సబ్ ఫీచర్

సామాజిక సర్వతోముఖ వికాసంలో వైశ్యుల పాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుమారు ఒక నెలరోజులుగా ఇంగ్లీషు పత్రికలలో, తెలుగు పత్రికలలో ఆచార్య ఐలయ్య షెప్పర్డ్‌గారి ‘సామాజిక స్మగ్లర్లు కోమట్లు’ అనే కరపత్రం వంటి చిన్న పుస్తకంపై విమర్శలు, ప్రతి విమర్శలు, దూషణ భూషణలు చూస్తూ ఉన్నాం. ఒక సంస్కారం, సామాజిక బాధ్యత ఉన్న పెద్ద మనుషులు(?) అటువంటి రాతలు రాయకూడదు. ఇందువల్ల సమాజంలో కలిగే కనువిప్పు, జ్ఞానలబ్ధి ఏమిటి? వికాస ప్రోద్బలం ఎటువంటిది? సంస్కార విహీనంగా, ద్వేషపూరితంగా, నిందాభరితంగా ఒక వర్గాన్ని, ఒక కులాన్ని సాముదాయికంగా, సామూహికంగా చిత్రించినందువల్ల సమాజంలో చైతన్యోద్బోధ సాధ్యమా! ‘వాదులేక వల్లూరు వెళుతున్నాను. నేను మళ్లీ వచ్చేదాకా నా సవతుల్లారా ఇల్లు కాస్త కనిపెట్టి ఉండండి’ అన్నదట ఒక గయ్యాళిగంప. ఇక వెంటనే ఎవరే నీ సవతులు? అని ఈ గయ్యాళిని తిట్లు దీవెనలతో దులపరించారుట ఇరుగూ పొరుగూ. ఇట్లా ఉన్నది ఐలయ్యగారి వైఖరి లేదా ధోరణి. చరిత్రలో భారతదేశంలో, తెలుగునాట వైశ్యవర్గం నిర్వహించిన సమాజహిత కార్యకలాపాలు, దానధర్మాలు, చైతన్యవిలసిత చేయూతలు ఐలయ్యగారికేమీ తెలిసినట్లు లేవు. వారి ఈ రచనవల్ల తిట్లపురాణ ప్రవీణత వారికెంత వారి మత నిబద్ధంగా సిద్ధించిందో తెలుస్తున్నది.
కాలక్రమంగా కాక ఇటీవలి కాలంలో ముఖ్యంగా తెలుగుదేశంలో వైశ్యవర్గం వారు చేపట్టి సాగించిన సమాజహిత కార్యకలాపాలు గుర్తు చేస్తున్నాను. కాకినాడలో ఉండే పైడా రామకృష్ణయ్య గారనే వణిక్ప్రముఖుడు, వీరేశలింగం పంతులు సమకాలం వాడు కందుకూరి వారి వితంతు వివాహ నిధికి 1880ల ప్రాంతంలో ముప్ఫై వేల విరాళం ఇచ్చాడు. రామకృష్ణయ్య గారు వైశ్యులలో మొదటి పట్ట్భద్రుడట (బిఎ). ఇప్పటి రూపాయి విలువతో చూస్తే రామకృష్ణయ్య గారి విరాళం రూ. 30 లక్షలు కావచ్చు. ఇంకా ఎక్కువేనేమో! 140 ఏళ్ల కిందటి రూపాయి విలువతో పోల్చి చెప్పాలి.
కిందటి శతాబ్దంలో ప్రతి చిన్న పట్టణంలో, నగరంలో వైశ్యుల ధర్మసంస్థలుండేవి. రాజమండ్రిలో నాళం వారి అన్నసత్రం చాలా ప్రసిద్ధి పొందింది. ఇతర కులాలవారికి కూడా అన్నం పెట్టేవారు. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్ర్తీ స్వీయ చరిత్రలోనూ, కథలలోనూ ఈ సత్రం ప్రస్తావనలున్నాయి. ఈ సత్రం వైశ్యులే నిర్వహించేవారు కదా!
