సబ్ ఫీచర్

సద్భావనల పునాది సంవత్సరాది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూత వర్తమాన భవిష్యత్తులుగా కాలం పరిభ్రమిస్తూ వుంటుంది. జ్ఞాపకాలు, గురుతులు, అనుభవాలను అరలు అరలుగా తనలో భద్రపరచుకుంటుంది. సుఖాన్నీ, దుఃఖాన్నీ, కన్నీళ్ళనీ, కలలనీ ఆవేశాన్ని, ఆప్యాయతను, మంచిని, చెడును సమానంగా తనలో కలగలుపుకుంటుంది. మొదటి శ్వాస నుంచి చివరి శ్వాస వరకూ గల కాలమే మనిషి జీవితం. ఈ జీవితాన్ని అద్భుతంగా మలచుకోగలిగే రూపశిల్పి మానవుడు. ఈ విధంగా తీర్చిదిద్దుకోలిగినవారే మహానుభావులై చరిత్ర పుటల్లో ఒక స్థానాన్ని సంపాదించుకుంటారు. మహత్కార్యాలు చేసినవారు చరితార్థులుగా చిరస్మరణీయులు కాగలుగుతారు. కాని వారంతా ‘కారే రాజులు..’ అని పోతన చెప్పినట్లుగా కాలగర్భంలో కలిసిపోతారు. కాలం అత్యంత విలువైనదని అందరికీ తెలుసు. కాలం చిత్రమైనది, శక్తిమంతమైనది. గతాన్నుండి గుణపాఠాలు నేర్చుకుంటూ, కొత్త విషయాలు తెలుసుకుంటూ, యోగ్యులైనవారికి మార్గదర్శకంగా ఉంటూ, ఉత్తముడైనవాడు కాలగమనంలో ముందుకు సాగిపోతూ వుంటాడు. దుకాణాల్లో, కార్యాలయాల్లో ఖాతాలు, చిల్లర పద్దులు, మదింపు లెక్కలు, అంచనాలు మాదిరి జీవితంలోనూ బేరీజులు వేసుకోవలసిన సందర్భాలు తటస్థపడుతూ వుంటాయి. పుట్టినరోజు, ఉగాది, న్యూ ఇయర్ వంటి సందర్భాలు గతాన్ని గుర్తుచేస్తూ సింహావలోకనం చేయడానికి అవకాశాన్ని కల్పిస్తాయి.
మన ఉగాది పండుగ చెట్లు చిగురించే కాలంలో పచ్చదనంతో కళకళలాడుతూ వస్తుంది. మామిడి రుచులను, మల్లెల గుబాళింపులను, కోకిల మధుర స్వరాలను తన వెంట తీసుకుని వస్తుంది. ఆరు ఋతువులలో వసంత ఋతువు మొదటిది. శుక్లపక్షం మొదటి పక్షం. పాడ్యమి తిథులలో మొదటిది.. ఇవి అన్నీ ప్రారంభ సంఖ్యలే. యుగానికి ఆది యుగాది, ఉగాది అయింది. శీతోష్ణాలకు, గతానికి, రాబోయేదానికీ సంధి సమయమే యుగాది. తెలుగు సంవత్సరానికి ఆది అయి సంవత్సరాది. అయితే, వైశాఖ శుద్ధ తృతీయనాడు కృతయుగం ప్రారంభమైనట్లు తెలిపే కాలగణనలు వున్నట్లే చంద్రుని ఆధారంగా చాంద్రమానం ప్రకారంగా తెలుగువారి పండుగలుంటాయి. తెలుగులో ప్రభవలు మొదలుకుని అక్షయ వరకు అరవై సంవత్సరాలున్నాయి.
సంవత్సరాది - సంప్రదాయం
ఉగాది నాడు ప్రపాదానం చేయాలని శాస్త్రం విధించింది. ప్రపాదానము అంటే మార్గస్థులకు, బాటసారులకు నియతముగా చేసే నీటిదానము. ఇంకా సర్వప్రాణులకూ సాధారణంగా చలివేందరలు వుంచాలంట. ఈ విధంగా చేస్తే పితృదేవతలు సంతోషిస్తారు. గృహమునందు ధ్వజారోహణమును, నింబ పత్ర భక్షణమును, సంవత్సరాది ఫలశ్రవణమును, వాసంత నవరాత్రారంభమును, తన్నిమిత్తకమయిన అభ్యంగ స్నానాదికమును చేయవలసినది అని చెప్పిన ప్రకారంగా అభ్యంగన స్నానం, నింబదళ భక్షణం, పంచాంగ శ్రవణం, వసంత నవరాత్రులు భక్తిగా చేయడం ఆనవాయితీ అయింది. ఈ సమయాన్ని యమదంష్టల్రంటారు. వ్యాధులు సోకేందుకు ఆస్కారముంది. దీని నివారణకు భగవంతుని అనుగ్రహాన్ని కోరి వసంత నవరాత్రులు జరిపి విశేష పూజలు చేస్తున్నాం. ఆరోగ్య పరిరక్షణకు పనికివచ్చే వాటిని ప్రసాదం పేరుతో స్వీకరిస్తున్నాం. ఈ కాలంలో లభించే వేపపువ్వు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఉగాది పచ్చడి చేసినప్పటి నుండే కొత్తకుండను వాడడం మొదలుపెట్టేవారు కొందరైతే, ఈ పచ్చడితోనే మామిడికాయలు తినడం మొదలుపెట్టేవారు మరికొందరు. ఉగాది పచ్చడి గురించి హాస్యోక్తులు ఎన్ని చెప్పుకున్నా ఆ పచ్చడిని ఆస్వాదించనివారుండరు. బెల్లం, పంచదార లేదా పటిక బెల్లం, ఉప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు, వేపపువ్వు, మామిడికాయ ముక్కలు, కొత్త చింతపండు రసం- ఈ దినుసులతో తయారైన ఉగాది పచ్చడి చవులూరిస్తుంది.
