సబ్ ఫీచర్

‘నేరెళ్ల’లో నేరం ఎవరిది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూలి, నాలి చేస్తూ ప్రశాంతంగా జీవిస్తున్న నేరెళ్ల గ్రామవాసులు ఇపుడు మీడియాలో చర్చనీయాంశంగా మారారు. ఈ పల్లెప్రజలపై ఇటీవల జరిగిన దౌర్జన్య సంఘటన వెనుక వున్న చీకటి కో ణాలు- తెలంగాణ ప్రభుత్వం ఆరంభం నుండే పురుడుపోసుకున్నాయని అనిపిస్తుంది. నేరెళ్ల, జిల్లేల గ్రామాల్లో వ్యవసాయంపై ఆధారపడి జీవించే కుటుంబాలే ఎక్కువ. ప్రపంచంలో ఎక్కడైనా ప్రకృతి సంపద స్థానికులకు వరంగా మారుతుంది. కానీ నేరెళ్ల విషయంలో అది తారుమారై ప్రజల ప్రాణాలను బలిగొంటున్నది. ఇందుకు పర్యవసానమే భూమయ్య లాంటి సాధారణ దళితుడి మరణం. పక్షుల కిలకిలరావాలతో తెల్లారాల్సిన పల్లె, రణగొణ ధ్వనులు, పోలీస్ సైరన్‌ల మోతలతో ఇపుడు దినచర్య ప్రారంభిస్తోంది. పల్లె ప్రజలు నిత్యం భయాందోళనలతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సిన దీనస్థితి. దీనికి కారణం ఎవరు? నిజానికి నేరెళ్ళలో నేరం ఎవరిది?
నిశితంగా పరిశీలిస్తే- బూర్జువా, ఆధిపత్య రాజకీయాలతో ప్రజాస్వామ్యం గతి తప్పుతోందనడానికి నేరెళ్ళ ఓ నిదర్శనం. స్థానికులు ఎన్నోసార్లు ప్రజా ప్రతినిధులను, అధికారులను కలసి ఇసుక అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలని మొరపెట్టుకున్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడానికి కారణం ఎవరు? ఇసుక మాఫియాతో కుమ్మక్కై, కాంట్రాక్టర్లు ఇచ్చే మమూళ్ళతో జేబులు నింపుకునే అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు దళితుల ప్రాణాలను గాలికి వదిలేస్తున్నారు. ఇసుక రవాణా అక్రమమా? సక్రమమా? అనే దాన్ని పక్కన పెడితే, పేద కుటుంబాలను రోడ్డున పడేస్తున్న ఇసుక లారీల వ్యవహారం మాత్రం అక్రమమే. ఇసుక రవాణాకు అనుమతులున్నాయని, అంతా సవ్యంగా జరుగుతోందని జబ్బలు చరుచుకుంటున్న ప్రభుత్వం- ఇక్కడ వరుసగా జరుగుతున్న ప్రమాదాలకు కూడా ‘పర్మిషన్’ తీసుకుందా? అనూహ్యంగా ఒకసారి జరిగితే అది ‘ప్రమాదం’ అవుతుంది. ఈ ఘటనలు పదే పదే జరిగితే ఏమంటారు? ‘తెలంగాణ తొలి ముఖ్యమంత్రి దళితుడే’ అనే నినాదంతో గద్దెనెక్కిన సిఎం కెసిఆర్ దళితుల పాలిట ఇలా వ్యవహరించడం దారుణం. దళితులకు మూడు ఎకరాల భూమి అనే నినాదాన్ని కూడా తెరాస అధినేత గాలికి వదిలేశారు. దళితుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నా పట్టించుకోని ముఖ్యమంత్రి దగ్గరుండి అధికారులను, పోలీసులను అరాచకాలకు పురమాయిస్తున్నట్లు ఉంది. తమ కులానికి సిఎం పదవి ఇవ్వకపోయినా ఇసుక మాఫియా బారి నుండి కాపాడితే అదే పదివేలని దళితులు భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక ఇసుక అక్రమ తవ్వకాలు ఇంకా ఎక్కువైనాయి తప్ప ఏ మాత్రం తగ్గలేదు. ఇసుక కాంట్రాక్టర్లు చూపే ప్రలోభాలకు లొంగిన పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి అభం శుభం తెలియని అమాయక దళిత బిడ్డలపై ‘్థర్డ్ డిగ్రీ’ ప్రయోగించడం ఎంతవరకు సమంజసం? ఒకవేళ ప్రజలు ఆవేశంతో, ఆక్రోశంతో లారీలు దగ్ధం చేస్తే- వారిని శిక్షించడానికి చట్టాలు, కోర్టులు ఉన్నాయి కదా!
