సబ్ ఫీచర్

పర్ఫెక్షన్‌కు.. ప్రాక్టీసే మార్గం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాక్టీస్ మేక్స్ ఏ మేన్ పెర్ఫెక్ట్ -అన్నది చదువుకున్నప్పటి కంటే గొప్పవాళ్ల నుంచి నేర్చుకున్నపుడే ఎక్కువ ఫీల్ కలిగింది నాకు. స్టేజిమీద చేసినా, తెరపై చేసినా -రెండూ నటనే కదా! అనుకునే వాడిని. స్టేజిమీద, కెమెరాముందు -నటించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో గొప్ప నటుడు నాగభూషణం చెప్పినపుడు ఆశ్చర్యమనిపించింది. స్టేజిమీద ఇచ్చినట్టు లిప్‌మూమెంట్‌ని కెమెరా ముందు ఇవ్వకూడదు. దర్శకుడు క్లోజప్ షాట్ తీసుకుంటే -నువ్విచ్చిన ఎక్స్‌ప్రెషన్ అసహ్యంగా అనిపిస్తుందంటూ నాగభూషణం చెప్పారు. ఇక ఒకే డైలాగ్‌ను వందసార్లు చెప్పగలిగితే -అద్భుతమైన ఎక్స్‌ప్రెషన్‌తో చెప్పడం సాధ్యమవుతుందన్న విషయాన్ని నిర్మలమ్మ నుంచే నేర్చుకున్నా. అద్భుతనమైన నటులు అనిపించుకున్న వాళ్లంతా ఇంత సాధన చేశారా? అనిపించింది -అంటూ గుర్తు చేసుకున్నాడు అభినవ ఎన్టీఆర్ వెంకటేశ్వర రావు. ఆయన కెరీర్ పరుగులో -రెండోవారం కోసం దాచిన కొన్ని ముచ్చట్లు వెనె్నల పాఠకుల కోసం.
‘వియ్యాలవారి విందు’ షూటింగ్ గోవిందరావు దర్శకత్వంలో జరుగుతోంది. అందులో కాంపౌండర్ వేషం నాది. నన్ను చూడగానే దర్శకుడు ‘ఇదేదో హీరో వేషం అనుకోకు. కానీ -సినిమా అంతా ఉంటావ్. మంచి పేరొస్తుంది’ అని అభయమిచ్చాడు. ఆయన ఊహించిన దానికన్నా మంచి నటన చూపించటంతో సంతోషపడిపోయారు. చాలా మెచ్చుకున్నారు. మరోసారి బి గోపాల్ దర్శకత్వంలో ప్రతిధ్వని షూటింగ్. శారద, శరత్‌బాబు కాంబినేషన్‌లో సన్నివేశాలు. నేను విప్లవ నాయకుడి పాత్రలో నటించాను. మొదట ఆ పాత్రను విన్నాక నేను చేయలేనేమో అనుకున్నా. కానీ దర్శకుడిచ్చిన ప్రోత్సాహంతో ఆయనే్న మెప్పించాను. ‘కప్పండ్రా ఎర్రజెండా.. కార్మిక నాయకుడు అమర్ రహే’ అన్న డైలాగ్ ఉద్వేగంతో చెప్పాలి. తొలి షాట్‌లోనే పూర్తి చేయడంతో యూనిట్ మొత్తం క్లాప్స్ ఇచ్చారు. నాకు కొంచెం గర్వమనిపించింది’ అంటూ గుర్తు చేసుకున్నారు పేరా.
ఇంకోసారి ఎన్టీఆర్‌తో మేజర్ చంద్రకాంత్ షూటింగ్ జరుగుతోంది. నాది డాక్టర్ పాత్ర. దర్శకుడు రాఘవేంద్రరావు వచ్చి డైలాగ్ నేర్పించి ‘ఎన్టీఆర్ కాంబినేషన్.. జాగ్రత్త. తొలి షాట్‌లోనే ఓకే కావాలి’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఆయన చెప్పినట్టే ఒక్క టేక్‌లోనే పూర్తి చేసేశాను. అది నా లైఫ్‌లో గుర్తుండిపోయే విషయ. నటుడు అయ్యాక ఒక్కసారైనా ఎన్టీఆర్‌తో, ఎఎన్నార్‌తో నటించగలనా అనుకున్నాను. ఆ రెండూ సాధించినందుకు మనసు తృప్తిగా ఉంటుంది. ముఖ్యంగా ఎన్టీఆర్‌తో షూటింగ్ అన్నపుడు.. వెంటనే మా అమ్మకు ఫోన్ చేసి చెప్పాను. ఆమెకూడా సంతోషపడింది’ అంటూ గుర్తు చేసుకున్నారు వెంకటేశ్వర రావు.
