ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

మూడేళ్ల పాలనలో మెరుపులు, మరకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ ప్రజల సంక్షేమం కోసం పరితపించే వాడే నిజమైన నాయకుడు. ప్రధాన మం త్రి నరేంద్ర మోదీ ఈ తరహాలో పనిచేస్తూ విజయపథంలో దూసుకుపోతున్నారు. భారత దేశానికి కొత్త నిర్వచనం ఇచ్చేందుకు ప్రయత్నిస్తూ దానికి కార్యరూపం ఇచ్చేందుకు మోదీ దీక్ష వహించడం హర్షణీయం. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దటంతోపాటు బలవంతమైన దేశంగా నిలబెట్టేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు సైతం అర్థం చేసుకుంటున్నారు. కేంద్రంలో ఎన్‌డిఎ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు గడిచినా, మోదీ పట్ల ప్రజల్లో విశ్వాసం పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు. ప్రతిపక్షాలు ఎంత అసత్య ప్రచారం చేసినా ప్రజల్లో మోదీ ప్రతిష్ఠ మరింతగా ఇనుమడిస్తోంది. గత మూడేళ్లలో మోదీ దేశాన్ని అన్ని విధాలా పటిష్టం చేయటంతోపాటు అంతర్జాతీయ స్థాయిలో దేశానికి గౌరవం, గుర్తింపు తెచ్చిపెడుతూ ఆశించిన స్థాయిలో విజయం సాధించారు. ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించడంలో మోదీ ప్రభుత్వ ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి.
మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోవటంతో పాటు వాటిని అమలు చేసి చూపిస్తున్నారు. ఏళ్ల తరబడి సోమరితనం, బాధ్యతారాహి త్యం,నిర్లక్ష్యానికి అలవాటు పడిన పరిపాలనా యంత్రాంగం చేత పని చేయించటం, ఉద్యోగులు సకాలానికి కార్యాలయానికి వచ్చేలా చేయటం చిన్న విషయం కాదు. ప్రభుత్వ యంత్రాంగం ప్రజల కోసం పని చేయాలే తప్ప వారిపై ఆధిపత్యం చేయడానికి కాదనే సత్యాన్ని గ్రహించిన మోదీ దీనిని ఆచరణలో పెట్టేందుకు చేస్తున్న కృషి ఫలిస్తే దేశం త్వరితగతిన ముందుకు సాగుతుంది. పాలకులు, అధికారులు ప్రజల కోసం పనిచేయని పక్షంలో తీవ్ర పరిణామాలను ఎదుర్కొనవలసి వస్తుందనే సందేశాన్ని పంపించటంలో మోదీ కొంత వరకు విజయం సాధించారు. ప్రభుత్వ, ప్రైవేట్ వ్యవస్థలో పేరుకుపోయిన అవినీతిని అదుపు చేసేందుకు కఠినమైన నిర్ణయాలు తీసుకునేందుకు వెనకాడకపోవటం మోదీ పనితీరుకు అద్దం పడుతోంది. వెయ్యి, ఐదువందల రూపాయల నోట్లను రద్దు చేయటం మామూలు విషయం కాదు. అవినీతిని అదుపు చేసేందుకు, నల్లధనాన్ని వెలికితీసేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నం ప్రశంసనీయం.
మంత్రివర్గం, అధికార యంత్రాంగంలో అవినీతి, అక్రమాలను గణనీయంగా తగ్గించటం మోదీ ప్రభుత్వం సాధించిన ఘన విజయాల్లో ఒకటని చెప్పుకోవచ్చు. పదేళ్ల యుపిఏ పాలనలో మంత్రులు, అధికారులు స్థాయిలో అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారనేది జగద్విదితం. యుపిఏ మిత్రపక్షాలు సైతం పెద్దఎత్తున అవినీతికి పాల్పడ్డాయి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. గత మూడు సంవత్సరాల్లో ఒక్క అవినీతి సంఘటన, కుంభకోణం జరగలేదు. అవినీతి, అక్రమాల విషయంలో మోదీ ప్రభుత్వాన్ని వేలెత్తిచూపించేందుకు అవకాశం లేకుండాపోయింది. అవినీతి, నల్లధనాన్ని అదుపుచేసేందుకు మోదీ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందనేది నిజం. ఆయన చేస్తున్న ప్రయత్నాలను దెబ్బ తీసేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నించినా విజయం సాధించలేకపోయాయి. పెద్దనోట్ల రద్దును సగటు పౌరుడు సమర్థించటం వల్లనే మోదీ ఉత్తరప్రదేశ్,ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. భారత దేశం ముఖచిత్రాన్ని మార్చివేసేందుకు మోదీ ప్రభుత్వం రకరకాల కార్యక్రమాలు చేపట్టింది.
