సబ్ ఫీచర్

పొదుపుతోనే మరింత శక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధునిక జీవితంలో విద్యుచ్ఛక్తి వినియోగం లేకుండా మనిషి మనుగడ సాధించలేకపోతున్నాడు. మన జీవనశైలిలో వచ్చిన మార్పులు, అందివచ్చిన సౌకర్యాలు దీనికి కారణం. అయితే వాటిని వినియోగించుకునేందుకు విచ్చలవిడిగా విద్యుత్‌ను వాడుకుంటున్నాం. విద్యుత్ ఉత్పాదనకు పెద్దఎత్తున ఖర్చు ప్రజాధనం ఖర్చు అవుతోంది. అయితే మనం వాడుకునే విద్యుత్‌లో ఎక్కువభాగం వృధా అవుతోంది. ఈ శక్తి వినియోగంలో పొదుపు పాటించడం అత్యవసరం. నీరు, బొగ్గు, గ్యాస్, సూర్యరశ్మి ద్వారా అవసరమైన విద్యుచ్ఛక్తిని మనం ఉత్పత్తి చేస్తున్నాం. కోట్లాది సంవత్సరాల పాటు భూగర్భంలో మగ్గి తయారైన బొగ్గు, గ్యాస్, పెట్రోల్ వంటి ఇంధనాలను మనం విచ్చలవిడిగా వాడేస్తున్నాం. ఇప్పుడున్న వాటి నిల్వలలు మానవాళి అవసరాలకు మరో 40 ఏళ్ల వరకు తీరుస్తాయి. ఆ తరువాత మన పరిస్థితి ఏమిటి? విద్యుత్ ఉత్పత్తిలో సంప్రదాయ విధానాల నుంచి ఆధునిక, పొదుపు, తక్కువ ఖర్చుతో, పునరుత్పత్తి చేసే విధంగా సరికొత్త విధానాలను రూపొందించాలి. పరిశోధనలు చేయాలి. విద్యుత్ వినియోగంలో పొదుపు పాటించడం, వృధాను అరికట్టడం, బొగ్గు, గ్యాస్, నీటి ద్వారా విద్యుచ్ఛక్తిని ఉత్పత్తి చేయడం తగ్గించి అణు, సౌరవిద్యుత్ ఉత్పత్తి విధానాలను ప్రోత్సహించడం అత్యవసరం. ఈ అంశాలను ప్రజలకు అర్ధమయ్యేలా చెప్పి విద్యుత్‌ను ఆదా చేసేలా వారిని చైతన్యవంతులను చేయాలన్నది ప్రతీ దేశం లక్ష్యంగా పెట్టుకుంది.
మన దేశంలో ఈ లక్ష్య సాధనకు19971లో పెట్రోలియం కన్సర్వేషన్ అసోసియేషన్‌ను భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ 2001 వరకు పెద్దగా చర్యలు తీసుకున్నది లేదు. ఆ తరువాత ఆ బాధ్యతను బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బిఇఇ) 2002లో ఆవిర్భవించిన తరువాత భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. భారతదేశంలో విద్యుత్ సంరక్షణ, పొదుపు మార్గాలను అనే్వషించి సమర్ధంగా, నిరంతరాయంగా, దుర్వినియోగం కాకుండా విద్యుచ్ఛక్తిని వినియోగించేందుకు వివిధ కార్యక్రమాలను రూపొందించి ప్రతిపాదనలు చేస్తోంది. క్రేంద్ర ప్రభుత్వం ఆయా విధివిధానాలను అమలు చేస్తోంది. పరిశ్రమలు, సంస్థల్లో విద్యుత్‌ఆదా, శక్తి వినియోగంలో నూతన విధానాలను అమలు చేస్తూ పొదుపు, తక్కువ వినియోగంతో పనులు చక్కబెట్టడం వంటి వాటిని ప్రోత్సహిస్తోంది. ఏటా డిసెంబర్ 14వ తేదీని విద్యుచ్ఛక్తి సంరక్షణ దినోత్సవాన్ని నిర్వహిస్తూ చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తోంది. నాలుగు