సబ్ ఫీచర్

దగా పడుతున్న గంగపుత్రులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సామాజిక వర్గంగా వారు బెస్తలు.. వారిని గంగపుత్రులుగా పిలవడం కూడా కద్దు. ప్రాచీనకాలం నుంచి సంప్రదాయంగా చేపలు పట్టే వృత్తి జీవనాధారం కావడంతో మత్స్యకారులయ్యారు. పురాణాలను బట్టి వీరిది ఘన చరిత్రే. భీష్ముడు, వ్యాసుడు గంగపుత్రులే. వ్యాసుడు గురువులకే గురువు. మహాభారతాన్ని, వేదాలను రచించి మానవాళికి దిశ, దశలను చూపిన, అన్నదానం, రక్తదానం మిన్న అని చాటిన మహనీయుడు. అందుకే కాలగమణంలో చిరస్థాయిగా నిలిచిపోయేలా వారం రోజుల్లో గురువారం లేక బెస్తవారం (బేస్తవారం) స్థిర పర్చారు. అయితే స్వాతంత్య్రానంతరం ఏర్పడిన ఏ ప్రభుత్వాలూ వీరిద్దరి జయంతి, వర్ధంతిని అధికారికంగా ప్రకటించలేదు. తద్వారా వివక్ష చూపుతున్నాయన్న బాధ గంగపుత్రుల్ని వెంటాడుతోంది. అంతేకాకుండా పూర్వంలాగే ఈనాటికీ దేవాలయాల్లో ఉత్సవమూర్తులను మోసే బోరుూలుగానే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. రాబోయే తరాల్లోనైనా తమ తలరాతలు మారుతాయో లేదోనన్న ఆందోళన వీరిని వెంటాడుతోంది.
ముఖ్యంగా మైదాన ప్రాంతాలైన రాయలసీమలోని అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో బెస్తలు (గంగ పుత్రులు) నిరంతరం దగా పడుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బెస్తలు 80 లక్షల మంది దాకా ఉండగా, 2014లో ఏర్పడిన నవ్యాంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో 25 లక్షల మంది ఉన్నారు. వీరిలో మైదాన ప్రాంతాల్లో 18 లక్షల మంది, మిగతా 7 జిల్లాల్లో స్వల్పంగా ఉన్నారు.
వృత్తి, ఆచార వ్యవహారాలు
మైదాన ప్రాంతాల్లో నదులు, వంకలు, వాగులు, చెరువులు, సాగునీటి ప్రాజెక్టులు బెస్తల ఆవాసాలు. వల, బుట్టి వీరి ఆస్తి. నేటికీ ఒంటి నిండా కట్టడానికి బట్ట ఉండదు.. చాలా మందికి చదువులేదు.. ఆర్థిక స్తోమత లేక అనారోగ్యాలతో అకాల మరణాల పాలవుతున్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా..ఏటా గంగమ్మ బోనాలు, జాతర్లు, భీష్మ ఏకాదశి, వ్యాస పౌర్ణమి వంటి పండుగల ద్వారా తమ జాతి వీరులను ఆదర్శప్రాయులుగా స్మరించుకుంటూనే ఉన్నారు. అయినా ప్రభుత్వ పెద్దలు వాటి విశిష్టతను గుర్తించడం లేదన్న వేదన తప్పడం లేదు. ఇది ప్రభుత్వాలు మేల్కొని నిద్ర పోవడమేనన్న విమర్శలున్నాయి.
రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల వల్ల మైదాన ప్రాంత జిల్లాల్లో సహజ సిద్ధమైన నదులు, వంకలు, వాగులు ఎండిపోయి కరువు, ఎడారి పరిస్థితులతో బెస్తలు కులవృత్తిని కోల్పోతున్నారు. ఒక బలమైన వర్గం 1964 సహకార సంఘాల చట్టం ప్రకారం చేపలు పట్టే వృత్తి ఆధారంగా సంఘంగా ఏర్పడింది. వారికి వలలు అల్లకం గానీ, చేపల వేట గానీ, అమ్మడం గానీ చేత కాకపోయినా, మత్స్యకార సహకార సంఘాల్లో పూర్తిగా తిష్టవేశారు. జీవో నెంబరు 98 ప్రకారం ఈ వృత్తిలో 29 కులాలు మాత్రమే ఉండాలని నిర్దేశించినా, కండబలం గల వారు, బీసీల ఐక్యతను వల్లె వేసే కుహనా రాజకీయ నాయకులు, ఈ జీవోను అమలు కానీకుండా సైంధవుల్లా అడ్డు పడుతుండటంపై బెస్తలు మండిపడుతున్నారు. వారే గ్రామ, జిల్లా సంఘ అధ్యక్షులుగా ఎన్నికవుతుండటంతో బెస్తలకు తావు లేకుండా పోతోంది. ఇందులో ఉన్న కులాల్లో ఈ ప్రాంతాల్లో అగ్నికుల క్షత్రియ, బెస్త, యానాది, జాలర్లు, కొండదొరలు, పల్లియలు తప్ప ఇతర కులాలు లేవు. ఎక్కడైనా ఒకటీ అరా సంఘాల్లో బెస్తలున్నా, జనాభా బలం పేరుతో, ఆయా సంఘాల నిండా ఇతర కులాలను చేర్చి, అసలు వారిపై దాడులు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ మత్స్య సహకార ఫెడరేషన్ (ఏపీఎఫ్‌సీఓఎఫ్) ఎవరి కోసం
