సబ్ ఫీచర్

పైకి పేరా.. లోపల ఎన్టీయారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్టీఆర్ అంటే -నందమూరి తారక రామారావు అంటారు కొందరు. పేరు అనుకోవచ్చు. ఎన్టీఆర్ అంటే -విశ్వవిఖ్యాత నటుడంటారు మరికొందరు. ప్రతిభ అనుకోవచ్చు. ఎన్టీఆర్ అంటే -యుగపురుషుడు అంటారు మరికొందరు. జన్మ సాఫల్యం అనుకోవచ్చు. కానీ -ఎన్టీఆర్ అంటే విజయం అనుకునేవాళ్లు కొందరుంటారు. దాన్ని తత్వమనుకోవాలి -ఎన్టీఆర్‌ను సరిగ్గా అర్థం చేసుకుంటే. అనేక సందర్భాల్లో ఎదురైనా ఓటముల్నీ ఆయన గెలుపుగానే చూడాలి. ఎన్టీఆర్ పేరు వింటూ, అమ్మ మాటలో ఆయనే్న తలుస్తూ.. మాటలను ధ్వనిస్తూ.. ఆయనలా అయిపోవాలనుకున్న ఓ మామూలు వ్యక్తి... తనేంటో నిరూపించుకున్నాడు. దక్కిన దానికి సంతృప్తిపడుతూ -జర్నీ చేస్తున్నాడు. పైకి పేరా వెంకటేశ్వర రావేకానీ, లోపలికి తొంగిచూస్తే ఆయనా ఎన్టీఆరే.
*
పేగు తెంచుకుని పుట్టిన బిడ్డను చూసి ఎన్టీఆర్ మాతృమూర్తి ఏమనుకుందో తెలీదుకానీ, తన బిడ్డ మాత్రం ఎన్టీఆర్ అవుతాడనే అనుకుంది ఓ తల్లి. పెంచి పెద్ద చేస్తూనే -ముద్దుమాటలు చెప్పే ప్రతీసారీ ఎన్టీఆర్‌నే ప్రస్తావించేది. పొత్తిళ్ల దశ దాటి -బుడిబుడి అడుగుల్లోకి వచ్చేసరికే అతనికి ‘ఎన్టీఆర్’ ఎవరో తెలిసిపోయింది. ‘వీడు ఎన్టీఆర్‌లా ఉంటాడు’ అని తల్లి అంటుంటే.. ‘నేను ఎన్టీఆర్‌లా ఉంటాను’ అని తనకే చెప్పుకునేవాడతను. ఎన్టీఆర్‌లా ఉంటాడో అప్పటికి చూడకపోయినా -అమ్మ చెప్పింది కనుక ఎన్టీఆర్ అయిపోవాలంతే. అదే అతని నిశ్చయం. అందుకే -ఎన్టీఆర్ ఎవరో తెలుసుకున్నాడు. ఆహార్యాన్ని జీర్ణించుకుని.. ఆంగికం అందిపుచ్చుకున్నాడు. ఎన్టీఆర్‌లా రెండు డైలాగులు చెప్పు అని ఎవరైతే అనడమే తరువాయి -అతనిలోంచి ఎన్టీఆర్ బయటకు వచ్చేవాడు. తన కడుపున పుట్టిన ఎన్టీఆర్‌ని చూసి తల్లి మురిసిపోయేది.
*
ఈసారి -నా కొడుకు ఎన్టీఆర్‌లా గొప్పవాడవుతాడని అనుకుంది తల్లి. అమ్మ అనుకుంది కనుక -అవ్వాలనుకున్నాడు అతను. ప్రయత్నాలు మొదలయ్యాయి. -తరువాత ఏమైంది. ఎన్టీఆర్ అవ్వాలనుకున్న అతగాడెవరు? అయ్యాడా? ఏం జరిగిందన్నది చెప్పుకోవడం కంటే -వెనె్నల అతిథి ముచ్చట్లలో చూద్దాం. ఆ ముచ్చట్లు చెబుతోన్న అతిధి -పేరా వెంకటేశ్వరరావు. ఎన్టీఆర్‌ని చూస్తూ నటుడిగా మారిన ఆయన జ్ఞాపకాలు ఈవారం పాఠకులకు ముచ్చట్లుగా.
