సబ్ ఫీచర్

అభ్యుదయానికి పెద్దపీట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌లో గతవారం రెండు ఘనమైన కార్యక్రమాలు జరిగాయి. ఒకటి ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సు, రెండవది ఎంతోకాలంగా నిరీక్షిస్తున్న హైదరాబాద్ మెట్రో రైలు ప్రారంభోత్సవం. ప్రపంచం ఎటువైపు పయనిస్తున్నదో చూపే సూచికలివి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంక ట్రంప్ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సుకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మూడుపదుల ఇవాంక ఆలోచనలకు, అభిప్రాయాలకు ప్రత్యేక గౌరవం, మన్ననలు కనిపించాయి. ట్రంప్ కుమార్తె అయినందువల్ల ఆమెకా గౌరవం, మర్యాద దక్కడం లేదని పత్రికలు ప్రముఖంగా రాసాయి. ఆమె జ్ఞానం, తెలివితేటలు, చొరవ, దృక్పథం, పురోగమనశీల వైఖరి సానుకూల ధోరణి ఇవన్నీ కలిస్తేనే ఇవాంక అంటున్నారు. తన ఉపన్యాసం ద్వారా అది నిజమని రుజువు చేసుకున్నారు. మరి ఇవన్నీ ఆహ్వానించదగ్గ అంశాలేకదా!
ఇక మెట్రోరైలు.. అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక టెక్నాలజీ ఆధారంగా, కాలుష్యమనే మాటే ఎరుగని రీతిలో ప్రజా రవాణాను ఒక కొత్త ‘లెవల్’కు తీసుకువెళ్లింది. హైదరాబాద్‌లో జట్కాంబడిలో, సైకిల్ రిక్షాలో ప్రయాణించిన తరం ఇప్పటికీ కనిపిస్తుంది. ఆ తరంవారు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో కూడిన రైల్వేస్టేషన్‌కు వెళ్లి ఆకాశంలో తేలిపోయే రీతిలో ప్రయాణం చేసే వీలు కలిగింది. ఎంతలో ఎంత మార్పు? ఎంత పురోభివృద్ధి. ఇది సమాజం ఎదుగుదలకు చిహ్నం. ప్రపంచంతో కలిసి అడుగులేస్తున్న వైనం.. పెద్ద సంరంభం.
ఈ సౌకర్యం, సౌలభ్యం కుబేరులకో, సంపన్నులకో ప్రత్యేకం కాదు. సాధారణ, అతిసాధారణ పౌరుల కోసం రూపొందించినది. ప్రజలు అన్నివిధాలుగా ఎదగాలన్న ఆకాంక్షతోనే వేల కోట్ల రూపాయల ఖర్చుతో ఈ బృహత్ పథకాన్ని చేపట్టారు.
హైదరాబాద్ మెట్రో విశిష్టత ఏమిటంటే ఇది ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో రూపుదిద్దుకోవడం. పెట్టుబడిదారులు తమ బొక్కసాలను అప్పనంగా నింపుకోవడానికి మాత్రమే ముందుంటారన్న మాటను పూర్వపరం చేస్తూ లాభాలు ఎప్పటికొస్తాయో తెలియని మెట్రో మార్గంలో వారు పెట్టుబడులు పెట్టారు. సమాజ పరిణామ క్రమానికి తమవంతు పాత్రను పోషిస్తున్నారు. ఇది ఈనాటి ప్రత్యేకత. సమాజంలో అద్వైతమే తప్ప ద్వైతం కనిపించని కాలంలో మనమున్నాం. దీన్ని గత వారం జరిగిన రెండు కార్యక్రమాలు మరోసారి రుజువు చేశాయి.
