ఉత్తరాయణం

శారీరక శ్రమతో ఊబకాయం దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు ప్రపంచవ్యాప్తంగా ధనిక, పేద అనే తేడాలు లేకుండా అన్ని దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలలో అత్యంత ప్రధానమైనది ఊబకాయం. ఆధునికత పేరుతో మన ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పులు, జీవనశైలిలో మార్పులే ఈ ఊబకాయం రావడానికి ముఖ్యకారణం. ద గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డీసెజెస్ స్టడీ- 2013 పేరిట ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో ప్రజల ఆరోగ్య పరిస్థితిపై నిర్వహించిన సర్వే ఫలితాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రపంచంలో వున్న మొత్తం ఊబకాయం కలిగిన వారిలో 50 శాతం పైగా కేవలం పది దేశాలలో మాత్రమే ఉన్నారు. అవి, అమెరికా, చైనా, ఇండియా, రష్యా, బ్రెజిల్, మెక్సికో, ఈజిప్టు, జర్మనీ, పాకిస్తాన్, ఇండోనేషియా దేశాలు. ప్రపంచవ్యాప్తం గా ఊబకాయం పెరుగుదల పెద్దలలో 28 శాతం ఉండగా, బాలల్లో 47 శాతం ఉంది. అమెరికా జనాభాలో 13 శాతం ఊబకాలు ఉండగా, చైనా, భారతదేశంలో వీరి సంఖ్య 15 శాతంగా ఉంది.
ఇక మన దేశం విషయానికి వస్తే, ప్రతి ఐదుగురిలో ఒకరు ఊబకాయంతో ఇబ్బంది పడుతున్నారు. 20 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన ప్రతి వంద మందిలో ఐదుగురు ఊబకాయంతో ఉన్నారు. కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ నేటివరకు ఊబకాయం నిరోధించడానికి ఎటువంటి చర్యలు తీసుకొనకపోవడం గమనార్హం. 2007లో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం 37.5 శాతం ఊబకాయులతో పంజాబ్ ప్రథమ, 24.4 శాతంతో తమిళనాడు ద్వితీయ, 22.7 శాతంతో ఆంధ్రప్రదేశ్ తృతీయ స్థానంలో ఉన్నాయి. 20 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన వారిలో ఊబకాయం పెరగడానికి కారణం ఫాస్ట్ఫుడ్స్. ‘‘కొత్త ఒక వింత- పాత ఒక రోత’’ అన్న నానుడి నేటి తరంకు చక్కగా వర్తిస్తుంది. శాటిలైట్స్ ఛానల్స్‌లో ఎంతో ఆకర్షణీయంగా వచ్చే వ్యాపార ప్రకటనలు (్ఫస్ట్ఫుడ్స్‌కు సంబంధించి) పిల్లలను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. తల్లిదండ్రులు కూడ ఆధునికత మోజులో ఫాస్ట్ఫుడ్స్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఫాస్ట్ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడంవలన ఊబకాయం వస్తున్నది. ఆహార పదార్థాలకు సంబంధించిన వ్యాపార ప్రకటనలలోని వాస్తవికతకు సంబంధించిన అంశాలను నిర్ధారించడానికి ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థను ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉంది. అదే విధంగా నూడిల్స్ లేదా పిజ్జా తినడంవలన ఎన్ని కేలరీల శక్తి వస్తుంది. దానిని ఖర్చుచేయడానికి ఎంత శ్రమపడాలి అనే అంశంపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ప్రపంచీకరణ కారణంగా నెలకొని వున్న పోటీ ప్రపంచంలో రాణించడానికి అటు బాలలు ఇటు యువత శారీరక శ్రమకు తిలోదకాలు ఇచ్చి, పుస్తకాలతో కుస్తీ పట్టడానికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. దీని కారణంగా ఫాస్ట్ఫుడ్స్ తీసుకొనడం ద్వారా శక్తి ఖర్చుకాకపోవడంతో అది కొవ్వుగా మారి, ఊబకాయం రావడానికి దోహదమవుతున్నది.