ఊరు -ప్రకాశం జిల్లా ఒంగోలు దగ్గర కరవది. పుట్టింది -జనవరి 6, 1955లో. జన్మనిచ్చింది -పేరా వెంకటప్పయ్య శర్మ, భారతీదేవి దంపతులు. తోబుట్టువుగా అన్న ఉన్నాడు. ఒంగోలు రంగరాయుడు చెరువువద్ద సంతపేటలో నివాసం. అక్కడే డిగ్రీ చేశాడు. నాదస్వరం దిట్ట షేక్ చిన వౌలానా సాహెబ్, నటి కాంచన తాత పీసుపాటి వెంకట్రాయశర్మ లాంటి ఉద్దండ కళాకారుల కళ్లముందు బాల్యం గడిచింది. ‘మావాడు ఎన్టీఆర్‌లా ఉంటాడు. అంత గొప్ప నటుడవుతాడు కూడా’ అంటూ ముద్దు చేసేది అమ్మ భారతీదేవి. అమ్మ డైలాగులు బుర్రకెక్కడంతో -ఎన్టీఆర్ డైలాగులు నోటికెక్కించాడు. ‘ఎన్టీఆర్‌లా రెండు డైలాగులు చెప్పరా’ అని ఎవరైనా అనడం పాపం -నాల్కపైన బీజాక్షరాల్లా ముద్రపడిన ఎన్టీఆర్ సినిమాలు డైలాగులు తన్నుకొచ్చేసేవి. గుండె గొంతునుంచి ఎన్టీఆరే బయటికొచ్చేవాడు. అలా సహజ శిక్షణలో దిద్దిన నట ఓనమాలు -కాలేజీ కొచ్చేసరికి తిరిగి ఇవ్వడం మొదలెట్టాయి. కాలేజీలో -బహుకృత వేషం, త్రివేణి, క్షంతవ్యుడులాంటి నాటకాలకు ఉత్తమ నటుడు అవార్డులు తెచ్చిపెట్టింది. అదే -తనను తాను అర్థం చేసుకునే సమయమైంది. ఎన్టీఆర్ అవ్వాలనుకున్న ఆయన -ఒక ఎన్టీఆర్ ఉన్నపుడు మళ్లీ ఎన్టీఆర్ ఎందుకు? నేను ‘వెంకటేశ్వరా రావే’ అవ్వాలి అనుకున్నాడు. అందుకోసం -1977లో బికామ్ పూర్తి చేసి హైదరాబాద్ వచ్చేశాడు. ఇక్కడ మళ్లీ -ఆ ఉదయం ఎప్పుడో, యథారాజా తథా ప్రజ, మీరైతే ఏం చేస్తారు, వశీకరణం, దారిఖర్చు’ నాటకాలను రవీంద్రభారతిలో ప్రదర్శించాడు. అక్కినేని నాగేశ్వరరావు, దాసరి నారాయణరావు చేతులమీదుగా మళ్లీ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నాడు. ఎవరో తెలిసినోళ్లు తీసుకెళ్లి తొలిసారిగా చిరంజీవి నటించిన దేవాంతకుడు సినిమాలో వేషమిప్పించారు. అలా వేసిన లాయరు పాత్ర వర్కౌటైంది. అప్పటినుంచి పరిశ్రమలో తన స్థానం వెతుక్కుంటూ వెళ్లారు. ‘దర్శకుడు కోడి రామకృష్ణ ననె్నంతో ప్రోత్సహించేవారు. అలా -ఆయన తీసిన అనేక సినిమాల్లో ఎస్‌ఐగానో, లాయర్‌గానో కనిపిస్తుండేవాడిని. రాజశేఖర్ ఆహుతి చిత్రంలో ఎస్‌ఐగా, ఏఎన్నార్ చేసిన కలెక్టర్‌గారి అబ్బాయిలో డాక్టర్‌గా, నాగార్జున రక్షణ చిత్రంలో ఎస్‌ఐ, ఎన్టీఆర్‌తో మేజర్ చంద్రకాంత్‌లో, చిరంజీవి ఆపద్బాంధవుడు చిత్రంలో వైద్యుడిగా చేసిన పాత్రలు ఎప్పటికీ గుర్తు పెట్టుకునేవే’ అంటాడు వెంకటేశ్వర రావు. అలాగే -ఆగ్రహం, విచిత్రప్రేమ, భార్యాభర్తల బంధం లాంటి అనేక చిత్రాల్లో నటించి మెప్పించారాయన. హాయిగా సాగిపోతున్న జీవనయానంలో అనుభవం మళ్లీ కొత్త ఆలోచనలకు ఊతమిచ్చింది. ‘నచ్చిన, ఎంచుకున్న రంగంలో విజయం సాధించడం అసలైన ఎన్టీయారిజం తప్ప, ఎన్నాళ్లకూ గొర్రెకు బెత్తెడు తోక అన్నట్టుండటం కాదని అర్థమైంది. ఆ ఆలోచనే వెంకటేశ్వర రావును -తాత ముత్తాతలు చేసిన పౌరోహిత్యంవైపు నడిపించింది. అంతే హైదరాబాద్ వదిలేసి -హిందూపురం వెళ్లిపోయాడాయన. అప్పటికి తండ్రి హిందూపురంలో పౌరోహిత్యంలో దిట్ట అనిపించుకున్నారు. తండ్రి నీడలో.. అనాదిగా వస్తోన్న బాటలో ముందుకెళ్లాలనుకున్నారు. అనుకున్నదే తడవు వెళ్లాడుగానీ -అక్కడా బుర్రలో నిండిపోయిన ఎన్టీఆర్ బయటికెళ్లలేదు. దాంతో -ఎన్టీఆర్ కళాక్షేత్రం ద్వారా అనేక నృత్యాలు, నాటకాలు ప్రదర్శించారు. కృష్ణదేవరాయల ఉత్సవాలు, నంది ఉత్సవాలు, దివి భువన విజయం ఉత్సవాలల్లో అభినవ ఎన్టీఆర్‌గా పలువురి మన్ననలు అందుకుంటున్నారు. అయినా -నమ్మి నాన్న నీడలోకి స్వీకరించిన పౌరహిత్యాన్ని వీడలేదు. విజయనిర్మల తనయుడు నరేష్ హిందూపురంలో స్థాపించిన ‘ఐక్య కళావేదిక’ ద్వారా కళాసేవ చేస్తున్నాడు వెంకటేశ్వర రావు. ‘ఈ సేవలో నాకు నేను ఎన్టీఆర్‌లా కనిపిస్తున్నా’ అంటాడు చమత్కారంగా.
