సబ్ ఫీచర్

వైజ్ఞానిక రంగంలో కొనసాగుతున్న లింగ వివక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రకృతి రహస్యాలను ఛేదించి మానవ ప్రగతికి మూలకారణమైన సైన్స్ సమాజంలోని ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో విప్లవాత్మకమైన మార్పు తీసకొస్తూ మానవ ప్రగతికి బాటలు వేయడం జరుగుతోంది. కావున సైన్స్‌కు మరియు అభివృద్ధికి మధ్య విడదీయరాని సంబంధం ఉంది. మన సైన్సును ప్రపంచ వ్యాప్తం చేసిన మొట్టమొదటి పరిశోధన ‘రామన్ ఎఫెక్ట్’ భారతీయ శాస్తవ్రేత్త సి.వి.రామన్‌గారు కాంతిపై పరిశోధనకుగాను నోబెల్ ప్రైజ్ పొందిన సందర్భంగా ‘జాతీయ విజ్ఞాన దినోత్సవ’ (నేషనల్ సైన్స్ డే) ప్రతి ఏటా భారతదేశంలో నిర్వహించడం జరుగుతోంది. ప్రతి ఏటా నిర్వహించుకునే సైన్స్ దినోత్సవం ఏదో ఒక ఇతివృత్తాన్ని కేంద్రంగా తీసుకోవడం ఆనవాయితీ కావున, ఈ ఏడు సైన్సులో మహిళల ప్రాతినిధ్యాన్ని, శాస్త్ర విజ్ఞాన ప్రగతిలో వారి భాగస్వామి గురించి చర్చించుకొని పెంపొందించడానికి ‘వైజ్ఞానిక రంగంలో స్ర్తిలు’ (ఉమెన్ ఇన్ సైన్స్) ఇతివృత్తాన్ని కేంద్రంగా చేసుకొని సైన్స్ డే నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా విజ్ఞాన శాస్త్రంలో మహిళల పాత్ర గురించి విశే్లషణ అవసరం. పురుషులతో పోల్చి చూస్తే విద్య, సామాజిక, ఆర్థిక రంగాల్లో స్ర్తిల స్థాయి ప్రపంచ వ్యాపితంగానే తక్కువగా ఉన్నదన్నది ఎవరూ కొట్టివేయలేని ఒక వాస్తవం. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ అసమానతలు మరీ ఎక్కువ. విద్యాభ్యాస స్థాయిలోనే కాలేజీల్లో బాలికల ప్రవేశాలు ముఖ్యంగా సైన్సు టెక్నాలజీ, ఇంజనీరింగ్, వైద్య కోర్సుల్లో తగినంత ఉండటంలేదు. ఒకవేళ సైన్సులో పట్ట్భద్రులైనా, డాక్టరేట్లు చేసినా సైన్సును వృత్తిగా కొనసాగించటం దుర్లభంగా ఉంది. ప్రాథమిక స్థాయిలో, కొంతవరకు సెకండరీ విద్యలో కూడా లింగ వివక్ష సమసిపోయిందని మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ 2016లో వెలువరించిన గణాంకాలు చెబుతున్నాయి. పోస్టుగ్రాడ్యుయేటు స్థాయి వరకు మహిళల శాతం ఒకింత మెరుగ్గానే వున్నా ఆపై పరిశోధన పరమైన చదువుల్లో (ఎంఫిల్, పిహెచ్‌డి) వారి నిష్పత్తి పడిపోతున్నది. ఉపాధి ఉద్యోగాల్లో వీరికి తగిన ప్రోత్సాహం మరియు అనేక కుటుంబపరమైన కట్టుబాట్లు కొంతమేరకు కారణం. వైజ్ఞానిక పరిశోధనా రంగంలో ప్రపంచ వ్యాపితంగా మహిళలు 30 శాతం కంటే తక్కువగా ఉన్నారని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గుటెర్రస్ ఎత్తిచూపారు. మహిళలపట్ల కొనసాగుతున్న వివక్ష ప్రపంచమంతటా వున్నా భారతదేశం వంటి వర్థమాన దేశాల్లో మరీ ఎక్కువ. మన దేశంలోని శాస్తవ్రేత్తలు, టెక్నాలజిస్టులు, ఇంజనీర్లలో మహిళలు కేవలం 14 శాతమే (ప్రపంచ సరాసరి 28.4 శాతం). ఇస్రో వంటి ప్రతిష్ఠాత్మక అంతరిక్ష పరిశోధనా సంస్థ సిబ్బందిలో కూడా మహిళలు 8 శాతానికి మించి లేరు. ఇక అటువంటి సంస్థలకు నేతృత్వం వహించే డైరెక్టర్లుగా మహిళలను ఊహించలగమా? పురస్కారాలు, ప్రోత్సాహాల విషయంలో కూడా మహిళలపట్ల చిన్నచూపే. ప్రతిష్ఠాత్మకమైన సైన్సు అకాడమీ ఫెలోషిప్పుల్లో కూడా సైన్సును వృత్తిగా ఎంచుకుని ధీటైన పరిశోధనలు చేస్తున్న మహిళా శాస్తవ్రేత్తలు ఎందరో ఉన్నారు కానీ వారిని గుర్తించడంలో వైఫల్యం చెందుతున్నాం అనేది నిర్వివాదాంశం.
