సబ్ ఫీచర్

చేనేతకు జిఎస్‌టి గ్రహణం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇప్పటికే సంక్షోభంలో కూరుకుపోయి మనుగడ కోసం తిప్పలు పడుతున్న చేనేత రంగం ఇక మరింతగా కష్టాల పాలయ్యే పరిస్థితి ఏ ర్పడింది. ఒకప్పుడు కాంగ్రెస్‌లోని పెట్టుబడిదారులను ఉద్దేశించి ‘చిరుతపులి చర్మంపై మచ్చలు మారవచ్చు.. కానీ మీరు మాత్రం మారరు’ అని దివంగత నేత ఆచార్య ఎన్.జి.రంగా అన్నట్టుగా- కేంద్రంలో ప్రభుత్వాలు మారినా చేనేత రంగంపై నిర్లక్ష్య ధోరణి అలానే కొనసాగుతోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ‘వస్తు, సేవా పన్ను’ (జిఎస్‌టి) విధానాన్ని అమలు చేయడంతో అన్ని రంగాలూ పెద్ద కుదుపునకు గురవుతున్నాయి. ఆచరణలో మంచి ఫలతాల కోసం ఇతర రంగాలు ఎదురు చూడాల్సి వున్నప్పటికీ చేనేత రంగం మాత్రం పూర్తిగా కుదేలు అయిపోయింది. 1930వ దశకంలో ప్రపంచాన్ని ముంచెత్తిన ఆర్థిక సంక్షోభాన్ని ‘హంగ్రీ ఆఫ్ థర్టీస్’గా నాటి ఆర్థికవేత్తలు అభివర్ణించారు. నాటి సంక్షోభాన్ని ప్రముఖ రచయిత కొడవటిగంటి కుటుంబరావు ‘గడ్డురోజులు’ నవలలో చూపించిన సంక్షోభానే్న జిఎస్‌టి వల్ల ఇపుడు చేనేత రంగం ఎదుర్కొంటోంది. నేతన్నల వ్యధలపై ఓ నవలకు సరిపడా ‘ముడిసరుకు’ను జిఎస్‌టి అమలు తర్వాతి పరిణమాలు సమకూర్చుతున్నాయి. చేనేత రంగం వాస్తవ పరిస్థితి పట్ల, ఆ వృత్తిని నమ్ముకున్న కార్మికుల దుస్థితి పట్ల, వారికి ఉద్దేశించిన విధానాల అమలు తీరుపట్ల- ఫలితంగా ఛిన్నాభిన్నమైన చేనేత బతుకుల పట్ల కేంద్రంలోని శాసనకర్తలకు తగిన అవగాహన లేనందువల్లే జిఎస్‌టి భారాన్ని మోపినట్టు అర్థమవుతోంది.
చేనేత పరిశ్రమలో పేరెన్నిక గన్న ఉప్పాడ ‘జంధాని’ రకానికి దేశ విదేశాల్లో గిరాకీ వుంది. తెలంగాణలోని గద్వాల చీరలు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పరిసర గ్రామాల్లో తయారుచేయడం చేనేతకు ప్రాంతీయ భేదాలు లేవని చాటి చెబుతుంది. నెల్లూరు జిల్లా వెంకటగిరి చీరలకు ఎంత పేరు వుందో తెలియనిది కాదు. మంగళగిరి డ్రెస్ మెటీరియల్, చీరాల జాకార్డు చీరలకు వున్న ఆదరణ తిరుగులేనిది. శ్రీకాళహస్తి పుణ్య క్షేత్రమే కాకుండా ప్రింటింగ్, నగిషీలకు, ముద్దులొలికే రకాలకు మహిళలు ముగ్ధులు అవాల్సిందే. జిఎస్‌టి తర్వాత ఈ అద్భుతమైన చేనేత వస్త్రాలు అమ్మకాలు తగ్గి నిల్వలు గుట్టలుగా పోగుపడి వున్నాయి.
