ఐడియా

గాట్లుపడ్డ ముఖానికి నిగారింపు సాధ్యమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘాట్‌రోడ్డుపై ప్రయాణించడం ఎంత కష్టమో, గాట్లున్న మొహాన్ని చూడటం కూడా అంతే కష్టం. ఆ గాట్లున్న మొహం మనదైతే అది- భరించడం మహా కష్టం..
అది ప్రత్యక్ష నరకం. ఇరవై ఏళ్ళ తరువాత కలుసుకున్న
ఓ స్నేహితుడు తన మిత్రుడి మొహం చూడగానే-
‘నీ నుదుటిమీదున్న గాటు మన కాలేజీ రోజుల్లో నువ్వో అమ్మాయి కోసం కొట్లాడినపుడు తగిలిన గాయం కదా..?’ అని ప్రశ్నించాడు. మన మొహం మీది గాటు చూసినపుడల్లా దాని గురించి తెలిసిన వాళ్ళు మనకు
ఆ సందర్భాన్ని గుర్తుచేస్తుంటారు. తెలియని వారైతే- ‘అదేంటి..? ఏమైంది..? ఎలా జరిగింది..?’ అన్న ప్రశ్నలు వేసి మనల్ని గుచ్చి గుచ్చి పొడుస్తుంటారు. అందుకే
ఈ గాట్లని చూపించుకోవడానికి ఎవరూ ఇష్టపడరు.
మన శరీరంలో మొహం తప్ప మిగతా భాగాలమీదున్న గాట్లని దుస్తులతో కప్పేయవచ్చు. కానీ, మొహంపై ఉన్న గాట్లని ఎలా కప్పుతాం? మాస్కులు వేసుకుని తిరగలేంగా..! (అలా ముసుగేసుకుని తిరిగితే వీడే బందిపోటో, టెర్రరిస్టో అని అనుమానించే ప్రమాదం వుంది). మొహం మీద గాట్లు కనిపించకుండా కొందరు భారీ మేకప్ వేసుకుంటారు. అది తాత్కాలికం. తెలివైన వాళ్ళు మాత్రం ప్లాస్టిక్ సర్జరీ ద్వారా గాట్లని శాశ్వతంగా తీయించేసుకుంటారు.
గాట్లు ఎందుకు వస్తాయి?
మన చర్మానికి లోతైన గాయం తగిలినపుడు అది గాటుగా మారుతుంది.
ఎలాంటి గాయాలకు..?
గాయం ఎలాంటిదైనా- అది కత్తివల్ల తగిలినా, నిప్పువల్ల కలిగినా, సైకిల్ చైన్‌వల్ల అయినా అది లోతైనదైతే గాటుగా మారుతుంది.
ఎలా ఏర్పడతాయి?
గాట్లు ఎలా ఏర్పడతాయో తెలుసుకోవాలంటే ముందుగా మన చర్మం ఎలా వుంటుందో తెలుసుకోవాలి. మనకి కనిపించే పైచర్మం నలుపు లేదా తెలుపు రంగులో ఉంటుంది. దాన్ని ‘ఎపీడర్మిస్’ అంటారు. దాని కింద తెల్లని రంగులో మన కంటికి కనిపించని చర్మాన్ని ‘డెర్మిస్’ అంటారు. దాని కింద కొవ్వు, ఫేషియా, కండ, ఎముకలు ఉంటాయి. మనకి కనిపించే పైచర్మానికి మాత్రమే గాయమైనపుడు (చర్మం చిట్లినపుడు) దాన్ని ‘ఎబ్రేషన్’ అంటారు. ఇలాంటి గాయాలకు మందు రాసి కట్టుకడితే సరిపోతుంది. రెండు నుంచి మూడు వారాల్లో అక్కడ కొత్త చర్మం వస్తుంది. ఈ కొత్తచర్మం 90 శాతం మందిలో నలుపు రంగుతో వస్తుంది. దీన్ని ‘హైపర్ పిగ్మెంటేషన్’ అంటారు. కాలక్రమేణా అది మన శరీరం రంగులోకి మారిపోతుంది (3-9 నెలల్లో). తొమ్మిది నెలల తరువాత కూడా ఆ నల్లటి మచ్చ అలానే వుంటే అపుడు డాక్టర్‌ని సంప్రదించడం మంచిది. గాయం చాలా లోతైనదైతే మచ్చలు మానడం మరోలా వుంటుంది.
