సబ్ ఫీచర్

విరాట్పురుషుడు(ప్రపంచ తెలుగు మహాసభలు )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవితం ఒక సుదీర్ఘయాత్ర. నిరంతర అనే్వషణ. ఒక అభ్యాసం. అపరిపూర్ణత నుంచి పరిపూర్ణత వైపుగా చేసే ప్రయాణం. ఈ పరిమిత జీవితానికి అపరిమితమైన శక్తిని కలిగించేదీ, వెలుగులను విస్తరింప చేసేదీ విలువను కలిగించేదీ మహాపురుష సందర్శనం. ఈ మహాపురుషుడు గురువు కావచ్చు. ప్రాణదాత కావచ్చు. జీవన పరమార్థాన్ని విప్పిచెప్పే వ్యాఖ్యాత కావచ్చు. ఒక ఆశ్చర్యం కలిగించే ప్రభావ పరిధిలో నీ చైతన్యాన్ని పరిపాలించే ప్రభువు కావచ్చు. తాత్త్వికుడు కావచ్చు. సాత్త్వికుడు కావచ్చు. కవియో, కళాకారుడో, శిల్పియో, గాయకుడో కావచ్చు. యోగి కావచ్చు. ఎవరైనా ఒక విలక్షణమైన శక్తి స్పందం చేత సన్నిహితుడైనవాని పాత్రతను బట్టి ఊర్థ్వముఖంగా, దివ్యముఖంగా పరిణమింపజేసేవాడై అతని జీవన రథానికి సారధి అవుతాడు.
మహా పురుషుల పరిచయం, సాన్నిహిత్యం, అత్యంతం ఆశ్చర్యాన్ని కలిగించే అతని వ్యక్తిత్వ పార్శ్వాలను దర్శించగలగడం, బ్రతుకులో, అన్ని విబ్జియార్లకూ, భావలోకంలో, ఇంద్రధనూవర్ణశబలతకూ నడుమ వైరుధ్యాలు అసంపూర్ణతలు కూడా ఎంతో విలువైనవి.
ఆ మహాపురుషుని నిర్యాణం తరువాత పాతికేండ్లు గడచిన తరువాత కూడా ఆ వ్యక్తిత్వంలోని మణిభంగదీప్తులు ఇంకా ప్రకాశిస్తూనే ఉండటం ఎంత అద్భుతమైన అంశమో ఆలోచిస్తే ఆశ్చర్యం కలుగుతుంది.
ఆ మహాపురుషుని ముద్ర జీవితంతో విడదీయరానిదై ఉజ్జ్వలంగా ప్రకాశిస్తూ వుండటం మన బ్రతుక్కు ఒక విలువను సంపాదించడం, స్మరించుకోవడం మనకు ముఖ్యమైన అంశమే.
నా జీవితంలోనూ ముగ్గురు మహాపురుషుల సంసర్గం లభించింది. ఒకరి పరిచయం కేవలం పరోక్షమైంది. భావరూపమూ, వాఙ్మయరూపమైంది. ఇరువురైతే భౌతికంగా నా జీవిత పథంలో నడిచిపోయారు. పోతున్నారు.
అలా నా జీవన పరిధిలో సాగిపోయిన మహానీయులు శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు. ఆ సాగిపోయిన సన్నివేశాలు, అవిస్మరణీయములైన ముద్రలూ చెప్పుకోవడం ప్రారంభించితే అది ఒక గ్రంథమే అవుతుంది.
ఆజానుబాహుడై చూపులతో వాక్కులతో ఎవరినైనా ఆకర్షించగల ఆ మహాత్ముణ్ణి 1951లో తొలిసారి వరంగల్లు ఆంధ్ర సారస్వత పరిషత్తు వార్షికోత్సవాలకు వచ్చినపుడు చూడటమే. అప్పటికి ఆయన సాహిత్యాన్ని గురించి కొంచెం కొంచెం తెలుసు. ఆరాధన కానంత అభిమానం. చిట్టిగూడురులో ప్రాచ్య కళాశాలలో 1949 నుంచి చదువుతున్న మా చిన్నాయన సంపత్కుమారాచార్యుల గారి వల్లనే ఈ పరిచయం. అప్పుడు రెండోమూడో ఉపన్యాసాలు వినటం జరిగింది. ఆయన భౌతిక వ్యక్తిత్వమూ, సారస్వత వ్యక్తిత్వమూ జమిలిగా అవిభాజ్యంగా తోచి రసప్రపంచంలోకి సాగిపోయే అవకాశము లభించింది.