కానీ, పోలీసులు ఎవరు దళితులను కొట్టడానికి? బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో తప్పు చేసినవారిని ఇలా నిర్దాక్షిణ్యంగా కొట్టమని ఉందా? అలా భా విస్తే పోలీసులు, ప్రభుత్వ పెద్దలు కలిసి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కడమే అవుతుంది. ముంబయి తాజ్ హోటల్‌లో ఉగ్రవాదులు జరిపిన నరమేధంలో ప్రధాన నిందితుడు కసబ్‌పై కూడా థర్డ్ డిగ్రీ ప్రయోగించలేదు. అంతకంటే పెద్ద నేరమేమైనా చేశారా నేరెళ్ళ ప్రజలు? రాజకీయ నాయకులను, కాంట్రాక్టర్లను కాపాడడానికి కాదు తాము పనిచేస్తున్నది ప్రజల కోసం అని పోలీసులు, అధికారులు గుర్తించాలి. మూత్రంలోంచి రక్తం వచ్చేటట్లు కొట్టడం అంటే ఎంత దుర్మార్గంగా పోలీసులు ప్రవర్తించారో అర్థమవుతుంది. తెలంగాణ ప్రభుత్వం చెబుతున్న ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’ అంటే ఇదే కావచ్చు! ఇదంతా ప్రభుత్వ పెద్దలకు, పోలీసు బాసులకు తెలియకుండా జరిగిందా?
మాట్లాడితే చాలు.. పోలీస్ కేసులంటున్న ప్రభుత్వం ఈ ఘటనకు కారణం అయిన జిల్లా ఎస్పీని ఎందుకు సస్పెండ్ చెయ్యలేదు? ఏదో పేరుకు మాత్రమే ఎస్‌ఐని సస్పెండ్ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. చనిపోయిన భూ మయ్య కుటుంబానికి, గాయాలపాలైన వారి కుటుంబాలకు అండగా ఎవరుంటారు? తెలంగాణ ప్రభుత్వమా? పోలీసు అధికారులా? సంఘటన జరిగి దాదాపు 30 రో జులు కావస్తున్నా ప్రభుత్వ నేతలు ఒక్కసారి మాత్రమే పరామర్శకు వెళ్లారంటే అది దళితులపై ఉన్న కపట ప్రేమను తెలియజేస్తుంది. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ, ‘లారీలను దగ్ధం చేస్తే పోలీసులు ఊ రుకుంటారా?’ అనడం బాధాకరం. ఇదే కెసిఆర్ తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఉద్యమ నాయకుడి పాత్ర పోషించి, యువతను రెచ్చగొట్టి కొన్ని వందల బస్సులు, పోలీసు వాహనాలను ఆందోళనకారులు తగులబెట్టినపుడు వౌనం ఎందుకు వహించారు? ‘వెయ్యి ఎలుకలను తిన్న పిల్లి నీతులు చెప్పింద’నే సామెతకు గొప్ప ఉదాహరణగా ముఖ్యమంత్రి వ్యవహార శైలి. ఈ సంఘటన దళితుల పట్ల సిఎంకు ఎంతటి ప్రేమ ఉందో తెలియజేసింది. పోలీస్ వ్యవస్థ తీరుతో తెలంగాణ రాష్ట్రం జాతీయ స్థాయిలో సిగ్గుతో తలదించుకొనేలా వుంది. చట్టాలు, న్యాయాలు ప్రజలకు ఉండవా? పోలీసు వ్యవస్థలో వున్న అరాచకాలను జనం ఎండగడితే తక్షణమే స్పందించి వారిపై చర్యలు తీసుకుంటుంది. దళితులేమి చేశారు? ఇసుక లారీల దూకుడుతో ఎంతోమంది మృత్యువాత పడుతున్నందున స్థానిక దళితులు లారీలను ధ్వంసం చేశారు. పోలీసు వ్యవస్థ మాత్రం సమస్యను దళితులే సృష్టించారని వాదిస్తోంది. తెలంగాణ మేధావులు ఇకనైనా స్పందించాలి.
