సబ్ ఫీచర్

ప్రతిపక్షమే పాలకపక్షమైతే..ప్రజలే పక్షం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అది తెలంగాణ ఉద్యమకాలం. ఏప్రిల్ 2001లో పురుడు పోసుకున్న తెరాసకు స్వతంత్రించి అసెంబ్లీకి పోటీచేసే పరిస్థితి లేదు. నాటి తెలుగుదేశం హయాంలో ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్‌ఆర్ తెలంగాణ కావాలంటూ సంతకాల సేకరణ చేయించిన సూత్రధారుడు కాకున్నా, పాత్రధారుడు కావడంతో, 2004 ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌తో జతకట్టి తెరాస సాధించుకున్న అసెంబ్లీ స్థానాలు 28 కాగా, ఎంపి స్థానాలు 4. తెరాస మీడియా ప్రతినిధిగా ఉన్న మందాడి సత్యనారాయణ రెడ్డితో సహా పదుల సంఖ్యలో ఉద్యమ పార్టీని కాదని, ఉద్యమాలను కాదని కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. తెరాస ఇప్పటి టిడిపి లాగానే నెత్తినోరు కొట్టుకుంది. 2009 ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ను కాదని బాబుతో పొత్తుపెట్టుకున్న తెరాస పొందిన ఎమ్మెల్యే సీట్లు 12 కాగా, ఎంపి సీట్లు రెండే. నిజానికి ఎన్నికల్ని, ఉద్యమాన్ని నమ్ముకున్నట్లయితే నాడు తెరాస 119 స్థానాలకు పోటీ చేయాలి. ఈ గుణపాఠం బహుశ కెసిఆర్‌ను ఇప్పటికీ వెంటాడుతూనే ఉండాలి. తెరాసది వాపేగాని బలుపు కాదని ఆయన అంతరంగం హెచ్చరిస్తూ ఉండాలి. తెలంగాణ సాకారం కావడం 2014లోనే ఎన్నికలు రావడం, 119 స్థానాల్లో తెరాస గెలుచుకున్నది 64 స్థానాలే కావడం, కెసిఆర్ ముందుచూపుకు కారణం కావచ్చు. నీళ్లున్నప్పుడే పంటలు పండించాలన్న ప్రకృతి నీతిలా, అధికారమున్నప్పుడే అన్నీ చక్కదిద్దుకోవాలన్నది కెసిఆర్ ఎత్తుగడ. అధికార దాహం అనే బలహీనతని గుర్తించిన కెసిఆర్ శతృశేషం లేకుండా పని ప్రారంభించారు.
ముందుగా శాసన మండలిలో బలం పుంజుకోవడానికి కాంగ్రెస్‌ను దెబ్బతీశారు. ఇలా తెరాస తీర్థం పుచ్చుకున్న మండలి సభ్యులపై వేటు వేయాలని గత జూలై 1న ఛైర్మన్‌కు కాంగ్రెస్ ఫిర్యాదు చేస్తే, ఇప్పటికీ చర్య లేకపోగా, స్వయానా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ ప్రచారం జరిగిన డి.శ్రీనివాసే కాంగ్రెస్‌తో పాటు ప్రజలకు షాకిచ్చారు. నిశ్శబ్ద క్యాబినెట్ హోదాలో కేంద్రస్థాయి పనులను కెసిఆర్‌కు చేసిపెడుతున్నాడని శ్రీనివాస్‌పై ఆరోపణలు. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నట్లు, ఈ పాఠాల్ని ఒకప్పుడు కాంగ్రెస్సే నేర్పింది. కిరణ్‌కుమార్ రెడ్డి హయాంలో తీవ్రస్థాయికి చేరుకున్న సకలజనుల సమ్మె ఉద్యమానికి జడిసి 11 మంది టిఆర్‌ఎస్ సభ్యులతో సహా 42 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 38 మంది టిడిపి ఎమ్మెల్యేలు, భాజపా, పిఆర్‌పికి చెందిన ఇద్దరేసి సభ్యులు మొత్తంగా 95 మంది, అలాగే కాంగ్రెస్‌కు చెందిన 13 మంది, టిడిపి చెందిన ముగ్గురు, వెరసి 16 మంది ఎంఎల్‌సిలు రాజీనామా చేస్తే అసెంబ్లీ రద్దు చేయాలని గొడవ చేసింది తెరాసనే. నాన్చుడు ధోరణిని అవలంబించిందీ కాంగ్రెస్సే.