ఆంధ్రప్రదేశ్ మత్స్య సహకార ఫెడరేషన్ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకూ బెస్తలు చైర్మన్లుగా ఎన్నిక కాకపోవడం ఈ సంస్థ ఎవరి కోసం పని చేస్తుందోనన్నది అర్థమవుతుందోనని, దీంతోనే జీవో నంబర్ 98 సక్రమంగా అమలు కాక తీవ్ర అన్యాయం జరుగుతోందన్న ఆవేదన గూడు కట్టుకుంది. మైదాన ప్రాంత మత్స్యకార సంఘాల్లో కొందరు దళారీలు బెస్తల వెనుకబాటుతనాన్ని ఆసరాగా చేసుకుని.. ముందస్తుగా చేప పిల్లలకు, రొయ్య పిల్లలకు అప్పులిచ్చి, అవి పెరిగాక వాటిని తమకే, తాము చెప్పిన ధరకే అమ్మాలంటూ నిర్బంధం విధిస్తున్నారు. దీంతో కష్టానికి తగ్గ ఫలితం లేక మత్స్యకారులు దోపిడీకి గురవుతున్నారు. పై స్థాయి కింది స్థాయి వరకూ ఒక్క అధికారి కూడా మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వారు లేకపోవడం వల్లే దోపిడీ నివారణ చర్యలు లేవన్న అభిప్రాయం బెస్త సామాజికవర్గంలో ఉండటం కొసమెరుపు.
తెలుగు రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి నేటి వరకూ బెస్త కులస్తులు ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, నామినేటెడ్, జిల్లా చైర్మన్లుగా ప్రాధాన్యత లేకుండా, ఓటర్లుగా మాత్రమే మిగిలిపోయారు. కోస్తా తీర ప్రాంతాల్లో గణనీయమైన సంఖ్యా బలం కలిగి ఉన్న మత్స్యకారులు సముద్ర వేటకు వెళ్లి దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారు. కానీ తెలివైన వర్గం అక్కడ ఎమ్మెల్యేలుగా గెలిచి మంత్రులవుతున్నారు. మైదాన ప్రాంత బెస్తల అభివృద్ధి వీరికి ఏమాత్రం పట్టదు. అయినా మోసపూరితంగా రాయలసీమ బెస్తలు కూడా మావారే. అక్కడ కూడా మాకు బలం ఉందని ముఖ్యమంత్రుల వద్ద చెప్పుకుని మరింత లబ్ధి పొందుతున్నారు. అన్ని ప్రభుత్వాలూ రాజకీయంగా బెస్తలను నిర్లక్ష్యం చేస్తునే ఉన్నాయి. ఒక్క బీసీ సంఘం నాయకుడైనా బెస్తల జీవన పరిస్థితుల్ని పట్టించుకున్నాడా? సంఖ్యాబలం కోసం వీరిని ఐక్యం చేసుకోవడం తప్ప, వీరి రాజకీయ, సామాజిక, ఆర్థిక లబ్ధి కోసం కృషి చేశారా? మత్స్యకార సంఘాల్లో బెస్తలే ఉండాలని చెప్పే దమ్ము వీరికుందా? బెస్త కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, ఆప్‌కాబ్ చైర్మన్ పదవి వారికే ఇవ్వాలని కోరగలరా? అది అసాధ్యం. వీరికి కేవలం సంఖ్యాబలం అవసరం. అందుకే బీసీ సంఘాల్లో ఉండాల్సిన అవసరం లేదన్న ఆలోచనకు బెస్తలు వచ్చారు. మనం పెంచిన చేపలు తింటూ మనల్నే అంటరానివారుగా చూస్తున్నారు. ఈ క్రమంలో బెస్తలను ఎస్టీ జాబితాలో చేర్చాలని నినదిస్తున్నారు. భూమి కోసం, భుక్తి కోసం, వృత్తి కోసం, విముక్తి కోసం పోరాటం చేస్తున్నారు. జీవో నెంబరు 98ని పకడ్భందీగా అమలు చేయాలని నినదిస్తున్నారు. మత్స్య సహకార సంఘాల్లో అన్యకులాల వారికి చోటివ్వవద్దని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని కులాలకూ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తోంది. అయితే బెస్తలు తక్కువగా ఉన్నారని ‘మత్స్యకారుల కార్పొరేషన్’ అంటోంది. అంటే మరోసారి బెస్తలకు తీవ్ర అన్యాయం జరగబోతోంది. దీన్ని బెస్తలంతా ఏకమై ప్రతిఘటించాల్సిందే.

- కె. పురుషోత్తం కుమార్ (పాముదుర్తి), 9573613737