతిరోజూ షూటింగ్‌కు వారి ఇంటినుండి ఎన్నిరకాల నాన్‌వెజ్ వంటలున్నాయో అన్నీ వచ్చేవి. అవన్నీ ఆయన ఒక్కరే తినగలరా? అందుకే తనకిష్టమైన చిన్న యూనిట్ బాయ్‌తో సహా అందరినీ పిలిచి వారందరికీ వంటకాలు వడ్డించేవారాయన. అందరూ తిన్నాకే ఆయన తినేవారు. అది మా అందరికీ చాలా సంతోషం అనిపించే సంగతి. ఆ రోజుల్లో ఐదు రూపాయలుంటే కుటుంబమంతా హ్యాపీగా వుండేది. ఈరోజున వెయ్యి రూపాయలిచ్చినా సరిపోవడంలేదు. అప్పటికీ ఇప్పటికీ మానవుని జీవిత పోరాటంలో ఆవేశం ఎక్కువైంది. తృప్తిపడేవారు నేటికాలంలో తక్కువ. అసంతృప్తితో పోరాడేవాళ్లే ఎక్కువ. ఎకరానికి 15 బస్తాలు పండించడం అప్పట్లో గగనం. కానీ ఇప్పుడు 60 నుంచి 70 బస్తాలదాకా పండిస్తున్నారు. అప్పటిలాగా ఇప్పుడు ఆకలి నినాదాలు తగ్గాయి. అవకాశాలూ ఎక్కువయ్యాయి. మాటల్లో అందరూ మహానుభావులే. కానీ చేతలకొచ్చేసరికి చెప్పడానికే ధర్మం అనే దాతలు ఎక్కువయ్యారు. అప్పట్లో చదువులేని లీడర్లువున్నా పాలన బాగా జరిగేది. ఇపుడు ఎంతో చదువుకున్న నాయకులున్నా పాలనలో పవిత్రత లేదు. పరిపాలన సక్రమంగా జరగక సోమరులు ఎక్కువై చోద్యాలు చేసేకాలం వచ్చింది. ఇది ఎవరి తప్పూ కాదు. కాల పరివర్తన. ఇలా ఎంతకాలం పోరాడాలో మనిషే నిర్ణయించుకోవాలన్న నా ఆలోచనలు నిరంతరం సాగుతూనే వుంటాయి. ఎంత సంపాదించినా హీరోలు కష్టాలు అనుభవిస్తూ కాలం చేశారు. నటులు నటులుగా బ్రతికారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్‌బాబు వచ్చి జీవితం అంటే ఇది అని చెప్పి ఆర్జనే కాదు మనిషిగా ఎలా బ్రతకాలో సినీ జీవులకు నేర్పించారు. ఎలా బ్రతకాలో నిరూపించారు. అందుకు ఈ రోజు ప్రతి చిన్న నటుడు కూడా సంతోషంగా బ్రతుకున్నాడు. అప్పట్లో ఒక రూపాయి దానం చేయాలన్నా ఆలోచించేవారు. ఇపుడు నటులందరూ కలిసి ‘మా’ ద్వారా మాలాంటి వృద్ధ పేద కళాకారులను పోషిస్తున్నారు. హెల్త్‌కార్డులు, పెన్షన్లు ఇస్తున్నారు. కళను నమ్ముకున్నవాడు ఎప్పటికీ ఓడిపోడని నా నమ్మకం అంటూ ముగించారు శ్రీరామమూర్తి. *

-సరయు శేఖర్, 9676247000