ఇక తిథి వార యోగ నక్షత్ర, కరణాలతో కూడిన పంచాంగ శ్రవణం కోసం ఎదురుచూసేవారు ఎందరో. అందులోని శుభ ఫలితాల కోసం ఎదురుచూసేవారు, తెలుసుకుని జాగ్రత్తలు పడేవారు- ఇలా రకరకాలుగా సంవత్సర ఫలితాలను విశే్లషించుకోవడానికి ఉత్సాహపడుతూ వుంటారు. భక్తితో పంచాంగ శ్రవణం చేసి భగవత్ప్రీతికి పాత్రమవుతారు. తెలుగుదనాన్ని నింపుకున్న తెలుగువారి ఈ తొలి పండుగ సాహిత్యాభిమానుల్లోనూ ఉత్సాహాన్ని నింపుతుంది. ఈ సందర్భంగా కవులకు సన్మానాలు, కవి సమ్మేళనాలు దీనికి నిదర్శనం.
భగవత్స్వరూపం
‘కాలోహి అయం’ అని భగవంతుడు చెప్పినట్లుగా కాలమే భగవంతుడు. భగవత్స్వరూపమైన కాలం విలువను గుర్తించి మసలుకోవాలి. కాలం అనంతమైనది, మనకు ముందు కాలం వుంది. మన తరువాత కాలం వుంటుంది. కాలాన్ని గౌరవించాలి అంటే కాలప్రాశస్త్యాన్ని తెలుసుకోవాలి.
సంవత్సరాది - సద్భావాలు
తెలుగు సంవత్సరాల పేర్లను గమనిస్తే మొట్టమొదటిది ప్రభవ. ప్రభవ అంటే పుట్టుక. చివరిది అక్షయ, అంటే క్షయము కానిది అని అర్థం. క్షీణించనిది. చివరిది అక్షయం కావాలనుకోవడమే సద్భావాలను సూచిస్తున్నది. అలా తరగని నిండుదనం లోకమకంతా వ్యాపించాలని మనం కోరుకోవాలి. పంచాంగ శ్రవణంలోని మంచి ఫలితాలపైన మాత్రమే దృష్టి సారించాలి. చెడును ఊహించి బాధపడడం కూడదు. మంచి ఫలితాల సాధనకు ప్రయత్నించాలి. తటస్థంగా వుండగలగాలి. షడ్రుచులను సమానంగా స్వీకరించినట్లుగానే ఎప్పుడూ ఒకే తీరుగా నడుచుకోవాలి. ఇవన్నీ ఒక ఎత్తయితే శిశిరం తరువాత వచ్చే వసంతంలో మోడులు చిగురించడం మనలో ఆశావహ దృక్పథాన్ని పెంచుతుంది. కష్టాలు ఎప్పుడూ ఉండవు, సుఖం తప్పకుండా వస్తుందని చెబుతుంది వసంతాగమనం. నిరాశా నిస్పృహలు దరిచేరనీయకుండా సరికొత్త ఆశలతో కొత్త ఏడాదిలో పచ్చగా కళకళలాడాలని ఆశించాలి. ‘గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్’ అని దిగులు చెందకుండా రాబోయే నవోదయాల కోసం ఎదురుచూడాలి. ‘విలంబః’ అంటే విశేషముగా ఇచ్చునది అని అర్థం. విశేష శుభాలను ప్రసాదిస్తుందని విశ్వసిద్దాం. బంగారు తోరణాలతో అలంకరింపబడిన ‘హేమలంబ’ గడపలో అడుగుపెడుతున్న మనకు భగవత్స్వరూపమైన కాలం సకల శ్రేయస్సులనూ కలిగించాలని కోరుకుందాం.
*
-కె.లక్ష్మీ అన్నపూర్ణ
94938 41396

-కె.లక్ష్మీ అన్నపూర్ణ 94938 41396