పార్టీని పడగొట్టాలంటే, అదే పార్టీలోని అసమ్మతి వర్గాన్ని నిద్ర లేపడం, మేపడం, ముఖ్యమంత్రి పదవి ఆశచూపడం, మద్దతు తెలపడం కేంద్రంలోని పార్టీకి, లేదా ఆయా రాష్ట్రాల్లోని ప్రతిపక్ష పార్టీకి అలవాటుగా మారింది. పశ్చిమాన కర్నాటక నుంచి, తూర్పున అస్సాం దాకా, కాశ్మీర్ నుంచి కేరళ దాకా ఈ దివాళా కోరు రాజకీయాలకు బలికాని రాష్ట్రం లేదు. ఆలోచన ఏదోగాని, ఇందిరాగాంధీ హత్యతో అత్యధిక మెజారిటీ సాధించిన రాజీవ్‌గాంధీ 1985లో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తేవడం, 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 10వ షెడ్యూలు రెండవ పేరాగా చేర్చడం జరిగింది. అయినా ఇందులోని 5వ సెక్షన్ ప్రకారం 3/2 వంతుల సభ్యులు సంబంధిత పార్టీకి రాజీనామా చేసినా, పార్టీ ఫిరాయించినా అనర్హత వేటు ఉండదనే ద్వంద్వనీతి ఉండటంతో, తర్వాత ప్రధాని అయిన పి.వి. నరసింహారావే స్వయంగా జెఎంఎంతో కుమ్మక్కయ్యారు. స్వయాన రాజీవ్ గాంధీయే, చంద్రశేఖర్‌ను ప్రధానమంత్రిగా చేసి దించేశారు.
ఇప్పుడు తెలంగాణలో తెదెపా ఈసాకునే వినియోగించుకుంటున్నది. అప్పటికే చేరిన ఏడుగురు సభ్యుల రగడ ఓవైపు రగులుతుండగానే, మరో ఇద్దరితో కలిసి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫిరాయింపు చట్టానికి లోబడి చేరడం గమనార్హం. పూర్వాశ్రమంలో ఒకే తానుగుడ్డలైన కడియం, ఎర్రబెల్లి బద్ధ శత్రువులనేది అందరికీ తెలిసిందే. ఈ బద్ధ శత్రువులు ఇప్పుడు గులాబి జెండా కింద చేరారంటే, జరిగేది ప్రజా సంక్షేమం కాదు-పదవుల పంపకం. అలాగే కొండా సురేఖ, కొండా మురళిల కథ. తిట్టిన నోర్లకే పదవుల్ని కట్టబెడుతున్న కెసిఆర్ రాజనీతి నిజమైన తెరాస కార్యకర్తలకు ఇంకా తెలియడం లేదు. తెలిసినా చేసేదేమీ లేక మిన్నకుంటున్నారు. ఇక అన్నింటికీ మించి, రాబోయే నెలలో జరుగబోయే రాజ్యసభ రెండు సీట్లను గెలుచుకోవాలంటే, ఈ ఫిరాయింపుల్ని ప్రోత్సహించడం తెరాసకు అనివార్యమైంది.
ఇప్పటికి ఉమ్మడి రాష్టంలో అన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్, తెదెపాకు బలమైన క్యాడర్ ఉంది. అందుకే ముందుగా తెదెపాను తుదముట్టించడం ప్రారంభించారు. ఈవిధంగా ఒక పార్టీని భూస్థాపితం చేసి, కాంగ్రెస్‌తో తలపడడం చాలా సులభమనేది కెసిఆర్ ఎత్తుగడ. ఈ నేపథ్యంలోనే పోచారంతో సహా, గంప గోవర్థన్ లాంటి వారికి టికెట్లనిచ్చి గెలిపించారు. తుమ్మల నాగేశ్వరరావుతో సహా, వైఎస్‌ఆర్ వర్గీయులైన కొండా దంపతుల్ని తిట్లను మరిచి పదవుల్ని కట్టబెట్టారు. పరిస్థితి ఎక్కడిదాకా పోయిందంటే, కింది స్థాయి క్యాడర్, కెసిఆర్ కుటుంబంలోని కొడుకు, కూతురు, మేనల్లుడు తప్ప కెసిఆర్‌తో సహా అంతా కాంగ్రెస్, తెదెపా సరుకే! ఇక బిజెపి ఎంత గుంజుకున్నా రెండంకెల సీట్లు సాధించడం కష్టం. సిపిఐ, సిపిఎంతో ఇబ్బందే లేదు. ఎంఐఎం శత్రువుకాని మిత్రపక్షమే. ఇక మిగిలేది కాంగ్రెస్ ఒక్కటే. తెరాస వ్యతిరేక ఓట్లు తప్ప పార్టీగా ఎదిగే పరిస్థితి ఇప్పట్లో కాంగ్రెస్‌కు లేదు. ఈ బలహీనతలన్నీ కెసిఆర్‌కు బాగా కలిసివస్తున్నాయి కాబట్టే, ఈ చర్యలు కొనసాగుతున్నాయి.
