సబ్ ఫీచర్

రాజకీయ బతుకమ్మ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ భారతీయ సంస్కృతి అంటూ ప్రత్యేకంగా లేదు. భిన్న సంస్కృతులున్నాయి. శాస్ర్తియ, జానపద సంగీతమంటూ వేరు చేసి చూడడం సరైంది కాదు. ప్రతీదీ సామాజికమే.!’ అంటూ సమాజంలో మార్పు కోసం కళలు ఉపయోగపడాలని చాటి చెపుతున్నందుకు ఈ మధ్యనే రామన్ మెగసెసే అవార్డును అందుకున్న తమిళనాడుకు చెందిన తోడూరు మాడభూషి కృష్ణ అన్న మాటలివి. నిగూఢంగా వేలాది ప్రశ్నలకు లక్షలాది సమాధానాలు ఈ మాటల్లో దొర్లుతాయి.
గత దశాబ్ద కాలంగా జరిగిన తెలంగాణ ఉద్యమంలో సాహిత్యంతోపాటు ప్రజల విభిన్న సంస్కృతులు ప్రతిబింబించాయి. కబడ్డీ, గిల్లి దండలతోపాటు, అసైదూలా, బతుకమ్మ, కోలాటం లాంటి ఆటలు చౌరస్తాలకు చేరాయి. పీరీలు, బోనాలు, బతుకమ్మలు ఆయా సంప్రదాయాలను కాదని వీధుల్లో ఊరేగాయి. ఉద్యమంతో మమేకమయ్యాయి. ఇలా సాగిన తెలంగాణ ఉద్యమంలో ‘్ఫలానావారిది..’ అనే ప్రస్తావన లేకుండా తెలంగాణ మార్కు భిన్న సంప్రదాయాలు మేళవింపుగా ముందుకు వచ్చాయి. వీటన్నింటినీ అన్ని రాజకీయ పార్టీలు వాడుకున్నాయి. భేషజాలు లేకుండా ప్రజలు గజ్జెలు కట్టి ఆడారు, పాడారు! డప్పులకు లయబద్ధంగా నృత్యం చేశారు. జాతీయోద్యమ కాలంలో బాలగంగాధర్ తిలక్ జాతీయవాదంతో ముంబాయిలో గణేశ్ విగ్రహాల స్థాపనకు పూనుకుని జాతినంతా ఏకం చేయాలని భావించాడు. ఆనాటి అవసరంగా మొదలైన ఆ సంప్రదాయం నేడు నియంత్రణ లేకుండా రాజకీయంగా మారి పర్యావరణానికే సవాలుగా మారింది. ఇప్పుడు బతుకమ్మలది ఇదే స్థితి. ప్రకృతి సహజంగా వుండాల్సిన బతుకమ్మ కృత్రిమ రంగుల్ని పులుముకుని దినం, వారం, కాలం అనే తేడా లేకుండా సంప్రదాయానికి భిన్నంగా కాంగ్రెస్ బతుకమ్మగా, టిడిపి బతుకమ్మగా, బిజెపి బతుకమ్మగా, టిఆర్‌ఎస్ బతుకమ్మగా రూపాంతరం చెందింది.
తెలంగాణ రాష్ట్రం సాకారం తర్వాత పాలక పార్టీ తెరాసకు బతుకమ్మ ‘బంగారు బతుకమ్మ’గా మారితే, టియుఎఫ్ నాయకురాలు విమలక్క ‘బహుజన బతుకమ్మ’ అయింది. ఇలా ఉన్నత వర్గాల, రాజకీయ వర్గాల బతుకమ్మ ప్రతినిధిగా ‘జాగృతి’ అధ్యక్షురాలు ఎంపీ కవిత ఎదిగితే, బడుగువర్గాల బతుకమ్మ ప్రతినిధిగా విమలక్క ప్రాతినిధ్యం చేస్తున్నది. ప్రజలు ఇరురకాల బతుకమ్మలకు లయ కలుపుతూ తమ తమ బతుకమ్మల్ని మరిచిపోతున్నారు. అటు ఖండాంతరాలకు, ఇటు ఢిల్లీ వీధుల్లోకి బతుకమ్మ వెళ్లినా, ఇప్పటికీ మాదిగ, మాలవాడల గడపలకు బతుకమ్మ వెళ్లలేని స్థితే! నిజానికి బతుకమ్మ తయారీకి కావాల్సిన ప్రకృతి ముడి పదార్థాలైన పువ్వుల్ని, గుమ్మడి, తామర ఆకుల్ని సేకరించి అందించేది బడుగు వర్గాలే అయినా పసుపుతో గౌరమ్మ (గౌరవించే అమ్మ)ను చేయడం తమ కులాలకు పనికిరాదనే భావన వీరిది. అలా ఆలోచించేలా అగ్రవర్ణాల ఆధిపత్యం అనాదికాలం నుంచి చెలాయిస్తూనే ఉంది.
ప్రకృతి ఆరాధనగా భావిస్తూ శ్రమ జీవులు, ముఖ్యంగా రైతులు, వ్యవసాయంపై ఆధారపడి జీవించే ఇతర కులవృత్తుల వారు, వ్యాపార వర్గాలవారు ఎలాంటి ఆర్భాటాలు లేకుండా జరుపుకునే ‘బతుకమ్మ’కు రాజకీయ రంగు పులిమి, ఉన్నత వర్గాల బతుకమ్మగా రూపాంతరం చెందించడం భవిష్యత్తులో గణేశ్ ఉత్సవాల తరహా జరుపుకునే విధంగా బాటలు వేయడమే అవుతుంది. బతుకమ్మలకు పోటీని నిర్వహించమంటేనే ఉన్నత రాజకీయ వర్గాల కుటుంబాలకు పెద్దపీట వేయడమే! పూల పరిమళాలతో ఉండాల్సిన బతుకమ్మను కృత్రిమ పూలతో (కాగితం, ప్లాస్టిక్) వికృతిగా మార్చడం చూస్తున్నాం. సాధారణ మహిళలు ఈ పోటీలో పాల్గొనాలంటే వారి బొమిడికం చీర (రెండు చీరల్ని అతుకుగా చేసి కుట్టుకోవడం) అపహాస్యం చేస్తుంది కూడా!