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో- ‘నా చావు కు కారణం నేనే, నేను చనిపోయాక వేరేవాళ్ళను కాని వేరే సంస్థలను కాని ఎవరూ విమర్శించవద్దు’- అని లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్న రోహిత్ వేముల మరణాన్ని ఎంత రాజకీయం చేశారో మనకు తెలిసిందే? రోహిత్ దళితుడని కొందరు, దళితుడు కాదని కొందరు రాజకీయం చేశారు. రోహిత్ ఆత్మహత్యపై స్పందించిన కొన్ని ప్రాంతీయ పా ర్టీల నాయకులు, కాంగ్రెస్ పార్టీ యువనేత రాహుల్ గాంధీ నేరెళ్ళ సంఘటనపై ఎందుకు స్పందించడం లేదు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి రెండుసార్లు వచ్చి దళితుల పక్షాన తాము పోరాడుతామని చెప్పిన జాతీయ నాయకులు ఇప్పుడు ఏమై పోయారు? కాంగ్రెస్ పార్టీ నేత మీరాకుమార్ ఇటీవల రాష్టప్రతి ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణకు వచ్చారు. కానీ, నేరెళ్లలో దళితుల పక్షాన ఆమె పోరాడింది లేదు. దళితుల పట్ల విపరీతమైన ప్రేమాభిమానాలు ఒలకబోసే వివిధ రాజకీయ పక్షాల వారు కూడా నేరెళ్ల ఉదంతం జరిగి నెల రోజులు దాటినా ఎందుకు పరామర్శకు రాలేదు. పత్రికాముఖంగానైనా సానుభూతి వ్యక్తం చేయలేదు. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, దళిత నాయకురాలు మాయావతి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సిపిఎం, సిపిఐ, ఇతర వామపక్ష జాతీయ నాయకులు ఎక్కడ ఉన్నారు? రోహిత్ వేముల కుటుంబానికి ఆర్థిక సాయం, ఉపాధి ఇస్తామని హడావుడి చేసిన నాయకులకు- తెలంగాణలోని నేరెళ్ళ దళితులు కనపడలేదా? మంథని మధుకర్ దళితుడు కాదా? కరీంనగర్ జిల్లా వీణవంకలో సామూహిక అత్యాచారానికి గురైన అమ్మాయి దళితురాలు కాదా? మొన్నటికి మొన్న ఇద్దరు దళిత యువకులు మానకొండూరు నియోజకవర్గంలో ప్రభుత్వ భూ ముల విషయంలో ఆవేదన చెంది ఆత్మహత్య చేసుకోలేదా? వీరిపట్ల నేతల సానుభూతి ఏది? ఆర్థిక సహాయాలు ఏవి? వీటి గురించి చట్టసభల్లో ఎందుకు చర్చించలేదు? యూనివర్సిటీలకు వెళ్లి విద్యార్థుల చదువును పాడుచేసిన నాయకులు నేడు అమాయక దళితుల పట్ల ఇసుక మాఫియా చేస్తున్న అరాచకాలను ఎందుకు ఖండించరు? దళితులను కాపాడాలని, నిందితులైన పోలీసులను శిక్షించాలని రాజకీయ పార్టీల నేతలు ఎందుకు గళం విప్పడం లేదు? ఎస్‌ఐని సస్పెండ్ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంటే దళితులకు న్యాయం జరుగుతుందా?
సంబంధిత మంత్రి మాత్రం ప్రెస్‌మీట్ పెట్టి- ప్రతిపక్షాలు తనను ప్రజలకు దూరం చేసే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపణలు గుప్పించారు. కానీ, బాధితులకు ఎలాం టి నష్టపరిహారం ఇప్పించలేదు. పైగా ఈ విషయం హైకోర్టు పరిధిలో వుందని బుకాయించాడు. నేరెళ్ళ ప్రజలకు న్యాయం చేసేదెవరు? న్యాయం జరిగేదెలా? ఇంత పెద్ద సంఘటన జరిగినా సకాలంలో ఏ రాజకీయ పార్టీ స్పందించలేదు? ఇప్పటికైనా బాధితులకు న్యాయం చేసే విధంగా అన్ని పార్టీలు కృషి చేయాలి. పత్రికలకు, టీవీలకు పరిమితం కాకుండా న్యాయం జరిగేంతవరకు పోరాడి నేరెళ్ళలో నేరం ఎవరిదో తేల్చాలి. ఘటనకు ప్రత్యక్షంగా, పరోక్షంగా కారకులైన వారందరిపైనా కేసులు పెట్టి న్యాయపరంగా కఠిన చర్యలు తీసుకోవాలి. సిట్టింగ్ జడ్జితో కమిటీని వేసి సమగ్ర విచారణ జరిపించాలి.
తెలంగాణలో వెనుకబడిన సామాజిక వర్గాలపై ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా వుండాలంటే- నేరెళ్ళలో నేరం ఎవరిది అనేది తేల్చి రాష్ట్ర ప్రభుత్వం తన చిత్తశుద్ధిని రుజువు చేసుకోవాలి. లేకపోతే ఇదే అలుసుగా తీసుకొని దళితులపై మరిన్ని దాడులు జరగడానికి ప్రభుత్వమే కారణం అవుతుంది.

-ఎన్.రాజేంద్రప్రసాద్