సబ్ ఫీచర్

అభివృద్ధి పథంలో విమానయాన రంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌లో పౌరవిమానయాన రంగం అభివృద్ధి పథంలో దూసుకుపోనున్నది. రాష్ట్ర విభజన తరువాత ఈ రంగంలో అభివృద్ధికి ప్రాధాన్యం పెరిగింది. ముఖ్యంగా నూతన రాజధాని అమరావతి నిర్మాణ నేపథ్యంలో విమానయాన అవకాశాల మెరుగుపై ప్రభుత్వం దృష్టి పెడుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని గన్నవరం విమానాశ్రయం స్థాయి, విస్తరణపై దృష్టి సారించారు. అటు విశాఖ విమానాశ్రయంతోపాటు కొత్తవాటి కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. కొద్ది సంవత్సరాలుగా విమానయానం చేసేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. నూతన రాష్ట్రానికి విదేశాలు, దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పెట్టుబడిదారులు, వ్యాపార, వాణిజ్య రంగాలకు చెందినవారి రాకపోకలు పెరిగాయి. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విమానయాన రంగాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించాయి. ఏపీ నూతన రాజధాని అమరావతికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎన్టీఆర్ - అమరావతి (గన్నవరం) విమానాశ్రయం నుంచి జాతీయ అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. దాంతో దీనిని అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి చేస్తున్నారు. ఇక్కడ నుంచి దేశంలోని అన్ని నగరాలకు విమాన సర్వీసులు అందుబాటులో ఉంచే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. దీనివల్ల దీనికి అంతర్జాతీయ విమానాశ్రయం హోదా లభించింది. గన్నవరం-విశాఖపట్నం, గన్నవరం-హైదరాబాద్, గన్నవరం-తిరుపతి, గన్నవరం - కడప మధ్య సర్వీసులు పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాష్ట్రం నుంచి అన్ని విమానాలు 90 నుంచి 95 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తుండటం పరిగణనలోకి తీసుకుంటున్నారు. గన్నవరం నుంచి దేశంలోని ఇతర పెద్ద నగరాలకు కనెక్టివిటీ కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్రంలోని విమానాశ్రయాలను ప్రాంతీయంగా అనుసంధానం చేసేందుకు ఎయిర్‌పోర్ట్ అథారిటీ - పౌరవిమానయాన శాఖ - ప్రభుత్వాల మధ్య ఒప్పందం కూడా జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం రాష్ట్రంలో విమానాశ్రయాల మధ్య తక్కువ ఛార్జీలతో ప్రాంతీయ పౌర విమాన సర్వీసులు పెరుగుతాయి. ఇందులో భాగంగా విజయవాడ-కడప మార్గంలో రోజుకు రెండు పర్యాయాలు, విజయవాడ-పుట్టపర్తి మార్గంలో రోజుకు ఒక పర్యాయం చొప్పున విమాన సర్వీసులు నడిపే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతానికి 8 నుంచి 20 సీటర్ల చిన్న ఎయిర్‌క్రాఫ్ట్‌లను నడపనున్నారు. అవసరమైన అనుమతులు రాగానే జనవరి 1 నుంచి ఈ సర్వీసులు పూర్తిస్థాయిలో నిర్వహిస్తారు. హైదరాబాద్-విజయవాడ-హైదరాబాద్ మధ్య మరిన్ని విమాన సర్వీసులు నడపడానికి ఎయిరిండియా, జెట్ ఎయిర్‌వేస్, ఇండిగోవంటి విమానయాన సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. తిరుపతి విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తాయి. అక్కడ 3 అదనపు పార్కింగ్ బేస్‌తో విస్తరణ పనులు ఇప్పటికే దాదాపు 90 శాతం పూర్తయ్యాయి. గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ విమానాశ్రయం హోదా రావడంతో కోడ్-ఇ తరహా విమానాలను నడిపేందుకు వీలుగా ప్రస్తుత రన్‌వే విస్తరణ పనులు చేపట్టారు.
రాజమండ్రిలోని మధురపూడి విమానాశ్రయంలో ప్రయాణీకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని రన్‌వేని విస్తరిస్తున్నారు. రూ.181 కోట్ల వ్యయంతో ఈ రన్‌వే విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక్కడ 3 అదనపు పార్కింగ్ బేస్‌లకు సంబంధించి యాప్రాన్ నిర్మాణం పూర్తయింది. జనవరి 16న ఇక్కడి నుంచి ఒకేసారి 4 సర్వీసులు ప్రారంభించనున్నట్లు ఇండిగో సంస్థ ఇప్పటికే ప్రకటించింది. హైదరాబాద్‌కు 2, బెంగళూరు, చెన్నైలకు ఒక్కొక్కటి చొప్పున 8 సర్వీసులు నడపుతారు. ప్రస్తుతానికి ఇక్కడ స్పైస్‌జెడ్, ట్రూజెట్‌లు ఒక్కొక్కటి, జెట్‌ఎయిర్‌వేస్ 2 సర్వీసులు నడుపుతున్నాయి. గోదావరి పుష్కరాల ముందు డీగ్రేడ్‌లో ఉన్న ఈ విమానాశ్రయం సీ గ్రేడ్ సాధించింది.
కుప్పం, దొనకొండ, నాగార్జునసాగర్, పుట్టపర్తిలలో ప్రస్తుతం బ్రౌన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. దొనకొండ విమానాశ్రయం విస్తరణ కోసం ఎయిర్‌పోర్టు అధారిటీ ఆఫ్ ఇండియాకు ప్రభుత్వం లేఖ రాసింది. భోగాపురం, దగదర్తి విమానాశ్రయాల కోసం ఇప్పటికే భూసేకరణ మొదలైంది. ఓర్వకల్లు విమానాశ్రయం కోసం పర్యావరణ అనుమతులు లభించాయి. 2022 నాటికి పెట్టుబడులు పెద్దఎత్తున ఆకర్షించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం దేశీయ విమానయాన రంగం అభివృద్ధికి కృషి చేస్తోంది. పుట్టపర్తిలో ఫ్లయింగ్ అకాడమీ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది.

-ఎస్.నాగార్జున