మరి కొంతమంది బతుకమ్మ పాటల్ని అమ్మి సొమ్ము చేసుకుంటే, ‘ఇదరక్క జెల్లండ్లకు ఉయ్యాలో! ఒక్కూరి కిచ్చిరి ఉయ్యాలో! ఒక్కడే మాయన్న ఉయ్యాలో? వచ్చన్న పోడు ఉయ్యాలో!..’ అంటూ నిరాదరణకు గురయ్యే ఆడపడచులు చెప్పుకునే తమ వెతల పాటలకు కాలం చెల్లిపోతున్నది. మీడియాలో బతుకమ్మపై జరిగే చర్చలు, కొత్త కొత్త ఆవిష్కరణలు తెలంగాణ వాసుల్ని ప్రశ్నించుకునేలా చేస్తున్నాయి. నమ్మకాలకు, సంప్రదాయాలకు తారీఖులు, దస్తావేజులుండవు. కాలానుగుణంగా, అవసరానికి అనుగుణంగా అవి మార్పు చెందినా ప్రజల మనోఫలకంపై అవి తీవ్ర ప్రభావానే్న చూపుతాయి. వీటిని మార్చే ప్రయత్నం చేస్తే, సంప్రదాయాలు సంకుచితంగా మారి రాజకీయ మయం అవుతాయి. ఇప్పుడు దేశంలో, రాష్ట్రంలో జరుగుతున్నది ఇదే!
ఆరవ నిజాం మహబూబు అలీ బాషా ఈ పండగ సందర్భంగా తన అధికార నివాసం నుంచి బయటకు వచ్చి వీధుల్లో ఆడే బతుకమ్మలపై వెండి సిక్కాల్ని పెట్టేవాడని ప్రతీతి! ఆ కాలంలోనే ఎదిగిన దొరలు, దేశ్‌ముఖ్‌లు ఇప్పుడు నాయకులైనవారు ఇలాంటి మానవీయ పనులు చేసినట్టు ఎక్కడా కనపడదు. పెద్దబాలశిక్ష 129 ప్రచురణ మొదటి భాగంలో బతుకమ్మ పుట్టక గురించి ఓ కథనం వుంది. చోళరాజు అయిన బొట్ల నర్సింహరాజు, సత్యవతిల సంతానంగా బతుకమ్మను గుర్తిస్తూ గునక, గుమ్మడి,తంగేడు పూలతో తులతూగాలంటూ పెద్దలచే దీవించబడిందనేది ఈ కథనం.
మన దేశంలో ప్రజల సంప్రదాయాల్ని, నమ్మకాల్ని స్వయంగా ప్రభుత్వమే నిర్వహించాలనుకోవడం చూడడానికి బాగానే అనిపించినా, భవిష్యత్తులో అనేక అనర్థాలకు హేతువుగా మారుతుంది. ఇప్పటికే సెప్టెంబర్ 17వ తేదీ- ‘విలీన, విమోచన, విద్రోహ’ దినంగా విభజించబడింది. ఎవరు పాలకులైతే వారికి అనుగుణంగా కార్యక్రమాలు నిర్వహించడంతో ప్రజలు మూడింటినీ కాదనలేకపోతున్నారు. బతుకమ్మ పరిస్థితీ ఇదే! మంత్రుల లోగిళ్ల బతుకమ్మ, తెలంగాణ భవన్ బతుకమ్మ, తెలుగుదేశం బతుకమ్మ, బిజెపి బతుకమ్మ, గాంధీభవన్ బతుకమ్మగా మారిపోయి- ప్రజల బతుకమ్మ కనుమరుగైపోతున్నది. చివరి రోజున జరిగే సద్దుల పెద్ద బతుకమ్మ ఉత్సవం- నాయకుల, నాయకురాండ్రు హాజరయ్యే రోజును బట్టి జరుపుకునే స్థితికి వచ్చింది.
పట్టణీకరణతో బతుకమ్మ చెరువులు ఆక్రమణకు గురైనాయి. బతుకమ్మల నిమజ్జనం ఇంట్లోని నీటి కుండీల్లో, మురికి కాలువల్లో చేయాల్సి వస్తున్నది. చెరువులను పునరుద్ధరిస్తే ప్రజలు వారిమానాన వారు బతుకమ్మల్ని కాపాడుకుంటారు, వారి స్థాయిని బట్టి పండగను జరుపుకుంటారు. ప్రజల మనోభావాల్ని, సంప్రదాయాల్ని గౌరవించడం ఎంత అవసరమో, వాటి జోలికి పోకుండా వారి వారి పద్ధతులకు వదిలివేయాలి. రాజకీయంగా గుప్పిట్లో పెట్టుకోవాలంటే, ప్రజల మధ్యన అడ్డుగోడలు నిర్మించడమే అవుతుంది. భవిష్యత్తులో ఇవి సంక్లిష్టంగా మారుతాయి. రాజకీయాలు ప్రజల గుండెల్లోకి చొరబడడమంటే- వారి శ్వాసను నియంత్రించాలని అనుకోవడమే! లేదంటే బతుకమ్మలు కూడా కులాల వారీగా కలుషితం అవుతాయి!

-డా.జి.లచ్చయ్య