సబ్ ఫీచర్

మార్క్స్ ‘తర్కం’ తప్పని చాటిన థాయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుదీర్ఘకాలం జనరంజకంగా పాలన సాగించిన థాయ్‌లాండ్ రాజు భూమిబోల్ అతుల్యదేజ్ గత సంవత్సరం మరణించారు. సంవత్సరకాలం పాటు శోక దినాలు పాటించిన అనంతరం ఇటీవల ఆ దేశ రాజధాని బ్యాంకాక్‌లో కర్మకాండలు పూర్తి చేశారు. అంతిమ సంస్కారాలకు లక్షలాది మంది ప్రజలు తలివచ్చారు. చివరిసారి తమ రాజును చూసేందుకు, వీడ్కోలు పలికేందుకు తరలివచ్చారు. విషణ్ణ వదనాలతో వారంతా ఉద్వేగానికి గురయ్యారు. తమ సొంత మనిషి మరణించిన దానికన్నా ఎక్కువే వారు శోకించారు. 21వ శతాబ్దంలో, ప్రపంచీకరణ అంతటా కమ్మేస్తున్న వేళ రాజు - ప్రజల మధ్య ఈ విధమైన ‘బంధం’ ఉండటం ఊహకు అందనిది. ఇటీవల థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో రాజు అంతిమయాత్ర దృశ్యాలను చూడనివారు దీన్ని నమ్మకపోవచ్చు. కట్టుకథగా కొట్టిపారేయొచ్చు. కాని ఇది నూటికి నూరుపాళ్లు వాస్తవం.
కమ్యూనిస్టు సిద్ధాంతకర్త కారల్‌మార్క్స్ సూత్రాల ప్రకారం ముఖ్యంగా ఆయన బలపరచిన గతితార్కిక భౌతిక సూత్రాల ప్రకారం రాజు-ప్రజల మధ్య వైరుధ్యం ఉండాలి. ఘర్షణ చోటుచేసుకోవాలి. విప్లవాగ్నులు బద్దలవ్వాలి. పరస్పర విరుద్ధ శక్తుల మధ్య ఘర్షణ అనివార్యం. గత చరిత్ర అంతా వర్గపోరాటాల చరిత్ర అన్న సూత్రీకరణ, సిద్ధాంతం.. శాస్ర్తియ పద్ధతిలో చేసిన విశే్లషణగా చెప్పుకున్న గతి తార్కిక చారిత్రక భౌతిక వాదం ఎంత పసలేనిదో థాయ్‌లాండ్ ప్రజలు నిరూపించారు.
భౌతిక సూత్రాలు వేరు, మానవ సంబంధాలు వేరు. ఈ వౌలిక సూత్రాన్ని తుంగలో తొక్కి మార్క్స్ అనుయాయులు గత 150 సంవత్సరాలుగా చర్విత చరణంగా చారిత్రక భౌతికవాద పాఠాలు బోధిస్తూనే ఉన్నారు. అందులో ఏమేరకు సత్యం ఉన్నదో?.. రక్తమాంసాలుగల మనుషులకు ఆ భౌతిక సూత్రం అన్వయమవుతుందా? లేదా? అని పరిశీలించకుండానే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారు. మార్క్స్ ‘తర్కం’ తప్పుల తడకని థాయ్‌లాండ్, భూటాన్ ప్రజలు తాజాగా చాటి చెప్పారు. మార్క్సిజాన్ని విశ్వసించేవారి కళ్లు తెరిపించారు.
పద్దెనిమిదేళ్ల వయసులో అంటే 1946 సంవత్సరంలో భూమిబోల్ అతుల్యదేజ్‌కు థాయ్‌లాండ్ రాజుగా పట్ట్భాషేకం జరిగింది. అప్పటి నుంచి ఆయన తన విద్యాజ్ఞానాన్ని, తెలివితేటలను ప్రజల అభివృద్ధికి, వారి జీవన ప్రమాణాలు పెరిగేందుకు నిరంతరం కృషి చేశారు. దాంతో ఆయన థాయ్‌లాండ్ వైతాళికుడిగా గుర్తింపు పొందారు. తన దేశ సాంస్కృతిక, సంప్రదాయాలను సంపూర్ణంగా పాటిస్తూ అదే సమయంలో అభివృద్ధి చెందిన దేశాల్లోని వసతులను దేశంలో కల్పించి కాలానుగుణంగా ప్రజలు ముందడుగు వేసేలా చూశారు.
