Others

ఎమ్మెల్యే సీట్ల పెంపే ఏకైక సమస్య..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు అధికారం చెలాయిస్తున్న నేతలకు ఏ సమస్యలూ పట్టడం లేదు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎమ్మెల్యే సీట్లను పెంచుకొనేందుకే తెరాస, తెదేపా అధినాయకత్వాలు ఆరాటపడుతున్నాయి. గత కొద్దికాలంగా ఇతర పార్టీల నుంచి తమ పార్టీలోకి వలసలు అధికం కావడంతో ఎమ్మెల్యే సీట్లను పెంచడం అనివార్యమని అధికార పార్టీల నేతలు భావిస్తున్నారు. ఈ ఉద్దేశంతోనే దిల్లీ వెళ్లిన ప్రతిసారీ ప్రధాని మోదీని, కేంద్ర మంత్రులను తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలుస్తూ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు పదే పదే వినతులు సమర్పిస్తున్నారు. ఎమ్మెల్యేల సీట్లు పెరిగితే కొంతమంది నాయకులకు ‘రాజకీయ ఉపాధి’ దొరుకుతుందేమో గానీ, నిజమైన నిరుద్యోగులకు ఎలాంటి ప్రయోజనం ఉండదు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు జనాకర్షక పథకాలను ప్రకటించడం తప్ప, పేద నిరుద్యోగులను ఆదుకునే చర్యలు చేపట్టడం లేదు. లక్షల సంఖ్యలో నిరుద్యోగులుంటే వందల సంఖ్యలో నియామకాలు చేపడితే ఎలాంటి ప్రయోజనం చేకూరదు. శాసనసభ్యుల సంఖ్య పెరిగితే వారికి జీతభత్యాలు, ఇతర ప్రయోజనాలు, భద్రత వంటి ఖర్చులతో వందల కోట్ల రూపాయల ప్రజాధనం అదనంగా ఖర్చవుతుంది. పేరుకు ప్రజాస్వామ్యమైనా, రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు అధికారంలో వున్న చోట ఏక వ్యక్తి పాలనే శరణ్యం. ఇప్పటికే శాసనసభలు అలంకారప్రాయమై కొందరికి ఉపాధి కేంద్రాలుగా మారాయి. శాసనసభల్లో ఎప్పుడు చూసినా రచ్చలే, ఎలాంటి చర్చలుండవు. నేటి రాజకీయ నాయకుల్లో చాలామంది కుబేరులే. ఎన్నికల్లో రాజకీయ పార్టీలను గెలిపించేది సామాన్య ప్రజానీకమేగానీ, సంపన్నులు కాదు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తే పాలన మెరుగుపడి ప్రజలు హర్షిస్తారు.
సమాజంలో నిరుద్యోగులుగా మిగిలిపోతున్న వా రంతా పేదలే. ఉపాధి లభించక బతుకు భారమై ఏటా నాలుగైదు వేలమంది నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. చదువుకున్న యువకులు సైతం నేరాలకు అలవాటు పడుతూ సమాజానికి చేటు తెస్తున్నారు. మనది అధిక జనాభా దేశం. పాశ్చాత్య దేశాల వలే పెద్ద జీతాలు, తక్కువ ఉద్యోగుల వ్యవస్థ మనకు పనికిరాదు. వివిధ ప్రజాకర్షక, అభివృద్ధి పథకాలను క్షేత్ర స్థాయిలో తనిఖీ చేసేందుకు తగినంత సిబ్బంది లేక అవినీతి, అక్రమాలు అంటువ్యాధిలా వ్యాపించాయి. జనాభాకు తగిన సంఖ్యలో న్యాయ, పోలీసు విభాగం వంటి ముఖ్యమైన శాఖల్లో తక్షణమే నియామకాలు చేపట్టాలి. పాలనలో నిఘా పెంచితే వృథా ఖర్చు తగ్గి, ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది. ఇక, రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు వేతన సంఘం సిఫారుసులను మించి (ఉద్యోగ భద్రత లేని కార్పొరేట్ సంస్థలతో పోల్చుకుని) భారీగా జీతాలు పెంచటంతో ఖజానాకు పెనుభారమై ఖాళీలను భర్తీ చేయటం లేదు. అత్యధిక దేశాల్లో ప్రభుత్వోద్యోగుల జీతభత్యాలు పౌరుల సగటు ఆదాయంతో నాలుగు రెట్లుంటే ఇక్కడ ఎనిమిది రెట్లుగా వున్నదట. భవిష్యత్తులోనైనా ప్రభుత్వాలు ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. భారీ వేతనాలతో విలాస, దుర్వ్యసనాల సంస్కృతి, ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయి. ఇక్కడ ఉపాధి లభించక గల్ఫ్ దేశాలు వెళ్ళి ఎన్నో ఇక్కట్లు పడుతున్నవారెందరో ఉన్నారు. పని వత్తిడి, వయోభారంతో ఉద్యోగులు, పని లేక రోడ్లపై నిరుద్యోగ యువత ఈ దేశానికి సమస్య కారాదు. సంపాదన యావలో సమాజంలో అక్రమాలు, నేర ప్రవృత్తి పెరుగుతున్నాయి. గతంలో ఇంతటి ఆర్థిక అభివృద్ధి లేకపోయినా సమాజం ప్రశాంతంగా ఉండేది.
కనుక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పదవీ విరమణ వయస్సును 58 సంవత్సరాలకు తగ్గించి, సకాలంలో ఉద్యోగ నియామకాలు చేపడితేనే నిరుద్యోగ సమస్య కొంతమేర తగ్గుతుంది. నిరుద్యోగ భృతితో సమస్య పరిష్కారం కాదు. ఒకనాడు 55 ఏళ్లుగా వున్న పదవీ విరమణ వయసును తొలుత 58 ఏళ్లకు, ఆ పిమ్మట 60 సంవత్సరాలకు పెంచారు. జీతాల పెంపు, పదవీ విరమణ వయసు పెంపుతో రిక్రూట్‌మెంట్లు తగ్గి అసంఘటిత రంగంలో లక్షలాది మంది నిరుద్యోగులు అల్లాడుతున్నారు. ఐటి రంగం వృద్ధితో కొద్దిమంతి విద్యావంతులకే గాని మిగతా వారికి అవకాశం లేదు. రిటైర్మెంట్ సమయానికి నూటికి తొంభైమంది ఉద్యోగులు ఆర్థికంగా స్థిరపడి వుంటారు. జీవన భృతిగా పెన్షన్లు వస్తాయి. కనుక సామాజిక న్యాయం, దేశ పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకుని పదవీ విరమణ వయసును 58 సంవత్సరాలుగా నిర్ణయిస్తే యువతకు కూడా అవకాశం దక్కుతుంది. ఒకవేళ కొద్దిమంది అనుకోని ఆర్థిక ఇబ్బందుల కారణంగా సర్వీసు పొడిగింపుకోరితే వారికి మినహాయింపు ఇవ్వవచ్చు. ఎవరూ ఇలాంటి ప్రతిపాదనలను వ్యతిరేకించరు. పని ఒత్తిళ్ళతో సతమతమయ్యే ఉద్యోగులెందరో సమర్థిస్తారు. ఈనాటి ఉద్యోగులు ఒకప్పటి నిరుద్యోగులేనని గుర్తించాలి. కొత్త ఉద్యోగ నియామకాలతో వేతన భారం ఎక్కువ పడకుండా మూడు, నాలుగు తరగతి ఉద్యోగులను 5 సంవత్సరాలు తాత్కాలిక ప్రాతిపదికపై నియమించి ఆ పిమ్మట వేతన సవరణకు ముందున్న పాత స్కేళ్ళలో నియమించే చట్టం తెస్తే ప్రభుత్వోద్యోగాలపై మోజు తగ్గి గతంలో వలే పేదలు, సామాన్య కుటుంబాల నుండి వచ్చినవారికే దక్కుతాయి.

-తిరుమలశెట్టి సాంబశివరావు సెల్: 92478 70141