మేక్ ఇన్ ఇండియా, స్వచ్ఛ భారత్, జనధన్ లాంటి పలు పథకాలతో దేశాన్ని పటిష్టం చేసేందుకు చిత్తశుద్ధితో ఆయన ప్రయత్నిస్తున్నారు. ఈ పథకాల ఫలితాలు ఇప్పుడిప్పుడే రావటం ప్రారంభమైంది. మోదీ ప్రభుత్వం ప్రతి రంగంలోనూ విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ప్రతి వ్యవస్థను సంస్కరించటం ద్వారా ప్రజలకు సుపరిపాలనను అందజేసేందుకు ప్రయత్నం జరుగుతోంది. మోదీ ప్రభుత్వం గత మూడేళ్లలో ఎంతో చేసింది, ఇక మీదట కూడా చేస్తుంది. అయితే, విజయాలతోపాటు కొన్ని అపజయాలు కూడా ఆయన ఖాతాలో ఉన్నాయి. సమసమాజ స్థాపన, బడుగు,బలహీన వర్గాలకు సముచిత ప్రాధాన్యత కల్పించే విషయంలో మోదీ ప్రభుత్వం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చేందుకు ‘సోషల్ ఇంజనీరింగ్’ పేరుతో బలహీన వర్గాలకు పెద్దపీట వేసిన మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వంలో వారికి సముచిత ప్రాధాన్యత కల్పించకపోవటం శోచనీయం. దేశంలోని కోట్లాది మంది బడుగు,బలహీన వర్గాలను అభివృద్ధి చేయగలిగితేనే సమసమాజ స్థాపన సాధ్యమవుతుంది. బడుగు వర్గాల ప్రగతి కోసం బిసి పార్లమెంటు కమిటీని ఏర్పాటు చేస్తే సరిపోతుందా? బిసి పార్లమెంటరీ కమిటీని, రాజ్యాంగ హోదాతో కూడిన బిసి కమిషన్‌ను ఏర్పాటు చేసిన మోదీ మరో అడుగు ముందుకు వేసి బిసిల సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తే బాగుండేది.
కాశ్మీర్ సమస్యను పరిష్కరించటంలో దేశ ప్రజలు ఆశించిన రీతిలో మోదీ విజయం సాధించలేకపోతున్నారు. కాశ్మీర్ నుండి వలస వచ్చిన హిందువుల హక్కుల పరిరక్షణలో మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఈ హిందువులు స్వదేశంలోనే అనాథలుగా మారిపోవటం దురదృష్టకరం. కాశ్మీర్ హిందువులను స్వరాష్ట్రానికి తరలించేందుకు మోదీ ప్రభుత్వం ఇంతవరకు ఒక్క చర్య కూడా తీసుకోలేదు. కాశ్మీర్‌లో కొనసాగుతున్న మతపరమైన హింసాత్మక కార్యక్రమాలను అదుపుచేసి, హిందువులు కాశ్మీర్‌లో మనుగడ సాగించేలా మోదీ ఇకనైనా గట్టి చర్యలు తీసుకోవాల్సి ఉంది. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించటంతోపాటు కాశ్మీర్ ప్రజలను మతం పేరుతో రెచ్చగొడుతున్న పాకిస్తాన్‌ను అదుపుచేసే విషయంలో మోదీ ప్రభుత్వం దూకుడుగా వ్యవహరించటం లేదు. మెరుపుదాడులు, పాక్ బంకర్లను ధ్వంసం చేసినంత మాత్రాన ఆ దేశం దారికి వస్తుందని ఆశిస్తే పప్పులో కాలు వేసినట్లే. మోదీ ప్రభుత్వం పాకిస్తాన్ విషయంలో మరింత ధైర్యంతో కూడిన నిర్ణయాలు తీసుకోవటం మంచిది. పక్కలో బల్లెంగా మారిన పాకిస్తాన్‌ను దారికి తీసుకురావాలంటే మొదట చైనాను నిలువరింపజేయవలసి ఉంటుంది. చైనా అండ చూసుకునే పాకిస్తాన్ మనపై దాష్టీకాలకు తెగిస్తోంది. భారత్‌ను దెబ్బ తీసేందుకు పాకిస్తాన్ పాలకులు చైనాకు ‘ఒక బెల్ట్,ఒక రోడ్డు నిర్మాణ పథకం’లో సహకరించడంతో పాటు ఆక్రమిత కాశ్మీర్‌లోని కొంత భూభాగాన్ని చైనాకు ధారాదత్తం చేశారు. చైనాను మనం కట్టడి చేస్తే పాకిస్తాన్ దానంతటదే దారికి వస్తుంది. చైనాను ఎదుర్కొనాలంటే భారత దేశం సైనికపరంగా ఎంతో ఎదగవలసి ఉంటుంది. చైనాకు దీటైన సమాధానం ఇచ్చే స్థాయికి భారత సైన్యాన్ని తెచ్చేందుకు మోదీ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికపై చర్యలు తీసుకోవలసి ఉంటుంది. విదేశాల నుండి ఆధునిక ఆయుధాలు దిగుమతి చేసుకున్నంత మాత్రాన లక్ష్యాన్ని సాధించలేము. ఆయుధాల విషయంలో స్వయం సమృద్ధిని సాధించటంతోపాటు ఆధునిక ఆయుధాలను ఉత్పత్తి చేసుకోగలిగినప్పుడే చైనాను నిలువరించగలం.
ప్రభుత్వంలో నరేంద్ర మోదీ ఒక్కరే అంతా తానై వ్యవహరిస్తున్నారు. గత మూడు సంవత్సరాల్లో మోదీ ఒక్కరే ఎదిగారు తప్ప ఎన్.డి.ఏ ప్రభుత్వం, బి.జె.పి ఆశించినంతగా ఎదగలేకపోయాయి. మోదీ మూలంగానే బి.జె.పి గెలుస్తోంది తప్ప బి.జె.పి మూలంగా ఎన్‌డిఏ కూటమి విజయం సాధించటం లేదు. దేశ ప్రజలు కూడా మోదీ వైపు చూస్తున్నారే తప్ప బి.జె.పి, ఎన్.డి.ఎ వైపు కాదు. సీనియర్ మంత్రులకు సైతం ప్రాధాన్యత లేకుండాపోయింది. మోదీ మాటే శిలాశాసనంగా మారటంతో ఎన్.డి.ఏ ప్రభుత్వం నామమాత్రమైపోతోంది.
*