సబ్ ఫీచర్

అరాచక శక్తులను అణచివేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌లోని హెచ్.సి.యు.లో, న్యూఢిల్లీలోని జెఎన్‌యులో జరిగిన సంఘటనలను సాకుగా తీసుకొని ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు మావేశాలను సజావుగా జరగకుండా ప్రతిపక్షాలు శతవిధాలా ప్రయత్నించాయి. నిన్న మొన్నటి వరకు గుళ్లు, గోపురాల చుట్టూ తిరిగిన అసహనం ఇప్పుడు విశ్వవిద్యాలయంలో తిష్ఠవేసింది. మనదేశంలో నివసించే ప్రజలంతా కులమత భేదాలు లేకుండా కలసిమెలసి నిస్వార్థంతో పారిశ్రామికంగా అభివృద్ధి కోసం తమవంతు కృషి చేస్తున్నారు. కాని కొంతమంది కుహనా రాజకీయ వాదులు ఇంటి దొంగలై దేశ సమగ్రతకు భంగం కలిగించడానికి శాయశక్తులా మాయోపాయాలను పన్నుతున్నారు. దీనికి దృష్టాంతమే విశ్వవిద్యాలయాలలో రిజర్వేషన్ల అలజడులు, గందరగోళాలను సృష్టించడం. విద్యాలయాలలో ఉన్న విద్యార్థులను మూడు వర్గాలుగా విభజిస్తున్నారు. దళితులు, ముస్లిం మైనారిటీలు, అగ్రవర్ణాలవారు. కాలేజీ క్యాంపస్‌లలోకి అడుగుపెట్టగానే వారి హృదయాలలో ఈవిధమైన విభేదాలు సృష్టించి విషబీజాలు నాటుతున్నారు. దళితుల, మైనారిటీల కొమ్ము కాస్తున్నామన్న సాకుతో దేశ విద్రోహకర చర్యలు చేపడుతూ దేశంలో అరాచకాలు సృష్టిస్తున్నారు.
ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వారు మన దేశాన్ని ఎక్కువకాలం పాలించారు. నిజంగా దళితులపై, మైనారిటీలపై ప్రేమ, అభిమానం ఉండే వారి దుస్థితి ఇంకా ఇట్లాగే ఉండేది కాదు. స్వాతంత్య్రం వచ్చి 67 సంవత్సరాలు ముగిసినా రిజర్వేషన్లు కొనసాగించవలసిన అగత్యం వచ్చేది కాదు. విద్యార్థి శక్తి చాలా గొప్పది. ప్రపంచంలోని ఏ దేశమైనా విద్యార్థిలోకానికి తలవంచాల్సిందే. తెలంగాణ రాష్ట్ర అవతరణకు విద్యార్థి శక్తి ఎంత దోహదం చేసిందో మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు అవకాశవాదులు, విద్యార్థులను పావులుగా వాడుకొని దేశంలో గొడవలు సృష్టించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రపంచంలోని చాలా దేశాలల్లో మన దేశానికి చెందిన విజ్ఞానవేత్తలే మూలస్తంభాలుగా ఉన్నారు. అమూల్యమైన మేధాసంపత్తిని దుష్ట రాజకీయాలకు బలిచేస్తూ మీ బంగారు భవిష్యత్తుకై కలలుకన్న తల్లిదండ్రులకు నిరాశను, దుఃఖాన్ని మిగిల్చి, కడుపు కోతలకు గురి చేయకండి. ముసలి కన్నీరు కార్చే నాయకుల నిజ స్వరూపాలను విద్యార్థులు తెలుసుకోవాలి.
రిజర్వేషన్ల ప్రహసనం ఇప్పుడు మనదేశంలో మళ్లీ మొదలైంది. ఉత్తర భారతదేశంలో మహారాష్ట్ర నుంచి గుజరాత్‌కు తర్వాత రాజస్థాన్‌కు ఇప్పుడు హర్యానాకు వ్యాపించింది. దేశ ప్రజలందరికి సమాన ప్రతిపత్తి కలగడానికి కులపరమైన రిజర్వేషన్లు అవసరం. కాని ఈ రిజర్వేషన్లు ఒక ప్రత్యేకమైన కులంలో ధనికులు ఇంకా ధనికులుగా లేక బీదవారు మరింత బీదవారుగా తయారుకాకుండా చూడాలి. అప్పుడే అంబేద్కర్ ఆశయాలకు విలువనిచ్చినవారవౌతాం. ఏ సమస్యనైనా సామరస్యంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. అంతేగాని బలప్రదర్శన చూపించకూడదు. హర్యానాలో జరిగిన జాట్ కులస్థుల ఆందోళనలో దాదాపు రూ.20వేల కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. ఆంధ్రప్రదేశ్‌లో ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో జరిగిన కాపు రిజర్వేషన్ ఆందోళనలో కూడా ఒక రైలు, దాదాపు 12 ప్రభుత్వ వాహనాలు, పోలీసు స్టేషన్లు నాశనమయ్యాయి. మరి ఈ ఆస్తులన్నీ సామాన్యులనుంచి పన్నుల రూపంలో వసూలు చేసిన మొత్తాల ద్వారా నిర్మించినవే. నిరసన సమయంలో ఇటువంటి విధ్వంసానకి పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలి. విశ్వవిద్యాలయాలలో దేశవిద్రోహ కలాపాలకు పాల్పడుతున్న వారిని, రిజర్వేషన్ల నెపంతో అరాచకాలు సృష్టిస్తున్న వారిని ఉక్కుపాదంతో అణచివేయాలి.

-జన్నాభట్ల లక్ష్మీ కామేశ్వరి