దేశమంతటా ఒకేపన్ను పేరుతో జిఎస్‌టి ప్రారంభం అయినా చేనేత రంగానికి బహుళ పన్నులు అమలు అవుతున్నాయి. నూలుపై 5 శాతం, రంగులపై 18 శాతం, కెమికల్స్‌పై 18 శాతం, తయారైన వస్త్రంపై 5 శాతం, కార్మికుల వేతనాలపై 5 శాతం మొతం 51 శాతం వరకు పన్నులు భరించాల్సి వస్తోంది. పవర్ లూమ్స్ ధాటికి విలవిలలాడుతున్న చేనేత రంగాన్ని బతికించేందుకు ‘ఆప్కో’ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ‘కో-ఆప్టెక్స్’ ద్వారా తమిళనాడు ప్రభుత్వం రాయితీలు ఇస్తూ ఎంతోకొంత సహకరిస్తున్నాయి. చేనేతపై జిఎస్‌టి ఇలాగే కొనసాగినట్టయితే- రాయితీలను ప్రభుత్వాలు ఏ మేరకు పెంచుతాయో, నేత కార్మికుల మనుగడ ఎలా ఉంటుందో ఇప్పుడు ఏమీ చెప్పలేం. రాయితీలను భారీగా పెంచడం అసాధ్యం. వస్త్రాల నిల్వలు పెరిగిపోతున్నాయి. మాస్టర్ వీవర్లు వేచి చూసే ధోరణిలో ఉత్పత్తిని ఆపేస్తున్నారు. ఈ స్థితిలో చేనేతపై జిఎస్‌టిని పూర్తిగా తొలగించకుంటే దేశవ్యాప్తంగా రెండున్నర కోట్ల నేత కార్మికులు వీధినపడే ప్రమాదం వుంది. ఏ విధమైన ప్రత్యక్ష, పరోక్ష పన్నులను చేనేత ఉత్పత్తులు, ముడిసరుకులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేయరాదని రాజ్యాంగంలోని 43వ అధికరణ నిర్దేశించింది. దీనికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం చేనేత వస్త్రం తయారీకి ఉపయోగించే ముడిసరుకులు, చిలప నూలు, రంగులు, రసాయనాలు, ఎంబ్రాయిడరీ, జరీ వగైరా అన్నింటిపైనా జిఎస్‌టి విధించారు. చేనేతను ప్రోత్సహించేందుకు 2015 నుంచి ‘జాతీయ చేనేత దినోత్సవం’ పాటిస్తూ చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ మాదిరిగా వ్యవహరిస్తున్న ప్రధాని మోదీ ఈ విషయంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
వ్యక్తిగత ఆదాయలను బట్టి ఆదాయపు పన్ను వసూలు చేయడం ద్వారా ప్రత్యక్ష పన్నులు పెంచకుండా, స్థూల జాతీయ ఉత్పత్తిలో పన్నుల వాటా మొత్తాన్ని ప్రభుత్వం పెంచుతూ ప్రజలపై ఆర్థిక లోటు భారాన్ని మోపుతుంది. ఈ క్రమంలోనే జిఎస్‌టి మొదలైంది. చేనేతకు వాడే రంగులు, రసాయనాలపై జిఎస్‌టి 18 శాతం వంతున వుంది. కాటన్ యార్న్ (దారం) బేళ్ల రూపంలో రంగుల అద్దకం చేయించగలిగితే తప్ప జిఎస్‌టిని లెక్కించి చెల్లించడం చిన్న మాస్టర్ వీవర్‌కు, సామన్య నేత కార్మికులకు సాధ్యపడే విషయం కాదు. ఆర్థిక స్థోమత లేని చేనేత ఉత్పత్తిదారులు పన్నులను సరిగా అంచనా వేయలేక రంగుల అద్దకానికి, దారం కొనుగోలుకు అదనంగా చెల్లించే పరిస్థితి ఉంది. వీటన్నింటినీ క్రమపద్ధతిలో పెట్టగలిగే విధానాన్ని పన్నులు వసూలు చేసే సేల్స్ టాక్స్ శాఖ ఇంకా రూపొందించలేదు. స్థిర విధానం లేక చేనేత వస్త్ర ఉత్పత్తి వివిధ దశలలో (నూలు కొనుగోలు, రంగుల అద్దకం, హోల్‌సేల్, రిటైల్ అమ్మకాలతో) చెల్లించే మొత్తాన్ని జిఎస్‌టి పన్ను విధానంలో తిరిగి తీసుకోవలసిన వారు (ఇన్‌పుట్ సబ్సిడీ) ఎవరో కూడా స్పష్టత లేని విధంగా చేనేతపై జిఎస్‌టి పన్ను విధానం వుంది. చేనేతపై జిఎస్‌టిని తొలగించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా పలు చేనేత సంఘాలు, జాతీయ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, జిఎస్‌టి కౌన్సిల్‌కు విజ్ఞప్తి చేసారు. ఆగస్టు 5, 2017న ఢిల్లీలో జరిగిన జిఎస్‌టి కౌన్సిల్ 21వ సమావేశంలో ఇచ్చిన రాయితీలు జౌళి రంగానికే ఉపయోగకరంగా ఉన్నాయి తప్ప చేనేతకు ఉపశమనం కలిగించలేదు. పులి లాంటి జౌళి నుండి మేక వంటి చేనేతను వేరుచేసి, రెండు శాఖలుగా ఏర్పాటు చేసి వస్త్ర పరిశ్రమను రక్షించాలన్నది చిరకాల డిమాండ్. చేనేత-జౌళిని ఒకే మంత్రిత్వ శాఖగా ఉమ్మడి బడ్జెట్‌తో, ఉమ్మడి అధికార యంత్రాంగంతో పనిచేయించడం వల్ల చేనేతకు నష్టం కలుగుతుందని మొత్తుకునేది ఇందుకే.
