సబ్ ఫీచర్

‘చీకట్లు’ చిమ్మే చైనా బాణసంచా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దీపావళి పండుగ అంటే బాణసంచా వెలుగులే కళ్లముందు కన్పిస్తాయి. మిరుమిట్లుగొలిపే వెలుగులు చిమ్ముతూ, చెవులు చిల్లులుపడే శబ్దాలు చేస్తూ నీలాకాశంలో విభిన్నరంగుల్లో బాణసంచా విస్ఫోటనం అందరికీ ఆనందాన్నిస్తుంది. కానీ, ఈ బాణసంచా తయారీకేంద్రాలు, అక్కడ పనిచేసేవారి జీవితాల్లో ఇప్పుడు ఆ వెలుగు వెలవెలపోతోంది. భారతీయ బాణసంచా తయారీ పరిశ్రమకు అక్రమంగా జొరబడుతున్న చైనా క్రాకర్లు, ఫైర్‌వర్క్స్ సవాలు విసురుతున్నాయి. కనీస నాణ్యతాప్రమాణాలు లేని చైనా దీపావళి వస్తువులు దేశ ప్రజలకు శాపంగా మారుతున్నాయి. చౌకగా, ఆకర్షణీయంగా కన్పించే చైనా బాణసంచా వెలుగులు తాత్కాలిక ఆనందాన్నిచ్చినా అంతిమంగా అవి చిమ్మచీకటిని మిగులుస్తాయి. ప్రత్యక్షంగా వేలాదిమంది భారతీయ కార్మికుల ఉపాధిని దెబ్బతీస్తున్న చైనా బాణసంచా భారతీయ ఆర్థిక వ్యవస్థకు ఒక్క రూపాయినీ జమచేయడం లేదు. పర్యావరణానికి, ప్రజారోగ్యానికి పెనుముప్పుగా మారిన చైనా బాణసంచా వినియోగించకపోవడమే అసలు మందు.

విజయానికి గుర్తుగా, ఆనందాన్ని చాటుకునే వేదికగా భారతీయులు దీపావళి పండుగను అత్యంత కోలాహలంగా నిర్వహించుకుంటారు. వెలుగుదివ్వెలు వెలిగించి, మిరుమిట్లు గొలిపే బాణసంచా కాల్చడం ఈ పండుగ విశేషం. నిజానికి పర్యావరణాన్ని, ప్రాణికోటి ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఈ వేడుక- ఒకప్పుడు ఆరోగ్యసూత్రానికి ప్రతీక. శీతాకాలంలో వచ్చే రోగాలకు చెక్ పెట్టి, క్రిమికీటక నాశనానికి దివ్వెల పండుగ పేరుతో బాణసంచా కాల్చేవారు. ప్రజాబాహుళ్యంలో బాణసంచా కాల్చడం ఓ వేడుక. ఒక్క దీపావళిలోనే కాకుండా అనేక సందర్భాలలో బాణసంచా వెలిగించడం రానురాను ఓ శుభసంకేతంగా మారింది. ఇదే వేలాది కుటుంబాలకు ఉపాధి మార్గంగా మారింది. తమిళనాడులోని శివకాశి ఓ చిన్నపట్టణం. బాణసంచా, అగ్గిపెట్టెల తయారీ ఇక్కడ కేంద్రీకృతమైంది. భారతదేశ బాణసంచా అవసరాల్లో 90 శాతం శివకాశి తీరుస్తోంది. నాణ్యమైన, పర్యావరణానికి, వినియోగదారులకు హాని చేయని రీతిలో, ప్రభుత్వ నిబంధనల మేరకు ఇక్కడ బాణసంచా తయారవుతోంది. ఈ పరిశ్రమపై దాదాపు 2 లక్షల మంది నేరుగా అక్కడే ఉపాధి పొందుతున్నారు. దాదాపు వెయ్యి లైసెన్స్ కలిగిన బాణసంచా తయారీ పరిశ్రమలు అక్కడ నెలకొన్నాయి. దీనికి అనుబంధ పరిశ్రమల్లో (ప్రింటింగ్, ప్యాకింగ్) 3 లక్షల మంది వరకూ పనిచేస్తు బతుకుతున్నారు. ఫైర్‌వర్స్క్, క్రేకర్స్, ఇతర దీపావళి బాణసంచా నిల్వ, రవాణా చేసే విభాగాల్లో 20 లక్షలమంది ఆధారపడి జీవిస్తున్నారు. ఇక తాత్కాలికంగా అంటే- దీపావళికి ఓ నెలముందు నుంచి బాణసంచా క్రయవిక్రయాలపై 80 లక్షలమంది ఆధారపడి ఉన్నారు. అంటే భారతదేశంలో బాణసంచా పరిశ్రమపై దాదాపు కోటి మంది ఆధారపడి ఉన్నారన్నమాట. ఒక్క దీపావళికి దేశం మొత్తం మీద బాణసంచా విక్రయాలకు సంబంధించి దాదాపు 3వేల కోట్ల రూపాయల మార్కెట్ ఉంటుంది. ఇంతకాలం ఈ వ్యాపారంలో 90 శాతం శివకాశి పట్టణం కేంద్రంగా సాగేది.