గతకొంతకాలంగా థాయ్‌లాండ్‌లో రాజరికంతో కూడిన ప్రజాస్వామ్యం కొనసాగుతోంది. ప్రధాని ఇతర మంత్రులకన్నా ఆ దేశ ప్రజలకు రాజుపట్లనే ‘గురి’ ఎక్కువ. ఈ విషయం అనేకసార్లు ప్రజలు వ్యక్తపరిచారు. ఈ బంధం.. అనుబంధం, ఆప్యాయతలు, ఆరాధనాభావం ఏ గతితార్కిక భౌతిక సూత్రాలకు లొంగేవికావని రుజువు చేశారు. ఊహాలోకాల్లో విహరిస్తు వాస్తవికతను ఏమాత్రం పట్టించుకోకుండా చేసే సూత్రీకరణల, సిద్ధాంతాల చట్రాల్లో మానవ ఉద్వేగాలు, బంధాలు, ఆరాధనా అంశాలు, అభిమానాలు ఇమడవని, ఏరకంగా చూసినా అవన్నీ ఊహాజనితాలేనని స్పష్టంగా తెలుస్తున్నా, దశాబ్దాలుగా అనుభవంలోకి వచ్చినా ఇంకా భేషజాలకు పోయి పాతపాటనే పాడుతూ ప్రజలను తప్పుదారి పట్టించడమేగాక వారివెనుకబాటుతనానికి మార్క్స్ అభిమానులు ప్రోత్సహిస్తున్నారు. ఇది ఆహ్వానించదగ్గ అంశమా? అభినందించే సంగతా?
ఇప్పటికీ ప్రపంచంలోని చాలా దేశాల్లో రాచరికం కొనసాగుతోంది. ఆయా దేశాల ప్రజల సమ్మతితో ఆ వ్యవస్థలు కొనసాగడం దేన్ని సూచిస్తోంది?
అన్ని ఖండాలలోని 30 దేశాలలో రాజులు-రాణులు కొనసాగుతున్నారు. కామన్‌వెల్త్ దేశాలను కలుపుకుంటే 45 దేశాలలో రాచరిక ప్రభావం బలంగా ఉంది. ఇందులో రాజుల ప్రమేయం కూడ కనిపిస్తోంది. బ్రిటన్ రాణి ఎలిజబెత్-2తోపాటు అనేకమంది రాణులు తమ ముద్రను పాలనపై వేస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశంగా చెప్పుకునే జపాన్‌లో ఏకంగా చక్రవర్తియే ఉన్నారు. ఆ దేశ ప్రజలు గౌరవాన్ని, మన్ననలు ఆయన అందుకుంటున్నారు. ఆఫ్రికా దేశాల్లో, యూరప్‌లో, అరబ్ దేశాలలో ఇలా అనేక చోట్ల కోట్లాదిమంది ప్రజలు రాచరికానికి, సంఘీభావం తెలుపుతున్నారు. సానుకూలతను వ్యక్తం చేస్తున్నారు. రాజుల.. రాణుల.. రాచరిక పోకడలను, సంప్రదాయాలను స్వాగతిస్తున్నారు. యువరాజును రాజుగా పట్ట్భాషక్తుడిని చేస్తున్నారు. రాచరికం పగ్గాలు అందిస్తున్నారు. ఇదంతా 21వ శతాబ్దంలో కొనసాగుతోంది.
ఒకటిన్నర శతాబ్దం క్రితం కారల్‌మార్క్స్ జీవించినప్పటి రాచరిక పోకడలు, పద్ధతులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఆయన ఊహించిన పరిణామాలు కోట్లాది ప్రజలను తాకనే లేదు. సూత్రీకరణలు వేరు, వాస్తవాలు వేరు అని ఆయా దేశాల ప్రజలు తరతరాలుగా రుజువు చేస్తున్నారు. అరబ్బు దేశాల్లోనైతే రాజుల ప్రాసాదాల్లో బంగారం టన్నుల కొద్ది మూలుగుతోంది. వారి స్నానాల గదులు, ఇతర గదులు సైతం బంగారుమయంగా కనిపిస్తాయి. దశాబ్దాలుగా ఈ పరిస్థితిపై ‘పరస్పర విరుద్ధ శక్తుల’ భౌతిక సూత్రం వీసమంత కూడా పనిచేయడం లేదు. అలాగని ఆ దేశాల్లో నిరుద్యోగం, పేదరికం, రోగాలు, రొష్టులు లేవనికాదు. అన్నీ ఉన్నాయి. అయినప్పటికీ అవి సహజీవనం చేస్తున్నట్లుగా కనిపిస్తాయి. అంతే తప్ప వైరుధ్యం బద్దలై విప్లవాగ్నులు రాజుకోవడం లేదు. దీన్ని మార్క్సిస్టులు, మావోయిస్టులు పరిగణనలోకి తీసుకోవడానికి సుతరాము ఇష్డపడరు.