మిల్లు యజమానుల ‘లాబీయింగ్’ ముందు నేతన్నల బలహీనమైన గొంతు పాలకులకు వినిపించని పరిస్థితి ఉంది. మిల్లు యజమానులకు వేలాది కోట్ల రూపాయల సబ్సిడీలు, తక్కువ ధరకు ప్రభుత్వ స్థలాల కేటాయింపు చేసినప్పటికీ ఆ రంగం వృద్ధి రేటు 14 శాతం నుంచి 5 శాతానికి పడిపోయింది. పరిశ్రమలకు ప్రోత్సాహకాల పేరుతో మిల్లులకు రుణాలు, సబ్సిడీలు ఇచ్చిన మాదిరిగా చేనేత కార్మికులు ఆ సౌకర్యాలను తమకూ కావాలని అడగడం లేదు. ప్రభుత్వం ఇచ్చిన చట్టబద్ధమైన హామీలు మాత్రమే అమలు జరపమని అడిగినా అది అరణ్య రోదనగానే మిగిలిపోతోంది. పవర్‌లూమ్ ఉత్పత్తుల పోటీ తట్టుకోలేని నేతన్నలు ఇప్పటికే నడ్డివిరిగి వున్నారు. చేనేత, పవర్‌లూమ్ రంగాలు పరస్పర విరుద్ధంగా ఉంటాయి. పవర్‌లూమ్ చేనేతను మింగేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఎంతో కష్టపడి చేనేత ఉద్యమం సాధించుకున్న రిజర్వేషన్ చట్టాన్ని ఉల్లంఘించి పవర్‌లూమ్ వస్త్రాలు ఉత్పత్తి చేస్తుంటే చట్టం వుండి కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి చేనేతది. ఇన్ని ఒడిదుడుకుల మధ్య జీవన పోరాటం చేస్తున్న చేనేత రంగం జిఎస్‌టి పన్ను విధింపుతో కొన వూపిరికి చేరుకుంది. ఈ అంశాలన్నింటినీ దృష్టిలోవుంచుకు సెప్టెంబర్ 9న హైదరారబాద్‌లో జరగబోతున్న జిఎస్‌టి కౌన్సిల్‌లో చేనేత, దానికి సంబంధించిన ముడిసరుకులపై పన్నులను పూర్తిగా ఉపసంహరించాలన్నది నేత కార్మికుల ఆకాంక్ష. ఇదే విషయమై ఇటీవల ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడులకు నేత కార్మికుల ప్రతినిధులు వినతిపత్రాలను సమర్పించారు. జిఎస్‌టి కౌన్సిల్ చైర్మన్, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీకి కూడా ఇదే అంశాన్ని చేనేత ప్రతినిధులు నివేదించారు.
జిఎస్‌టితో ప్రస్తుతం చేనేత దుస్తులకు అమ్మకాలు లేకుండా పోయాయి. మాస్టర్ వీవర్లు సైతం మగ్గాలు ఎత్తివేస్తున్నారు. మాస్టర్ వీవర్లు లేకపోతే సగటు నేత కార్మికుడు సొంత పెట్టుబడులతో వస్త్ర ఉత్పత్తి చేయలేని దుస్థితి తప్పదు. ఒకప్పుడు పదిలక్షలకు పైగా ఉన్న చేనేత మగ్గాల సంఖ్య ప్రస్తుతం మూడు లక్షలకు పడిపోయింది. జిఎస్‌టి చేనేత కార్మికులకు జీవన్మరణ సమస్యగా మారిపోయింది. జీవనోపాధి హక్కు సాధన కోసం చేనేతపై జిఎస్‌టి పన్ను పూర్తిగా తొలగించే వరకు చేనేత కార్మికులు తమ సంఘటిత శక్తిని ప్రభుత్వాలకు చూపాల్సిన తరుణం ఇది.

-పోతుల సునీత, ఎమ్మెల్సీ