సాంకేతిక పరిజ్ఞానం ఎంతలా ప్రజానుకూలంగా రూపుదిద్దుకున్నదో స్పష్టంగా అవగతమైంది. ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ. త్వరలోనే మరిన్ని మెరుగైన సౌకర్యాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కృత్రిమ మేధ అన్ని రంగాల్లోకి ప్రవేశించి మానవుడి శ్రమను తగ్గిస్తోంది. అటువైపుగా నడవాలని, మహిళలకు పెద్దపీట వేయాలని ప్రపంచ సదస్సు తీర్మానించడం ఆహ్వానించదగ్గ అంశం. మానవజీవితం మెరుగుపడేందుకు అన్వయించాలని పిలుపునిస్తున్నారు. అయితే శ్రమశక్తిపై పూర్తిగా ఆధాపడి ఆవిర్భవించిన మార్క్సిజం - మావోయిజాన్ని విశ్వసించే కామ్రేడ్లు ఈ పరిణామాన్ని చూసేందుకు, పట్టించుకునేందుకు సిద్ధంగా లేరు.
ఈ అభివృద్ధి, పరిణామాలన్నీ పెట్టుబడిదారుల కోసమే తప్ప పేదప్రజల కోసం కాదని పొసగని వ్యాఖ్యలతో తమ అతి పురాతన సిద్ధాంత కవచాల్లోనే, తొడుగుల్లోనే తరలివెళ్లడం అలవాటు చేసుకున్నారు. ఆధునిక అద్వైతం అంతటా పరిఢవిల్లుతుండగా, మానవశ్రమ కనిష్టానికి తగ్గిన వైనం స్పష్టంగా కనిపిస్తుండగా పట్టించుకోకుండా ‘‘వర్గ దృక్పథం’’తో లోకాన్ని చూస్తే, లోక కల్యాణం జరుగుతుందా?
వేల కోట్ల రూపాయలతో పట్టాలపైకి తెచ్చిన మెట్రో రైలు ఏ ‘వర్గం’ కోసం?.. ఏ సంపన్న శ్రేణి కోసం? ఏ పెట్టుబడిదారుల బిడ్డల కోసం?... మెట్రోరైలు ప్రజల కోసం, పౌరుల కోసం కదా?... మిగతా ఆవిష్కరణల సారాంశం కూడా ఇదే కదా?
ఈ అద్వైతాన్ని విస్మరించి ద్వైతం మార్గంలో ప్రయాణించాలని మార్క్సిస్టులు, మావోయిస్టులు ఆలోచించినంతకాలం వారి నడక భూమికి బారెడు ఎత్తులో ఉంటుంది. ఆ విన్యాసం ప్రజలకు ప్రయోజనకారి కాదని పలుసార్లు రుజువైనప్పటికీ, ఎన్నో దేశాల్లో, ఎన్నో ప్రాంతాల్లో ఆ పద్ధతి తిరస్కరణకు గురైనప్పటికీ ప్రజలను ఇంకా ఆ తిరస్కరణ మార్గం వైపు మళ్లిస్తామని కంకణం కట్టుకోవడం కాలాన్ని గేలిచేయడం తప్ప మరొకటి కాదు. ప్రజల్ని ఆశావహులుగా అన్ని విధాలా అభివృద్ధి మార్గంలో నడిచేలా, నడిపించేలా చొరవ తీసుకోవలసిన పార్టీలు ఇలా అపసవ్వయ దిశలో ప్రజల్ని నడిపించేందుకు అహరహం పనిచేస్తే అది దేనికి సంకేతం?
స్టార్టప్ సంస్థల్లో, ప్రయోగాల్లో, వివిధ ఆవిష్కరణలు చేస్తున్నదెవరు? ఆధునిక టెక్నాలజీని, ప్రజల సమస్యల పరిష్కారానికి ఉపయోగిస్తున్నవారు, ఫలితాలు సాధిస్తున్నవారు ఎవరు? ప్రజలే.. కష్టజీవుల సంతానమే! శ్రమజీవుల వారసులే, కొత్త తరమే పగ్గాలు చేపట్టి సమాజాన్ని కొత్త మలుపుతిప్పుతున్న దృశ్యం స్పష్టంగా కళ్లముందు కనిపిస్తున్నా కామ్రేడ్లు ఇంకా ఈ అభివృద్ధి పెట్టుబడిదారులకు ఉపయోగపడేదని వాపోవడంలో ఏమాత్రమైనా అర్థం ఉందా?
