సబ్ ఫీచర్

బాల్యం.. బృందావనమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి మనిషి జీవితానికి బాల్యం తొలిపొద్దులాంటిదే. ఆ పసి మనసులో పడే ముద్రలే భవితకు బాటలు వేస్తాయి. నిర్మలమైన ఆ బాల్యం అద్భుత దశ. మంచి పౌరులుగా ఎదగాలంటే మొక్కదశలోనే వారిని కుదురుగా వంచాలి. కర్తవ్యంతో పెంచాలి. విలువలు పుణికిపుచ్చుకునే బాల్య దశలోనే బీజాలు పడాలి. ఈ విషయంలో తల్లిదండ్రులు ప్రధాన భూమిక పోషించాల్సిన అవసరం ఉంది. పిల్లల పెంపకం అనేది నేడు తల్లిదండ్రులకు పెను సవాల్‌గా మారింది. ఇందుకోసం పిల్లలతో పాటు తల్లిదండ్రులూ శిక్షణాతరగతులకు వెళుతున్నారు. ఎవరు ఏ శిక్షణాతరగుతలకు వెళ్లినా అక్కడ చెప్పిన విషయాలు అన్నీ తెలిసినవే. ఇవి మన అమ్మమ్మలు, తాతయ్యలకు ఏవరు నేర్పించారు అని ప్రశ్నించుకుంటే తల్లిదండ్రులు ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు.