నాళం కృష్ణారావు స్వాతంత్య్రోద్యమ స్ఫోరకంగా రెండు పత్రికలు నడిపేవారు. దేశమాత, మానవసేవ ఆ రెండు పత్రికలు. రాజమండ్రివారే అయిన మామిడి దేవేంద్రుడు అనే వ్యాపార ప్రముఖుడు బారిస్టరు కావడానికి ఇంగ్లండు వెళ్లారు రాజమండ్రి నుంచి. ఊటుకూరు లక్ష్మీకాంతమ్మగారు నాళం కృష్ణారావుగారి కుమార్తె. కృష్ణారావు తొలి తరం బాలసాహిత్య రచయితలలో విశిష్టుడు. ఆ రోజులలో చాలా ఊళ్లలో వైశ్యుల వదాన్యత, దాననిరతి వెల్లడించే ప్రజాహిత సంస్థలు, (పాఠశాల, కళాశాల, గ్రంథాలయం, సత్రం, రోటరీక్లబ్ వంటివి ఉండేవి) ఇప్పుడూ ఉన్నాయి. అనకాపల్లి, గుంటూరు, నరసారావుపేట, సత్తెనపల్లి, చీరాల, వరంగల్, ఖమ్మం ఇందుకు కొన్ని ఉదాహరణలు.
ఇటీవలి కాలంలో విశ్వవిద్యాలయాల వైస్‌ఛానె్సలర్‌లుగా వైశ్యులున్నారు. పేరుప్రతిష్ఠలార్జించుకున్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ చానె్సలర్‌గా పనిచేసిన కె.వెంకట్రామయ్యగారు వైశ్యులే. ఈ మధ్యనే సాహిత్య అకాడమీ ప్రతిష్టాత్మక పురస్కారం పొందిన శ్రీ చిటిపోలు కృష్ణమూర్తిగారు వైశ్యులే. వారి కావ్యం పురుషోత్తముడు గ్రీకు చరిత్ర పరిశోధన ఫలితం. అలెగ్జాండర్ తాలూకు నాణేలు కూడా ఈ పుస్తకంలో ప్రతికృతులుగా ఉన్నాయి. సుమారు 70 ఏళ్ల కిందట నెలకొన్న సాహిత్య అకాడమీ నుంచి ఇప్పటివరకు ఇద్దరో ముగ్గురో మాత్రమే తెలుగు సాహిత్యం నుంచి పురస్కారాలు పొందారు. వీరిలో శ్రీ ఊటుకూరు లక్ష్మీకాంతమ్మగారు ఒకరు. రాజమండ్రిలో వైశ్యులే స్థాపించిన సంస్కృత, ప్రాచ్య భాషా విద్యాసంస్థలో (నాళం సుశీలమ్మగారు స్థాపకురాలు) ఇప్పటి కాలపు ప్రముఖ విద్వాంసుడు, కవి, విమర్శకుడు అయిన మల్లంపల్లి శరభయ్య శర్మగారు చాలాకాలం పండితులుగా పనిచేశారు.
స్వాతంత్య్ర సమరోద్యమ ప్రముఖ నాయకులైన గోపాలకృష్ణ గోఖలే, మోతీలాల్ నెహ్రు, సి.వై. చింతామణి, మాలవ్యా వంటి మహనీయులతో గుంటూరు వాస్తవ్యులైన శ్రీ శనగపల్లి రామస్వామి గుప్త కలసి పనిచేసినట్లు శ్రీరామస్వామి గుప్త జీవిత చరిత్రకారులు చెప్పారు. 1928లో కలకత్తాలో జరిగిన కాంగ్రెసు సభలో శ్రీ శనగపల్లి వారు పాల్గొని విషయ నిర్ణాయక సంఘం (సబ్జెక్ట్ కమిటీ)లో తమ వంతు పాత్ర నిర్వహించారు. వీరికి సాంఘిక సేవపట్ల, సభా నిర్వహణ పట్ల ఎంతో కుతూహలం, మమత్వం ఉండేవి.
వెంకటగిరి సంస్థానం దివానుగా పనిచేసిన సుంకు నారాయణస్వామి శ్రేష్ఠి 1907లో గుంటూరులో జరిగిన మొట్టమొదటి ఆర్యవైశ్య మహాసభకు అధ్యక్షత వహించారు. ఇటువంటి ఆర్యవైశ్య మహాసభలు 30 దాకా ఆంధ్రదేశంలో వివిధ ప్రాంతాలలో ప్రతి సంవత్సరం జరుగుతూ వచ్చాయి. ఈ సభలలో వీరు అనేక సాంఘిక సమస్యలను, బాల్య వివాహ నిరసన, వితంతు వివాహాలను కూడా తీర్మాన రూపంలో సమర్థించేవారు.