అమృతసమమైన ఆ రసప్రపంచంలో నన్నయ తిక్కనలూ, శ్రీనాథ పోతనలూ, రాయలు పెద్దనలూ సంగమించిన విలక్షణత దర్శనమిచ్చేది. అయినా ఇన్నింటినీ మించిన, మనకు వ్యక్తావ్యక్తంగా అతీతమైన చైతన్య శిఖరం కనిపించేది. ఒక రవీంద్రుని, ఒక వాల్మీకిని చూడలేదన్న కొరత ఎప్పుడూ అనిపించలేదు. నా ప్రపంచంలో ఆయన ఒక మిన్నులవాన, తేనెలమబ్బు, తట్టుకోలేని తుఫాను. వ్యక్తిగతంగా ఆయనలో పసిపిల్లవాడికుండే అమాయికత, అమృతమయమైన హృదయం, తొందరలో కటువుగా మాట్లాడినా ఎవరినీ ద్వేషింపలేని హృదయం, ధనాన్ని కీర్తినీ వద్దనకపోయినా అంతస్సులో నెలకొని ఉన్న నిజమైన వైరాగ్యం, అలిప్తత, సమానానాం ఉత్తమ శ్లోకతత్వం - ఇవన్నీ ఆయనలోని మరొక పార్శ్వం.
ఈ రెండు వ్యక్తిత్వాల మధ్య అత్యంతికమైన వైరుధ్యం ఏమీ లేదు. మానవ సహజములైన కొన్ని బలహీనతలు ఉండటం వాస్తవమే అయినా జీవితానికి మకుట

ప్రాయాలైన ఔదార్యము, క్షమ, దాక్షిణ్యము ఆయనను నడిపించిన ప్రధాన లక్షణాలు.
మొత్తమీద ఆయనలోప్రతిఫలించేది రజోముఖమైన సత్త్వము. సత్త్వము జీవుని చింతనలోని గాఢతకు వేదనకు కారణం కాగా రజస్సు అనితర దృశ్యమానమైన సృజన శీలానికి హేతువుగా రూపొందింది.
ఆంధ్ర సారస్వత పరిషత్తులో శ్రీ సత్యనారాయణగారి ఉపన్యాసాలు మూడూ వినటం నాకు అరుదైన సన్నివేశం మనస్సులోని సంస్కార సంపుటి కుదురుకొనే ప్రాయం. మాతృభాషాభిమానం, ఆంధ్ర సారస్వతం మీద అభిరుచి, కవితాస్వాద వైఖరి ఈ మూడు నాలో బీజభూతంగా కుదురుకున్నాయి. ఒక ఉపన్యాసం చమన్ దగ్గరలోని, మాధ్యమిక పాఠశాలలోనూ, ఒకటి వేయిస్తంభాల గుడిలోనూ జరిగాయి. వేయిస్తంభాల గుడికి మేం నడిచిపోతున్నాం. సత్యనారాయణగారూ, ఆయన సోదరులూ (వేంకటేశ్వరులుగారు) టాంగాలో పోతూవుండగా చూచాము. వారు ఇంద్రావరుణుల్లాగా కనిపించారు. శ్రీ వేంకటేశ్వరులుగారి నీడలో నేను పద్యవిద్యాభ్యాసం చేశాను. అప్పటికి నేను వ్రాసిన పద్యాలన్నీ చూచి ఏది ఏమైనా లోకంలో వ్యక్తిని పొగిడే పద్యాలు వ్రాయవద్దు అన్నారు. ఆ మాట నాకు ఇప్పటికీ మార్గదర్శకంగా రూపొందింది. ఆయన గొప్ప అధ్యాపకులు. వ్రాసే పద్యంలో ప్రౌఢిమ, జిగి ఉండేది. శ్రీ సత్యనారాయణగారి వాఙ్మయంతోనూ పరిచయం పెరుగుతూ వచ్చింది. కావ్యమును చూడటంలోని గాఢత్వం, ఆస్వాదలక్షణం, వస్తువులో ప్రత్యక్షంగా గూఢంగా ఉన్న శాస్త్రాంశాలను గమనించే నేర్పు అప్పుడే అలవడుతున్నది. శ్రీ సంపత్కుమారగారు నేనూ కలిసి రచించిన తొలి పద్యరచన హృద్గీతకు వేంకటేశ్వరులుగారే ముందుమాట సత్యనారాయణ గారితో వ్రాయించారు.1951 ప్రాంతాలలో ఆంధ్ర పత్రికలో సీరియల్‌గా ప్రచురితమైన ‘స్వర్గానికి నిచ్చెనలు’ అప్పుడు చదివిన గురె్తైతే లేదుగానీ 1954-55లో ప్రచురితమైన ‘తెరచి రాజు’ (వారానికి రెండుసార్లు వచ్చేది) చదవడం గుర్తే. ఆ రోజుల్లోనే విశ్వనాథ వారు కరీంనగర్ జగిత్యాలలో సాహితీ యాత్ర చేశారు, శ్రీ జువ్వాది గౌతమరావుగారి ప్రేరణతో. వరంగల్‌లో వారి విడిది శ్రీ వేంకటేశ్వర్లు గారి ఇంటిలోనే. అప్పుడు వారిని కలుసుకోవటం, ఆయన చేసే ప్రసంగాలకు శ్రోతలుగా ఉండటం గొప్ప. తొలిసారి విమాన ప్రయాణం చేసిన విస్మయకర భావన. 1955 ఫిబ్రవరిలో కాలేజీలో ఇంటర్ చదువుతున్న మిత్రులం శ్రీ పేర్వారం జగన్నాథం ప్రభృతులం - సాహితీ
బంధు బృందం అనే సంస్థను స్థాపించుకున్నాం. దాని ప్రారంభోత్సవానికి విశ్వనాథ వారు వచ్చి సరస్వతీ తత్త్వాన్ని గురించి చక్కని ఉపన్యాసమిచ్చారు. స్థాపకాధ్యక్షుణ్ణి కావడం వలన నేను వేదికమీదనే ఉన్నాను. ఆనాటి వారి ఆశీస్సు గాఢత, బలమూ నాటి నుంచీ సాహిత్య స్ఫూర్తి రూపంలో నా జీవితాన్ని పాలిస్తూ వున్నది.
ఆ రోజుల్లోనే వరంగల్లులో శ్రీ మగదల రామచంద్రరావు అనే మిత్రుడు ఉండేవారు. ఆయనా ఐనాల హరీంద్రబాబు, నేనూ మా సంపత్కుమార గారూ అందరం కలసి విశ్వనాథను, కాటూరి వారిని చూచేందుకు విజయవాడ వెళ్లాము. రామచంద్రరావుకు కాటూరి విజయసారథి ఆత్మీయ మిత్రుడు. అప్పుడు శ్రీ సత్యనారాయణ గారితో రెండు మూడుసార్లు ప్రసంగించే అవకాశం లభించింది. ఇరవయ్యేళ్లు నిండీనిండని నాతో వారు ఆత్మీయంగా ప్రసంగించడం, సాహిత్య జీవితాన్ని గురించి తెలియజేయడం ఈనాడు తలుచుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. వారి సౌలభ్యమూ, సౌహార్దమూ అప్పుడే తెలిసివచ్చాయి. ఆ యాత్ర మాకు ఒక అరుణాచల శిఖరాన్ని, మీనాక్షీ దేవాలయాన్ని చూచి వచ్చినంత గొప్ప అనుభవం.
