సబ్ ఫీచర్

బాధ్యతల మాటేమిటి?‘

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ దేశం నాకేమిచ్చింది?’ అని ప్రశ్నించేవారు ‘దేశం కోసం నేనేమి చేసాను..’ అన్న ప్రశ్న వేసుకోవాలి. పౌరహక్కుల గురించి ప్రశ్నిస్తూ సమ్మెలు, ఉద్యమాలు చేసేవాళ్ళు సమాజం పట్ల తమకున్న బాధ్యతను గుర్తించగలగాలి. అంతేగానీ ప్రతిదానికీ.. ప్రభుత్వం తన ఇంటి ముందుకు నడిచొచ్చి సహాయం చేయాలని ఆశించటం, రాకుంటే గగ్గోలు పెట్టడం అవగాహనా రాహిత్యం అనిపించుకుంటుంది. పంచాయతీ సభ్యుడి నుంచి ప్రధానమంత్రి వరకూ అందరూ ప్రజా సేవకులే. మన అవసరాలను తీర్చడానికి ఎన్నో ప్రభుత్వ శాఖలు, ఎన్నో వ్యవస్థలు ఉన్నాయి. ఎవరైనా ఆపదలో చిక్కుకున్నప్పుడు, ప్రమాదాల బారిన పడినప్పుడు, ప్రకృతి వైపరీత్యాలకు గురైనపుడు ఆగమేఘాల మీద వచ్చి బాధితులను కాపాడాల్సిన బాధ్యత సంబంధిత అధికారులకు ఉంది. అత్యవసర పరిస్థితిలో ప్రభుత్వ యంత్రాంగం అలసత్వం వహించినపుడు పాలకులను విమర్శించే హక్కు అందరికీ ఉంటుంది. కానీ, సామాన్యంగా అలా జరగదు. ఎందుకంటే- మన రాజ్యాంగం ప్రజలను చక్కగా పరిపాలించడానికి వివిధ శాఖలతో విస్తార ప్రభుత్వ యం త్రాంగాన్ని ఏర్పాటుచేసింది. ఒక మనిషికే కాదు... ఒక జంతువుకు, ఒక పక్షికి ఆపద వచ్చినా మానవతా దృక్పథంతో సంబంధిత ప్రభుత్వ యంత్రాంగ శాఖలు తరలివచ్చి వాటి రక్షణ చర్యలు చేపడతాయి. ఎంత ప్రభుత్వ ధనం ఖర్చయినా, ఎంత సమయం పట్టినా వెనకడుగు వేయకుండా ప్రాణరక్షణే ధ్యేయంగా పనిచేస్తాయి. ‘మేము పన్నులు కడితేనే ఖజానాకు డబ్బు వస్తుంది.. అది ప్రజాధనం’ అంటూ రూల్సు మాట్లాడి అవసరం ఉన్నా, లేకపోయినా ప్రతి చిన్నపనికీ ప్రభుత్వ శాఖలకు ఫోన్‌చేసి పిలవటం సరియైన పద్ధతి కాదు.