రక్షణ చిత్రంలో నాగార్జునతో సినిమా అంతా సాగే ఎస్‌ఐ పాత్ర. ఆయన ఏఎస్‌ఐ అయితే నేను ఎస్‌ఐ. మొదట ఆ పాత్ర చిన్నదిగానే రాశారు. స్క్రిప్ట్ పెరిగేకొద్దీ నా పాత్రా పెరిగిపోయిది. అందుకు దర్శక నిర్మాతలతోపాటు నాగార్జున కూడా ‘్భలే ఛాన్స్ కొట్టేశావే. చిన్న పాత్ర అనుకున్నది సినిమా మొత్తం సాగింది. వెరీ నైస్’ అంటూ ప్రోత్సహించారు. కానీ -ఒక్కోసారి నాలాంటి కొత్తవాళ్లకు, సపోర్టు లేనివాళ్లకు అవకాశాలెవరిస్తారు? అని బాధపడిన సందర్భాలు ఉండేవి’ అంటూ గుర్తు చేసుకున్నారు. భారత్‌బంద్ సినిమా షూటింగ్ హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో జరుగుతోంది. దర్శకుడు కోడి రామకృష్ణ దగ్గరకు వెళ్లి ఏదైనా పాత్ర వుందా? అని అడిగా. ఏమీ లేదన్నారు. కానీ నా గురించి తెలిసిన ఆయన అప్పటికప్పుడు పాన్ షాప్ వద్ద ఓ పాత్రను సృష్టించి ఇచ్చారు. బాలకృష్ణతో రాము చిత్రంలో ఫ్యాక్టరీ వర్కర్‌గా, అల్లరి మొగుడులో మీనాను పరీక్షించే డాక్టరులాంటి అనేక పాత్రల్లో నటించాను. ఓసారి పీపుల్స్ ఎన్‌కౌంటర్ షూటింగ్ అసెంబ్లీ హాలు వద్ద జరిగింది. ఉద్యమం అనే సినిమా కూడా కుషాయిగూడలో ప్రజల మధ్య జరిగింది. ఈ రెండు షూటింగ్‌లు పబ్లిక్‌లో జరగడంతో ఇబ్బంది ఎదుర్కొన్నా. షూటింగ్ ఓ పట్టాన పూర్తయ్యేదికాదు. విచిత్రప్రేమ, అహనా పెళ్లంట, నీకు నాకు పెళ్లంట లాంటి జంధ్యాల దర్శకత్వంలో నటించడం ఓ మధురమైన అనుభూతి.
**
నాటకరంగంపై పట్టు సాధించేందుకు చేసిన ప్రయత్నాల్లో తనకు అద్భుతమైన శిక్షణనిచ్చినవారు స్టేజీ రాంప్రసాద్ -అని గుర్తు చేసుకున్నారు పేరావారు. ఓసారి యూసుఫ్‌గూడలో మాంగల్యమా- త్యాగమా? అనే సినిమా షూటింగ్ జరుగుతోంది. అందులో అవకాశం వుందంటే వెళ్లాను. అక్కడ సెట్‌లో నిర్మలమ్మ ఉన్నారు. నన్ను చూడగానే ‘ఎవరీ అబ్బాయి?’ అని అడిగారు. నాకు నేనే పరిచయం చేసుకుని ‘అమ్మా, నేను హిందుపురం నుంచి వచ్చా’ అని చెప్పా. ‘ఓహో, అయితే డైలాగులు బాగా చెప్పగలవా?’ అంటూనే ‘ఏదీ ఒక డైలాగు చెప్పు, వింటా’ అన్నారు. నాకు కొంచెం బెరుకు అన్పించింది. ఆ బెరుకుతోనే ఏదో డైలాగు చెప్పాను. వెంటనే ఆమె అందుకున్నారు. ‘అలా కాదు బాబు చెప్పేది, నీ డైలాగులో ఎమోషన్ మర్చిపోతున్నావు. సినిమా డైలాగు చెప్పేటప్పుడు ఎమోషన్‌తో చెబితేనే పండుతుంది. ఎలాబడితే అలా చెబితే కుదరదు. ఏదీ మరోసారి చెప్పు’ అన్నదావిడ. మళ్లీ చెప్పాను నేను. ఇంకొంచెం బాగా చెప్పు.. మరి కాస్త బాగా చెప్పు అంటూ అదే డైలాగును నాలుగైదుసార్లు చెప్పించారు నిర్మలమ్మ. ఊ.. ఇప్పుడు సరిగ్గా చెప్పావు. సినిమాకు ఇలావుండాలి అంటూ నేర్పించి.. కృషిచేస్తే మంచి నటుడివి అవుతావు అని ఆశీర్వదించారు. అది మర్చిపోలేని విషయం. మరోసారి 1976లో ఒంగోలు ఊరి బయట రంగస్థలాన్ని నిర్మించి నటులు