కానీ కొన్ని సంవత్సరాలుగా చైనా నుంచి అక్రమంగా వస్తున్న బాణసంచా పెద్దదెబ్బ కొట్టింది. దాదాపు 1.5 వేల కోట్ల వ్యాపారాన్ని దెబ్బతీసింది. ఈ పరిణామాలకు శివకాశి విలవిలలాడుతోంది. వేలాది కుటుంబాలకు పనిలేకుండా పోతోంది. చైనా నుంచి వచ్చే బాణసంచా వల్ల అటు ప్రభుత్వానికి లేదా ఇటు కార్మికవర్గాలకు ఒక్క రూపాయి ఆదాయం కూడా ఉండటం లేదు. దొంగచాటుగా తెచ్చిన చైనా బాణసంచాను విక్రయించేవారికి మాత్రం దండిగా లాభాలు దక్కుతున్నాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ మీదుగా చైనా బాణసంచా భారత్‌కు చేరుతోంది. క్రీడావస్తువులు, పాలిథిన్ కవర్లు, సెల్లోఫిన్ టేపులు, దుస్తులు తరలిస్తున్నట్లు బుకాయించి, ఆ కంటైనర్లలో బాణసంచాను చైనా తరలిస్తోంది. ము ఖ్యంగా సముద్రమార్గంలో ఈ తరలింపు సాగుతోంది. ఐదారు సంవత్సరాలుగా ఈ చైనా బాణసంచా అక్రమ ప్రవాహం పెరిగిపోయింది. దీంతో తమిళనాడులోని బాణసంచా పరిశ్రమ ఆందోళన చెందింది. అక్కడి ప్రభుత్వమూ స్పందించింది. చైనానుంచి వచ్చే బాణసంచాను నిషేధించాలని కోరింది. కేంద్రం ఆ పని చేసింది. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చైనా బాణసంచాను నిషేధించాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి చైనా బాణసంచా వాడరాదన్న వాదనకు కాస్త స్పందన కన్పిస్తోంది.
ఆ బాణసంచాతో ముప్పు..
చైనా బాణసంచాకు ఆదరణ పెరగడానికి ఓ కారణం ఉంది. దేదీప్యమానంగా వెలగడం, పెద్దశబ్దాలు రావడం, చౌకగా లభించడం వల్ల వాటిని కొనేందుకు జనంలో ఆసక్తి పెరిగింది. వినియోగదారులకు కారుచౌకగా దొరకడం వల్ల గణనీయమైన లాభాలు వస్తూండటంతో అమ్మకందారులూ పరుగులుపెడుతున్నారు. కానీ, అవి తెచ్చిపెట్టే ముప్పును గుర్తించడం లేదు. కేంద్రప్రభుత్వం సూచించిన నిబంధనల ఆధారంగా భారతీయ బాణసంచా తయారవుతోంది. బాణసంచా పేలుళ్ల సందర్భంగా వెలువడే శబ్దం, విడుదలయ్యే కర్బన ఉద్గారాలు, కాల్చేటప్పుడు ప్రమాదాలు సాధ్యమైనంత తక్కువగా జరిగేలా భారతీయ బాణసంచా తయారవుతోంది. పరిమిత స్థాయిలో రసాయనాలు వాడుతున్నారు. కానీ, చైనా బాణసంచా అన్ని పరిమితులను బరితెగించింది. నిషేధిత మూలకాలను వీటిలో ఇష్టారాజ్యంగా వాడుతున్నారు. అవి విడుదల చేసే వాయువులు వాతావరణాన్ని, ప్రజల ఆరోగ్యాన్ని, భూగర్భజలాలను శాశ్వతంగా దెబ్బతీస్తున్నా యి. బాణసంచా వస్తువుల్లో ఆకర్షణీయమైన నీ లం, ఆకుపచ్చ, ఎరుపు రంగు, మెరుపులు కన్పించడానికి వాడే యాంటిమొని సల్ఫైడ్ మన బాణసంచాలో 8శాతం వాడితే చైనావాటిలో 25 శాతం వినియోగిస్తోంది. మండటానికి, మంట అం టుకోవడానికి