సబ్ ఫీచర్

గుర్తుకొస్తున్నారుూ..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉరుకులు పరుగుల ఈ హడావుడీ పట్టణ జీవితం నుంచి... సెల్‌ఫోన్ మోతల, టీవీ అరుపుల ఈ ఆధునిక గాడ్జెస్‌ల యాంత్రిక జీవితం నుంచి ఎలాగైనా కాస్తంత తీరిక చేసుకుని వాలుకుర్చీలో కళ్లు మూసుకుని కూర్చుని మూడు, నాలుగు దశాబ్దాల వెనక్కి వెళితే... ఎనె్నన్ని సహజ సుందర దృశ్యాలు కళ్లముందు బ్లాక్ అండ్ వైట్‌లో బొమ్మ కడతాయి..! ‘గుర్తుకొస్తున్నారుూ..!’ అంటూ మనసు కూనిరాగం తీస్తూ... ఆ తీపి జ్ఞాపకాలతో ప్రస్తుతాన్ని మరచి తాదాత్మ్యం చెందగలిగితే ఎంత హాయిగా వుంటుంది..! పుట్టి పెరిగిన ఇల్లు, ఊరు, ఆటపాటలతో గడిచిన అందమైన ఆ బాల్యం, ఆనాటి ఆ గత వైభవం అప్పుడప్పుడూ గుర్తుకొచ్చి మనసును గిలిగింతలు పెట్టని మనిషి అసలు ఏ ఒక్కరైనా వుంటారా...?

ఆరుబయట మంచం వేసుకుని.. ముసుగు కప్పుకుని పడుకుంటే ఆ దుప్పటిలో నుంచే చెవులకు అందంగా వినిపించే పక్షుల కిలకిలారావాలు, వంటింట్లో నుంచి చల్లకవ్వం చేసే నాట్య రవళులు, వాకిలి ఊడ్పుల పొలికట్టె శబ్దాలు, అరకలకు సిద్ధమవుతున్న ఎడ్ల మెళ్లోని చిరుగంటల రవళులు, వేపచెట్టు ఆకుల చల్లగాలి వీవెనలు..’ ఇలా చెబుతూపోతే ఒకటా.. రెండా! ప్రతి ప్రభాతమూ సుప్రభాతమే! ‘బడికి వెళవుతోంది, తొందరగా తయారవ్వు!’ అని అమ్మ అనేదాకా లేగదూడలతో ఆడుకోవటం, కట్టె పుల్లతో సైకిల్ టైరును తిప్పుతూ దానివెంట ఉరుకులు పెట్టడం తప్ప ఆ ధ్యాసే వుండేది కాదు. ఆ తరువాత చకచకా ఉడుకునీళ్లు పోసుకుని.. ఉతికిన బట్టలేసుకుని.. చద్ది అన్నం తిని పలకా, బలపం పట్టుకుని బడికి వెళ్లేవాళ్లం... పిల్లలం అంతా!
ఐదో క్లాసు పాసయ్యేవరకూ నా చదువంతా ఒక్క పలకమీదనే... ఆ వీధి బడిలోనే! పద్యాలు, ఎక్కాలు, వారాలు, నెలల పేర్లు మాత్రం నోటితో బట్టీ పట్టాల్సిందే! ఎంతో గట్టిగా ఉండేది ఆ బట్టీయం చదువు! అక్షరాలు, అంకెలు దిద్దీ.. దిద్దీ నల్లటి పలక అంతా తెల్లగా అయిపోయేది. అప్పుడు ఇప్పటిలా ఊళ్లో కరెంటు కూడా వుండేది కాదు... అమ్మ వెలిగించిన బుడ్డి దీపాలు, లాంతర్ల దగ్గర కూర్చునే తలలు వంచుకుని చదువుకోవాలి.. ఆ తర్వాత ఎప్పుడో కరెంటు వచ్చింది. అంతేకాదు.. మరికొన్నాళ్లకు మా ఇంట్లో ఓ రేడియో కూడా వచ్చింది. పెద్ద రేకు పెట్టెంత వుండేది అది. దాని చుట్టూ మేము పిల్లలమంతా చేరి బాలానందం వినేవాళ్లం.. మా నాన్న పొలం పనులు, కార్మికుల కార్యక్రమం వంటివి వినేవాడు. మా అమ్మ నాటికలు, ఇల్లాలి ముచ్చట్లు భక్తి పాటలు వినేది. మనుషులు కనపడకుండా ఎక్కడినుంచో వాళ్లు మాట్లాడుతున్న మాటలు వినబడుతుంటే భలే గమ్మత్తుగా అనిపించేది. ఆరోజుల్లో మాకు ఫొటోలు దిగటమంటే భలే సరదాగా వుండేది. పక్కనున్న టౌనుకెళ్లి స్టూడియోలో ఫొటో దిగితే.. ఆ ఫొటో స్టూడియో అబ్బాయి స్టాండుకు కెమెరా అమర్చి నల్లటి ముసుగు కప్పి.. అందులో అతను తల దూర్చి ఫొటోలు తీసేవాడు. అప్పుడు అన్నీ నలుపు తెలుపు ఫొటోలే.. సినిమాలూ బ్లాక్ అండ్ వైట్‌వే..! రక్తం కూడా నల్లగానే కనపడుతుంటే ‘ఇదేంటీ!’ అనిపించేది. అప్పుడన్నీ ఎన్టీరామారావ్, నాగేశ్వర్రావ్ సినిమాలే! అంజలి, సావిత్రి నటించిన సినిమాలు చూడటానికి మా ఊరి వాళ్లంతా ఎడ్ల బండ్లు కట్టుకుని వచ్చేవాళ్లు. అప్పుడు టిక్కట్ ఎంతనీ! నేల టికెట్ పావలా.. బెంచీ టిక్కెట్ అర్థరూపాయి.. కుర్చీ అయితే రూపాయి! అంతే..! ఆ కాలంలో అదొక్కటే కాదు.. అన్ని వస్తువుల ధరలూ అంతే.. చాలా తక్కువ. రూపాయిన్నరకి కిలో బియ్యం.. అప్పుడు కిలో లెక్కలు లేవనుకుంటా! శేరు, అర్ధశేరు, మానిక, తవ్వ ఇలా వుండేవి తూకాలు, కొలతలు. పాడి పంట పుష్కలంగా వుండడంతో అసలు ఏదీ కొట్టుకెళ్లి కొనుకోవాల్సిన అవసరమే వుండేది కాదు. కూరగాయలు సైతం మా దొడ్లోనే పండేవి.. పెరట్లో బోలెడు తోటకూర, బెండకాయలు, దొండ కాయలు కాస్తుంటే మా అమ్మ ఊరివాళ్లందరికీ కూడా పంచి పెట్టేది. తెప్పాల పట్టుకుని ఇంటి ముందుకొచ్చిన వాళ్లందరికీ లేదుకుండా చల్ల పోసేది. మా అమ్మ పిల్లలమైన మా కోసమని ఇంట్లో జంతికలు, కజ్జికాయలు చేసినా.. మేము ‘కానీ’నో ‘అర్ధణా’నో పట్టుకుని మా ఇంటికి నాలుగు అడుగుల దూరంలో వున్న నాగభూషణం డబ్బా రేకు కొట్టుకెళ్లి పప్పుచెక్క, లౌజు బిళ్లలు, బొంగుండలు కొనుక్కుని తినేవాళ్లం. ఎంత బాగుండేదో ఆ రుచి! గుర్తుకొస్తే ఇప్పటికీ నోట్లో నీళ్లూరుతాయి.
ఇప్పుడు మన చుట్టూ అన్ని సౌకర్యాలు, అన్ని ఆధునిక పరికరాలు వున్నా ప్రతి ఒక్కరిలోనూ ఏదో అశాంతి, మరేదో కోల్పోయిన భావన! పెరుగుట విరుగుట కొరకే అన్నట్లు మనిషికి ప్రాధాన్యత తగ్గిపోయి యంత్రాలకు, మరమనుషులకు ప్రాధాన్యత అవసరాన్ని మించి పెరిగిపోవడంవల్ల ఇలా జరుగుతోందా? మేధస్సుకు ప్రాధాన్యం పెరిగి మనసు విలువ తరిగి పోవడం.. మనుషులు మరబొమ్మల్లా.. రోబోల్లా మారిపోవటంవల్లనా? ఏమో.. ఇది అందరూ ఆలోచించాల్సిన విషయం.

