సబ్ ఫీచర్

వృక్షో రక్షతి రక్షితః

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రకృతిని పచ్చగా, ఆహ్లాదకర, ఆరోగ్యకర వాతావరణంగా మార్చే శక్తి ఒక్క వృక్షాలకే ఉన్నదనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేనే లేదు. మొదట మొక్కలుగా ఉన్నా, పిదప వీటిలో చాలావరకు వృక్షాలుగా, మహావృక్షాలుగా రూపాన్ని సంతరించుకుంటాయి. తాము కార్బన్‌డై ఆక్సైడును పీల్చుకుంటూ, మనకేగాక, పశుపక్ష్యాదులకు అత్యవసరమైన ప్రాణవాయువునందిస్తూ త్యాగానికి మరో పేరుగా అలరారుతున్నాయి. అసలు ఇక్కడనుండే పరోపకారమనే పర్వానికి శ్రీకారం చుట్టడం ఆరంభమైంది. అలసిన మనసునకు చల్లని నీడనిచ్చి, చక్కని ప్రశాంతతను కలిగింపచేస్తాయి. రసవంతమైన ఫలాలనందిస్తాయి. పర్యావరణ పరిరక్షణకు అంగరక్షకులుగా వ్యవహరిస్తాయి. భూతాపాన్ని అరికడతాయి. భూసారాన్ని పెంచుతాయి. వర్షాల రాకకు కారకాలై కరువురక్కసిని పారద్రోలుతాయి. పసిడి పంటలతో వసుధను పరవశింపచేస్తాయి. గృహాలకు అత్యంత ఉపయోగకరమైన ఉపకరణాలుగా మారతాయి. అందుకే దివంగత కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్ర్తీ తన ‘తెలుగుబాల’ శతక పద్య ప్రక్రియలోసస
బ్రతికినన్ని నాళ్ళు ఫలములిచ్చుటెగాదు
చచ్చి కూడ చీల్చి ఇచ్చు తనువు
త్యాగభావమునకు తరువులే గురువులు
లలిత సుగుణజాల! తెలుగుబాల!
అంటూ ‘ఆటవెలది’ ఛందస్సులో అద్భుతంగా చెప్పారు. మన మనుగడకే గాక, పక్షుల నివాసయోగ్యానికి, పశుపక్ష్యాదుల ఆహారానికి ఉపయోగపడుతున్నాయి. మరో ఆధునిక కవి దివంగత పులికంటి కృష్ణారెడ్డిగారు తన ఆటవెలదుల తోటలో..
ప్రకృతి వరము చెట్టు పరమపావని చెట్టు
పూజలందుకొన్న పుణ్యచరిత
కొలువ చెట్టు విలువ కొలమానమున్నదా?
కంటి నలుసుర పులికంటి మాట!
అంటూ ‘చెట్టు’ అను పద్యకవితా శీర్షికలో చెట్టుకున్న విశేషమైన స్థానా న్ని చాలాచక్కగా వర్ణిస్తూనే మరో పద్యంలో..
అవ్వకైనగాని గువ్వకైనను కాని
తల్లి ఒడిగ చెట్టు తావునొసగు
చెట్టు గుణములేదె? చెట్టంత మనిషికి!
కంటి నలుసుర పులికంటి మాట!
అని తరువుకున్న పరోపకార గుణాన్ని, వినయాన్ని అలా చక్కగా వివరిస్తూనే మరో ప్రక్క
‘‘మనసుకొరకు పూలు, మందులెన్ని?
మనిషికిలను చెట్టు మధురవౌ వరమురా!
అంటూ తరువుకున్న ప్రాశస్త్యాన్ని చాలా సహజంగా వివరించారు పులికంటి కృష్ణారెడ్డి.
ఇలా ఎన్నోవిధాలుగా పరోపకార పరాయణత ప్రదర్శనలో వినయశీలంలో తరువులు అగ్రస్థానమొందుతూ పరోక్షంగా మన ధర్మాన్ని సూచిస్తున్నాయి. ప్రకృతిలో ఇవి ఎంత అవసరమోకూడా తెలియజేస్తున్నాయి. కనుక మనమంతా మొక్కల పెంపకంలో మనమొక్కటై ‘వనమహోత్సవ’ కార్యక్రమాన్ని మరింతగా ప్రోత్సహించి విజయవంతంగావిద్దాం. అధికారంలో ఏ ప్రభుత్వమున్నాసరే చిత్తశుద్ధితో ఈ కార్యక్రమానికి అండగా నిలబడదాం. ఆరోగ్యకర, ఆహ్లాదకర వాతావరణానికి భాగస్వాములమవుదాం. భావితరానికీ స్ఫూర్తిదాయకమవుదాం. ‘వృక్షోరక్షతి రక్షితః’’అనే సూక్తి నాడే సార్థకవౌతుంది.

- గాడేపల్లి మల్లికార్జునుడు