వైజ్ఞానిక అభివృద్ధిలో లింగ వివక్షతోపాటు అనేక ఇతర అంశాలు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ముఖ్యంగా శాస్ర్తియ ఆలోచనా విధానాన్ని దెబ్బతీసే విధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ రంగానికి బడ్జెట్‌లో నిధుల కేటాయింపు, ఈ రంగానికి కేటాయిస్తున్న నిధులు స్థూల జాతీయ ఉత్పత్తిలో కేవలం 0.8 శాతం మాత్రంగానే ఉన్నాయి. ఈ కేటాయింపులు రోజురోజుకూ తగ్గిపోతూ ఉండడం విచారకరం. గడచిన కాలంలో భారతదేశం గణనీయమైన అభివృద్ధి సాధించడానికి శాస్త్ర సాంకేతిక సంస్థలకు కొంతమేరకైనా ఆర్థిక సహాయం ప్రభుత్వాలనుండి లభించడమే కారణం అనడంలో సందేహం లేదు.
ఇటీవల ప్రకటించిన డెహ్రాడూన్ డిక్లరేషన్ ప్రకారం ప్రభుత్వ సైన్స్ పరిశోధన సంస్థలు తమకు అవసరమైన నిధులను మార్కెట్ నుండి సేకరించుకోవాలి అని చెప్పడం ప్రభుత్వం సైన్స్ సంస్థలను నిరుత్సాహపరుస్తూ విస్మరించడమే అని పేర్కొనవచ్చు. యువత నైపుణ్య అభివృద్ధికి ఉద్దేశించిన ‘స్కిల్ ఇండియా’ మరియు నూతన ఆవిష్కరణలు కొరకై ప్రారంభించిన ‘స్టార్ట్ అప్ ఇండియా’ కార్యక్రమాల పర్యవేక్షకులుగా అనుభవంలేని వారిని నియమించడంలో యువతలో నైపుణ్యాభివృద్ధి లోపించి నవ కల్పనకు ఆస్కారం లేకుండా పోయి నిరుద్యోగం పెరుగుతూ వుంది.
అన్ని రంగాల అభివృద్ధిని కాంక్షించి ప్రభుత్వానికి సూచనలు ఇచ్చే ప్రణాళికా సంఘం స్థానంలోని నీతి అయోగ్‌ను ఏర్పాటుచేసి శాస్త్ర సాంకేతిక అంశాలకు తగిన చోటులేకుండా చేయడం జరిగింది. కీలకమైన జాతీయ విద్యా విధాన రూపకల్పనకు విద్యారంగ నిపుణులలు, ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాల ప్రతినిధులు కాకుండా ఆ రంగంలో ఏ మాత్రం పరిచయం లేని అధికారులను నియమించి లోపభూయిష్టమైన జాతీయ విద్యా విధానం 2019ను ఇటీవల ప్రకటించడం జరిగింది.
ఈ నేపథ్యంలో సమ్మిళిత వైజ్ఞానిక అభివృద్ధికై కృషిచేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా శాస్త్ర సాంకేతిక రంగంలో లింగ వివక్ష కూడా తొలగించాల్సిన అవసరం ఉంది. చదువులో, వృత్తిలో ఎన్ని ఒడుకులు ఎదురైనా ముందుకు నడిచి విజయాలు సాధించిన మహిళా శాస్తవ్రేత్తల జీవితాలు మనకేం చెబుతున్నాయి? అవకాశం ఇవ్వాలేగాని తాము ఎవ్వరికీ తీసిపోమని, కృషిలోగాని, మేధస్సులోగాని అగ్రగాములుగా నిలుస్తామని మరీ మరీ విశదం చేస్తున్నాయి. స్ర్తిలకు వైజ్ఞానిక రంగ అవసరం ఎంత వుందో అంతకంటే ఎక్కువగా వైజ్ఞానిక రంగానికి మహిళల అవసరం ఉంది. ప్రపంచంలో సగభాగం వున్న మహిళల సమాన ప్రాతినిధ్యం లేకుండా సైనే్స కాదు ఏ రంగమూ పరోగమించలేదు. స్ర్తి పురుష సమానత్వం ఒక మానవ హక్కు. దీన్ని నిజం చేయడానికి సైన్స్‌లో మహిళలకు సముచిత స్థానం కల్పించివలసి వుంది. బాలికలను సైన్స్ పట్ల ఆకర్షించడానికి ఇప్పటికే డాక్టరేట్లు పొందిన మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పించి, వారి సృజనాత్మక పరిశోధనలను దేశ ప్రగతికి వినియోగించుకోవడం ఎంతైన ఆవసరం. అదేవిధంగా వివిధ రంగాల్లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికై మహిళా భాగస్వామ్యం ఎంతైనా అవసరమని గుర్తించాలి. కావున పురుష శక్తితో సమానమైన మహిళా శక్తిని ప్రోత్సహించే విధంగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి.

-సంపతి రమేష్ మహారాజు 9959556367