సబ్ ఫీచర్

అదీ.. ఆమె!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పద్మ. కలువలాంటి ముఖాన్ని చూసి తల్లిదండ్రులు పెట్టిన పేరు. తన తల్లికి ఇష్టమని నృత్యం నేర్చుకుంటే -ఆ నృత్యమే ఆమెను నటిని చేసింది. అలా ఆమె చేసిన మొదటి సినిమా -కుక్క. ఆమె అభినయానికి మంచి పేరొచ్చింది. అప్పటినుంచీ ఇండస్ట్రీకి.. కుక్క- పద్మయ్యింది. ఇండస్ట్రీలో వెలుగు చుట్టూ చీకటి ఆవరించి ఉంటుందన్న విషయం -ఆమె వెలుగులోకొచ్చాకే తెలుసుకుంది. జాగ్రత్తపడినోళ్లు -చీకటిని జయిస్తారు. గ్రహించలేనోళ్లు -చీకట్లో కలిసిపోతారు. ఇక్కడా -పద్మ భిన్నం. వెల్తుర్లో ఉందో, చీకట్లో కలిసిపోతోందో ఆమెకే తెలీని పరిస్థితి.
‘ఏ సినిమాలోనైనా నా పాత్రకు సంబంధించిన స్క్రిప్ట్‌ని దర్శకుడు ముందే ఇస్తాడు కనుక -ఎక్కడినుంచి ఎక్కడివరకో తెలుస్తుంది. అదృశ్యశక్తి డిజైన్ చేసిన లైఫ్ పాత్ర స్క్రిప్ట్ నాకు తెలీదు. సో, మొదలెట్టాను కనుక ఎక్కడినుంచో తెలుసు. ఎక్కడి వరకో మాత్రం నాకు తెలీదు’ అంటూ నవ్వేస్తారు కుక్క పద్మ. అందరి జీవితాల్లో ఎత్తుపల్లాలే ఉంటాయి. కానీ, ఆమె జీవితంలో పర్వతాలూ, లోయలున్నాయి. ఈవారం వెనె్నల అతిథిగా వచ్చిన ‘కుక్క పద్మ’ ముచ్చట్లలో వాటి ఎత్తెంత? లోతెంతో చూద్దాం.
నిజామాబాద్ వాసి కె తిరుపతయ్య, గౌరి దంపతుల ముద్దుల పుత్రిక -పద్మ. పుట్టింది హైదరాబాద్‌లోనే. చెన్నై ఎన్‌ఎస్‌ఎస్‌ఒలో తండ్రి కొలువు. కూతురికి నాట్యం నేర్పించాలన్నది తల్లి సత్సంకల్పం. ‘అమ్మ సంకల్పం నాకు అభ్యాసమైంది. కథక్ నృత్యరీతిని ఒడిసిపట్టి నాట్యగత్తెనయ్యా’ అంటారు పద్మ చిద్విలాసంగా. ‘నేనప్పుడు సెవెన్త్ స్టాండర్డ్. స్కూల్ వార్షికోత్సవాన్ని హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించారు. ఎందరో ప్రముఖులెక్కిన రవీంద్రభారతి డయాస్ -అలా నా నాగిని డ్యాన్స్‌కు వేదికైంది. అప్పుడు నాకు బహుమతి కూడా వచ్చింది’ అంటూ గుర్తు చేసుకున్నారు పద్మ. అలా సాగిన చిన్న నృత్య కార్యక్రమం -ఆమె జీవితానికి ఎన్నో మలుపులైంది. కొత్త ప్రపంచాన్ని చూపించింది. కొత్త పాత్రల్ని బతుకులోకి తీసుకొచ్చింది. అందులో గొప్పోళ్లూ ఉన్నారు. అందమైన బతుకుతో ఆడుకున్నోళ్లూ ఉన్నారు. ఆసక్తికరమైన ఆ జ్ఞాపకాలనే ఆమె ముచ్చట్లుగా గుర్తు చేసుకున్నారు.
నేను చేసిన నాగిని నృత్యం సినిమాలతో సంబంధమున్న ఓ వ్యక్తికి బాగా నచ్చినట్టుంది. ‘కుక్క’ అనే సినిమా పురుడు పోసుకుంటున్న టైం అది. ఆనాడు -నా డ్యాన్స్ చూసిన వ్యక్తి ఆ యూనిట్‌లో ఉన్నట్టున్నాడు. అతనే యూనిట్‌లోని కీలకమైన వ్యక్తులకి -నన్ను సిఫార్స్ చేశాడు. అలా నా దగ్గరకు సినిమా యూనిట్ కదిలొచ్చింది. ‘కుక్క’ టైటిల్‌తో చేస్తున్న సినిమాలో నటించమని అడిగారు. అప్పటికి నా వయసు పనె్నండేళ్లు. సో, హీరోయిన్‌గా తగనన్నారు. తరువాత హీరోయిన్ పాత్రకోసం ఎంతమందిని ఆడిషన్స్ చేసినా సరైన ఎంపిక జరగలేదు. చివరకు ననే్న హీరోయిన్‌గా ఫైనల్ చేసుకున్నారు’ అంటూ గుర్తు చేసుకున్నారు పద్మ. అప్పటికి ఇండస్ట్రీలో ‘పద్మ’లు చాలామందే ఉన్నారు. సో, గుర్తుపెట్టుకోడానికి వీలుగా.. హీరోయిన్‌గా చేసిన తొలి సినిమా టైటిలే పేరు ముందు స్థిరపర్చేసింది సినీలోకం.