చిరకాలంగా కొనసాగుతున్న ఈ వైవిధ్యభరిత మానవ సమాజాన్ని తిలకిస్తూనే ‘‘గతమంతా వర్గపోరాటాల చరిత్ర’’ అని మెడలో ఒ గంట కట్టుకుని తిరగడంలో అర్ధమేమైనా ఉందా? ఆ ఒక్క వాక్యాన్ని ‘దేవుని వాక్యం’గా భావించి ప్రపంచమంతా అల్లకల్లోలం చేసిన మార్క్స్ వీరాభిమానుల మానసిక స్థితి, వారి భావాల పరిపక్వత ఏపాటిదో తాజా పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. బ్రిటన్ రాజవంశం గొడుగుకిందగల గ్రంథాలయంలో అధ్యయనం చేసిన మార్క్స్ ఉపరితల అంశాలనే తప్ప ప్రజల అంతర్లోకాలను పట్టుకోలేకపోయాడని, మానవ స్వభావాన్ని జీర్ణించుకోలేదని, ఆ డొల్లతనం స్పష్టాతి స్పష్టంగా అగుపిస్తున్నా ఆయన అభిమానులు ఇంకా వీరంగం చేయడంలో అర్థం ఉందా?
ఫ్యూడల్ వ్యవస్థ గర్భంలోంచి పెట్టుబడిదారి వ్యవస్థ, దాని గర్భంలోంచి వెలువడిన వైరుధ్యాల కారణంగా సోషలిజం ఏర్పడుతుంది, అనంతరం కమ్యూనిజం కళ్లు తెరుస్తుంది, చివరికి ‘రాజ్యం’తో పనిలేకుండా ప్రజలు ఆదిమ కమ్యూనిజంలో జీవించినట్టు స్వేచ్ఛగా జీవిస్తారని సిద్ధాంతీకరించి మార్క్స్ తన అనుచరులను ఉసిగొల్పాడు. ఆ ఊహకు దరిదాపుల్లో సమాజాలు, దేశాలు ఎక్కడైనా కనిపిస్తున్నాయా?.. ఫ్యూడల్ వ్యవస్థకన్నా పూర్వపు రాచరిక వ్యవస్థ పునాదులే కదలడం లేదు, అదీ ప్రపంచీకరణ జోరుమీదున్న సమయంలో దాని ప్రభావం కనిపించడం లేదంటే మార్క్స్ ‘మహనీయుడి’ మార్గం ఎంత నిరర్ధకమైనదో బోధ పడుతోంది.
ఈ నిరర్థక సిద్ధాంతానికి ప్రాణం పోయడానికి భారతదేశ మావోయిస్టులు దండకారణ్యంలో సమాంతర వ్యవస్థకు బీజాలు వేస్తున్నామని బీరాలు పలుకుతున్నారు. ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. వేదాలు, ఆధునిక సిద్ధాంతాలు ఔపోసన పట్టామని చెప్పుకునే మావోయిస్డుల కార్యక్రమం ఎంత అమానవీయమో, ఎంత నిరర్ధకమో కొంచెం నిశితంగా ఆలోచిస్తే బోధపడుతుంది.
కొసమెరుపు ఏమిటంటే.. ఇప్పటికీ ఒంటికి బట్ట కట్టని అనేక ఆదిమ తెగలు, జాతులున్నాయి. వేల సంవత్సరాల తమ సంప్రదాయాలను ఆచరిస్తూ కాలం గడుపుతున్నారు. అసంతృప్తి అంటే ఏమిటో తెలియని రీతిలో జీవిస్తున్నారు. మార్క్స్ సిద్ధాంతం.. ఊహప్రకారం వారలా కొనసాగేందుకు వీల్లేదు. కాని తరతరాలుగా తృప్తిగా జీవిస్తున్నారు. ఆ సంస్కృతిని సజీవంగా నిలుపుకుంటున్నారు. మార్క్సిజం మాత్రం మృతప్రాయంగా మిగిలింది.

-వుప్పల నరసింహం 9985781799