నాగభూషణం, సీత ఆధ్వర్యంలో రక్తకన్నీరు నాటకం ఆడుతున్నారు. ఆ నాటకం చూడాలని నేను వెళ్లాను. అక్కడికి విలన్‌గా విలక్షణమైన ప్రతిభ సంపాదించుకున్న రాజనాల వచ్చారు. నేను వెళ్లి ఆయన్ను కలిశాను. సినిమాల్లో ప్రయత్నాలు చేస్తున్నానని కూడా చెప్పాను. ఏదీ ఓ డైలాగ్ చెప్పు అని అడిగారాయన. ‘ప్రజారాజ్యం.. ప్రజారాజ్యం.. అంటూ ప్రజలపై మత్తుమందు చల్లి పీనుగులపై బడ్డ రాబందుల్లా ప్రజల్ని పీక్కుతింటున్న నీవు ప్రజానాయకుడివా.. నో.. నీవు ప్రజాభక్షకుడివి’ అన్న డైలాగు చెప్పాను. ఆయన నన్ను బాగా పరిశీలించి చూశారు. ఏదో మిస్టేక్ జరుగుతుంది గమనించావా? అని అడిగారు. గమనించలేదన్నాను. మళ్లీ ఒకసారి అద్దంలో చూసుకుంటూ చెప్పు అన్నారు. అద్దంలో చూసుకుంటూ కూడా చెప్పాను. ఏం గమనించలేదా అని మళ్లీ అడిగారు. మరోసారి చెప్పమన్నారు అదే డైలాగును. మళ్లీ చెప్పగా, ఏం గుర్తించలేదా? అని మళ్లీ అడిగారు. ఏ మిస్టేక్ జరుగుతుందో తెలియటంలేదండీ అన్నానే్నను. ‘బాబూ, నీవు చెప్పిన మాండలికం ఎక్స్‌ప్రెషన్, హావభావాలు నాటక రంగానికి పనికొస్తాయి. నువ్వు లిప్ మూవ్‌మెంట్స్ ఎక్కువగా ఇస్తున్నావు. అది స్టేజీకి బాగుంటుంది కానీ సినిమాకు బాగోదు. లిప్ మూవ్‌మెంట్స్ ఎక్కువైతే స్క్రీన్‌మీద ఎబ్బెట్టుగా వుంటుంది. లిప్ మూమెంట్స్ తగ్గించు. నీ వాయిస్ ఓకె.. హావభావాలు కరెక్టుగానే ఉన్నాయి. స్క్రీన్‌పై క్లోజ్ షాట్స్‌లో లిప్‌మూమెంట్స్ ఎంత పెద్ద నటులకైనా ఎక్కువగా ఇస్తే బాగోదు. అందుకని ఈరోజునుంచి గుర్తుపెట్టుకో.. లిప్ మూమెంట్స్ తక్కువగా ఇవ్వు. అలా చేస్తేనే స్క్రీన్‌కు పనికొస్తావు. లేకపోతే స్టేజీపైనే నిలబడిపోవాల్సి వస్తుంది’ అంటూ ఆయన చెప్పిన పాఠం నాకు ఎప్పటికీ గుర్తుంటుంది. స్క్రీన్‌కు, నాటక రంగానికి తేడావుందని అప్పుడే గ్రహించా. అంత గొప్ప నటుడు ఇంత మంచి సలహా నాకు ఉపకరించేలా, ఓవరంలా ఇచ్చారని భావిస్తాను. అలా ఆయన ఆశీర్వాదమే ఇప్పటికీ నన్ను కాపాడుతోంది -అంటారు వెంకటేశ్వర రావు.
**
నేను అందుకున్న అత్యధిక పెద్ద పారితోషికం అంటే రక్షణ సినిమాకు పనిచేసినపుడు. ఇలా అనేక చిత్రాల్లో నటించిన అనుభవంవున్నా సరైన ప్రోత్సాహం ఇపుడు కరువవ్వడంతో సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టేసి నాటకాలు, నృత్యాలు చేయడమే ఇష్టంగా పెట్టుకున్నాను అన్నారాయన. భార్య సుధాస్రవంతి వెంపటి చినసత్యం శిష్యురాలు. ఇప్పటికీ ఆమె పిల్లలకు నాట్యం నేర్పిస్తున్నారు. ఒక అమ్మాయి చెన్నైలో సెటిలైతే, ముగ్గురు అబ్బాయిలు బెంగుళూరులో ఉద్యోగాలు చేస్తున్నారు. ఇప్పటికీ హిందుపురం ప్రాంతంలో ‘అభినవ ఎన్టీఆర్’ అంటే పేరావారిని ప్రేక్షకులు గుర్తు చేసుకుంటారు. ఆ సంతృప్తి చాలు నాకు -అంటూ ముగించారాయన. *

-సరయు శేఖర్, 9676247000