ఇటీవల పిల్లల పెంపకంపై ఒక సర్వే నిర్వహించారు. ఆ సర్వేలో తేలిందేమిటంటే తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువ కాలం గడపటం లేదు. తల్లి రోజుకు సగటున 11 నిమిషాలు, తండ్రి 8 నిమిషాలు మాత్రమే గడుపుతున్నట్లు వెల్లడైంది. దీంతో ఆధునిక మేధావులు పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు ఆచరించాల్సిన నాలుగు అంశాలను సూచించారు. అవి ఏమిటంటే..
* పిల్లల కోసం కొంత సమయాన్ని కేటాయించండి.
* పిల్లలతో మనసు విప్పి మాట్లాడండి.
* ఆత్మీయాలింగనం, ప్రేమాదరణ చూపించటం.
* పిల్లల పట్ల విశ్వాసం కలిగి ఉండటం.
ఎంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఎంత సమయాన్ని కేటాయిస్తున్నారో ఎవరికి వారు ఆత్మవిమర్శ చేసుకోవాలి. స్మార్ట్ఫోన్‌లో తండ్రి గేమ్‌లు ఆడటం, తల్లి ఫోన్‌లో గంటల తరబడి మాట్లాడటం చేస్తుంటారు. స్మార్ట్ఫోన్‌ను పిల్లల్లాగా కాకుండా.. పిల్లల్ని స్మార్ట్ఫోన్‌లా చూసుకుంటే మంచిది.
కలామ్ చెప్పిన పాఠాలు ఇవే..
అది ఓ పాఠశాలలో జరుగుతున్న విద్యార్థుల సమావేశం. ఆ సమావేశానికి ముఖ్య అతిథిగా అబ్దుల్‌కలామ్ హాజరయ్యారు. ఆయనకు పిల్లలంటే ప్రాణం కదా! ఎక్కడకు వెళ్లినా వారిలో స్ఫూర్తినింపుతుంటారు. ఈ సందర్భంగా ఆయన దేశంలో పెరిగిపోతున్న అవినీతిని అరికట్టాలంటే ఏమి చేయాలి అని అడగారు. పిల్లలు ఉత్సాహంగా ఎన్నో విలువైన సూచనలు, పరిష్కారమార్గాలను చెప్పారు. మీరిచ్చిన సూచనలు మంచివే కాని వాటిని ఆచరణలో పెట్టడం అనేది మీ ఇంటి నుంచే ఆరంభించండి అని అంటూ ఉదాహరణకు.. మీ తండ్రి లంచం డబ్బుతో ఖరీదైన సెల్‌ఫోన్ కొనిస్తే.. ‘‘ఆ అవినీతి సొమ్ముతో కొనిచ్చిన ఈ సెల్‌ఫోన్‌ను వాడబోమని’’ చెప్పండని ఉద్బోదించారు. అక్రమార్జనతో విలాసవంతమైన జీవితాన్ని గడపడం కంటే సాధారణ జీవితమే మేలు అని నిర్భయంగా కన్నవారికే నైతికబలాన్ని మీరు అందిస్తారో.. ఆనాడే అవినీతి నిర్మూలన జరుగుతుందని సూచించారు. కలామ్ చెప్పిన సూచనను పిల్లలు ధైర్యంగా.. నిర్భయంగా అమలుచేసిననాడు నిజంగానే నిర్మాణాత్మకమైన భావిభారతం మన ముందు ఆవిషృతమవుతోంది.
ఆత్మగౌరవానికి ప్రతీకలుగా..
ఇందిరను కదలించిన ఓ చిన్నారి
ఇందిరాగాంధీనే ఓ చిన్నారి బాలిక కదిలించింది. ఆ అమ్మాయి గురించి ఇందిరాగాంధీ స్వయంగా తన డైరీలో రాసుకున్నారు.ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఢిల్లీలో తన కాన్వాయ్‌తో కారులో వెళుతున్నారు. దూరంగా ఓ తొమ్మిదేళ్ల బాలిక మండుటెండలో దూది బొమ్మలను అమ్ముకుంటోంది. వెంటనే ఇందిర తన కారును ఆపించి ఆ బాలికను పలుకరించటానికి వెళ్లారు. ఆ చిన్నారిని వివరాలు అడిగారు. తాను మురికివాడలో ఉంటానని, తండ్రి జబ్బుతో మంచాన పడటంతో తల్లి, అక్క ఇంట్లో తయారుచేసిన ఈ దూది బొమ్మలను అమ్ముతానని. ఇదే తమ జీవనాధారం అని చెప్పింది. ఆ బాలిక మాటలకు ఇందిర నిట్టూర్చి వెంటనే తన వద్ద ఉన్న ఐదువందల రూపాయల నోటును ఇవ్వబోయారు. వెంటనే ఆ అమ్మాయి చివాలున తలపైకెత్తి..‘‘నేను బిచ్చగత్తెను కాదు’’ అని విసురుగా సమాధానం ఇచ్చింది. ఆ చిన్ని గొంతులో కనిపించిన ఆగ్రహానికి ఆ ఉక్కుమహిళ సైతం ఖంగుతిన్నది. మరైతే ఈ డబ్బులు తీసుకుని ఆ బొమ్మలన్నీ ఇస్తావా అని ఇందిర అడిగారు. ఇన్ని బొమ్మలు మీరేమి చేసుకుంటారు. నాపై సానుభూతితో అయితే కొనాల్సిన అవసరం లేదు అని చెప్పింది. ఆ పాప ఇంత సులువుగా బొమ్మలు అమ్మదని గ్రహించి.. సరే నా వద్దకు ఎంతోమంది పిల్లలు వస్తుంటారు. వారికి ఇస్తాను అని చెప్పింది. అయితే తీసుకోండి అని ఐదువందలు కాకుండా వాటి ఖరీదు ఎంతో లెక్కకట్టి వంద రూపాయలకు అమ్మింది. డబ్బులు ఇస్తుంది కదా అని ఆ పాప ఆయాచితంగా ఐదువందలు తీసుకోలేదు. తొమ్మిదేళ్ల ప్రాయంలోనే ఆ చిన్నారి ప్రదర్శించిన ఆత్మగౌరవానికి అచ్చెరవొందిన ఇందిరాగాంధీ ఈ ఉదంతాన్ని తన డైరీలో రాసుకున్నారు. ఆయాచితంగా వచ్చిన దాన్ని స్వీకరించకుండా..ఒకరి దయాదాక్షిణ్యాలపై బతికే అలవాటు లేకుండా పిల్లలను ముఖ్యంగా అమ్మాయిలను తీర్చిదిద్దితే.. వారు ఎటువంటి బలహీనతలనైనా అధిగమించగలరు. ఇందిరాగాంధీ ఎంతోమంది ప్రముఖుల ముందు ఈ చిన్నారి గురించి చెబుతూ.. మా భారతీయులు ఎవ్వరి ముందు చేయిచాపరు అనేవారు.
పిల్లలను ఉన్నతమైనవారిగా తీర్చిదిద్దేక్రమంలో ఈ లోకాన్ని నిందిస్తే ప్రయోజనం లేదు. తల్లిదండ్రులు ఆదర్శవంతమైన జీవనవిధానమే వారికి పునాదిరాయి అవుతుందని గ్రహించిననాడు నిజంగానే బాల్యం బృందావనమే అవుతుంది.

-టి.ఆశాలత