వినియోగించే అమ్మోనియం, పొటాషి యం, పొటాషియం నైట్రే ట్ వంటివి మనం 6 లేదా 7 శాతం వాడితే చైనా 22 నుంచి 30 శాతం వరకు వాడుతోంది. పాదరసం, ఆర్సెనిల్, బేరియం నైట్రేట్, కాపర్ వంటివి మనం 2 నుంచి 9 శాతం వాడితే చైనా 8 నుంచి 23 శాతం వాడుతోంది. చైనా బాణసంచా అంటించిన వెంటనే పేలిపోవడం, కాలిపోవడం వంటివి సంభవిస్తాయి. అందువల్ల వినియోగదారుడు ఊహించని ప్రమాదాలకు వెంటనే గురవుతాడు. మన బాణసంచా వెలగడం కాస్త నెమ్మదిగా ఉంటుంది. అందువల్ల ప్రమాదాలు తక్కువ. చైనా బాణసంచాలో నిషేధిత మూలకాలు వినియోగించడం వల్ల విడుదలయ్యే వాయువులు మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఊపిరితిత్తుల వ్యాధులు, క్యాన్సర్, కళ్లకు సంబంధించిన వ్యాధులను కలుగచేస్తాయి. భూగర్భ జలవనరులు, వాయు కాలుష్యం తీవ్రస్థాయిలో ఉంటుంది. పైగా భారతీయ బాణసంచా మార్కెట్‌లో సగానికి సగం కొల్లగొడుతున్న చైనా నుంచి మన ఖజానాకు ఒక్క రూపాయ కూడా రాదు. అన్ని అనర్థాలకు కారణమైన చైనా బాణసంచాకు ఎంత దూరంగా ఉంటే మనం అంత భద్రంగా ఉన్నట్లు లెక్క.
అసోచామ్ ఏం చెబుతోందంటే...
వాతావరణ కాలుష్యం, చైనా బాణసంచా వల్ల కలిగే అనర్థాలపై జరిగిన ప్రచారం ప్రజల్లో చైతన్యాన్ని కలిగించిందని ‘అసోచామ్’ (ది అసోసియేటెడ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా) నిర్వహించిన తాజా సర్వే వెల్లడించింది. చైనా నుంచి వచ్చే బాణసంచా నిరోధానికి జరిగిన ప్రచారం వల్ల భారతీయ బాణసంచా విక్రయాలూ తగ్గాయని సర్వే సందర్భంగా ‘అసోచామ్’ ఓ అంచనాకొచ్చింది. ప్రజల్లో కలిగిన సామాజిక స్పృహే దీనికి కారణమని వెల్లడించింది. అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, చెన్నై, డెహ్రాడూన్, న్యూఢిల్లీ, హైదరాబాద్, జైపూర్, లక్నో వంటి మెట్రో నగరాల్లో గడచిన పాతికరోజుల వ్యవధిలో అసోచామ్ సర్వే నిర్వహించినపుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. డబ్బు వృథా చేసి, అనారోగ్యాన్ని కొనితెచ్చుకోవడం వృధా అన్నది జనం ఆలోచన. చైనా బాణసంచాపై తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఆ బాణసంచా వల్ల ప్రత్యక్షంగా 30వేలమంది నష్టపోతున్నారు, 400 ఫ్యాక్టరీలు నష్టపోతున్నాయి. చైనాను కట్టడి చేయడానికి చేసిన ప్రయత్నం, భారతీయ పరిశ్రమపై ప్రభావం చూపినా అది మంచి చేసే నిర్ణయమేనని ప్రజలు భావిస్తున్నట్లు అసోచామ్ జనరల్ సెక్రటరీ డిఎస్‌రావత్ అంటున్నారు. తాత్కాలిక ఆనందం కన్నా సురక్షిత జీవితమే ముఖ్యం. అప్పుడు ప్రతిరోజూ దివ్య దీపావళే.

-ఎస్.కె.రామానుజం