ఓ రాజకీయ సిద్ధాంతంతో (అశాస్ర్తియ సిద్ధాంతమైనా) మరో రాజకీయ పార్టీ సిద్ధాంతంపై గెలిచి ప్రజలపక్షం వహించాల్సిన రాజకీయ నాయకులు, రీకాల్ వ్యవస్థ లేకపోవడంతో అధికార పక్షమే అండగా నిలవడం, నెలల తరబడి, సంవత్సరాల తరబడి స్పీకర్లు నిర్ణయాలు తీసుకోకపోవడంతో ఈ అనైతిక చర్యలకు పాల్పడుతున్నారు. కోర్టులు కూడా మిన్నకుండాల్సిన స్థితి. తాజాగా అరుణాచల్‌ప్రదేశ్ ఉదంతమే చక్కని ఉదాహరణ. పైగా స్పీకర్లు సంబంధిత రాజకీయ పార్టీ సభ్యుడే కావడం, గవర్నర్లు కేంద్రం చెప్పుచేతల్లో పనిచేయడంతో ఈ రాజకీయ అనిశ్చిత పరిస్థితి అంతటా కొనసాగుతోంది. తిలాపాపం తలా పిడికెడులా అన్ని రాజకీయ పార్టీలు ఈ దొంగనాటకంలో పాత్రధారులే. చిత్తశుద్ధి నిజాయతీ లేని ఈ నాయకులు, పార్టీలు మాత్రం ఓట్లను అమ్ముకోవద్దని సెలవిస్తూ వుంటాయి. బుద్ధి జీవులు ఈ మాటల్ని మాగ్నాకార్టాలా భావిస్తూ ప్రజల్ని చైతన్యం చేస్తున్నట్టు భ్రమపడుతారు. వీరెవ్వరికీ లోపభూయిష్ట ఎన్నికల విధానం పట్టదు. సంస్కరణలు గిట్టవు. మార్పును ఆహ్వానించరు.
ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికైన గుర్తును కాదని, మరో గుర్తు పార్టీలో చేరడం చెల్లదనే నిబంధన ఉండాలి. చేరితే పార్టీకి రాజీనామా చేసి, ఆమోదింపచేసుకొని చేరాలని ఉండాలి. ఒకవేళ పదవికే రాజీనామా చేస్తే, సంబంధిత సీటుకు ఉప ఎన్నికలు నిర్వహించవద్దు. గవర్నర్ పాలన కింద సంబంధిత నియోజకవర్గాన్ని ఉంచాలి. నిధుల కేటాయింపు దామాషా పద్ధతిలో జరగాలి. అధికార యంత్రాంగం ఎలాగో ఉంటుంది కాబట్టి, అభివృద్ధి కుంటుపడే అవకాశం ఉండదు. ఇలా కట్టుదిట్టమైన నిబంధనలుంటే పార్టీ ఫిరాయింపును కలలో కూడా ఊహించరు. రాజకీయ రంగులు మారవు. ఓ స్థిరత్వం ఏర్పడుతుంది. అలాగే ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే విధిగా సంబంధిత పార్టీకి సగానికి మించిన మెజారిటీ ఉండాలి. ఇతర పార్టీల మద్దతు, ఇండిపెండెంట్ల మద్దతు అనేదాన్ని తొలగించాలి. ఇలా మెజార్టీ రాకుంటే, సంబంధిత రాష్ట్రం రాష్టప్రతి పాలన కింద ఉంచాలి. తిరిగి సాధారణ ఎన్నికల దాకా మధ్యలో ఎన్నికలకు పోవద్దు. ఇలాంటి సంస్కరణలే ఈ ప్రజాస్వామ్యాన్ని ఏమైనా కాపాడగలుగుతాయి. ప్రజలకు మనశ్శాంతి, సుస్థిరత ఏర్పడుతుంది. బహుముఖ పోటీలు, బహుళ పార్టీల విధానం తగ్గుముఖం పడతాయి. అమెరికా, బ్రిటన్, యూరోపియన్ యూనియన్ దేశాల్లో ఈ విధానాలున్న విషయం తెలిసిందే. అన్నింటా అమెరికాను, గతంలో బ్రిటన్‌ను అనుకరించిన మన నాయకులకు, ఈ ఎన్నికల విధానం ఎందుకు ఇష్టముండదో తెలిసిందే. పాలక పార్టీకి కనువిందుగా, ప్రతిపక్ష పార్టీకి సంకటంగా, ప్రజలకేమో అనిశ్చిత పరిస్థితి కొనసాగే ఈ వ్యవస్థ మారకపోతే, ప్రజాస్వామ్య మనుగడే అత్యంత ప్రమాదకరం. ఈ అంచునే భారత ప్రజాస్వామ్య మున్నదని ఇప్పుడైనా గుర్తిద్దాం.