ఉత్తరాయణం

భ్రష్టుపట్టిన పాఠశాల విద్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలోను రాష్ట్రంలోను విద్యాశాఖ వింత వింత విచిత్ర వాతావరణంలో మగ్గిపోతోంది. మన రాష్ట్రంలో విద్యాశాఖ తీవ్ర గందరగోళంలో ఉంది. పాలకులు ఏదో చేసేద్దామని ఎడమ చెయ్యి తీసి కుడి చెయ్యి కుడి చెయ్యి తీసి ఎడమ చెయ్యి పెట్టి తమాషాలు చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో విద్యాశాఖ ఒక అనవసర ఖర్చు శాఖ వలెనే కనిపిస్తున్నది తప్ప ఇది దేశ నిర్మాణంలోను జాతి నిర్మాణంలోను వెన్నుముక వంటి భావన అనేది లేనే లేదు. ఎందుకంటే విద్య యొక్క విలువ పరమార్థం ఆశయం అనే వాటిని ప్రత్యక్షంగా పరోక్షంగా అనుభవించిన దాఖలాలు పాలకులకి లేనే లేవు. విద్యాశాఖని క్షేత్రస్థాయి నుండి అత్యున్నత స్థాయివరకూ కేవలం పాలకులే భ్రష్టుపట్టించారు. చదువు విలువ తెలియని వారందరూ ఈ శాఖకి మంత్రులుగాను అధికారులుగాను తమతమ దాష్టీకం వెలగపెట్టటానికి మాత్రమే వస్తున్నారనటంలో అతిశయోక్తి లేదు. వాస్తవంగా ఈ శాఖ యొక్క విలువ ఎంతటిదో సంబంధిత మంత్రికి కానీ ముఖ్యమంత్రికి కానీ తెలియటం లేదు.
విద్యాశాఖలో వ్యాపార ధోరణులు మూడుపువ్వులు ఆరుకాయలుగా ఉంటున్నది. అసమర్థులు ఎందుకూ కొరగాని వారందరినీ విద్యాశాఖలో అధికారులుగా పర్యవేక్షకులుగా నియామకాలు చేస్తున్నారు. అంతేకాకుండా వ్యాపారం చేయాలనే ఉబలాటం ఉంటున్నవారందరూ ఈ శాఖలో చేరిపోతున్నారు. అంతేకాకుండా విద్యాశాఖలో నిరంతరం నిత్యం ప్రయోగాలు చేస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్‌తోను విద్యాశాఖ అధికారులు, ప్రభుత్వం ప్రయోగాలు చేస్తుంటారు. ప్రయోగాలు అన్నీ వికటిస్తూనే ఉంటాయి. ప్రయోగాలకి ఏర్పడిన గందరగోళం విచిత్ర వాతావరణానికి విద్యార్థి ఉపాధ్యాయులు విద్యాబోధన తీవ్రమైన ప్రభావానికి లోనై తరగతి వాతావరణం అంతా కాలుష్యం అయిపోతోంది. పాఠశాలలు భ్రష్టు పడుతున్నాయి. వీరి పుణ్యమా అంటూ భావితరాలు పాడవుతున్నాయి.
రాష్టవ్య్రాప్తంగా ప్రాథమిక పాఠశాలల పనితీరు చాలా కష్టంగా ఉంటున్నది. ప్రాథమిక విద్యా పాఠశాలల్లో ఉపాధ్యాయులకి చాలా నిరాసక్తంగా ఉంటున్నది. ఎందుకంటే ఒకటవ తరగతి నుండీ 5వ తరగతి వరకూ ఒక్కరిద్దరు ఉపాధ్యాయులతోనే ప్రభుత్వం కథ నడిపించేస్తోంది. రాజకీయ నాయకులు తమతమ ప్రాపకం కోసం వాడవాడలా వీధి వీధిలో ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటుచేయించారు. అయితే సిబ్బందిని మాత్రం పూర్తిస్థాయిలో నియమించకుండానే కథ కంచికి చేర్చారు. ప్రాథమికంగా ఏ చిన్న పాఠశాల అయినా ఒకటి నుండి 5 వరకూ గల పిల్లలకి అన్ని రకాలైన పాఠాలు బోధించాలంటే తగిన సమయం అవకాశం ఓపిక ఇద్దరు టీచర్లకి ఎలా ఉంటుంది. అన్న కనీస పరిజ్ఞానం అటు పాలకులకీ అధికారులకి ఏమాత్రమూ లేదన్నది వాస్తవం. అందరికీ విద్య అంటూ ఎవ్వరికీ అందరాని విద్యను చేస్తున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో జరిపే విద్యాబోధనకు అనుగుణం గా పాఠశాల స్థాయని పెంచడంలేదు. అందుకు పాలకులు చిత్తశుద్ధితో పనిచేయకుండా సరిగ్గా చెప్పటం లేదనే అభాండం టీచర్ల నెత్తిన వేస్తున్నారు. రాష్ట్రంలో అనేక ప్రాథమిక పాఠశాలల్లో కేవలం ఇద్దరే ఉపాధ్యాయులు ఉంటున్నారు.