నుంచి 9వ తరగతి లోపు పిల్లలకు విద్యుత్ పొదుపుపై దేశవ్యాప్తంగా చిత్రలేఖన పోటీలు నిర్వహిస్తోంది. వివిధ సంస్థలు, పరిశ్రమలకు విద్యుత్‌పొదుపు పోటీని నిర్వహిస్తోంది. విజేతలకు నేషనల్ ఎనర్జీ కన్సర్వేషన్ అవార్డులను, బహుమతులు అందిస్తోంది. ఈ ఏడాది 1.22 కోట్లమంది చిన్నారులు, 322 సంస్థలు, పరిశ్రమలు ఈ పోటీలో పాల్గొన్నాయి. ఈ ఏడాది రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ విజేతలకు బహుమతులు అందజేయనున్నారు. స్థిరమైన అభివృద్ధి కోసం ఐక్యరాజ్య సమితి రూపొందించిన సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ సాధనకు వీలుగా ‘ద వరల్డ్ ఎకనామిక్ సిట్యుయేషన్ అండ్ ప్రాస్పెక్టస్ 2018’ నివేదికను విడుదల చేసింది. మనదేశంలో ఈ ఏడాది ఆర్థిక ప్రగతి మందగించింది. అయితే వచ్చే ఏడు ఇది 7.2, 2019లో 7.4 నాలుగుగా ఉంటుందని అంచనా వేసింది. సమగ్ర అభివృద్ధికి విద్యుచ్ఛక్తి అవసరం.
విద్యుచ్ఛక్తి వినియోగంలో ఆధునిక విధానాలు, పొదుపు పాఠాలు నేర్చుకుని ఫలితాలు సాధిస్తున్న దేశాలలో అమెరికా, ఇంగ్లండ్, చైనా, దక్షిణ కొరియా ఉన్నాయి. మనం వాటి అనుభవాలను పరిగణనలోకి తీసుకుంటున్నాం. ఇప్పటికే వివిధ రాష్ట్రాలు విద్యుచ్ఛక్తి వినియోగాన్ని తగ్గించడానికి సంప్రదాయేతర విధనాలను ప్రోత్సహిస్తున్నారు. సోలార్ విద్యుత్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నించేవారికి అండగా ప్రభుత్వాలు నిలుస్తున్నాయి. ఇక వీధిదీపాలు, ఇండ్లలో వాడే సాధారణ దీపాలకు బదులు సిఎఫ్‌ఎల్, ఎల్‌ఇడి బల్బులను చౌకగా, కొన్ని వర్గాలకు ఉచితంగా ఇస్తున్నారు. డెస్‌టాప్‌లకన్నా లాప్‌టాప్‌లకు విద్యుత్ తక్కువ వినియోగం అవుతుందని, అవసరం లేనప్పుడు టీవీలతోపాటు వాటికి విద్యుత్ సరఫరా చేసే స్విచ్‌లను కూడా ఆపాలని, వాషింగమెషిన్‌లను పూర్తి సామర్థ్యం మేరకు వాడాలని, రిఫ్రిజిరేటర్లు, ఏసీ మిషన్లను జాగ్రత్తగా వాడాలని, నీటిని వృధా చేయకూడదని, మైక్రోవొవెన్, ఇండక్షన్ టాప్ వంటి ఆధునిక పరికరాల వల్ల 40 శాతం విద్యుత్ లేదా గ్యాస్ ఆదా అవుతాయని నిపుణులు సూచిస్తున్నారు. ఆయా అంశాలను బిఇఇ, రాష్ట్ర ప్రభుత్వాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. కేంద్రం కూడా ఎల్‌ఇడి బల్బులను ఉచితంగా ఇచ్చే కార్యక్రమం విస్తృతంగా అమలు చేస్తోంది. విద్యుత్ ఉత్పాదనకు, వినియోగానికి మనం పెద్దఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నాం. వ్యర్థాలు, చెత్త ద్వారా, మళ్లీ మళ్లీ వినియోగించే విధానాల ద్వారా విద్యుత్ ఉత్పత్తికి కొత్తకొత్త పద్ధతుల్ని అమలు చేస్తున్నాం. ఇలా పొదుపు పాటించడం ద్వారా కేవలం బిఇఇ నిర్వహించిన పోటీల్లో పాల్గొన్నవారు ఆదా చేసినదానికి విలువకడితే దాదాపు ఏడాదికి 48 వేల కోట్ల రూపాయల విలువైన విద్యుత్ ఆదా అయినట్లు లెక్క. 44 బిలియన్ కిలోవాట్ల విద్యుత్‌ను పొదుపువల్ల మిగల్చగలిగాము. 