సబ్ ఫీచర్

పాఠ్యాంశాలుగా జానపద సాహిత్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జానపద కథలు ఆలోచనతో కూ డిన ఊహాత్మక కథనాలు. రచయిత తన ఊహను ఎంతవరకూ అందుకోగలడో అంతవరకూ ఊ హించి కథను ఆద్యంతం రక్తికట్టిస్తాడు. ఈ కథల్లో అందరినీ అలరించే అద్భుతాలుంటాయి. మనిషికి అసాధ్యమైన పనులను నాయకుడు, నాయకి సాధ్యం చేస్తుంటారు. మంత్రాలు, తంత్రాలు సైతం ఉంటాయి. ఇవన్నీ కల్పనలే అయినా పాఠకులను కొత్తకొత్త ఊహలతో ముందుకు తీసుకువెళుతుంటాయి. ఈ కథల్లో ఉన్నదంతా కల్పనే అని అనుకోనక్కర్లేదు. ఇందులో మనిషి జీవితం ఉంటుంది. ఆనాటి సమాజ పరిస్థితులూ కనిపిస్తాయి. కొంతవరకూ చరిత్ర ఉంటుంది. జాతికి సంబంధించిన సాంస్కృతిక మూలాలు ఇందులో అంతర్లీనంగా కనిపిస్తాయి. ఇవన్నీ- వయోభేదం లేకుండా పాఠకులను ఉత్సాహకరమైన ప్రేరణకు గురిచేసి ఆత్మవిశ్వాసాన్ని, సాహస లక్షణాలను పెంచుతాయి. బాలలైనా, యువకులైనా, పెద్దలైనా జానపద సాహిత్యం చదివితే మంచి అనుభూతికి లోనవుతారు. వీటి వల్ల కలిగే ఉత్సాహంతో పిల్లలు ఇతర పాఠ్యాంశాల మీద కూడా ఆసక్తిని పెంచుకుంటారు. వీటిని చదివిన పిల్లలు కొన్ని మార్పులు చేసో, కొత్తగా ఊహించో మంచి కథను వినిపించేందుకు ప్రయత్నిస్తారు. ఇలా బాలల్లో ఊహాశక్తి, సృజనాత్మకత పెరుగుతుంది.
గతంలో పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఇతర పాఠ్యాంశాలతో పాటు పిల్లలకు జానపద కథలు, నీతికథలు విధిగా చెప్పేవారు. వీటిని వినేందుకు చిన్నారులు ఎంతో ఆసక్తి చూపుతారు. ఈ కథల ద్వారా జీవన విధానం, నైతిక విలువలు వంటివి వారికి సులభంగా బోధించవచ్చు. కథలపై ఆసక్తి కలిగిన పిల్లలు తాము కూడా వినూత్నంగా ఆలోచించి సొంతంగా కథలు చెబుతుంటారు. జానపద కథలు కాలక్షేపం కోసం కాదు. పిల్లల్లో పరిశీలన, ఆలోచన, సృజన వంటివి పెంచుతాయి. మానసిక వికాసానికి అవకాశం ఏర్పడుతుంది. సొంతంగా ఆలోచించే స్థాయికి వారు ఎదుగుతారు. అందుకే- ‘విజ్ఞానం కన్నా ఊహాశక్తి ఎంతో గొప్పది’ అని ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్తవ్రేత్త ఐన్‌స్టీన్ అన్నారు. ‘చిన్నతనంలో నేను కాస్త అమాయకంగా ఉండేవాడిని.. ఏదీ సరిగా అర్థమయ్యేది కాదు.. అందువల్ల ప్రకృతిలోని ప్రతి వస్తువునూ అద్భుత భావంతో పరిశీలించేవాడిని... బహుశా ఆ భావమే నాలోని జిజ్ఞాసకు కారణమై ఉంటుంది..’ అని ఆయన చెప్పేవారు. మన భారతీయ సాహిత్యంలో ముఖ్యంగా తెలుగు భాషలో అంతులేని జానపద సాహిత్యం ఉంది. రాజమహేంద్రవరానికి చెందిన మధిర సుబ్బన్నశాస్ర్తీ ‘కాశీమజిలీ కథలు’ పేరుతో అనేక జానపద కథలను అందించారు. ఒకప్పుడు ఈ కథలను అన్ని వయసుల వారూ ఎంతో ఆసక్తిగా చదివేవారు. ఇలాంటి జానపద కథల పుస్తకాలు గతంలో తెలుగుసీమలోని ప్రతి ఇంట్లోనూ ఉండేవి. పెద్దలు ఈ కథలను సాయంత్రం వేళ పిల్లలందరినీ కూర్చోబెట్టి వినిపించేవారు. పిల్లల చేత కూడా చదివించేవారు. జానపద కథల్లోని పాత్రలు పసివాళ్ల మనసులపై చెరగని ముద్ర వేస్తాయి. తాము కూడా సాహసాలు చేయాలని, అందరిలోనూ పేరు తెచ్చుకోవాలని, ఉన్నత ఆశయాలతో జీవించాలని పిల్లలు భావిస్తారు. ఈ కథల ప్రభావంతో వారిలో కొత్త ఆశలు చిగురిస్తాయి. ఊహాశక్తి వికసిస్తుంది.
