సబ్ ఫీచర్

అతి..అనర్థదాయకమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అతి సర్వత్ర వర్జయేత్’- వందల సంవత్సరాల కిందటే మన పూర్వీకులు మనకు చెప్పిన గొప్ప జీవిత సత్యం. ఆహారమైనా, ఆరాటమైనా, ఆవేశమైనా చివరికి ఆరాధనైనా ‘అతి’ ఎల్లవేళలా అనర్థదాయకమే. మనిషితో మనిషి ఏర్పరచుకునే అనుబంధాలు, పెంచుకునే అభిమానాలు మనిషి బంగారు జీవితానికి బాటలు వేసేలా ఉండాలి. ప్రేమించేవారు దొరకడం అనేది అదృష్టం అనేది నానుడి. కాని హద్దులు దాటిన ప్రేమ ఎన్నో అనర్థాలకు, అపార్థాలకు కారణవౌతున్నదనే సత్యం మానసిక శాస్త్రం అభివృద్ధి చెందుతున్న క్రమంలో తెలిసొస్తున్న ఖరీదైన నిజం.
కుటుంబానికి పునాదిరాళ్ళు
భార్యాభర్తలమధ్య ఆప్యాయతా అనురాగాలు కుటుంబానికి పునాదిరాళ్ళవంటివి. ప్రేమించే భర్త లభించడం భార్యకు, ఆరాధించే భార్య దొరకడం భర్తకు అదృష్టమనే చెప్పాలి. దురదృష్టవశాత్తు ఇవాళ విడాకులు కోరుతూ, గృహహింస కేసులు పెడుతూ, పంచాయితీ పెద్దల చుట్టూ తిరుగుతూ విడివిడిగా గడుపుతున్న జంటలను పరిశీలిస్తే సుమారు పాతిక శాతం కేసుల్లో భార్యను అతిగా ప్రేమించే భర్తలు, భర్తను అతిగా ఆరాధించే భార్యలే ముందుగా ఆరోపణలు చేస్తూ న్యాయస్థానాలను, మధ్యవర్తులను ఆశ్రయిస్తున్నారు. త్రన ప్రేమ మైకంలో భర్త వ్యక్తిగత స్వేచ్ఛను, ఇతర అనుబంధాలను హరించివేస్తుంది. చివరికి తాను ఎంతగానో ప్రేమించిన భర్త వ్యక్తిత్వాన్ని కూడా కించపరచే స్థాయికి పడిపోతుంది. భార్యలను అతిగా ప్రేమించే భర్తల పరిస్థితి కూడా ఇలాంటిదే. తన ప్రేమ సామ్రాజ్యపు మహారాణి, తన కలల మహారాణి తనకు మాత్రమే సొంతం, తన ఇంటికే పరిమితం అనుకుంటూ తెలియకుండానే ఆమె స్వేచ్ఛను హరించి పంజరంలో చిలకను చేయాలనుకుంటాడు భర్త.
భార్యలను ఒప్పించలేక తల్లిదండ్రులనుండి, ఉమ్మడి కుటుంబాలనుండి విడిపోయి తన ఇంట్లో తానే ఒంటరిగా బతుకుతున్న భర్తలెందరో! భర్తను ఒప్పించలేక, బయటకు రాలేక తన ప్రపంచాన్ని భర్త కుటుంబానికే పరిమితం చేసుకొని నరకం అనుభవిస్తున్న భార్యలెందరో! వీరందరి సమస్య ఒక్కటే- పొసెసివ్‌నెస్. ‘‘నా మొగుడు నాకే సొంతం, నా భార్యకు నేనే ప్రపంచం’’ అనే చట్రం నుండి బయటపడే క్రమంలో జరుగుతున్న సంఘర్షణల ఫలితమే ఆత్మహత్యలు, హత్యలు, విడాకులు, పంచాయితీల రూపంలో మనకు రోజూ సాక్షాత్కరిస్తున్నాయి.
పచ్చని సంసారాల్లో చిచ్చు
మన కుటుంబ వ్యవస్థలో పెరుగుతున్న రెండో పెద్ద సంఘర్షణ పిల్లలకు తల్లిదండ్రులకుమధ్య అంతరం. చాలా సందర్భాలలో ఇటువంటి అంతరాలకు ప్రధాన కారణం మళ్లీ పొసెసివ్‌నెస్ అనే చెప్పాలి. నా పిల్లలు, నా ప్రపంచం, నా ఆలోచన అంటూ గిరిగీసుకుని ఉండటంవలన పిల్లలు తమదైన ప్రపంచంలో స్వేచ్ఛగా ఎదగలేపోతున్నారు. పిల్లలే ప్రపంచంగా బతికే తల్లిదండ్రులు భయంతో, అపోహతో లేనిపోని కట్టుబాట్లతో తమ స్వేచ్ఛను హరించాలని చూడటం ఎల్లలు లేని ప్రపంచంలో విహరించాలనుకునే నాటి తరానికి రుచించడంలేదు. పిల్లలు పెళ్లిళ్లు చేసుకొని భర్తగా లేదా భార్యగా మారిన తరువాత కూడా మా పిల్లలే మా ప్రపంచం, మేం గీసిన గిరి దాటకూడదు, మా ప్రపంచంలో మరెవరికీ చోటులేదనుకునే తల్లిదండ్రులు నేడు అనేక కుటుంబాల్లో జరుగుతున్న సంఘర్షణలకు కారణవౌతున్నారు. పిల్లల కొత్త బంగారు లోకానికి అడ్డంగా ఉన్న తల్లిదండ్రులెందరో.
తమ ప్రేమ అవతలి వ్యక్తి స్వేచ్ఛను ఆటంకపరచేది కాకుండా ఉన్నంతవరకే తమ బంధం వెలుగుతూ ఉంటుందని భార్యాభర్తలు గుర్తించనంతకాలం, పిల్లలే తమ ప్రపంచం కాదు, పిల్లల ప్రపంచంలో తమతోపాటు ఇంకా ఎన్నో అనుభూతులు, అనుబంధాలు ఉంటాయి అని తల్లిదండ్రులు గుర్తించనంతకాలం ఉమ్మడి కుటుంబాలు కూలుతూనే వుంటాయి, పచ్చని సంసారాల్లో చిచ్చు రగులుతూనే వుంటుంది. ప్రేమించాలని కోరుకున్నంతవరకు ఫరవాలేదు కాని నన్ను మాత్రమే ప్రేమించాలి, మిగతా బంధాలన్నీ వదులుకోవాలి అనుకోవడంతోనే అనర్థమంతా. అనుబంధాల మధ్య సమతుల్యం పాటించే నేర్పరితనమే సమస్యకు పరిష్కారం.

-చందుపట్ల రమణకుమార్‌రెడ్డి