సబ్ ఫీచర్

నిజంగా మన నిజాం మంచోడేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాదు జిల్లాలో కందికుర్తి అనే ఒక గ్రామం ఉంది. ఇక్కడ ఒక శివక్షేత్రం, నదీ సంగమం ఉంది. నరహరి శాస్ర్తీ అనే పూజారి, అసఫ్‌జాహీ ప్రభువులు పెట్టే బాధలు తట్టుకోలేక నిజాం రాష్ట్రం వదిలిపెట్టి మహారాష్ట్ర వెళ్లాడు. అక్కడ భోంస్లేల పరిపాలన ఉంది. నరహరి శాస్ర్తీగారి ఇంటిపేరు ఈడిగె వారు. అదే హెడ్గేవార్‌గా ఉచ్ఛారణలో మారింది. ఈ వంశంలో జన్మించిన కేశవరావు బలిరాం హెడ్గేవార్ 1925లో విజయదశమినాడు నాగ్‌పూర్‌లోని మోహితే ప్రాంతంలో ఐదారుగురు వ్యక్తులతో ఒక సంస్థ స్థాపించాడు. దానిపేరు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం. స్వతంత్ర స్వచ్ఛంద సాంస్కృతిక సేవాసంస్థ ఇది. అంటే ఈ సంస్థ ఆవిర్భావానికి పరోక్షంగా అసఫ్‌జాహీల దుర్మార్గపు పాలన ఒక కారణం.
1935 ప్రాంతంలో వరంగల్‌లో మా నాయనగారు మల్లికార్జున రావు టీచర్‌గా పనిచేస్తుండేవారు. కాశిం రజ్వీ నాయకత్వంలోని రజాకార్ల దుర్మార్గాలవల్ల కట్టుబట్టలతో వరంగల్‌ను వదిలివెళ్లిన వందలాది కుటుంబాలలో మా బంధువుల కుటుంబాలు చాలా ఉన్నాయి. పులిపాక కేదారలింగం గిర్మాజీపేట పిన్నావారి బజారు - త్రోవగుంట వెంకట సుబ్రహ్మణ్యం (గడ్డం సారు) శ్రీకృష్ణ కాలని, వరంగల్ గాంధీ ఎం.సిద్ధరాజలింగం (తర్వాత వారు బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో కార్మిక మంత్రిగా 1952లో పనిచేశారు). ఇలా వేలాది పేర్లు చెప్పవచ్చు. నిజాం రాజు ఉస్మాన్ అలీఖాన్ మంచివాడయితే ఇన్ని వేల కుటుంబాలు తెలంగాణ వదిలిపెట్టిపోయి ఇటు విజయవాడలోను అటు నాందేడ్‌లోను ఎందుకు తలదాచుకున్నట్లు??
‘‘ఓ నిజాము పిశాచమా. నిన్ను బోలు రాజు వేరొక్కడు ఇల కానరాడు’’ ‘‘బడాచోరు దగాకోరు రజాకారు పోషకునివి’’ ఇవి మహాకవి దాశరథి కృష్ణమాచార్య 1948లో వ్రాసిన కవితలు. ఆయనను నిజామాబాదు జైలులో బంధిస్తే బొగ్గుముక్కతో జైలు గోడలపై కవితలు వ్రాసి మననం చేసుకొన్నాడు. ఆ జైలులో మిత్రులు ఇరివెంటి కృష్ణమూర్తి వంటి వారు కూడా ఉన్నారు. నాడు స్వామి రామానంద తీర్థ నాయకత్వంలో ఉద్యమం చేశారు. రామానంద తీర్థ సమాధి హైదరాబాద్ బేగంపేటలోని బ్రాహ్మణవాడీలో ఉంది. దాశరథి రంగాచార్య చిల్లర దేవుళ్లు మోదుగపూలు జనపదం వంటి నవలలు వ్రాశాడు. ఆరుద్ర త్వమేవాహం, ఆవంత్స సోమసుందర్ వజ్రాయుధం వానమామలై వరదాచార్యులవారి మ.ఘ. వలయము పద్యకావ్యం నిజాం పాలనలో జరిగిన దుర్మార్గాలకు అద్దం పడుతున్న గ్రంథాలు. ఇంకా వందేమాతరం వీరభద్రరావు, రామచంద్రరావు, వంటివారి రచనలు చదవండి. తేదీలతో సంఘటనలతో సాక్ష్యాధారాలు లభిస్తాయి. షోయబుల్లాఖాన్ అనే జర్నలిస్టు నిజాంకు వ్యతిరేకంగా వ్యాసం వ్రాసినందుకు ఆయనను హైదరాబాద్ బరకత్‌పురా ప్రాంతంలో రజాకార్లు హత్య చేశారు. క్లారియన్ అనే పత్రికలో ఇండియన్ యూనియన్‌ను తిడుతూ వ్యాసాలు వస్తుండేవి. ఇప్పటివలె అప్పుడు బహిరంగంగా గణేశ ఉత్సవాలు జరుపుకొనే యోగ్యత లేదు. తెలంగాణ పద్యనాటక పితామహుడు తిరుమల శేషాచార్యులు నాతో ఇలా చెప్పారు...