1956 ప్రాంతాలలో వరంగల్లులో శ్రీ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు అనే గొప్ప కవి ఉండేవారు. ఆయన పరమ మధురంగా పద్యం చెప్పేవారు. ఆ రోజుల్లో ఆంధ్ర విద్యాభివర్ధనీ పాఠశాలలో పోతన జయంతి సందర్భంలో కవి సమ్మేళనం జరిగింది. శ్రీ సత్యనారాయణగారు అధ్యక్షులు. నేనూ రామప్పగుడి అని కొన్ని పద్యాలు చదివాను. మెప్పుగా చూచారు. అయితే శ్రీ రామానుజాచార్యులుగారు దశావతార వర్ణన మాలిక చదివారు. విశ్వనాథవారు అది విని పులకించిపోయారు. అతనిని ప్రశంసిస్తూ ఆయన కవిత్వాన్ని పెద్దన కవితతో పోల్చినారు. తెల్లవారి తమ విడిది దగ్గరకు రమ్మని వారి ‘కల్యాణ రాఘవం’లో పద్యాలు విని, కల్పవృక్షం నుంచి సీతాకల్యాణ ఘట్టం చదివి వినిపించారు. తరువాత కల్యాణరాఘవం ప్రచురిస్తానని ఉత్సాహపడ్డారు. (అది తరువాత అలాగే వారి కావ్యం విని పులకరించిన కాటూరివారి ప్రేరణతో త్రివేణి పబ్లిషర్స్ (మచిలీపట్నం) అచ్చు వేయించారు).
ఈ సన్నివేశం శ్రీ సత్యనారాయణగారి భావుకతకు, పద్యం స్పందనకు సాక్ష్యం ఇచ్చేది. 1940 ప్రాంతాలలో విశ్వనాథ వారు కాళోజీ సోదరులకు అతిథిగా ఒక పర్యాయం ఉన్నారు. శ్రీ వానమామలై వరదాచార్యులు గారూ, శ్రీ గార్లపాటి రాఘవరెడ్డిగారూ తమ పద్యాలు వినిపించడానికి వచ్చారు. భోజనానంతరం మంచమీద పడుకుని విశ్రాంతి తీసుకుంటున్న విశ్వనాథ వారు అలాగే ఉండి వారి ప్రక్క కుర్చీలో కూర్చొని వినిపించమన్నారు. శ్రీ రాఘవరెడ్డిగారు పద్యాలు చదువుతున్నారు. రెండు మూడు పద్యాలు చదివేసరికి లేచి కూర్చున్నారట. మరి కొన్ని పద్యాలు చదివేసరికి మంచి మీదనుంచి దిగి నేలమీద ఉన్నారట. ఇది వారియందున్న కావ్యానుభవ పారమ్యాన్ని తెలియజేసే సన్నివేశం. దీన్ని శ్రీ కాళోజీ పదేపదే గార్గద్యంతో వివరించేవారు.
ఈ సంఘటనకు కొంచెం ముందే కరీంనగరంలో 1955 మార్చి 31, ఏప్రియల్ 1 తేదీలలో విశ్వనాథ షష్టిపూర్తి జరిగింది. అత్యంత వైభవంగా. వారిని గురించి నేను వ్రాసిన పద్యాలను విడిదిలో మా మాస్టారు శ్రీ వేంకటేశ్వరులు గారికి నేను వినిపిస్తున్నాను. ప్రక్కగదిలో మేల్కొని ఉన్నారేమో విశ్వనాథ వారు వాటిని వింటున్నారు. ఒక పద్యంలో తార్తీయమూర్తి అనే ప్రయోగం ఉన్నది. ఆ ప్రౌఢ ప్రయోగానికి మెప్పుగా అక్కడి నుంచి ఊ అని దీర్ఘంగా పలికారు. తరువాత ఆ పద్యంలో ఒకటో రెండో ఆనందలహరి అంకితంలో చోటు చేసుకున్నాయి.