ఇక మహిళల విషయానికి వస్తే, ఎక్కువగా కూర్చోవడం, టి.వి. చూడటం, కంప్యూటర్ ముందు కూర్చోవడంలు కూడ వారిలో ఊబకాయులు పెరగడానికి కారణమవుతున్నది. ఎక్కువసేపు కూర్చోవడంవలన కండరాల సంకోచ ప్రక్రియ తగ్గిపోయి, లైఫోప్రోటీన్ లైపేజ్ అనే ఎంజైమ్ పనిచేయడం ఆగిపోతుంది. మన శరీరంలోని కొవ్వు ట్రైగ్లిజిరైడు శక్తిగా మారేందుకు లైఫోప్రోటీన్ లైపేజ్ ఎంజైమ్ దోహదపడుతుంది. మనం నిలబడి కదులుతున్నప్పుడు రక్తస్రరణ బాగా జరిగి (కండరాల కదలిక వలస) వ్యర్థ పదార్థాలు బయటకు వస్తాయి. అంటే కండరాల కదలికలు మన రక్తంలోని కొవ్వులు, చక్కెరను బయటకు పంపడానికి దోహదపడతాయన్న మాట. రోజుకు ఆరు గంటలుకన్నా ఎక్కువగా కూర్చొంటే వ్యాధిగ్రస్తులం కాక తప్పదు. కదలకుండా కూర్చుంటే కొవ్వును కరిగించే ఎంజైమ్‌ల ఉత్పత్తి 90 శాతం వరకు తగ్గిపోతుంది. రెండు గంటలు కన్నా ఎక్కువ కూర్చుంటే గుండె సజావుగా పనిచేయడానికి ఉపయోగపడే మంచి కొవ్వుల స్థాయి 20 శాతం తగ్గుతుందని ఇటీవల జరిపిన ఒక వైద్య పరిశోధనలో వెల్లడి అయింది. తక్కువ శారీరక శ్రమ, ఎక్కువ కేలరీల శక్తిగల ఆహారంను తీసుకోవడం కూడ ఊబకాయం సమస్య ఉత్పన్నం అవ్వడానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇటీవల కెనడాకు చెందిన సైమన్ ఫ్రీజర్ విశ్వవిద్యాలయంకు చెందిన ప్రొఫెసర్ స్కాట్‌వీర్ ఊబకాయం, మధుమేహ వ్యాధుల పెరుగుదలపై 17 దేశాలకు చెందిన 1.50 లక్షల మందిపై సర్వే నిర్వహించారు. అమెరికా, కెనడా, స్వీడన్, చైనా, ఇరాన్, ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ తదితర దేశాలలో ఆయన నిర్వహించిన సర్వేలో అనేక ఆసక్తికరమైన అంశాలు వెల్లడి అయ్యాయి. శారీరక శ్రమ తగ్గిపోవడం, ఎక్కువగా కూర్చోవడంవలన శరీరంలో ఉన్న కొవ్వు, చక్కెరలు ఖర్చు అయ్యే అవకాశం లేకుండాపోతున్నది. గృహిణులలో ఊబకాయం సమస్య అధికంగా కనిపిస్తున్నది. దీనిని స్వయం కృతాపరాధం అనడమే సమంజసం. ఆధునిక గృహోపకరణాలు అందుబాటులోకి వచ్చిన తరువాత (మిక్సీలు, గ్రైండర్లు, కుక్కర్లు, మైక్రోవోవెన్లు) వంట చేసే సమయంలో కూడ గృహిణులు ఎక్కువ అవసరం లేకుండాపోతున్నది. రోలు, రోకలి, తిరగలి వంటి గృహోపకరణాల గురించి కనీసం కూడ తెలియని గృహిణులు నేడు ఎందరో ఉన్నారు. మహిళలు ఇకనైనా శారీరక శ్రమ (వ్యాయామం లేదా ఇంట్లో పనులు చేసుకోవడానికి) కనీస సమయం కేటాయించకపోతే వారు ఊబకాయంతోపాటు, పలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనక తప్పదు.
అదే విధంగా అన్ని పాఠశాలల్లో తప్పనిసరిగా ఏ ఫాస్ట్ఫుడ్ తింటే ఎన్ని కేలరీల శక్తి శరీరానికి లభిస్తుంది. అది కొవ్వుగా మారకుండా ఉండాలంటే ఎంత శారీరక శ్రమ చేయాలి అనే వివరాలు కలిగిన డిస్‌ప్లే బోర్డ్‌లను ఏర్పాటుచేయాలి. దీనివలన పిల్లల్లో చైతన్యం కలిగి వారిలో ఊబకాయం రాకుండా నిరోధించడానికి కొంతవరకు దోహదపడుతుంది. పిల్లల్ని కేవలం చదువుకొనే యంత్రాలుగా మాత్రమే చూడకుండా వారిని కనీసం కొద్దిసేపు అయిన ఆటలు అదే విధంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనివలన పిల్లల్లో ఊబకాయాన్ని చాలావరకు నిరోధించవచ్చు. ఊబకాయం సమస్య మన అంతట మనం కోరి తెచ్చుకొంటున్నదే తప్ప, మరొకటి కాదన్న విషయం అందరూ గుర్తించాల్సి అవసరం ఎంతైనా ఉంది.

- పి.హైమావతి