మా ఇల్లు పెంకుటిల్లే అయినా ఆ ఇల్లంటే నాకు ప్రాణం! ఆవు పేడతో అలికి ముగ్గులేసిన వంటింట్లో పిల్లలం అందరం వరసగా కూర్చుని కంచాలు ముందు పెట్టుకుని అన్నం తినేవాళ్లం. వసారాలో దూలానికి ఉయ్యాల కట్టుకుని ఊగేవాళ్లం. ధాన్యం గదులకు ఎప్పుడూ తాళాలు వేసే వుండేవి. నాన్నగారి గదిలో పెద్ద పట్టె మంచం వుండేది. ఇంటిముందు ఎడ్ల కొట్టం వుండేది. పెద్ద వేపచెట్లు, పున్నాగ చెట్టు వుండేవి. ఆ ఇల్లు గుర్తొస్తే ఇప్పటికీ నాకు స్వర్గంలా అనిపిస్తుంది. ఇప్పటిలా ఫోన్లు, స్మార్ట్ఫోన్‌లు, కలర్‌టీవీలు, కంప్యూటర్లు లేకపోయినా ఆ రోజులు బాగానే గడిచాయి. మనిషి మనిషికీ మధ్య మానవ సంబంధాలు బలంగా వుండేవి. కుటుంబసభ్యుల మధ్య ప్రేమానురాగాలు, ఆత్మీయతలు వుండేవి. ‘ఒకరికొకరు’ అన్నట్లుగా తోడుగా ఉమ్మడి కుటుంబంలో కలిసిమెలిసి నిండుగా వుండేవారు కనుక ఎవరికీ ఎలాంటి ఒత్తిడులు, అభద్రతా భావాలు, ఒంటరితనాలు వుండేవి కావు.

-శ్రీమతి కొఠారి వాణీచలపతిరావు