శతావధాని దోమా వెంకటస్వామి గుప్త బ్రహ్మ వైవర్త పురాణాన్ని తెనిగించారు. వీరు చెన్నపట్నం క్రైస్తవ కళాశాలలో పండితుడిగా పనిచేశారు. భగవాన్ రమణ మహర్షిని తరచు దర్శిస్తూ భగవాన్ కృపావలోకనకు పాత్రుడైనారు. గ్రంధి సుబ్బారాయ (శర్మ) గుప్తగారనేవారు స్వాతంత్య్ర సమరంలో పాల్గొని కారాగార శిక్షననుభవించారు. 1930లో ‘సామాన్య జీవితము’ అనే పేరిట స్వీయచరిత్ర ప్రకటించుకున్నారు. వీరే శనగపల్లి రామస్వామి గుప్తగారి జీవితచరిత్ర కూడా రచించారు. ఈ రెండు పుస్తకాలు చదివితే 20వ శతాబ్దంలో తెలుగువారి సామాజిక పునరుజ్జీవనానికి, సంఘ సంస్కరణకు, స్వాతంత్య్రోద్యమానికి, త్యాగనిరతికి వైశ్యులు ఎంతగా పాటుపడ్డారో విస్మయకరమైన విషయాలెన్నో తెలుసుకోవచ్చు. 20వ శతాబ్దం మొదటి మూడు దశకాలలో వైశ్యులకు, బ్రాహ్మణులకు వైదిక సంప్రదాయాలు, కర్మాచరణం విషయంలో ప్రబలమైన స్పర్థలు వచ్చాయి. పంతాలు, పట్టింపులు సాగాయి. దీనితో వైశ్యులలో పండిత వర్గం వేదోపనిషత్తులు, స్మృతుల పరిశోధన జరిపి బ్రాహ్మలను ఎదుర్కోవడం జరిగింది. సమదర్శని వంటి జస్టిస్ పార్టీ పత్రికలు వైశ్యులను సమర్థించాయి. ఆర్యవైశ్య పత్రికను స్థాపించి సాంఘిక పురోగతికై కృషి చేశారు వైశ్యులు. అట్టడుగు కులాల వారికి జరుగుతున్న అన్యాయాలను, వారిపట్ల అగ్రవర్ణులనుకుంటున్న వారి అమానుష ప్రవర్తనను తీవ్రంగా నిరసించారు.
చాలా ఆశ్చర్యకరమైన సంగతి. 1884లో గుంటూరులో వైశ్యులు రాత్రి పాఠశాలలు స్థాపించి ప్రజాస్వామ్య విద్యా వికాసానికి కృషి చేశారు. 1892లో ‘రేట్ పేయర్స్ అసోసియేషన్’ పేరిట ‘ప్రభుత్వ అవకతవకలను అధికారుల (స్థానిక, ప్రెసెడెన్సీ పాలకుల) దృష్టికి తెచ్చారు. చర్చా సంఘాలలో పాల్గొనేవారు.
స్వాతంత్య్రోద్యమంలో శిక్షననుభవిస్తూ గ్రంధి సుబ్బరాయగుప్త (శర్మ) రాయవేలూరులో సి.రాజగోపాలాచారి, ఎస్.శీనివాసయ్యంగార్‌లతో కారాగారవాసం చేశారు. ఈ విషయాలను సుబ్బరాయశర్మ (గుప్త) గారు స్వీయచరిత్రలో ఉటంకించారు.
గోపాలకృష్ణ గోఖలే స్థాపించిన ‘సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ’లో ‘రేట్ పేయర్స్ అసోసియేషన్’ వారికి ఉత్తర ప్రత్యుత్తరాలుండేవి అని శనగపల్లి రామస్వామిగుప్త జీవిత చరిత్ర నుంచి తెలుస్తున్నది. గుంటూరు పురపాలక సంఘ నిర్వహణలో, స్వాతంత్య్రోద్యమంలో వైశ్యులు నిర్ణాయకపాత్ర పోషించారు. నడింపల్లి వెంకట లక్ష్మీనరసింహగారు, తెల్లాకుల జాలయ్య స్వీయచరిత్రలు సంప్రదించవచ్చు.)