ఈ మధ్య జరుగుతున్న అనేక సంఘటనలు, బాధ్యతారహిత చర్యలు, ఆకతాయి పనులు చూస్తుంటే దానికి మనిషి నిర్లక్ష్యం, అజ్ఞానం, అపరిపక్వత కారణాలని అనిపిస్తుంది. దానివల్ల ప్రభుత్వ యంత్రాంగానికి కలుగుతున్న నష్టం లెక్కల్లో చెప్పలేనివి. ఉదాహరణకి - కొంతమంది రైతులు వాళ్ళ పొలాల్లో నీళ్ల కోసమని బోరుబావులు తవ్వుతున్నారు. నీళ్ళు పడక... మరో బావి తవ్వుతారు... ఇలా బావులు తవ్వుకుంటూ పోవడమే తప్ప నీళ్ళు పడని ఆ బావులను మట్టితో పూడ్చేయాలన్న విషయాన్ని అస్సలు పట్టించుకోటం లేదు. దాంతో అటుగా వెళ్లే రైతుకూలీల పిల్లలు బోరుబావుల్లో పడిపోతున్నారు. ఈ మధ్య ఇలాంటి దుర్ఘటనలు ఎన్ని జరిగాయో అందరికీ తెలుసు. బావిలో పడిన చిన్నారి నరకయాతన... తల్లిదండ్రుల మనోవేదన కాక ఇరుకుగా ఉండే ఆ లోతైన గొయ్యిలో నుంచి పసివాడిని బయటికి తియ్యటానికి భారీగా యంత్రాంగం అవసరం అవుతుంది. ఆ మధ్య మీనా అనే పాప బోరుబావిలో పడిన సంఘటనలో కేంద్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా తరలించాల్సి వచ్చింది. భారీ క్రేన్లు, అత్యాధునిక కెమెరాలు, ఆక్సిజన్ అందించే పరికరాలు, సహాయక బృందాలు కదిలివచ్చి యుద్ధప్రాతిపదికన మూడు, నాలుగు రోజులు నిరంతరం శ్రమించాల్సి వచ్చింది. అయినా ఆ పాప బతికి బయటపడలేదు. ప్రభుత్వానికి బోలెడు శ్రమ, ఖర్చు మాత్రం మిగిలాయి. దీనికంతటికీ కారణం ఒక రైతు ఖాళీ బోరు బావిని మూయించకపోవడం అన్న నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యం. ఆ రైతు బాధ్యతతో ఉంటే ఒక పసి ప్రాణం గాలిలో కలిసేది కాదు.
మనిషి జీవితంలో సంభవించే అనర్థాలకూ, దుర్ఘటనలకూ కారణం నిర్లక్ష్యం ఒక్కటే కారణం కాదు. అలక్ష్యం, అజ్ఞానం, మూర్ఖత్వం, మొండి పట్టుదల, ఆకతాయితనం వంటివన్నీ కారణాలే. వీటివల్ల వాళ్ళు వ్యక్తిగతంగా సమస్యలు కొనితెచ్చుకోవటమే గాక సమాజానికి, ప్రభుత్వానికి కూడా సమస్యలు సృష్టిస్తాయి. ఒక ఇల్లాలు మొగుడు పుట్టింటికి పందలేదనో.. పండక్కి కొత్తచీర కొనియ్యలేదనో ఏ హుస్సేన్‌సాగర్‌లోనో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. తాగుడికి పెళ్ళాం డబ్బులివ్వలేదని ఓ భర్త ఇలాగే జీవితాన్ని ముగిస్తాడు. టీచర్ తిట్టిందనో, ఏ కుర్రాడో వెంటబడి ఏడిపిస్తున్నాడనో ఓ విద్యార్థిని భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. అప్పుల పాలయ్యామని కుటుంబం మొత్తాన్ని హత్యచేసే ఇంటి యజమానులు, భర్త ఎవరితోనో అక్రమసంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో పిల్లల్ని చంపేసే ఇల్లాళ్ళు.. ఇలా అనునిత్యం ఎన్నో దుర్ఘటనలు. వ్యక్తిగత, కుటుంబ సమస్యలను ఎవరికివారు పరిష్కరించుకోగలిగితే ఇవి పేపర్లకు, చానళ్ళకు ఎక్కి పోలీస్ కేసులై ప్రభుత్వ యంత్రాంగానికి పని భారాన్ని పెంచవు. వాళ్ళు చేసిన తప్పులకు, తెలివితక్కువ చర్యలకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ఇవ్వాల్సిన అవసరం రాదు.