మన శరీరంలో ఎక్కడ గాయం అయినా పక్కనే ఉన్న అవయవాలు సహాయం చేస్తాయి. గాయం తగిలిన చోట తొలుత రక్తం గడ్డకడుతుంది. అక్కడ వాపులా అయి, ఎర్రగా రంగు మారుతుంది. ఇది మన శరీరం చేసే ‘ప్రొటెక్టివ్ రిపేర్’. నేరం జరిగిన ప్రదేశాన్ని పోలీసులు ఎలా ‘సీల్’ చేస్తారో అలానే మన శరీరం గాయం తగిలిన చోటుని అలా ‘సీల్’ చేసేస్తుంది. దీంతో గాయం మానడం సాఫీగా సాగుతుంది. గాయం తగిలిన చోటకి శరీరంలోని మిగతా అవయవాలు ‘డబ్ల్యు.బి.సి.’ని పంపి దుమ్ము, ధూళి, క్రిములు లోనికి ప్రవేశించకుండా అడ్డుకట్ట వేస్తాయి. అడ్డుకట్ట వేసిన చోట కొత్త చర్మం తయారవుతుంది. ఈ కొత్త చర్మం మన మామూలు చర్మంలా వుండదు, గట్టిగా, వలయంగా, నల్లగా ఉంటుంది. దానే్న ‘గాటు’ అంటారు.
కుట్లు వేస్తే..
లోతైన గాయం తగిలినపుడు దానికి ఇరువైపులా ఉన్న అంచులను దగ్గరగా తెచ్చి కుట్లు వేస్తే గాటు ఏర్పడడానికి అవకాశాలు తక్కువ.
కుట్లంటే?
బట్టల్ని కుట్టినట్లు మన చర్మానికి గాయమైనపుడు సూది, దారంతో ఆ గాయాన్ని వైద్యులు కుడతారు. అందుకే నిపుణులైన డాక్టర్లను- ‘శరీరాన్ని కుట్టే దర్జీలు’గా అభివర్ణించవచ్చు.
అలానే వదిలేస్తే?
గాజుబొమ్మ విరిగినపుడు ఆ విరిగిన ముక్కల్ని దగ్గరికి తెచ్చి ఫెవిక్విక్‌తో ఎలా అంటిస్తామో అలానే- గాయానికున్న అంచుల్ని దగ్గరగా తెచ్చి ఉంచగలిగితే అది త్వరితగతిన మానిపోతుంది. ఆ గాటు కూడా సన్నని గీతలా కనిపిస్తుంది. ఆ అంచుల్ని దగ్గరగా ఉంచాలంటే అది చర్మాన్ని కుట్టడం వల్లనే సాధ్యమవుతుంది.
ప్లాస్టిక్ కుట్లు..
సూక్ష్మమైన దారంతో అతి శ్రద్ధగా అంచుల్ని చాలా దగ్గరగా కుడితే అవి ప్లాస్టిక్ కుట్లు, గోనె సంచీ కుట్టినట్లు కుడితే అవి మామూలు కుట్లు. ప్లాస్టిక్ కుట్లు వేస్తే గాటు పడినట్లే కనిపించదు. అక్కడి చర్మం చాలా నీట్‌గా కనిపిస్తుంది.
కుట్లు వేసినా వస్తాయా?
అవును.. కొన్ని సందర్భాల్లో కుట్లు వేసినా గాట్లు వచ్చే అవకాశం లేకపోలేదు. కుట్లు వేసిన ప్రతి గాయం సన్నంగా, అందంగా కనిపించే గీతలా మారాలని లేదు.
మొహంపై గాట్లకు..
మొహంపైన గాట్లతో అందవిహీనంగా ఉంటే వెంటనే నిపుణుడైన సర్జన్‌ను సంప్రదించాలి. ఉన్న గాటుని తీసివేసి, మళ్లీ కొత్తగా కుట్లు వేస్తారు.
మళ్లీ రావా?
రాకపోవచ్చు.. కొందరిలో తప్ప. కీలాయిడ్స్ లేక హైపర్‌ట్రోఫిక్ స్కార్ వచ్చే అవకాశం ఉంది. కుట్టిన తరువాత కూడా గాట్లు వచ్చే అవకాశాలు వుంటాయి.
కీలాయిడ్ అంటే..
ఇది ‘రాక్షస గాటు’. గాటు పెద్దదిగా, ఎత్తుగా పెరుగుతూ, నొప్పిగా వుంటే దాన్ని కీలాయిడ్ అంటారు. ఇవి తిరిగి వచ్చే అవకాశం ఎక్కువ. వీటిని చాలా శ్రద్ధగా హ్యాండిల్ చెయ్యాలి. వెంటనే సర్జన్‌ని కలవడం ఉత్తమం. వీటికి క్లినిక్‌లోనే తగిన చికిత్స చేయాల్సి ఉంటుంది.
ఎలా హ్యాండిల్ చేయాలి..?
డాక్టర్ నుంచి సలహాలు తీసుకునో, పుస్తకాల్లో చదివో ఎవరికివారు సొంత వైద్యం చేసుకునే అవకాశం లేదు. సర్జన్ పర్యవేక్షణలో చికిత్స జరిగితేనే గాట్ల నుంచి విముక్తి లభిస్తుంది.
*

-డా. రమేష్ శ్రీరంగం, సర్జన్
ఫేస్ క్లినిక్స్, ప్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్

-డాక్టర్ రమేష్ శ్రీరంగం సెల్ నెం: 92995 59615