ఇక సమకాలీన తెలుగు సాహిత్య చరిత్రలో వైశ్యవర్గం నుంచి ఎందరో మంచి రచయితలున్నారు. (చూ. ఇలింద్ర రంగనాయకుల గారి రచనలు - వీరు షేక్స్పియర్ మేక్‌బెత్‌ను తెలుగులోకి అనువదించారు)
వైశ్యులలో జమీందారీ హోదాననుభవించిన వారు కూడా ఉన్నారు. ఉదాహరణకు ఏలూరులో మోతె గంగరాజుగారు. ఏలూరులోనే గుప్తా ఫౌండేషన్ పేరిట అనువార్షికంగా సాహిత్య సాంస్కృతిక రంగ ప్రముఖులకు, లక్ష రూపాయల నగదు పురస్కారం, సమ్మానసభ నిర్వహించే సంస్థ ఇప్పుడు కూడా ఉన్నది. దాసు శ్రీరాములుగారి వంటి మహాకవి, గొప్ప పండితుడు వైశ్యుల శ్రౌతకర్మాధికారాన్ని సమర్ధించారు.
పులవర్తి కమలాదేవి అనే విద్యాధికురాలు బైబిలును అనువదించగా అమెరికన్ మిషనరీ వారు లక్షాధికంగా ప్రతులు ముద్రించారు. ఆమెను సన్మానించారు. వైశ్యులది ఉదార సంస్కార దృక్పథం కాదనడం వెర్రికూతల కిందకి వస్తుంది.
అచ్చు యంత్రాలు మద్రాసు రాజధానిలో ప్రవేశించిన తొలి తరం కాలంలో క.పుష్పరధ శ్రేష్ఠి అనేవారు ముద్రణాలయం స్థాపించి తెలుగు కావ్యాలు, కొక్కొండ వెంకటరత్నంగారి వంటి మహాకవుల గ్రంథాలు ముద్రించేవారని నిడదవోలు వెంకటరావుగారు భారతి పత్రికలో కొక్కొండ వారిపై మూడు సంచికలలో రాసిన వ్యాసాలనుబట్టి తెలుస్తున్నది. (పుష్పరధ శ్రేష్ఠి అనే పేరు ఎంతో విస్మయకరంగా లేదూ!)
ఇటీవలి వరకు తెలుగు సాహిత్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, వైజ్ఞానిక రంగాలలో పేరు తెచ్చుకున్న ప్రముఖులకు లక్షలు విరాళాలు, పురస్కారాలు అందజేసిన రమణయ్యగారు వైశ్యకులోద్భవుడే. కందుకూరి శివానందమూర్తి భీలీ ఆశ్రమంలో చివరి సంవత్సరాలు సాధన తత్పరుడైనారు రమణయ్య రాజా.
సమర్థి రంగయ్యశెట్టి మద్రాసు క్రిస్టియన్ కాలేజీలో గణితశాస్త్రం బోధించేవారు. ఈయనను దేశభాషా పర్యవేక్షకుడిగా విద్యాశాఖ గౌరవించింది. వేదం వెంకట్రాయశాస్ర్తీ, గురజాడ అప్పారావు, వీరేశలింగం వంటి వారు వీరి ప్రాపకం పొందారు. వీరు ప్రకటించిన ఆధునిక తెలుగు కావ్యపోటీలలోనే కట్టమంచి రామలింగారెడ్డిగారికి ప్రథమ బహుమానం వచ్చింది. సమర్థి రంగయ్య శ్రేష్ఠి ప్రభుత్వ విద్యాశాఖ నుంచి పరీక్షాపత్ర నిర్ణేతగా, సమాధాన పత్ర మూల్యాంకన నిర్ణాయకుడిగా ఉండేవారు. పాపం తెనాలి దగ్గర జరిగిన రైలు ప్రమాదంలో 1911లో ఈ మహనీయుడు చనిపోయినాడు. కాకినాడ ఆంధ్ర సారస్వత పరిషత్తులో సమర్థి రంగయ్య శ్రేష్ఠి జీవిత చరిత్ర చిన్నపుస్తకం ఉంది. అఖిల భారతీయ భాషా సమానార్థక పద నిఘంటు నిర్మాణం కోసం ఉద్యమించిన రఘువీర వైశ్యవర్గానికి చెందినవాడే (చూ. తిరుమల రామచంద్ర స్వీయ చరిత్ర.. ‘హంపీ నుంచి హరప్పా దాక..’)

