సబ్ ఫీచర్

‘భాషా దినోత్సవం’ జరిపేశాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘సింగడు అద్దంకి వెళ్లనూ వెళ్లాడు, తిరిగి రానూ వచ్చాడన్న’ట్లు తెలుగు భాషాదిన్సోవం రానూ వచ్చింది, పోనూ పోయింది. ‘తెలుగుభాషకి ఎన్నో వరాలిస్తుంది తెలుగుదేశం’ అనుకున్న వాళ్లకి తీవ్ర నిరాశే మిగిల్చి వెళ్లిపోయింది. తొలి ఆధునిక తెలుగు భాషా శాస్తవ్రేత్త, ఆధునిక తెలుగు భాషా విమర్శకుడు గిడుగు వేంకట రామ్మూర్తి జయంతిని భాషాదినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీ. ఈ ఏడాది కూడా ఆ ఆనవాయితీకి భంగం కలుగలేదు. ఏపి సిఎం చంద్రబాబు నాయుడు గతేడాది ఈ ‘దినోత్సవం’ నాడు ఇచ్చిన వరాల జోలికి పోకుండా, జాగ్రత్తగా కొత్త వరాల్ని ఏరి కూర్చి ఇచ్చారు. ‘తెలుగు భాష లేకపోతే మన జాతికి ఉనికి ఉండదు. భాషాభివృద్ధికి అంతా కృషిచేయాలి..’వంటి పిలుపులనివ్వలేదు. భాషను కాపాడేందుకు తమ సర్కారు రాజీలేని కృషి చేస్తుందనీ చెప్పలేదు. భాషకి చెందిన ఏ జీవోల ముచ్చటా తేలేదు. కానీ ఓ జీవోని ఆవిష్కరించారు.
గతంలో చెప్పినట్లు బోధనా భాషగా పదో తరగతి వరకూ కాదు, కనీసం అయిదో తరగతి వరకూ ఉంటుందనీ చెప్పలేదు. పాలనాభాషగాను తెలుగుకి వరాలూ ఇవ్వలేదు. మన సంస్కృతీ సంప్రదాయాల వారసత్వ సంపదను కాపాడేందుకని సాహిత్య, సంగీత, నృత్య, నాటక, దృశ్య, కావ్య, జానపదకళల, సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీలను ఆవిష్కరిస్తూ జీవోని సిఎం సభలో ఆవిష్కరించారు. ఒక విధంగా భాషంటూ ‘సాహితీ వ్యాపారుల’ సందడి తగ్గుతోంది, మరోలా ప్రభుత్వ వరాల కోసం పాకులాటా మొదలవుతుంది. ఒక్క వరానికి రెండు దెబ్బలన్నమాట!
తెలుగు భాషని కాపాడేందుకు గతంలో ఓ ప్రాధికార సంస్థని కాగితం మీదే ప్రారంభించడం, దాని రూపకల్పనకు ఒక కమిటీని నియమించడం జరిగింది. కాగితం మీదే అయినా చెప్పిందే మళ్లీ చెప్పకూడదు. అందుకని అధికార భాషా చట్టం స్థానంలో ఈ ప్రాధికార సంస్థను ప్రారంభిస్తున్నట్లు, ఈ సంస్థ ఏర్పాటుకు త్వరలోనే అసెంబ్లీలో బిల్లు పెట్టి చట్టం చేస్తామని కూడా సిఎం హామీ ఇచ్చారు. మైసూరులో ఉన్న ప్రాచీన తెలుగు భాషా పరిశోధనా కేంద్రాన్ని అమరావతికి తెచ్చేందుకు కృషి చేస్తున్నామని విన్నవించారు. ఆ కేంద్రం ‘్భషకు’ ఇచ్చేదేకాని రాష్ట్రానికిచ్చేది కాదని, అదే కేంద్రం కోసం మరో తెలుగు రాష్ట్రం కృషి చేస్తోందని చంద్రబాబుకు తెలియనిది కాదు. ఏడు తెలుగు అకాడమీలు ప్రారంభిస్తామనడం, భాషా సాంస్కృతిక శాఖని నెలకొల్పడం, జిల్లాకి కనీసం ఒకరి చొప్పున (వాళ్ళు జిల్లాలో ఉంటున్నారని కాకుండా జిల్లాలో పుట్టారన్న ప్రాతిపదికన కావచ్చు. పెరిగారన్న ప్రాతిపదికన కావచ్చు.. వాళ్ళకే తెలియాలి గానీ మనకు తెలీదుగా!) పురస్కారాలిచ్చి బరువు దించుకోవడం, భాషా సాంస్కృతిక శాఖా మంత్రిని నియమించడం భాషా సేవ కాదా? గిడుగు రామ్మూర్తి గురించి- ఇప్పుడాయన జయంతి వచ్చింది కదాని భాషా సాంస్కృతిక శాఖ మంత్రిణి ‘గూగుల్’లో శోధించి మరీ తెలుసుకున్నారట! తెలుగు భాషా దినోత్సవం ఎవరి జయంతి నాడు జరుగుతుందో తెలుసుకోవడానికి శోధించడమంటే తెలుగు భాషకి, ‘గిడుగు’కి చేసే మేలు కాదా?
‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అని సంస్కృతం వచ్చిన కన్నడ ప్రభువు శ్రీకృష్ణదేవరాయలు అంటే, ‘దేశభాషలందు తెలుగు లెస్’ అంటున్నారు ఆంగ్లాన్ని అభిమానించే మన మంత్రులు. ‘సుందర తెలుగు’ అని తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి తెలుగు గురించి తెలీక అంటే ‘ఉద్యోగాలివ్వలేని తెలుగు’ అని మనవాళ్ళు అంటున్నారా? ‘తెలుగు ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్’ అని ఇటలీకి చెందిన నికోలోకోంటి అంటే, ‘పాఠశాలలోకి అడుగుపెట్టినప్పటి నుంచి పనికిరాని తెలుగు’ అని మన పాలకులంటున్నారు! తమిళులు, కన్నడిగులు, ఇటలీ వారి కన్నా మనవాళ్ళు గొప్పని ఒప్పుకోవడానికి ఇంకా సందేహమెందుకు? తెలుగుకి మేలు చేస్తున్నట్టు నటిస్తూ, చేయకుండా ఉండడం ఎంత కష్టమో ఎవరూ గుర్తించరేం! ఎలాగో భాషాదినోత్సవం ముగిసిందనుకుంటే గురజాడ జయంతి నాడు జరిపే (సెప్టెంబర్ 21) సాహితీ దినోత్సవమంటారేమిటి? అది సాహితీ దినోత్సవమని ఎవరు చెప్పారు? పాత ప్రభుత్వాల నిర్ణయాల్ని గౌరవించాలనే నియమం ఎక్కడైనా వుందా? తెలుగు భాషకి, తెలుగు సాహిత్యానికి సంబంధం ఏమిటిట? సాహిత్యంతో భాషని మార్చవచ్చని గురజాడ అన్నారా? ఎవరా గురజాడ? ఆయన కోసం మళ్లీ గూగుల్‌లో శోధించాలా? మేం తెలుగు భాషనే మరచిపోతున్నాం అంటున్నారు! ఆ పేరుని మేము జపిస్తున్నన్నిసార్లు ఏ రాష్ట్రంలోనైనా వాళ్ళ మాతృభాషని అన్నిసార్లు స్మరిస్తున్నారా? అసలు ఒకళ్ళతో మాకు పోలికేమిటి? మా ప్రత్యేకత మాది.. కాదంటారా? ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారు.. ఇంతకీ మీ పిల్లలు ఏ మాధ్యమంలో చదువుతున్నారు? మీ పిల్లల భవిష్యత్తుకోసమేగా మేం ఇన్ని విమర్శలకు లోనై తెలుగు వద్దనేది? తల్లిదండ్రుల కోరిక మీదే ఆంగ్లం వైపు మొగ్గుచూపుతున్నామంటే వినరే! మేమే దోషులైనట్లు నినాదాలేమిటి? మిమ్మల్నే! అలా మిన్నకుంటారేం?

-డా. వేదగిరి రాంబాబు