ఒంగోలులో ఉన్నపుడే -ఆర్‌ఎంపి డాక్టర్ ఎంవి సుబ్బారావు ప్రోత్సాహంతో నటుడినయ్యా అంటూ మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు వెంకటేశ్వర రావు. ‘ఆహుతిలో నేను చేసిన ఎస్‌ఐను అంతకుముందు మరో నటుడు చేశారు. కొంత షూటింగ్ జరిగాక -దర్శకుడు కోడి రామకృష్ణకు సంతృప్తి కలగలేదు. మరో నటుడిని చూస్తున్నట్టు యూనిట్ వాళ్లెవరో చెవిన వేయడంతో అక్కడికి పరిగెత్తా. ‘డైలాగులు చెబుతావా?’ అన్న ప్రశ్న ఎదురైంది దర్శకుడి నుంచి. నాకైతే ‘ఓ రెండు ఎన్టీఆర్ డైలాగులు చెప్పరా’ అని ఊళ్లోవాళ్లు అడిగినట్టే వినిపించింది. ఎన్టీఆర్ బయటికొచ్చాడు. గుక్క తిప్పుకోకుండా డైలాగులు చెప్పేశాడు. కట్‌చేస్తే -ఇతనికి మేకప్ వేయండి అన్నాడు దర్శకుడు. అక్కడే ఎగిరి గంతేశాను. చిత్రమేంటంటే -ఒకే షాట్‌లో అన్ని సీన్లూ చేసేశాను. ఆ మహదానందం ఎప్పటికీ గుర్తుండిపోతుంది’ అంటారు వెంకటేశ్వర రావు.
మరోసారి కలెక్టర్‌గారి అబ్బాయి చిత్రంలో ఏఎన్నార్‌తో కాంబినేషన్ సీన్లు. కొంచెం భయమనిపించింది. కానీ, లోలోపల ఎన్టీఆర్ ధైర్యం చెబుతున్నా -నా ముఖంలో భయం ప్రస్ఫుటమైంది. అది గమనించిన ఏఎన్నార్ కాస్త దగ్గరికొచ్చారు. -నేనేదో పెద్ద నటుడినని భయపడకు. నేను నీకు కో ఆర్టిస్టునంతే. మీరు మాకన్నా బాగా చేయగలరు. కాకపోతే మాకున్న పేరువల్ల ఎక్కువ మార్కులు మాకొస్తాయంతే. సో, ముఖంలో భయాన్ని తీసేసి భావాన్ని తీసుకురండి’ అని వెన్నుతట్టారు. నేనూ మంచి నటుడినేనని ఆనందపడటానికి ఇంతకంటే గొప్ప కితాబేముంటుంది? అంటారు వెంకటేశ్వరరావు. షూటింగ్‌లో ఏయన్నార్ చెప్పిన అనేక సత్యాలు నటనకంటే జీవితానికి ఎక్కువ ఉపకరించేవని గుర్తు చేసుకున్నారు. సహ నటుడికి ధైర్యాన్నిచ్చి కెమెరా ముందు భావ ప్రకటనకు సహకరించే గొప్పవారు కనుకే -వాళ్లందరూ ఆ స్థాయికి ఎదిగారంటారు అభిమానంతో పేరావారు.
(ముచ్చట్లు మరికొన్ని వచ్చేవారం)

-సరయు శేఖర్, 9676247000