ఎనె్నన్నో విద్యాసంస్థలను దేశ విదేశాల విమానాశ్రయాలను నిర్మించిన గ్రంథి మల్లికార్జున రావు (జిఎమ్‌ఆర్) వైశ్య కులస్థుడే. శంషాబాద్ విమానాశ్రయంలో జి.ఎమ్.ఆర్. తల్లిదండ్రుల ఛాయాచిత్రాలున్నాయి. జిఎమ్‌ఆర్ భార్య పేరిట విద్యాసంస్థలు, విద్యార్థి స్కాలర్‌షిప్‌లు ఉన్నాయి.
తెలుగులో తొలి నవలా రచయిత ఎవరు? అనే జిజ్ఞాసకు కారణంనరహరి గోపాలకృష్ణమశెట్టి (1870 ప్రాంతాలలో వీరు కర్నూలు జిల్లా డిప్యూటీ కలెక్టర్). వీరు శ్రీరంగరాజ చరిత్ర అనే నవల 1872 నాటికే రచించి ప్రకటించారు. వీరేశలింగం రాజశేఖర చరిత్రపై శ్రీరంగరాజ చరిత్ర ప్రభావం ప్రసరించింది. గోపాలకృష్ణమ గారి కుమారుడు రాజా మణిచెట్టి విజయనగరం ఆనంద గజపతి సంస్థానంలోని నవరత్నాలలో ఒకరు. శ్రీరంగరాజ చరిత్రపై సమకాలీన తెలుగు పత్రికలలో మంచి సమీక్షలు వచ్చాయి.
వైశ్యుల్లో ముఖ్యమంత్రులు, గవర్నర్లు, జడ్జ్‌లు, వైచ్‌ఛానె్సలర్‌లు ఎందరో లేరా? విద్యాసంస్థల నిర్మాతలుగా వారు వాసికెక్కలేదా? హైకోర్టు జడ్జీలుగా, నాటక రచయితలుగా కూడా వారు పేరు తెచ్చుకున్నారు.
ఆత్మూరి లక్ష్మీనరసింహం విజయనగరంలో జిల్లా జడ్జ్‌గా పని చేశారు. రాజమండ్రిలోనూ పనిచేశారు. జర్మన్, ఫ్రెంచ్, ఇంగ్లీషు భాషలలో కూడా ఈయన ప్రజ్ఞాశాలి. లక్ష్మీనరసింహంగారి ఇంగ్లీషు పాండిత్యం శ్లాఘనీయం కాబట్టి వీరిచేత వేదాలకు వ్యాఖ్యానం రచింపచేయవలసిందిగా మాక్సుముల్లరు ఆనంద గజపతికి లేఖ రాసినట్లు గ్రంథి సుబ్బరాయ గుప్త రచించిన ఆత్మూరి లక్ష్మీనరసింహం జీవిత చరిత్రలో చదవొచ్చు.
జమ్మి నమ్మాళ్వారుగారనే రచయిత భారతదేశ ప్రాచీన విద్యా సంప్రదాయాన్ని ‘ప్రాచీన భారతీయ విశ్వవిద్యాలయాలు’ అనే పరిశోధన గ్రంథం రచించారు. వీరు గుంటూరు వాస్తవ్యులు. వైశ్యులు. పత్రికలు నిర్వహించారు. వైశ్యులు తమ కుల పత్రికలే కాక సామాజిక పత్రికలూ నడిపారు. పేద విద్యార్థులకు సాయం చేశారు. సమాజ చేతనను ప్రబుద్ధం చేయడంలో తమ పాత్రను సమర్థంగా నిర్వహించారు. (కాకరపర్తి భావనారాయణ కాలేజీ -విజయవాడ, ఎస్‌ఎస్‌ఎన్ కాలేజీ -నరసరావుపేట వైశ్యుల విద్యాతృష్ణకు ఉదాహరణలు). అనకాపల్లిలో కూడా వీరు కళాశాల స్థాపించారు. గ్రంథాలను అంకితం పొందారు. ఇప్పుడు విజ్ఞాన, సాంకేతిక, వైద్యరంగాలలో, కంప్యూటర్ రంగంలోనూ ఉన్నారు. అమెరికాలో కూడా వీరు సాంకేతిక రంగంలో ఉన్నారు.