నేటి ఆధునిక యుగంలో ‘హేరీ పోటర్’ కథలు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందాయి. వీటిని చదివేందుకు దేశదేశాల్లోని పిల్లలు ఎంతగానో ఇష్టపడుతుంటారు. ‘హేరీ పోటర్’ కథలకు మన ‘కాశీ మజిలీ కథలు’ ఏ మాత్రం తక్కువ కాదు. మంత్రతంత్రాలు, కల్పనలకు మన జానపద కథలు పెట్టింది పేరు. ఇంగ్లీషు భాషలో వచ్చే కథల పుస్తకాలంటే అదో వేలం వెర్రి. తెలుగు జానపద, నీతికథల్లోనూ ఎన్నో విషయాలు నిబిడీకృతమై ఉన్నాయి. తెలుగు భాష ఒక ప్రాంతానికి పరిమితమైన భాష కావడంతో మన జానపద కథలు విశ్వవ్యాప్తం కాలేకపోయాయి. ఆంగ్లం అంతర్జాతీయ భాష కావడంతో హేరీ పోటర్ పుస్తకాలు దేశదేశాల్లో అమ్ముడుపోతున్నాయి. ‘కాశీ మజిలీ కథలు’ మాత్రమే కాదు, తెలుగు భాషలో మరెన్నో జానపద, పురాణేతిహాస గాధలు పిల్లలను ఆద్యంతం అలరిస్తాయి. రామాయణ, మహాభారత కథల్లో అప్పటి సామాజిక పరిస్థితులు, కుటుంబ బంధాలు, మానవీయ కోణాలు, మానవుడి బాధ్యతలు, నైతిక విలువలు వంటి అంశాలు పుష్కలంగా కనిపిస్తాయి. సముద్రం మీద వారధి కట్టడం అనే ఊహ వాల్మీకి మహర్షికి కలగడమే అద్భుతం. హనుమంతుడు సముద్రాన్ని దాటడం, లక్ష్మణుడి కోసం సంజీవిని పర్వతాన్ని అరచేతిలో మోసుకొని రావడం ఇవన్నీ అద్భుతమైన ఊహలు.
సాంకేతికత, శాస్ర్తియ విజ్ఞానం పిల్లలకు అవసరమే. అయితే- వారి మానసిక వికాసానికి, ఊహాశక్తిని పెంచడానికి కథలు కూడా అంతే అవసరం. మానసికంగా ఉత్సాహవంతులైతేనే పిల్లలు తమ పాఠ్యాంశాలను తొందరగా నేర్చుకునే వీలుంటుంది. ఈ కారణంగా పిల్లలకు ఇంట్లో, బడిలో జానపద కథలు చెబితే వారిలో సృజనాత్మకత ద్విగుణీకృతమవుతుంది. జానపద కథలను హైస్కూలు, కళాశాల స్థాయి వరకూ తెలుగు పాఠ్యపుస్తకాలలో చేర్చాలి. వీటిని ఉపవాచకాలుగా పెట్టవచ్చు. వీటిని చదివే పిల్లల్లో మానసిక వికాసమే కాదు, సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం పెరుగుతుంది. సృజనాత్మకతో వారు కొత్త కొత్త కలలు కంటారు. కొత్త ఆశలతో ఏదైనా సాధించాలని తపిస్తారు. దివంగత మాజీ రాష్టప్రతి అబ్దుల్ కలాం- ‘కలలు కనండి.. కలలను సాకారం చేసుకోండి..’ అని విద్యార్థులకు ఎప్పుడూ చెప్పేవారు. ఆయన మాటలు ఆచరణలో నిరూపించాలంటే విద్యార్థులకు చిన్నప్పటి నుంచే సరైన రీతిలో దిశానిర్దేశం చేయాలి. అందుకు మన సాహిత్యం, జానపద కథలు ఒక సాధనం అని తల్లిదండ్రులు, గురువులు గుర్తించాలి.

-మనె్న సత్యనారాయణ 99890 76150