సబ్ ఫీచర్

సమాజం మన చేతుల్లోనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషి ఒంటరిగా ఏ అడవిలోనో, ఎడారిలోనో జీవించలేడు. సాటి మనిషి తోడుగా... సాటి పౌరుల సహాయ సహకారాలతో... ప్రేమాభిమానాలతో కలిసి మెలిసి బ్రతకాలని కోరుకుంటాడు. అలా ఒకచోట... కొంతమందితో కలిసి జీవనయానాన్ని సాగించటానే్న ‘సమాజం’ అంటారు. మనిషికీ ఈ సమాజానికీ మధ్య ఉన్న అనుబంధం తప్ప గొప్పదంటే ‘మనిషి లేనిది సమాజం లేదు... సమాజం లేకుండా మనిషి ఉండలేడు’ అన్నంతగా...! ఒక సమాజం... అది చిన్నది కావచ్చు ‘‘పెద్దది కావచ్చు’’ అందులో ఆడ, మగ, పెద్ద, చిన్న, కులం, మతం అన్న భేదభావాలు ఉండవు. ‘్భన్నత్వంలలో ఏకత్వం’ అన్నట్లు అందరూ కలిస్తేనే సమాజం!
సమాజంలో జీవిస్తున్న ప్రతిమనిషీ సుఖంగా, సంతోషంగా, సౌకర్యంగా, నిర్భయంగా ఉండాలంటే అందరూ ఆ సమాజ పద్ధతులను, నియమాలను, ఆచార వ్యవహారాలను పాటించాల్సి ఉంటుంది. తన వ్యక్తిగత స్వేచ్ఛను, హక్కులను ఆనందంగా అనుభవించవచ్చు గానీ వాటిలో విచ్చలవిడితనాన్ని, హద్దుమీరిన స్వేచ్ఛను, విశృంఖలత్వాన్ని ప్రదర్శించకూడదు. దానివల్ల సాటి మనుషుల కెవరికయినా అవమానం. కష్టం, నష్టం కలిగితే అది సహించరానిది అవటమే కాదు... నేరం కూడా అవుతుంది. అందుకే మనిషి ప్రవర్తన ఎప్పుడూ సామాజిక నిబంధనలకు, చట్టానికి, రాజ్యాంగ విధులకు లోబడినదై ఉండటం తప్పనిసరి...!
ప్రతి మనిషీ... తన సమాజాన్ని మనసా, వాచా, కర్మణా గౌరవించాలి... ప్రేమించాలి. తన నోట్లో నుంచి వచ్చే ప్రతి మాటా, తను చేసే ప్రతి పనీ అది సమాజానికి గౌరవ ప్రదమైనదిగా ఉండాలి గానీ... కించపరిచేదిగా ఉండకూడదు. కొంతమందికి పొద్దున నిద్రలేచించి మొదలూ ‘పాడు సమాజం... ఈ రోజుల్లో ఈ సమాజం ఇలా తగలబడింది...’ అంటూ సమాజాన్ని తిట్టడం అలవాటు. సమాజం అంటే ‘తను... తనలాంటి మరికొందరు...!’ అన్న స్పృహే వాళ్ళకు వంటిమీద ఉండదు. ‘తను వేరు... సమాజం వేరు...’ ‘తను మంచివాడు... సమాజం చెడ్డది...’ అనుకుంటారు. సమాజంలోని ‘మంచి’కి ‘చెడు’కి రెండింటికీ తానూ భాగస్వామి అని... సమాజంలో లోపాలు ఉంటే సవరించే బాధ్యత తనది కూడా!’ అనీ అనుకోడు, అన్నీ తెలిసీ ఏమీ తెలియనితనం అంటే ఇదే...! మనిషి విచిత్ర స్వభావం ఇక్కడే బయటపడుతుంది.
మరికొంతమంది ఉంటారు... వాళ్ళకు ఈ సమాజం అంటే మహా నిర్లక్ష్యం, చులకన భావం...! ‘దాన్ని లక్ష్యపెట్టాల్సిన పనిలేదన్నది వాళ్ళ నిశ్చతాభిప్రాయం! ‘నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను... నాకు నచ్చినట్టు నేను ప్రవర్తిస్తాను’ నా జీవితం... నా ఇష్టం’ అంటూ వితండవాదం చేస్తుంటారు మూర్ఖత్వంతో...! వాళ్ళ ఇష్టం ఎదుటివాళ్ళకు కష్టం కలిగించేది అయినప్పుడు... వాళ్ళ ప్రవర్తన అభ్యంతకరమైంది అయినప్పుడు... వాళ్ళ జీవన విధానం మరొకరి జీవితాన్ని ఇబ్బందిపెట్టేది అయినప్పుడు కూ ఆ ‘నేను, నా’ మాటల ధోరణి అలాగే కొనసాగుతుంది. దాంతో రానురాను వాళ్ళ ఉనికిని భరించడమే ఈ సమాజానికి కష్టమైపోతుంది. ఒక వ్యక్తి తప్పుడు ఆలోచనలు, దారి తప్పిన భావజాలం, మూర్ఖపు ప్రవర్తన కడివెడుపాలలో ఒక్క విషపు చుక్క మాదిరిగా ఈ సమాజం మొత్తాన్ని విషపూరితం చేసే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించి మాట్లాడాలి. ఆచితూచి అడుగెయ్యాలి... బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. సమాజాన్ని తను ఉద్ధరించకపోయినా... తనవల్ల సమాజం పాడుకాకుండా జాగ్రత్తపడాలి.
