సబ్ ఫీచర్

తెలుగు భాష తెరమరుగేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన భాషకు ప్రాచీన హోదా కావాలి. కానీ, ప్రాచీన భాష అవసరం లేదు. ఒకప్పుడు వ్యవహారిక భాష ప్రాచుర్యానికి విశేషకృషి చేసిన ‘గిడుగు’ వారి పేరు ఇపుడు దశదిశలా మార్మోగిపోతోంది. దానికి కారణం- వ్యావహారిక భాషకు పట్టం కట్టి గ్రాంధిక భాషను ఆయన తుంగలోకి తొక్కడమే. ‘గిడుగు’ వారు పుట్టకమునుపే వ్యవహారిక భాష ఉంది. దానిని అప్పుడు గ్రంథాలలో ఉపయోగించేవారు కాదు. ఉత్తరాంధ్రలోను, గోదావరి జిల్లాలలోను, రాయలసీమలోను వివిధ రీతులలో వ్యవహారిక భాషలున్నాయి. తెలంగాణలో మరొక భాషా శైలి ఉంది. గిడుగువారు గ్రాంధిక భాష అంతా తప్పుల తడక అని, భాష అంటే వ్యావహారిక భాషేనని ఉద్యమం లేవదీశారు. ఎలాంటి ఉద్యమం లేవదీసినా అనుయాయులుంటారు. ఫలితంగా పత్రికలలో వ్యావహారిక భాష ప్రవేశించింది. ఈ భాషలో మాండలికాలు నిషేధం. ఉదాహరణకి ‘బుగత’ అంటే ఉత్తరాంధ్రలో యజమాని అని అర్థం. అలాగే, ఒంగోలు ప్రాంతంలో గేదెలను బఱ్ఱెలంటారు. ఇలాంటి పదాలు చాలా ఉన్నాయి. ఇవి పత్రికలలో కనిపించవు. ఇవి ఆయా ప్రాంతాలకే పరిమితం.
ఇటీవల పాఠ్యపుస్తకాలలో కూడా వ్యావహారిక భాష ప్రవేశపెట్టపడింది. అందువలన పిల్లలకు తెలుగు భాషలోని సౌందర్యము, నుడికారము తెలియకుండా పోయింది. తెలుగు భాష ఘనత తెలుసుకోవాలంటే చిన్నయసూరి రచనలు చదవాలి. చిలకమర్తి వారి రచనలు చదవాలి. భాషాభివృద్ధి కోసం పానుగంటివారి ‘సాక్షి’ వ్యాసాలు చదవాలి. ఇప్పుడు ఇవన్నీ అంటరానివి, వీటి పేర్లు స్మరించడానికి కూడా వీలులేదు. చిన్నయసూరి కథను వ్యావహారిక శైలికి మార్చి ‘దురాశ’ అను పేరుతో గతంలో ఐదవ తరగతి వాచకంలో ప్రచురించారు. చిన్నయసూరి రచనలు యథాతథంగా పెద్ద తరగతుల పిల్లలకు పాఠ్యంశంగా ఉండాలి. ఈ కథ లోభ గుణానికి ప్రతీక. కానీ, దురాశ అని పేరు పెట్టారు. ఈ రెండిటికి తేడా తెలియనివారు మన పిల్లలకు పాఠ్యపుస్తకాలు వ్రాస్తున్నారు. ఈ వ్యావహారిక భాష ఏ విధంగా పెరిగిపోతుందో పరిశీలించడానికి మన పత్రికలే ప్రమాణం. వాంగ్మయం, కర్ర, రాత పరీక్షలు, రుషి మొదలయిన పద ప్రయోగాలు చూస్తున్నాం. ఇవి అన్నీ ఒప్పులుగా చలామణి అయిపోతున్నాయి. వ్యావహారిక భాషలో గురజాడ అప్పారావు గారు వ్రాసిన ‘కన్యాశుల్కం’ నాటకం గుంటూరు జిల్లావరకే అవగాహన అవుతుంది. మిగిలిన ప్రాంతాల వారికి అవగాహన కాదు. ఈ బాధలు లేకుండా యావదాంధ్ర ప్రదేశ్‌లోను అందరికి అర్థం కావడానికి శిష్టవ్యావహారిక భాష ప్రవేశపెట్టారు. అందరికీ అర్థమయ్యే రీతిలో కొందరు వ్యావహారిక భాషలో రచనలు చేయగలరు. విశ్వనాధ సత్యనారాయణగారు వ్యావహారిక భాషలో వ్రాసిన నవలలు ఇందుకు ఉదాహరణ. ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే తెలుగు భాషాభివృద్ధికి దారులు అన్నీ మూసుకుపోయాయి. ఇంగ్లీషు మీడియం అనే మహాప్రవాహం వచ్చేస్తోంది. దానిని ఎవరూ ఆపలేరు. ప్రభుత్వ పాఠశాలలన్నీ క్రమంగా ఇంగ్లీషు మీడియంలోకి మారిపోతున్నాయి. ప్రాథమిక దశ నుండి ఇంగ్లీషు మీడియం ప్రవేశిస్తుంది. ఇది వినడానికి చాలా ఆశ్చర్యంగా వుంది. ఈ దశలో పిల్లలు తమ సందేహాలు ఉపాధ్యాయుడిని ఇంగ్లీషులో అడగ్గలరా? ఉపాధ్యాయుడు ఇంగ్లీషులోనే బోధిస్తాడా? గణితం కూడా ఇంగ్లీషులోనే బోధిస్తారా? ఏమిటి ఈ విపరీత ధోరణి? ఇంగ్లీషు మీడియం వ్యామోహాన్ని వదిలించుకుని, ఇంగ్లీషును ఒక భాషగా నేర్పాలి. విద్యాబోధన మాతృభాషలోనే జరగాలని ఎంతమంది విద్యావేత్తలు సూచించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం ఏ విధానం ప్రవేశపెట్టినా తల్లిదండ్రుల నుండి వ్యతిరేకత రావడం లేదు. ఇప్పుడు వారిలో చైతన్యం కలగాలి. భాషాభివృద్ధికి ఈ దిగువ పద్ధతులు అమలు చేయాలి. వాచక పుస్తకములు ఒకరు లేదా ఇద్దరు నిష్ణాతులు వ్రాయాలి. భాష శిష్టవ్యావహారిక శైలిలో ఉండాలి. ప్రాథమిక దశలో నాళం కృష్ణారావు వంటి వారు రచించిన గేయాలు పాఠ్యాంశాలుగా ఉండాలి. ఇలాటివి పిల్లలకు ఆనందాన్ని కల్గిస్తాయి.
ఇంగ్లీషు మీడియం పాఠశాలలన్నీ రద్దుచేయాలి. నాల్గవ తరగతినుండి ఇంగ్లీషు బోధించాలి. శతక వాఙ్మయానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆరవ తరగతి నుండి నెలకు ఒక వ్యాసం వ్రాయించాలి. అందులోని దోషాలు ఉపాధ్యాయుడు సరిచేసి తిరిగి వ్రాయించాలి. ఈ పద్ధతి పూర్వం ఉండేది. ఇప్పుడు ఉందో, లేదో తెలియదు. ఈ విధానం భాషాభివృద్ధికి దోహదం చేస్తుంది. ఈ పద్ధతి ఇంగ్లీషుకి కూడా అవసరం. పెద్ద తరగతులకి ఎక్కువ భాగం సంప్రద్రాయ గద్య పద్యాలే పాఠ్యాంశాలుగా ఉండాలి.

-వేదుల సత్యనారాయణ