ఇప్పుడు కులవృత్తులు లేవు. ఇక కులాల గూర్చిన ద్వేషం ఎందుకు? అట్టడుగు కులాల వారమని, అణచివేతకు గురైన వారమనీ చెప్పుకుంటూ నినదిస్తున్న వారిలో ఇన్ని ఉపకులాలు ఎందుకు? మనువుస్మృతీకరించలేదే!
నిన్న మొన్నటిదాకా దళితులలో కులవ్యవస్థ ప్రధాన వర్గాలు సఖ్యత పాటించలేదు. రిజర్వేషన్‌లు కావాలని, వద్దని పరస్పరం కలహించుకుంటున్నారు.
ఇటీవల రాబర్ట్ నోబుల్ జీవితయానం అనే గ్రంథం తెలుగులో వచ్చింది. ఆయన బందరులో నూట అరవై ఏళ్ల కిందట నడపిన విద్యాసంస్థలో మాదిగవారికి కూడా ప్రవేశం కల్పించగా మాలవారు ఆ పాఠశాలను బహిష్కరించినట్లు నమోదై ఉన్నది. ఈ నోబుల్ జీవిత చరిత్రను ఆయన తమ్ముడు జాన్ నోబుల్ రచించగా 1866 కేంబ్రిడ్జ్ ససెక్స్‌లో ప్రచురితమైంది. ఈ పుస్తకంలో రాబర్ట్ నోబుల్ ఇంగ్లండులో మిత్రులకు, గురువులకు, బంధువులకు రాసిన లేఖలున్నాయి. అట్టడుగు కులాల వారిలో కూడా న్యూనతాధిక్యతలు ఉన్నాయని రాబర్ట్ నోబుల్ రాశాడు. సమాజంలో బ్రాహ్మడికి టెక్కూ, భేషజం, అహంభావం కనపరిచే లక్షణం ఉందో దళిత వర్గాలలో మాలలకు అటువంటి గుణం తక్కువేమీ కాదని రాబర్ట్ నోబుల్ వ్యాఖ్యానించాడు. ఉన్నవవారి మాలపల్లి నవలలో రామదాసు భార్య మహలక్ష్మి అంటరాని వాళ్లలో మనం బ్రాహ్మలమట - తక్కిన కులాల పిల్లను నా కొడుకు ఎందుకు చేసుకోవాలి అంటుంది.
నూరేళ్ల కిందట, ఏభై ఏళ్ల కిందట ఉన్న కులాహంకార పట్టింపులు ఇప్పుడు లేవు. నగరీణ సమాజం పంక్తి భేదాలు పాటిస్తున్నాయా, హోటళ్లలో, స్కూళ్లలో, సినిమా హాళ్లలో అంటరానితనం పిశాచం కన్పించటం లేదు కదా! అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన సంగతి, తమిళనాడులో ఇప్పటికీ దళితులచే అణచివేతకు గురై వాళ్ల దయాదాక్షిణ్యాలకు లోబడి జీవించే అత్యంత స్వల్ప సంఖ్యాక వర్గం కడగండ్ల పాలవుతూ జీవిస్తున్నదని ఈ మధ్య (అక్టోబర్, 2017 మూడోవారం) ది హిందూ పత్రికలో ఒక ఉదంతం - వార్తా వ్యాఖ్యానంతో వెలువడింది.
భగవద్రామానుజల సమాజ సాంఘిక సంస్కరణోద్యమంలో అట్టడుగు కులాల వారిపట్ల ఎటువంటి వివక్ష లేదు. బసవేశ్వరుడు అగ్ర కులాల వారిని నిరసించి అంత్య కులజులకు మహిమాస్పదమైన స్థానాన్ని ఇచ్చాడు. బసవపురాణం, పండితారాధ్య చరిత్ర (పాల్కురికి సోమనాథుడి రచనలు) చదివితే వెయ్యేళ్లనాడే సమాజ చైతన్యంపట్ల ఆర్తి కనపడుతుంది. అరువత్తి మువ్వురు నాయనార్ల చరిత్రలు, పన్నిద్దరాళ్వారుల చరిత్రలు చూస్తే భక్తుల, యోగుల స్థాయి అట్టడుగు కులాల వారున్నారు. వీరికి తక్కిన కులాల వారు మొక్కుతారు.