ఇదొక్కటే అని కాదు... ప్రశాంతంగా ఉండాల్సిన ఈ సమాజంలో కావాలని... పనిగట్టుకొని గొడవలు లేపి అల్లకల్లోలం సృష్టించాలని చూసేవాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళు సమాజాభివృద్ధికి చేయాల్సిన పని ఒక్కటే చేయకపోగా తీరికూర్చుని ఏదో కూత కూస్తారు... ఏదో పిచ్చి రాత రాస్తారు...’ దాంతో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో మొదలవుతాయి చర్చోపచర్చలు.. జనం విలువైన సమయాన్ని వృధా చేయటం... వాళ్ళలో అనవసర గందరగోళాన్ని సృష్టించడం, కులాల మధ్య, మతాల మధ్య చిత్తుపెట్టి ఆగ్రహావేశాలు రగిలించటం తప్ప దీనివల్ల ఒరిగే ప్రయోజనం ఏమీ లేదు.
రకరకాల వ్యక్తులతో కలగలిసిన ఈ సమాజంలో కొంతమంది విచిత్ర వ్యక్తులు కూడా అడపాదడపా మనకు తగులుతూ ఉంటారు. వీళ్ళు ఎతిమతం మనుషులు. ‘ఎడ్డెమంటే తెడ్డెమనే’ రకం. వీళ్ళలో బాగా చదువుకున్నవాళ్ళు... మేధావులు, కళాకారులు కూడా ఉంటారు. చేతిలో కలం... మెదడులో భాషాజ్ఞానం ఉంటే చాలు... వీళ్ళు ఏదిబడితే అది రాసి ఈ సమాజం మీదికి వదిలేస్తారు. కొన్ని దిక్కుమాలిన సిద్ధాంతాలకూ... అర్థంపర్థం లేని వాదనలకు... మొండితనానికి, మూర్ఖత్వానికి బద్ధులై... ఎప్పుడూ ఎవరో ఒకరిని విమర్శించటం... ఏ కులాన్నో, మతాన్నో నిందించటం... ఇంకా ఈ సమాజాన్ని, ఈ దేశాన్ని, ప్రభుత్వాలను కూడా దుయ్యబట్టడం ఇదే వీళ్ళ పని... వేదిక లెక్కి అడ్డదిడ్డంగా వాదించటం... అనవసరపు వాదప్రతివాదనలు చేయటం దొరికినవాళ్ళను దొరికినట్లు కించపరచడం, అవమానించటం, అంటే వీళ్ళకు మహాసరదా. అదేమంటే ‘వాక్స్వాతంత్య్రం, భావస్వేచ్ఛ’ అంటారు.
భిన్నవిభిన్న వ్యక్తులతో, కులమతాలతో కలగూరగంపలా కలిసి ఉంటే ఈ సామాజిక వ్యవస్థలో ప్రతి ఒక్కరూ సమభావంతో, సంయమనంతో, సహనశీలంతో, మానవతా దృక్పథంతో బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సి ఉంటుంది. నేను... నా కుటుంబం ఎలా నాదో ఈ సమాజం కూడా నాది... ‘నా సమాజం బాగుంటే నేను బాగుంటాను’ నా సమాజం సమస్యల మయం అయితే... నా సమాజంలో కొట్లాటలు, రక్తపాతాలు, విషభావ ప్రయోగాలు జరిపి పరిస్థితి, అస్తవ్యస్థమయితే దాని ప్రభావం నా జీవితం మీద పడుతుంది’ అన్న స్పృహ, ఆలోచన ప్రతి ఒక్కరికీ ఉంటాలి. అప్పుడే ఈ సమాజం బాగుంటుంది. సమాజంలో అంతర్గత కలహాలు, విభేదాలు, వాదప్రతివాదనలు హద్దు మీరితే దేశం బలహీనపడి శత్రువులకు మార్గం సుగమం చేసినట్టు అవుతుంది. అలా కాకుండాసమాజం మొత్తం ‘ఒక్కతాటిమీద’ అన్నట్లుగా కలిసిమెలిసి ఉండగలిగితే సమాజ ఐక్యతను, అభివృద్ధిని ఎవ్వరూ ఆటంకపరచలేరు. ‘సర్వే జనా సుఖినోభవంతు’ అన్నది ఒక్కటే అందరి సిద్ధాంతం అయినప్పుడే ఇది సాధ్యం.

- డా.కొఠారి వాణీచలపతిరావు, పిహెచ్.డి