అలా.. ‘పదమూడేళ్లకే హీరోయిన్ అయ్యాను’ అంటున్నపుడు ఆమె ముఖంలో గర్వంలాంటి చిన్న ఎక్స్‌ప్రెషన్. ‘సినిమాలో నాది పల్లెటూరి అమాయకపు పిల్ల పాత్ర. దర్శకుడు ఎలా చెబితే అలా చేయడమే నా పని. అప్పటికి నటనమీద నాకు కనీస అవగాహన లేదు. అప్పటికి అంత మోజు కూడా లేదు. నాకు తెలిసింది, నచ్చేది అమ్మ నేర్పించిన నాట్యమే. నృత్యరీతిలో భాగమైన అభినయానే్న సన్నివేశాల్లోనూ ప్రదర్శించాను. నారాయణరావు నాకు జోడీ. తొలి సినిమాతోనే మంచి నటిగా గుర్తింపువచ్చింది’ అంటూ గుర్తు చేసుకున్నారు పద్మ.
‘తరువాత చదువులో పడిపోయాను. ‘కుక్క’ చిత్రంలో నా పాత్రకు వచ్చిన ఇమేజ్ మాత్రం అలాగే ఉండిపోయింది. అప్పుడొచ్చిన అప్లాజే -విముక్తికోసం సినిమాలో కథానాయిక అవకాశాన్ని మోసుకొచ్చింది. నటుడు సాయిచంద్‌కు జోడీ. అదే షూటింగ్‌లో కాకరాల, నాగమణి, తెలంగాణ శకుంతల లాంటి ఉద్దండులున్నారు. పేజీలకు పేజీల డైలాగులిచ్చి చదవమనేవారు. నటులంతా డైలాగులు బట్టీపడుతుంటే -నేను మాత్రం పక్కనున్న పిల్లకాల్వల్లో చిన్నపిల్లలతో ఈతలు కొట్టేదాన్ని. సెట్‌లో ఉండకుండా అటూ ఇటూ తిరుగుతున్న నన్ను చూసి తెలంగాణ శకుంతలకు చాలా కోపంవచ్చేది. ‘నిన్ను హీరోయిన్‌గా పెట్టుకున్నారు చూడు, వాళ్లననాలి’ అంటూ కెమెరా ముందుకు లాకొచ్చేది. ‘నువ్విప్పుడు హీరోయిన్‌వి. నీ ఇష్టంవచ్చినట్టుంటే కుదరదు’ అంటూ చివాట్లతో క్లాసుపీకేది. అయినా వినేదాన్ని కాదు. వినుంటే -లైఫ్ వేరేలా ఉండేదేమో’ అంటూ అప్పడు చేసిన అల్లరిని జోక్‌గా చెప్తోంది పద్మ. ‘కానీ, ఒక్కటి నిజమండి. అంతా డైలాగులు బట్టీపట్టినా, కెమెరాముందు చెప్పడానికి నానా తిప్పలు పడేవారు. నేను మాత్రం ఒక్కసారి డైలాగ్ వింటే -దర్శకుడికి కావాల్సినట్టు చెప్పేసేదాన్ని. షాట్ ఓకె అయిపోయేది. కళామతల్లి ఇచ్చిన గొప్ప వరమని నాకప్పుడు తెలీదు. మిగతా సీనియర్లు మాత్రం -నా మెమరీకి ఆశ్చర్యపోయేవారు. ఏదేమైతేనేం -ద్వితీయ విఘ్నం దాటేశాను. విముక్తికోసం సినిమా మంచి పేరు తెచ్చింది నాకు. రెండు సినిమాల్లో సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా పేరొచ్చేసింది’ అంటూ నవ్వేశారు పద్మ.
కొన్నాళ్ల తరువాత-
విజయ్‌చందర్ రూపొందించిన ‘ఆంధ్రకేసరి’లో కథానాయిక చాన్సొచ్చింది. కారణం -అప్పటికొచ్చిన రెండు సినిమాల హీరోయిన్ ఇమేజ్ కాదు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు భార్య ముఖకవళికలు నాలో ఉన్నాయట. ఆ పోలికలు ఉన్నాయి కనుకే -అవకాశమొచ్చిందని అనేవారు. ఏదేమైతేనేం -ఆ పాత్ర నాకు దక్కడం చాలా ఆనందమేసింది. ఆ సినిమాలో పిల్లగా, గృహిణిగా, వృద్ధురాలిగా -మూడు వేరియేషన్స్‌లో నటించా. నిజానికి అదొక ఛాలెంజ్. ఆ ఛాలెంజ్‌లో -బెస్ట్ యాక్టర్‌కి (నంది అవార్డు) ఒక్క మార్క్ దూరంలో ఆగిపోయానట. అలాగని విజయ్‌చందర్ చెప్పారు. ఏదేమైతేనేం -ప్రకాశం పంతులు భార్యను మరిపించానంటూ ప్రశంసలైతే లెక్కలేనన్ని వచ్చాయి. ఆడియన్స్ ఇచ్చే ఆ ఆనందంకంటే -అవార్డులు, రివార్డులు పెద్దవేంకాదని గొప్పవాళ్లు ఎందుకంటారో అప్పుడే అర్థమైంది నాకు. ఆ టైంలో -అవార్డు గురించే ఆలోచించలేదు’ అంటూ చెబుతారు పద్మ. ఏ రంగంలోనైనా పెరుగుతున్న అనుభవం -ఎలాంటి పరిణితిని తీసుకొస్తుందో తెలియజెప్పే విషయమది.
