సబ్ ఫీచర్

రైతులను ఆదుకునే పంట బీమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన వ్యవసాయం లాభసాటిగా లేకపోగా రైతులను నష్టాలకు గురిచేసి వారి ఆత్మహత్యలకు కారణమవుతున్నది. మన రైతులు ఎదుర్కొనే సమస్యలు అనేకం. చైనా దిగుబడితో పోలిస్తే మన వ్యవసాయ దిగుబడి బాగా తక్కువ. కమతాల పరిమాణం తగ్గుతున్నది. వ్యవసాయ యాంత్రీకరణ ఆశించిన స్థాయిలో లేదు. ఎరువులు, విత్తనాలు వాడటంలో రైతులు ఇంకా తప్పులు చేస్తున్నారు. ఒక్క మద్దతు ధరే రైతులను కాపాడలేదు. ఉత్పత్తి వ్యయాలు పెరగడంవల్ల మద్దతు ధర పెరగవచ్చు. రైతుకు వచ్చే ప్రయోజనం ఏమీ వుండదు. ఉత్పాదక/దిగుబడి బాగా పెరుగుతేనే రైతు ప్రయోజనం పొందుతాడు. ఇంకొక ముఖ్య విషయం.. వినియోగదారుడు చెల్లించే ధరలో కేవలం 20 నుండి 25 శాతమే రైతుకు అందుతుంది. వ్యవసాయం మధ్యవర్తుల రాజ్యమయిపోయింది. ఈ పరిస్థితి మారాలి. ఉన్న సమస్యలు చాలవన్నట్లు ప్రకృతి వైపరీత్యాలు రైతుకు తీవ్ర నష్టం కల్గిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో రైతుకు బీమా కల్పించవలసిన అవసరం ఎంతైనా వుంది. అయితే, ఎలా కల్పించాలి అన్న విషయంలో ఒక అంగీకారం లేదు. అందువల్లే అనేక రకాల పంట బీమా పథకాలను అమలుచేయడం జరిగింది.దేశంలో 1985 నుండి అనేక రకాల పంట బీమా పథకాలను అమలుచేయడం జరిగింది. దిగుబడి ఆధారంగా బీమా పథకం రూపొందించబడటం జరిగింది. ఆ తర్వాత వాతావరణ ఆధారంగా పథకం రూపొందించారు. దీనిలో కొన్ని మార్పులు చేసి వేరొక పథకం రూపొందించడం జరిగింది. 2013-14 రబీ నుండి ఇదే అమలులో వుంది. అయితే ఈ పథకాలు చిన్న, సన్నకారు రైతులకు అందుబాటులో లేవు. ప్రీమియంలు ఎక్కువ. నష్టపరిహారం చెల్లించటంలో జాప్యం. వీటివలన రైతులు బీమాపై శ్రద్ధ చూపలేదు. ప్రీమియం మొత్తాలకు రెట్టింపు నష్టపరిహారం చెల్లించడం జరిగింది. రైతు నిజంగా ప్రయోజనం పొందాలంటే రుణం తీసుకుని పండించే పంటకే కాకుండా అన్ని పంటలకు పూర్తి బీమా వుండాలి. రైతు సొంతంగా విత్తనాలు, ఎరువులు ఏర్పాటుచేసుకుని సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.
కేంద్ర ప్రభుత్వం ఇటీవలి కొత్త బీమా పథకం (పసల్ బీమా యోజన) ప్రవేశపెట్టింది. దీనిలో రెండు ప్రయోజనాలు వున్నాయి. ప్రీమియం భారం తక్కువ, నష్టపరిహారం వెంటనే పొందవచ్చు. ఈ పథకం ఈ సంవత్సరం ఖరీఫ్ నుంచి అమలవుతుంది. నూనె గింజల పంటలకు రెండు శాతం రబీకి సంబంధించి 1.5 శాతం ప్రీమియంలను రైతులు చెల్లిస్తే చాలు. వాణిజ్య పంటల విషయంలో ఇది 5 శాతం. కేంద్రం 90 శాతం వరకు భరించడానికి సిద్ధంగా వుంది. పంట రుణాలు తీసుకున్న వారితోపాటు స్వతహాగా పంట రుణేతర రైతులూ బీమా తీసుకోవచ్చు. కొత్త పథకంలో ఒక ముఖ్యమైన మార్పు వుంది. మండలం లేదా గ్రామం ఓ యూనిట్‌గా కాకుండా, క్షేత్ర స్థాయిలో జరిగే నష్టాలు, పంట కోత అనంతరం కష్టాలు లెక్కలోనికి తీసుకుంటారు. పంట నష్టపోయిన వెంటనే 25 శాతం నష్టపరిహారం చెల్లించబడుతుంది. (రైతు బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు). ట్రాక్టర్, ఇతర సామగ్రికి బీమా వుంది. పంట నష్టాన్ని త్వరగా అంచనా వేయడానికి స్మార్ట్ ఫోన్లు, రిమోట్ సెన్సింగ్ సాంకేతిక వ్యవస్థను వినియోగిస్తారు.
రైతుల ఆత్మహత్యలకు ఒక ప్రధాన కారణం వ్యవసాయ ఖర్చులు బాగా పెరిగిపోవడమే. ఎరువులు అతిగా వాడటంవల్ల ప్రయోజనం లేదని కొందరు నిరూపించారు. వ్యవసాయ శాస్తవ్రేత్త సుభాష్ పారేకర్ పెట్టుబడి లేని సహజ ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నారు. ఇవి రైతులను ఆకర్షిస్తున్నాయి. ఈ పద్ధతి పంటల వల్ల ప్రజలు బి.పి., షుగర్ వంటి వ్యాధులకు దూరంగా వుంటారు. ఈ పద్ధతిలో నీరు, విద్యుత్ 90 శాతం ఆదా అవుతుంది. కొత్త పద్ధతిని అమలులోనికి తెచ్చినప్పుడు కొన్ని సమస్యలు వుంటాయి. వాటిని అధిగమించడం అంత కష్టం కాదు. ప్రతి రైతుకు పంటే కాకుండా అదనంగా ఇంకొక, ఆదాయ మార్గం వుండాలి.. కొత్త పంట బీమా పథకం బాగా మెరుగైనదనే చెప్పాలి.

- డా.ఇమ్మానేని సత్యసుందరం