‘‘ఇబ్రహీంపట్నంలో మేము రోషనారా నాటకం ఆడుతుంటే నిషేధం విధించారు’’.
ఇరువెంటి కృష్ణమూర్తి నాతో ఇలా చెప్పారు. ‘‘ప్రంచంలోని అత్యధిక ధనవంతులలో నిజాం ఒకడు. ఆయన రోజూ తన వజ్రాలు బంగారం చేతితో తాకి చూసి మురిసిపోతూ ఉండేవాడు. ఇతడు పిసినిగొట్టు-పిల్లికి బిచ్చం పెట్టేవాడు కాదు’’
ప్రశ్న : మరి ఉస్మానియా యూనివర్శిటీ, నిలోఫర్ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్ వంటి పెద్దపెద్ద కట్టడాల నిర్మాణం ఎలా జరిగింది?
జవాబు : అవన్నీ తమ రాజకుటుంబాల కోసం ఆశ్రీతుల కోసం నిర్మించుకున్నాడు. రాజా కిషన్ ప్రసాద్, కొత్వాల్ వెంకటరామిరెడ్డి వంటి హిందువులు నిజాం రాజు వద్ద పనిచేస్తూ ఉండేవారు. గద్వాల రాజు రాంభూపాల్, లక్ష్మీదేవమ్మ, ఇంకా వనపర్తి, దోమకొండవంటి సంస్థానాధీశులు హిందూ సంస్కృతిని రక్షించడం కోసం కృషి చేశారు.
1940లో సికిందరాబాద్ మోండా మార్కెట్ ప్రాంతంలో దివ్యవాణి అనే పత్రిక ఉండేది. దాని ఎడిటర్ చివుకుల అప్పయ్య శాస్ర్తీ. వీరు హిందూ ధర్మాన్ని కాపాడటం కోసం తీవ్ర కృషి చేశారు. వీరికి వంగపల్లి నీలకంఠం, (ప్రొ.వంగపల్లి విశ్వనాథంగారి తండ్రి), మా నాయనగారు సహాయకులు. వంగపల్లివారు ఆర్థిక సహాయం అందిస్తే మా నాయనగారు చేదోడువాదోడుగా ఉండేవారు. చేదోడు అంటే వ్యాసాలు వ్రాయడం-వాదోడు అంటే ఉపన్యాసాలు చెప్పడం. 1947 ఆగస్టు 15నాడు భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది. కాని తెలంగాణకు రాలేదు. సరికదా నిజాం రాజ్యాంగాన్ని రద్దు చేసి ఇండియన్ యూనియన్‌లో కలిపివేయడానికి ఉస్మాన్ ఆలీఖాన్ అంగీకరించలేదు. అప్పుడాయన ఒక ఉపాయం ఆలోచించాడు. స్థానిక హిందువులను తరిమివేసి బయటి నుండి పెద్దసంఖ్యలో ఇక్కడికి ముస్లిములను దిగుమతి చేసుకోవడం, పాకిస్తాన్‌తో ప్రత్యక్ష సంబంధం పెట్టుకోవడం, ఇండియన్ యూనియన్‌తో యుద్ధం చేయడం. అప్పుడు పెద్దఎత్తున లూటీలు మానభంగాలు జరిగాయి. తెలంగాణ ఆడబడుచులను బట్టలు విప్పి బతుకమ్మలాడించారు.
‘‘నక్కలు తిరిగే కోటలో నాలుగు స్తంభాల కోటలో
రాకాసి రాజొకడుండెరా-వాడి గుండెరా! బండరా!
