సబ్ ఫీచర్

ప్రభుత్వ పెత్తనం వద్దు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు ప్రాథమిక విద్య నుంచి విశ్వవిద్యాలయాల స్థాయి వరకూ ప్రభుత్వ జోక్యం పెరగడంతో విద్యావ్యవస్థ అవస్థల పాలైంది. ఈ దుస్థితి తొలగాలంటే ముందుగా విద్యారంగంలో పాలకుల పెత్తనానికి తెరపడాలి. లేదా ప్రభుత్వరంగం నుంచి విద్యను పూర్తిగా తొలగించాలి. ఈ వాదన వింతగా ఉన్నా ప్రభుత్వ రంగంలో విద్యను సంస్కరించడం ఎవరి తరం కావడం లేదు. కళాశాలల్లో లైంగిక వేధింపులు, పోకిరీ చేష్టలు, కొన్ని చోట్ల అధ్యాపకులపై దాడులు వంటివి జరుగుతున్నాయి. నేడు చాలామంది విద్యార్థులు చదువుకోవాలన్న ఆకాంక్షతో ప్రభుత్వ కాలేజీలకు వెళ్లడం లేదు. మార్కుల కోసం, ర్యాంకుల కోసం ప్రైవేటు, కార్పొరేటు విద్యాసంస్థలను ఆశ్రయిస్తున్నారు. చదువుకునేందుకు భారీగా డబ్బు ఖర్చు ఏమిటి? ఇపుడు విద్య అంగడి వస్తువైంది. కొందరు విద్యార్థులైతే ఎంఫిల్, పిహెచ్‌డి పట్టాలను అక్రమ మార్గాల్లో సంపాదిస్తున్నారు.
హైస్కూలు విద్యార్థులకు సిలబస్‌ను విపరీతంగా పెంచేస్తున్నారు. ఆ సిలబస్‌పై టీచర్లకే తగిన అవగాహన ఉండడం లేదు. ఉపాధ్యాయులకు శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నా పిల్లల్లో నైపుణ్యం పెరగడం లేదు. పాఠ్యపుస్తకాల్లో ఏభై శాతం అంశాలు పిల్లలకు అనవసరమైనవే. ఇంగ్లీషు మీడియం పుణ్యమాని పిల్లలు రెంటికీ చెడిన రేవడులవుతున్నారు. ప్రభుత్వ టీచర్లకు జీతాలు భారీగా ఉంటున్నాయి. అందువల్ల ఖాళీలను భర్తీ చేయకుండా కాంట్రాక్టు పద్ధతిలో నియామకాలకు ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. బోధనా పద్ధతులు తెలియనివారు కేవలం జీతం కోసం టీచర్లుగా చేరుతున్నారు. స్కూళ్లు, కాలేజీలు, వర్సిటీల సంఖ్య అనూహ్యంగా పెరగడంతో వాటి నిర్వహణకు ప్రభుత్వం తగినన్ని నిధులు ఇచ్చే పరిస్థితి లేదు. రాశి పెరిగినా వాసి పెరగనందున చాలా విద్యాసంస్థలు కేవలం అలంకార ప్రాయంగా మారాయి.
ఇక పరీక్షా విధానంలో సంస్కరణలకు ప్రభుత్వం ఎలాంటి చొరవ చూపడం లేదు. కొన్ని పరీక్షలు పూర్తిగా రద్దుకావాలి. మరికొన్ని ఉన్నట్టు, లేనట్టు వుండాలి. ‘ఫెయిల్’ అనే మాట లేకుండా కొన్ని పరీక్షలుండాలి. పిల్లల్లో ఒత్తిడి కలగని రీతిలో పరీక్షల విధానం ఉండాలి. తాము రాసిన పరీక్ష ఫెయిల్ అవుతామన్న భయంతో కొందరు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. తగిన ర్యాంకు రాలేదని కొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. బలవంతపు చదువులతో విద్యార్థులకు మానసిక ప్రశాంతత కరవైంది. ప్రభుత్వానికి పట్టకపోయినా, విద్యావేత్తలైనా ఈ విషయాన్ని ఎందుకు ఆలోచించరు?
నేడు ప్రభుత్వం వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు ఎంట్రన్స్‌లు నిర్వహిస్తోంది. ఎంట్రన్స్‌లన్నీ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతుండగా- కోచింగ్ సెంటర్లు లక్షలాది రూపాయలను సంపాదిస్తున్నాయి. అన్ని చోట్లా ప్రభుత్వమే కోచింగ్ కేంద్రాలను నిర్వహించాలి. తల్లిదండ్రుల ఒత్తిడితో కాకుండా, కేవలం ఆసక్తి ఉన్నవారికి మాత్రమే ప్రభుత్వ కోచింగ్ కేంద్రాల్లో తర్ఫీదు ఇవ్వాలి. కార్పొరేట్ విద్యాసంస్థల్లో వ్యాపార ధోరణి పెరగడంతో ర్యాంకులు సాధించిన విద్యార్థులను తమ ప్రచారానికి వాడుకుంటున్నారు. ప్రతిభ చూపలేని పిల్లలను సొంత తల్లిదండ్రులే అసహ్యించుకుంటున్నారు. ఫలితంగా విద్యార్థుల మధ్య అంతరాలు ఏర్పడుతున్నాయి. పేరెంట్స్ ఒత్తిడి కారణంగా కొంతమంది విద్యార్థులు తమకు ఇష్టం లేని కోర్సులో చేరాల్సి వస్తున్నది. ఇలా బలవంతంగా కాలేజీకి వెళితే వారు చదువుపై ఎలా ఏకాగ్రత చూపిస్తారు? ఈ అస్తవ్యస్త పరిస్థితులన్నింటికీ ప్రభుత్వ అలసత్వం, అర్థం లేని విధానాలే కారణం. ప్రభుత్వ పెత్తనానికి బదులు విధాన నిర్ణయాలను తీసుకునేందుకు విద్యారంగ ప్రముఖులను నియమించాలి. ప్రైవేటు విద్యాసంస్థలను పూర్తిగా రద్దు చేయకపోయినా, వాటిని నియంత్రించాలి.

-వేదుల సత్యనారాయణ 96183 96071