మాల దాసరి కథను శ్రీ కృష్ణదేవరాయలవారు విష్ణుచిత్తీయంలో ఎంతో అందంగా చెప్పారు. పెంగ్విన్ ప్రచురణ సంస్థ ప్రచురించిన తెలుగు కథల అనువాద సంపుటంలో మాల దాసరి కథ చోటు చేసుకుంది. అనువాద రచసాయిత వి.పి.రంగారావు. ఈయన పెంగ్విన్ రంగారావుగా గుర్తింపు పొందాడు. ఆధునిక తెలుగు సాహిత్యంలో చింతా దీక్షితులు, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్ర్తీ, మా. గోఖలే, కరుణకుమారీ, అట్టడుగు కులాల వారి దయనీయ జీవితాలు కథించి సమాజ దురన్యాయాన్ని నిరసించారు. ఇప్పటి దళిత వర్గాల రచయితలు అటువంటి కథలు రాస్తున్నారా? సమాజాన్ని దురన్యాయాల పట్ల, వేదనల పట్ల చైతన్యవంతులను చేయాలనుకున్న రచయితలకు ద్వేషమూ, కావేషమూ, క్రోథమూ, డంభమూ, కపటము ఎందుకు? ఇందువల్ల సమాజ సామూహిక సంస్కారం సిద్ధించదు. ‘సమాజ స్మగ్లర్లు కోమటోళ్లు’ అనే రచన ద్వారా ఆచార్య ఐలయ్య ఏమాశిస్తున్నట్లు! ఇక ఆయనను సమర్థించేవాళ్లు, మెచ్చేవాళ్లు అంతర్యుద్ధమనీ, విప్లవమనీ గుండెలు బాదుకోవడాలు, నారసాలు గుచ్చుకొని శివాలు తొక్కటాలు ఎందుకు? ఇటీవల ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ఆచార్య ఐలయ్య మహాశయులు తన పేరుకు చివర షెప్పర్డ్ అని తగిలించుకున్నారు (శాస్ర్తీ, శర్మ, చౌదరి, రెడ్డి, రావు, మాదిగ, మాల బాపతులాగా) ఇప్పుడు పారిశ్రామిక యాజమాన్యం దళితులు కూడా నిర్వహిస్తున్నారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో వీరి ఉదంతాలు ఎన్నో వచ్చాయి. (కల్పనా సరోజ్, మిళింద్ ఇత్యాదులు). వీరు ఎందరికో జీవనోపాథి కలిగిస్తున్నారు.
క్రైస్తవ మతం వారు చేసిన దుర్మార్గాలు, క్రౌర్యాలు, పాపాల సంగతి చెప్పడానికి ఇది సందర్భం కాదు. సమయమూ కాదు. చెప్పినా తెలుగు పత్రికలు ప్రచురించడం సందేహమే! అన్నట్లు తెలుగు పత్రికా యాజమాన్యంలో ఇప్పుడు వైశ్యులు కూడా ఉన్నారు. వీళ్లంతా స్మగ్లర్లు కారు.
చివరగా ఒక సంగతి. గుంటూరులో శ్రీ బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తిగారనే వదాన్యవణిక్ప్రముఖుడు శ్రీ బొమ్మిడాల ట్రస్టును స్థాపించి సమాజ చేతనను ఉద్దీపింపజేస్తూ విద్యా వికాసానికి, జర్నలిజానికి, చరిత్ర సాహిత్య పరిశోధనకు, విజ్ఞానశాస్త్ర వికాసానికి గొప్ప పురస్కారాలు వార్షికంగా అందజేస్తున్నారు. ఎన్నో ప్రచురణలు తెస్తున్నారు. వీరి (ఈ ట్రస్టువారి) తొలి సాహిత్య భూరి పురస్కారం ఒక దళిత క్రైస్తవుడైన తెలుగు రచయితకే ఇచ్చారు (ఆచార్య కె.ఇనాక్). ఇప్పుడేమంటారు ఆచార్య ఐలయ్యగారు. సమాజ స్మగ్లర్లు కోమటోళ్లు అనే అంటారా ఇంకా!

-డాక్టర్ అక్కిరాజు రమాపతిరావు