కరీంగరం కాలేజీ ప్రిన్సిపల్‌గా, సాహిత్య అకాడమీ ఉపాధ్యక్షులుగా విశ్వనాథ వారు తరచుగా హైదరాబాదు వస్తుండేవారు. అంతలో జయంతి పత్రిక శ్రీ జువ్వాడి గౌతమరావు గారి ఆధ్వర్యంలో ప్రారంభమయింది. ఖమ్మంలో, హైదరాబాదులో, వరంగల్‌లో, రాజమహేంద్రవరంలో రామాయణ కల్పవృక్ష పఠనోత్సవాలు రెండు మూడు రోజులపాటు నిర్వహిస్తూండేవారు.
సృజనాత్మక రీతిలోను, సాహితీతత్త్వ ప్రచారంలోనూ శ్రీ సత్యనారాయణగారు అధికంగా క్రియాశీలంగా ఉన్నకాలం యిది. మ్రోయతుమ్మెద, సముద్రపుదిబ్బ, పురాణవైర గ్రంథమాల ఇంకా ఎన్నో నవలలు, కల్పవృక్షంలో సుందర యుద్ధకాండలు, కాళిదాసాదుల రచనలపై విమర్శలు. ఇలా ఎన్నో రచనలు వెలుగులోనికి వచ్చిన కాలం ఇది. విశ్వనాథ మధ్యాక్కరలు ఈ కాలపు రచనయే. ఒకసారి ఖమ్మంలో కల్పవృక్షోత్సవాలు జరుగుతున్నవి. విశ్వనాథ వారు ఆనాడే ప్రారంభం చేసిన కులస్వామి మధ్యాక్కరలు వినిపించారు. శ్రీ సత్యనారాయణ గారికి ఒక అలవాటు మొదటి నుంచి ఉన్నది. ఇంటికి వచ్చినవారికి తత్కాలంలో వ్రాస్తూ వున్న రచన తప్పకుండా వినిపించడం. ఆ విధంగా అతిథి రూపంలో ఉన్న సరస్వతికి సమర్పించడం. ఆస్వాదశక్తి వివిధస్తరాలను అంచనా వేసుకోవడం, తన రచనలో మార్పు పొందుతూవున్న భాషాపరమైన, అభివ్యక్తి శిల్పరూపమైన అందాలకు సహృదయుల ఒప్పుదలను సంపాదించడం - వ్యాఖ్యాన సహితంగా వినిపించడంతో, పాఠకులు అత్యంత సన్నిహితులు కావడం ఇదీ దీనివల్ల కలిగిన ప్రయోజనం
ఆయన రచనా ప్రపంచ పరిణామం గమనించిన వారికి సాహిత్య ప్రక్రియా నిర్వహణలో, పద్యరచనలో, తెలుగు పలుకుబడిని పెంపొందించడంలో, భాషాశక్తికి పదును పెట్టడంలో అనంతమైన ప్రయోగ లక్షణం, నూతనాంశాల ఆవిష్కారం ప్రత్యేకంగా అధ్యయనం చేయదగిన అంశం. విశ్వనాథ ప్రతిభా స్ఫూర్తికి ఏ ప్రక్రియగూడా దాని పరిమితులలో అది నిలిచివుండలేదు. అన్నీ విస్తరించి నూతనములైన సరిహద్దులను నిర్మించుకొన్నాయి. వారి కోప ప్రసంగాలను గురించి తరచూ వింటూంటాము. అది ఆయనలోని ఒకానొక పైనున్న పులి వేషం మాత్రమే. లోనున్న వ్యక్తిని గురించి మనకు తెలిసింది చాలా తక్కువ.
లేని కోపంబు వీరికై పూనుచుంటి లేని కామంబు వీరికై పూనుచుంటి
కృతకమయ్యెన రుూ బ్రతుకెల్ల వల్లరీ మనోజ్ఞ జటా శ శిభృచ్ఛలాట
అసలు వ్యక్తి అంతస్సులో నికామభవత్ పదచింతనానలోజ్జ్వలిత సనాథంగా లిప్తలను గడిపినవాడు. ఆ లిప్తలు నిరంతరాలుగానే గడిచాయి చివరి రోజుల్లో...

కోవెల సుప్రసన్నాచార్యులు