వాడిపేరు దగాకోరురా - వారి వజీరు పుండాకోరురా
వాడి రాజ్యానికది సరంగురా’’ (ఆరుద్ర)
మ.ఘ.వలయము అనే గ్రంధములో తెలంగాణ మహాకవి వానమామలై వరదాచార్యులు ఇలా రజాకార్ల దౌర్జన్యములను వర్ణించారు
‘‘దివ్యస్థలంబుల దేవాలయంబుల
మధుమాంస దుర్గంధమయమొనర్చి
విగ్రహంబులనెల్ల విధ్వంసనము చేసి
మూత్రాభిషేకాలముంచియెత్తి
భూషణాదుల దొంగపోటుగా హరియించి
వాహనాలెక్కి సవారి చేసి
చేతికందినవాడి సిగలెల్ల గొరిగించి
ఉపవీతముల మొలకుచ్చుబోసి
యర్చక స్ర్తిల గర్భాలయంబులబట్టి
చెప్పరానట్టి విధమున చెరిచి చెరిచి
కరుకుగుండెలు రూపులై తిరుగుమొరకు
రక్కసుల రాజ్యమైపోయె
నక్కటకట’’
‘‘అయ్యవార్లనదల్చి రొయ్యలు తినిపించి
నామవిభూతులు నాకివైచి
నిష్ఠాగరిష్టులనిల్పి సున్తీల్జేసి
కుచ్చుటోపీలు’’ పెట్టినారు
‘కులకాంతలను బట్టి బలవత్ రతులొనర్చి
గొల్లుమనంగ నిఖాలుగట్టి’’నారు
‘‘ఎంత రాక్షసత్వమెంత పైశాచిక
మెంతమాట విరోధమెంత హింస’’
కవి చెప్పిన ఈ వాక్యాలల్లో అతిశయోక్తి లేదు
‘‘ఆగిపొమ్మని జగత్తంత నగారాలు కొడుతున్నది- దిగిపోవోయో -తెగిపోవోయే’ అంటూ దాశరధి నిజామును ఆయన మద్దత్తుదారులను తీవ్రస్థాయిలో విమర్శించాడు. ‘నల్లగొండలో నాజీశక్తుల నగ్ననృత్యమింకెన్నాళ్లు?’’ అని కాళోజీ ప్రశ్నించాడు. రెంటాల సర్పయాగం గ్రంథం కూడా నిజాం దుర్మార్గాలను ఎత్తిచూపింది.
‘‘చిరిగిన బట్టలు తొడిగే చిత్రపు ఫకీరువయ్యా’ అని వానమామలై, నిజామును నిందించాడు.
‘‘బంద్‌నాఖూన్ హువా సునే్క
నిదాయ్ తక్బీర్ జల్‌జలా అహిహువా
రిస్తా మే జున్నార్పేచి’’
ఇది స్వయముగా నిజాం ప్రభువు ఉస్మాన్ ఆలీఖాన్ రచించిన కవి (రహఖరే దక్కన్‌లో). దీని అర్థం ఏమంటే ‘‘కల్మాలోని ప్రథమ సూత్రము పఠింపగానే హిందువుల శంఖధ్వానాలు ఆగిపోయాయి. వారి యజ్ఞోపవీతాలు తెగిపోయాయి’’ ఇది చదివాక కూడా నిజాం సచ్చీలుడు అని అనగలమా?
తెలంగాణ ఉద్యమంలో కమ్యూనిస్టులు కీలకపాత్ర పోషించారు. భూస్వామ్యశక్తుల నుండి దొరలు దేశముఖ్‌లు సంస్థానాధీశులు నుండి విముక్తం చేయాలని వారు సాయుధ పోరాటం మొదలుపెట్టారు. ఆర్యసమాజం హిందూ మహాసభ వంటి సంస్థలు దీనిని హిందూ-ముస్లిం కోణం నుంచి అధ్యయనం చేశాయి. ఇంకా సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ వంటివారు ‘జాతీయ సమైక్యత’ దృష్టితో చూశారు. 10 నవంబర్ 20017 నాడు హైదరాబాద్ బిజెపి నాయకుడు డా.లక్ష్మణ్ మాట్లాడుతూ తెలంగాణ చరిత్రను రాజకీయ లబ్దికోసం వక్రీకరించి నేడు తిరిగి రాయాలని ప్రయత్నిస్తే తీవ్ర పరిణాలుంటాయని హెచ్చరించారు.
వందేమాతరం వీరభద్రరావు తన ఆంగ్ల గ్రంధం పోలీస్ యాక్షన్ ఎగనెస్ట్ హైదరాబాద్ అనే గ్రంథం, 12వ పుటలో ఇలా వ్రాశారు.
‘‘నూటికి ఎనిమిది మంది వాడుక భాష ఉర్దూను రాజభాషగా ప్రవేశపెట్టారు. దేశభాషలు నశింపచేశారు. నవాబు దృష్టిలో హిందువులు అంటే బానిసలు - నవాబులకు నీళ్లుతోడే సేవకులు. అంతేకాదు హిందూ ధార్మిక సంస్థలను నశింపజేస్తూ విదేశీ ముస్లిం సంస్థలకు భూరి విరాళాలు ఇవ్వసాగారు’’
వందేమాతరం ఉద్యమంలో పాల్గొని లాఠీదెబ్బలు తిన్న కారణంగా వీరభద్రరావు, రామచంద్రరావుగార్ల ఇంటిపేరు వందేమాతరంగా మారింది. ఇప్పుడు చెప్పండి నిజంగా నిజాము మంచివాడేనా??

-ప్రొ.ముదిగొండ శివప్రసాద్