వాస్తవానికి వారి వ్యాఖ్యలను ఎవరూ పట్టించుకోవడం లేదన్న స్పృహ సైతం లేకుండా కాలం ప్రవాహ వేగంతో ఒరుసుకుని సాగిపోతున్నా మార్క్సిజం ద్వీపకల్పంపై కూర్చుని శాపనార్థాలు పెడితే నష్టం ఎవరికి? ప్రజలకే. శ్రామికులకే తప్ప పెట్టుబడిదారులకు కాదు. సంపన్నులకు అంతకన్నా కాదు. ఈ సదస్సు మార్కెట్ల విస్తరణకు, ప్రజానుకూల వైఖరికి అద్దం పట్టింది. మార్క్సిస్టుల, మావోయిస్టుల మార్కెట్ రహిత వ్యవస్థ కలికానికైనా కనిపిస్తుందా?..
శిఖరాగ్ర సభలో ఇవాంక ప్రసంగిస్తూ.. ‘‘మీరు (మహిళలు) సమాజాల్లో విశ్వాసాన్ని నింపుతున్నారు, ప్రాణాలు కాపాడుతున్నారు, ఉద్యోగాలు సృష్టిస్తున్నారు. అంతేగాక సవాళ్లను అధిగమించే సత్తా ఉందని ప్రపంచానికి చాటుతున్నారు. చరిత్రపై ప్రత్యేక ముద్ర వేస్తున్నారు. మనందరం (స్ర్తి -పురుషుల) మహోన్నత్వాన్ని స్వప్నిస్తే సమున్నత లక్ష్యాల్ని నిర్దేశించుకుంటే, ధర్మబద్ధమైన, సుభిక్ష భవిష్యత్ కోసం కలసికట్టుగా కృషి చేస్తే ఈ ప్రపంచం ఎంత గొప్పగా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి... ఆ సమున్నత భవితను నిర్మించుకోగలం, సదస్సుకు వచ్చినవారి, దూరదృష్టిగలవారి నేటి ప్రతిజ్ఞ ఇదే! సమాజాల్లోని అడ్డంకుల్ని తొలగించడానికి అవసరమైన సరికొత్త మార్గాల్ని కనుగొనడం కోసం సదస్సుకు హాజరైన వారంతా కలిసి కృషి చేద్దాం, ఒకరినుంచి మరొకరు తెలుసుకుందాం.. మన పిల్లలకు సమున్నత భవితను అందివ్వడానికి ఈ ప్రక్రియ ఉపకరిస్తుంది. మనం సరికొత్త మార్పుకోసం పరితపిస్తున్నాం.’’ అని ఉత్తేజాన్ని కలిగించారు. ఎంతో స్పష్టతతో ప్రపంచాన్ని మార్చే దిశను స్ర్తి-పురుషులకు తెలియజేశారు.
అడ్డంకుల్ని తప్పించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఆమె ప్రపంచ యువతరం దృష్టికోణాన్ని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించే ఫలితాలను, మార్పులను సంపూర్ణంగా జీర్ణించుకుని ప్రసంగించడం చూస్తే వర్తమాన కాలంలో సమాజాలకు చుక్కానిగా నిలిచేందుకు వయసుతో ఏమాత్రం నిమిత్తం లేదని స్పష్టంగా తెలుస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా బడుగుల అభ్యున్నతి కోసం శాన్‌ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేస్తున్న దారా దోట్జ్ సేవలను, అలాంటి అనేకమంది సామాజిక సేవలను ఆమె ప్రస్తుతించారు. ప్రపంచం ఈ విధంగా మలుపుతిరుగుతూ ఉంటే మార్క్సిస్టులు, మావోయిస్టులు మాత్రం తమ సిద్ధాంత చట్రాల్లో బందీలుగా మిగిలిపోయారు. వర్తమాన చైతన్యానికి నిలువెత్తు నిదర్శనం ఇవాంక. ఆమె మాట తూటాలా పేలింది. మార్క్సిజం తోక ముడిచింది.

వుప్పల నరసింహం 9985781799