5.1 బిలియన్ లీటర్ల ఇంధనాన్ని, 22.6 మిలియన్ మెట్రిక్ టన్నుల రాకాసిబొగ్గును, 250 బిలియన్ క్యూబిక్ మీటర్ల సహజవాయువును మనం మిగుల్చుకోగలిగామన్నమాట. మనం ఇంట్లో వాడే విద్యుత్‌లో ఆదా చేసే ఒక యూనిట్ విలువ రెండు యూనిట్ల విద్యుత్ ఉత్పత్తికి సమానం.
తెలంగాణలో విద్యుత్ చాలా కీలకం. తెలంగాణ ప్రభుత్వం కొలువుదీరాక భాగ్యనగరంతోపాటు ప్రధాన నగరాల్లో ఎల్‌ఇడి బల్బుల వినియోగాన్ని విస్తృతం చేసింది. వ్యవసాయంలో ఆటోస్టార్టర్ల వల్ల కలిగే నష్టాలను విస్తృత ప్రచారం చేస్తోంది. తక్కువ ఖర్చుతో మేలైన, నిరంతర విద్యుత్‌ను అందించేందుకు అడుగులు వేస్తోంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఎల్‌ఇడి బల్బుల వినియోగాన్ని ఒక ఉద్యమంలా అమలు చేసింది. 2020 నాటికి ఏటా 19,079 యూనిట్ల విద్యుచ్ఛక్తిని ఆదా చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకుంది. అమెరికా, ఐరోపా దేశాలు పాటిస్తున్న పొదుపు విధానాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈనెల 14 నుండి 20 వరకు ఎనర్జీ కన్సర్వేషన్ వీక్‌గా విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. నీటిని వృధా కాకుండా చూడడం, అవసరం లేకపోయినా బల్బులు, ఫ్యాన్లు, టీవీలను ఆన్ చేసి వదిలేయడం, ఇళ్లలో గ్యాస్ వాడకంలో జాగ్రత్తలు పాటించడం వంటి చిన్నచిన్న చర్యల వల్ల ఎంతో విద్యుత్ ఆదా అవుతుంది. అలాగే పరిశ్రమలు, సంస్థల్లో విద్యుత్ వినియోగాన్ని నియంత్రించే విధంగా ప్రోత్సాహకాలను వివిధ రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. గుజరాత్‌లో ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ అద్భుతమైన పథకాన్ని ప్రారంభించారు. ప్రతీ ఇంటికీ విద్యుత్, ఉచితంగా బల్బులు అందిస్తారు. అలాగే కశ్మీర్ ప్రభుత్వం కూడా సరికొత్త విద్యుత్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. సహజ వనరులు తగ్గిపోతున్న నేపథ్యంలో తక్షణం పొదుపుమంత్రం పఠించడం, పాటించడం తప్పదు. భవిష్యత్‌లో సమస్యలు రాకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ విధానాలు, పదేపదే వాడే వీలున్న విధానాలు, వస్తువులు, పదార్థాలతో విద్యుచ్ఛక్తిని ఉత్పత్తి చేయడం తప్పదు. ఆ దిశగా ప్రభుత్వాలు అడుగువేయాలి. ప్రజలు చైతన్యం కావాలి. అప్పుడు మన జీవితాల్లో వెలుగు స్థిరంగా ఉంటుంది.

-్భరతి