సబ్ ఫీచర్

పూల కోలాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవరాత్రి ఉత్సవాలకు హైదరాబాద్ నగరం ముస్తాబవుతోంది. గర్బా, దాండియా నృత్యాల రిహార్స్‌లతో నగరం హోరెత్తుతుంది. విద్యుద్దీపాల వెలుగుల్లో , గాగ్రా, లెహంగా దుస్తుల్లో స్ర్తి, పురుషల అందం మరింత వనె్నలద్దుకుంటుంది. గుజరాతీల సాంప్రదాయ వైభవం ఈ నవరాత్రి ఉత్సవాల్లో ఉట్టిపడుతోంది. తొమ్మిది రోజుల్లో తొమ్మిది అవతారాల్లో దర్శనమిచ్చే దుర్గామాతకు విభిన్న నైవేద్యాలు సమర్పించి భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. గర్బా, దాండియా నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. మహిళలు వలయాకారంగా చేరి చేతులతో చప్పట్లు తడుతూ.. తిరుగుతూ చేసే నృత్యాన్ని గర్బా అని అంటారు. ఇది గుజరాత్‌వారి సంప్రదాయ నృత్యం. ఇలా మహిళలు గర్బా నృత్యం చేయటాన్ని దుర్గామాతకు ఇచ్చే హారతిగా భావిస్తారు. అలనాడు ద్వారకలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కృష్ణుని భార్య రుక్మిణీ దేవి చేసిందని ఓ పురాణాల్లో ఉంది. ఇక స్ర్తి, పురుషులు ఇరువురు కలిసి కర్రలతో చేసే నృత్యాన్ని దాండియా అంటారు.
చెదరని ఆదరణ
నవరాత్రి ఉత్సవాల్లో చేసే ఈ సంప్రదాయ నృత్యానికి ఈనాటికీ చెక్కుచెదరని ఆదరణ లభిస్తోంది. హైదరాబాద్ నగరంలో వస్త్ర వ్యాపారానికి తలమానికంగా నిలిచే సుల్తాన్ బజార్‌లోని ప్రతి ఫంక్షన్ హాలులోనూ డోల్ బాజే..డోల్ బాజే అనే పాటకు లయబద్దంగా యువతీ యువకులు కదులుతూ రిహార్సల్ చేస్తున్న దృశ్యాలు కనువిందు చేస్తుంటాయి. గణేశ్ నవరాత్రి ఉత్సవాల వలే నేడు దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు సైతం అనేక కాలనీల్లో పెద్దఎత్తున నిర్వహిస్తుంటారు. ఈ కాలనీల్లో నిర్వహించే దాండియా నృత్యంలో అమ్మాయిలే కాదు కుటుంబ సభ్యులందరూ పాల్గొని ఆనందంగా ఆడతారు. సంప్రదాయ ఆభరణాలైన మెరిసే గాజులు, హారాలు, నడుముకి పట్టీ, కాళ్లకు గజ్జేలు ధరించి ఆకాశం నుంచి నక్షత్రాలు దిగివచ్చాయా అన్నట్లు మెరిసే రంగుల్లో టీనేజ్ యువతులు సందడి చేస్తుంటారు. దాండియా నృత్యంలో తాము లెహంగాలనే ఎక్కువగా ఇష్టపడతామని జెఎన్‌టియు విద్యార్థినులు చెబుతున్నారు.
ఇలాంటి వస్త్రశ్రేణి ప్రత్యేక ఆకర్షణ..
దాండియా నృత్యానికి వనె్నలద్దెది వస్త్రాలంకరణనే యువత ఇష్టపడుతోంది.దాండియా నృత్యం చేసేటపుడు చెమట అధికంగా పడుతుంది కాబట్టి కాటన్ లెహంగా, ఛోళీ, బాందీనీ దుపట్టా గల డ్రెస్స్‌ను ఎంపిక చేసుకుంటే మంచిదంటున్నారు ఫ్యాషన్ డిజైనర్లు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కాలేజీల్లోనూ, కార్పొరేట్ కార్యాలయాల్లోనైనా దాండియా నృత్యం చేయాలంటే లెహంగా వేసుకుంటేనే ఆకట్టుకునేలా కనిపిస్తారు. మన ఆహార్యానికి నప్పేలా కాస్తంత సంప్రదాయతను, ఆధునికతను జోడించి ఎన్నో రకాల డిజైన్లలో లెహంగాలు మార్కెట్లోకి వచ్చాయి. మరీ ఆర్భాటంగా కనిపించకుండా.. సింపుల్‌గా మీ ప్రత్యేకతను చాటుకుంటూ సిల్క్ లెహంగాకు స్టోన్ వర్క్ చేసుకుంటే బాగుంటుంది. లేత ఆకుపచ్చ రంగులో నెట్‌తో బ్లాక్ నెక్ చోలీతో డిజైన్ చేసిన లెహంగా చోలీతో నేల మీద నృత్యాన్ని చేస్తే కనులు తిప్పుకోవటం అసాధ్యం అంటే అతిశయోక్తి కాదు. ఆరంజ్, పింక్ రంగుల్లో మెరిసే లెహంగా చోలీలకు అద్దాలతో వర్క్ చేయించుకుంటే కనువిందు చేస్తుంది. ఎరుపు, గులాబీ, పసుపు, నారింజ వంటి కాంతివంతమైన రంగు వస్త్రాలను ఎంచుకుంటే మరింత ఆకర్షణీయంగా కనిపిస్తారు. యువకులు సైతం ఈ దాండియా నృత్యంలో పాల్గొనేటపుడు ప్రత్యేక వస్త్రాలను ధరిస్తారు. వైవిధ్యంగా.. సంప్రదాయబద్ధంగా కనిపించాలంటే కుర్తా, టర్బన్‌తో తలపై టోపీ, కుచ్చుల బాటమ్ ధరిస్తారు. ప్రింట్ కుర్తాకు అద్దాలతో ఎంబ్రాయిడరీ చేయించుకుంటారు.
ఆధ్యాత్మిక శోభ..
రాధాకృష్ణుల ప్రణయాన్ని గుర్తుకుతెచ్చే ఈ దాండియా నృత్యంలో ఆధ్యాత్మిక శోభ సైతం వెల్లివిరుస్తుంది. దాండియా ఆటలు ఆడ.. సరదా పాటలు పాడ అంటూ దాండియా ఆడితే శారీరకంగా, మానసికంగా ఉత్సాహం, అక్కడ ఆనందం తాండవ చేస్తుంది. అందుకే భాగ్యనగరం నుంచే కాదు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి హైదరాబాద్‌కు వచ్చి ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటారు. టీనేజర్లు నుంచి మేనేజర్ల వరకు, సాధారణ గృహిణి నుంచి బిజినెస్ ఉమెన్ వరకు ఈ నృత్యం పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. మరింకెందుకు ఆలస్యం కోలాటానికి సిద్ధంకండి.

- టి.ఆశాలత