పనిలేని వాళ్ళ మెదళ్ళలో దయ్యాలు, భూతాలు చేరతాయని ఇంగ్లీషులో ఒక సామెత ఉంది. ఏం చేయాలో తోచనప్పుడు ఆకతాయి పనులు చేయటం, పోలీసు యంత్రాంగాన్ని ఉరుకులు పెట్టించడం యువతకు ఇప్పుడు ఒక పనిగా మారింది. వాటి ఫలితమే తప్పుడు ఫోన్ కాల్స్...! ఫలనా థియేటర్లో బాంబు పెట్టారనో, ఫలానా ట్రయిన్‌లో బాంబు పెట్టారనో పోలీసులకు ఫోన్‌కొట్టి టీవీలో తమాషా చూస్తుంటారు కొంతమంది ఆకతాయి కుర్రాళ్ళు. దీంతో పోలీసులు బాంబ్‌స్క్వాడ్, డాగ్‌స్క్వాడ్, ఆధునిక పరికరాలు పట్టుకుని మందీమార్బలంతో ఉరుకులూ, పరుగులూ పెట్టడం... చివరకు అక్కడ ఏమీ లేదనీ... అది ఫేక్‌కాల్ అనీ గుర్తించడం జరుగుతుంది. ఇలాంటి అల్లరి పనులవల్ల ఎంత ప్రభుత్వ యంత్రాంగం సమయం వృథా అవుతుంది?! పైగా అనవసర భయంతో జనం పెట్టే ఉరుకులూ, పరుగులూ వల్ల హృద్రోగులకు, గర్భిణులకు, పిల్లలకు, వృద్ధులకు ఎంత రిస్కు..? చివరకు ఆ ‘కాల్’ చేసింది ఎవరో పోలీసులు కనిపెడితే.. నిందితుడైన ఆ యువకుడు తాను ఇదంతా ‘థ్రిల్’ కోసం చేశానని అంటాడు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కటీ యువతకు ‘థ్రిల్’ అయిపోయింది. సరదా అయిపోయింది. ప్రమాదం అంచులకు వెళ్ళి సెల్ఫీలు దిగి ప్రాణాలమీదికి తెచ్చుకోవడం ఒక సరదా... తప్పతాగి వేగంగా కారు డ్రైవ్‌చేసి ఏ స్తంభానికో గుద్దేయడం ఒక సరదా... కాలేజీలకు వెళ్ళి చదువుకోవటానికి బదులు మత్తుకు బానిసలై జీవితాలను ఛిద్రం చేసుకోవడం ఓ సరదా... ఇలా అన్నీ సరదాలే... అన్నీ వాళ్ళకు థ్రిల్ ఇచ్చేవే.
రాజ్యాంగ బద్ధంగా చేయవలసిన పనులు, ఉపయోగించాల్సిన యం త్రాంగం ప్రభుత్వానికి చాలా ఉంటుంది. ఈ విశాల భారతంలో ఎప్పుడు ఎవరికి నిజమైన ఆపద, కష్టం, నష్టం వస్తాయో తెలియదు. మనిషి చేతిలో లేని ప్రకృతి బీభత్సాలకు, వైపరీత్యాలకు ఒక్కోసారి ఎంత యంత్రాంగాన్ని వినియోగించినా సరిపోదు. ఈ విషయం తెలుసుకుని ప్రతి పౌరుతూ ఆచితూచి జాగ్రత్తగా, బాధ్యతాయుతంగా మసలుకోవాలి గానీ ప్రతిదానికీ రూల్సు, రైట్సు మాట్లాడుతూ గగ్గోలు పెట్టడం ‘ఈ ప్రభుత్వం మా కోసం ఏం చేస్తోంది’ అని ప్రశ్నించడం సరియైన పద్ధతి కాదు. దేనికైనా పద్ధతి, ప్రణాళిక, క్రమశిక్షణ నీతి, న్యాయం, ధర్మం ఉండాలి. ముఖ్యంగా ప్రభుత్వ యంత్రాంగం పనితీరు పట్ల ప్రతి పౌరుడికీ అవగాహన ఉండితీరాలి.

-డా. కొఠారి వాణీచలపతిరావు సెల్: 98492 12448