అన్ని తరగతులకీ తెలుగు లెక్కలు సైన్సు సోషల్ ఇంగ్లీషు అన్నీ చెప్పాలంటే ఆ ఉపాధ్యాయుడు అల్లా ఉద్దీన్ అద్భుతదీపంలో మాంత్రికుడి వలె పనిచేయాలి. అంతేకాదు మధ్యాహ్న భోజనం, డైస్ నివేదికలు, నెలవారీ నివేదికలు, జీతాల బిల్లులు, ఆధార్ కార్డులు నమోదులు, పాఠశాల సెనె్సస్, విద్యార్థుల సెనె్సస్, బడిబాట, బడి పిలుస్తోంది, జన్మభూమి, స్వచ్ఛ్భారత్, మానవహారం, నీరు మీరు, నీరు మొక్క ర్యాలీలు ఇంకా ఏవేవో కార్యక్రమాలు, పరీక్షలు, అనేక రకాలైన అదనపు బాధ్యతలు. ఒకటా రెండా అనేక పథకాలు. వాటికి టీచర్ మాత్రమే కేంద్రబిందువు. ఈ రకంగా ఉపాధ్యాయులని అన్ని రకాలైన అడ్డమైన కార్యక్రమాలకీ ప్రభుత్వం వాడుకుంటూ పాఠశాలల్లో బాగా బోధన చేయటం లేదంటే తప్పెవరిది? లోపం ఎక్కడుంది అన్నది పాలకులు, ప్రజలు యోచించాలి. ఇన్ని కార్యక్రమాలు శరపరంపరగా టీచర్ల నెత్తినపడి పోతుంటే ఇక బోధనకి సమయం ఎక్కడుంటుంది.
ఈమధ్యకాలంలో సర్వశిక్షా అభియాన్, రాజీవ్ విద్యామిషన్ వంటి పథకాల ద్వారా వచ్చే డబ్బు దుర్వినియోగంని సద్వినియోగంగా చూపించి నిధులు ఖర్చుచేయకుండా అధికారులు చెప్పినట్లు ఖర్చుచేయటం దానికి మసిపూసి మారేడుకాయలవలె లెక్కలు వ్రాయటం సర్వసాధారణం అయిపోయింది. విద్యారంగం విద్యకి దూరంగా వెళ్ళిపోతోంది. ఏది నేర్పాలో ఏం నేర్పాలో అనేది అంతా గందరగోళంగా తయారైంది. మన విద్యాశాఖలో నిరంతరం కొత్త కొత్తగా పాలసీలు రూపొందించి పాత వాటిని నిత్యం పాతర వేస్తుంటారు. కొత్తవి వింతగా రోతగా తయారైపోతున్నా వాటిని మనం అందరం పాజిటివ్ దృక్పధంతో చూడాలని ప్రబోధిస్తుంటారు. ఇది విద్యాశాఖ ఖర్మ.
రాష్ట్రంలో ఎస్‌సిఇఆర్‌టి రూపొందించిన పాఠ్యాంశాలు పూర్తిగా విఫలం అయ్యాయి. ప్రభుత్వం నెత్తికెత్తుకున్న సిసిఇ విద్యావిధానం పూర్తిగా విఫలం అయింది. ఈ విధానం రాజుగారి దేవతావస్త్రాల కథవలె ఉంది. విద్యా బోధనని ఈ విధానం ద్వారా పూర్తిగా భ్రష్టుపట్టించారు. కొండ నాలుకకి మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందట. మన ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాల్సిన పాఠ్యాంశాల రూపకల్పనని మనం ఇతర రాష్ట్రాల రచయితలతో తయారుచేయించారు. మన రాష్ట్రంలో విద్యావేత్తలు భాషావేత్తలకి ఈపాటి కార్యక్రమం చేయటంరాదని రాజస్థాన్ తదితర రాష్ట్రాలు విద్యలో వెనుకబడిపోయిన రాష్ట్రాల రచయితలతో పాఠ్యాంశాలు వ్రాయించారు. ఆంధ్రప్రదేశ్‌లో మేధావులకి తీవ్రమైన కరువు ఏర్పడింది కాబోలు! వీరందర్నీ దిగుమతి చేసుకుంటున్నారు. మన ఎస్‌సిఇఆర్‌టి పరిశోధన అధ్వాన్నంగా ఉందనటానికి మన పాఠ్యాంశాలు చదివిన ఏ మామూలు విద్యావంతుడికైనా అర్ధం అవుతుంది. పాఠ్యాంశాలు తయారీ రూపకల్పన వంటి కీలక అంశాలు గట్టిగా పట్టించుకున్న నాధుడే లేడా అనిపిస్తుంది. అంతా భ్రమలు భ్రాంతి అనే వాటిపై ఊహించి వ్రాయండి కనుక్కొని వ్రాయండి తెలుసుకొని వ్రాయండి అంటూనే పాఠాలు తయారయ్యాయి. అంత తెలివితేటలు గల పిల్లలు అయితే అందర్నీ లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో ప్రతి ప్రాథమిక ఉన్నత పాఠశాలల పిల్లల పేర్లు వ్రాసుకోవాలి.

- పిడుగు రామలింగయ్య