మూడు చిత్రాల సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా తరువాత బాగానే అవకాశాలొచ్చాయి. అసాధ్యులు, సజీవమూర్తులు, భైరవకోనలాంటి చిత్రాల్లో ప్రాధాన్యమున్న హీరోయిన్‌గా కనిపించా. చిరంజీవి ‘మొండిఘటం’, రాజశేఖర్‌తో ‘దొరబిడ్డ’, జయసుధ ‘ఆడపులి’, జయప్రద సోదరుడు రాంకుమార్ ‘రాకీ’, శారదతో ‘మా తెలుగుతల్లి’, ఓంకార్‌తో ‘పందిరిమంచం’ చిత్రాలలో వైవిధ్యమైన పాత్రలే చేశాను -అంటూ గుర్తు చేసుకున్నారు పద్మ. పాత్ర ఏదైనా, ఆ పాత్రకు ప్రాణంపోసే ఆమె పెర్ఫార్మెన్స్ చూసి -తమిళం, కన్నడ చిత్రాలకూ పిలుపొచ్చింది. విజయ్‌కాంత్ ‘వెట్రి’, అంబరీష్ ‘గజేంద్ర’ చిత్రాల్లో కథానాయకుడి చెల్లిగా కథను మలుపుతిప్పే పాత్రలే చేశారు పద్మ.
వెలుగును ఆవరించే గమ్మతె్తైన చీకటి ఉంటుందని తెలుసుకునే అనుభవం అప్పటికి నాకు లేదు. అప్పటికి -నా కెరీర్‌లో వెలుగుతున్న దీపాన్ని నేను. ఆ వెలుగును మింగేసే చీకటికాలం -నాచుట్టూ ఆవరిస్తుందని గ్రహించలేకపోయాను. ఆ చీకటే -పెళ్లి.. అంటూ గద్గద స్వరంతో గుర్తు చేసుకున్నారు పద్మ. ‘మా నాన్న తన బాధ్యత నెరవేర్చుకోడానికి పెళ్లి చేశారు. ప్రతి ఆడపిల్ల జీవితంలో ఓ అద్భుతమైన ముచ్చట పెళ్లి. కానీ, నాలాంటి నిర్భాగ్యురాలి జీవితంలో అదొక పీడకల. భరించలేనంత విషాదకర ఘట్టం -అంటూ గుర్తు చేసుకోడానికే విలవిల్లాడారు పద్మ.
అతనొక మోసగాడని -పెళ్లయ్యాకే తెలిసింది. అప్పటికే భార్యా పిల్లలతోవున్న అతను -మోసం చేసి తాళికట్టాడు. జీవితం అగాథంలోకి పోతోందని అర్థం చేసుకున్నాక -1996లోనే విడాకులు తీసుకున్నాం. అదృశ్యహస్తం నాపై పగపట్టడంతో -కెరీర్ కూడా నాశనమైంది. సినిమా అవకాశాలు పోయాయి. ‘నా పెళ్లి -షూటింగ్‌లో భాగమంటూ కోర్టులో నిరూపించారు’. ఏ ఆడదానికీ ఎదురుకాకూడని భయానక ఘట్టమది. ‘పెళ్లి’ ఘట్టం ఏ ఆడదానికైనా అద్భుత ప్రపంచాన్నిస్తుంది. నాకేంటో ఉన్న ప్రపంచం తలకిందులైంది. అమ్మ, నాన్న, తమ్ముళ్లు -అంతా దూరమైపోయి.. ఒంటరిగా పోరాడుతున్నా. లైఫ్ స్క్రిప్ట్‌లో నా పాత్రకు ఎక్కడ ఫుల్‌స్టాపో తెలీదు. కానీ, పైనున్నవాడు మాత్రం పోరాటం చేస్తూండాలన్న స్క్రిప్ట్‌నే రాసినట్టు కనిపిస్తోంది’ అంటూ కన్నీళ్లను తుడుచుకుంటూ నవ్వేశారామె. ఆ పిచ్చి నవ్వు వెనుక -విషాదం లోతెంత.. తుడుస్తున్నా ఆగని కన్నీళ్లే చెప్తున్నాయి.
*
(మరికొన్ని ముచ్చట్లు.. వచ్చేవారం)

-సరయు శేఖర్, 9676247000