సబ్ ఫీచర్

ఐదు వేలకే పెద్దాపరేషన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంకల్పం గట్టిగా వుంటే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయొచ్చు అని నిరూపించింది పశ్చిమ బెంగాల్‌కు చెందిన సుభాషిణి మిస్ర్తి. నోట్లోకి ఐదువేళ్లు పోవటమే గగనమైన ఓ నిరుపేద మహిళ పేదల కోసం ఆసుప్రతి కట్టించి వారికి ఐదువేల రూపాయలకే ఆపరేషన్లు చేయస్తోంది. మానవతకు నిలువెత్తు నిదర్శనం. ఎందరికో స్ఫుర్తిదాయకం. మరెందరికో మార్గదర్శకం.
కోల్‌కతా సమీపంలోని హస్తపూర్ గ్రామానికి చెందిన సుభాషిణి మిస్ర్తి కూరగాయలమ్ముకుని జీవనం గడుపుకునే నిరుపేద మహిళ. 23 ఏళ్ల వయసులోనే ఆమె భర్త అనారోగ్యం పాలయ్యాడు. పేదరికం కారణంగా అతనికి సరైన వైద్యం చేయించలేకపోయింది సుభాషిణి. దాంతో అతను మరణించాడు. ఆ మరణం ఆమెలో ఒక సంకల్పాన్ని కలిగించింది. ఓ లక్ష్యాన్ని ఏర్పరచింది. తన భర్తలా మరెవరూ వైద్యం అందక మరణించకూడదనుకుంది. అందుకే తానే ఒక హాస్పిటల్ కట్టించాలనుకుంది. కాని దానికి తగ్గ ఆర్థిక స్థోమత తనకు లేదు. అలాగని ఆలోచనతో ఆగిపోలేదామె. తనకు చేతనైన ప్రతి పనిని చేసింది. డబ్బులు కూడబెట్టింది. తన పెద్ద పిల్లలిద్దర్నీ అనాధాశ్రమంలో చేర్పించింది. చిన్నకొడుకు అజోయ్‌ను డాక్టర్ చదివించింది. ఇరవై ఏళ్లపాటు తన లక్ష్యసాధనే జీవితంగా బతికింది. అలా దాచిన డబ్బుతో తనుండే ప్రాంతానికి దగ్గరలోనే ఒక ఎకరం భూమిని కొని ఒక షెడ్‌ను నిర్మించింది. చివరకు 1993లో ఆ ప్రాంతీయుల సహకారం,కొడుకు అండదండలతో ఒక చిన్న హాస్పిటల్‌ను ఏర్పాటుచేసింది.
ఈ హాస్పిటల్‌లో డాక్టరయిన ఆమె కొడుకు అజోయ్ వైద్య సేవలందించేవాడు. అలా ఆమె లక్ష్యం మేరకు ఏర్పాటైన హాస్పిటల్‌లో ఉచిత వైద్య సేవలు ప్రారంభమయ్యాయి. అంతటితో ఆగలేదు. ఆ హాస్పిటల్‌ను ఇంకా విస్తరించాలని మరింత మందికి ఉచిత వైద్యాన్ని అందించాలని నిర్ణయించుకొని మరింతగా శ్రమించింది. కూరగాయల అమ్మకాన్ని కొనసాగించి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుంది. ఈ పనిలో పెద్ద కొడుకు సుజోయ్ చేదోడుగా నిలబడి పెద్ద పెద్ద సంస్థలను, ఛారిటీ సంస్థలను కలిసి నిధులను సంపాదించాడు. అలా సుభాషిణిని పట్టుదల, ఆమె కుమారుల సహకారంతో అధునాతన సదుపాయాలతో ఒక పెద్ద హాస్పిటల్ అప్పటి పశ్చిమ బెంగాల్ గవర్నర్ కె.వి.రఘునాథ్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమయ్యింది. సుభాషిణి మిస్ర్తి కోరిక మేరకు ఇందులో అందరికీ ఉచిత వైద్యమే అందుతుందని చెప్పాలి. ఇందులో సాధారణ వ్యాధులతో వచ్చేవారు కేవలం పది రూపాయలు చెల్లిస్తే చాలు. పెద్ద పెద్ద ఆపరేషన్‌లకు కూడా కేవలం ఐదు వేల రూపాయలనే వసూలు చేస్తున్నారు. ఇది కూడా చాలదంటుంది సుభాషిణి మిస్ర్తి. ఈ హాస్పిటల్‌ను ఇంకా విస్తరించాలని, ఇంకెంతోమందికి వైద్యాన్ని అందించాలని ఆశిస్తోంది. ఈమె చేసిన సేవలకుగాను 2009లో ప్రతిష్ఠాత్మకమైన గాడ్‌ఫ్రే ఫిలిప్స్ బ్రేవరీ అవార్డుతో రియల్ హీరోస్, రోటరీ ఇంటర్నేషనల్ వారి పలు అవార్డులు, స్వామి వివేకానంద అవార్డు- ఇలాంటి మరెన్నో అత్యున్నత పురస్కారాలను, గౌరవాలను సంపాదించుకుంది. అయితే వీటన్నిటికంటే తను ఏర్పాటుచేసిన హాస్పిటల్‌లో వైద్యం పొంది, ఆరోగ్యంతో తిరిగి వెళుతున్న పేదవారి సంతోషమే తనకు అత్యంత ఆనందం కలిగిస్తుందని అంటుంది మిస్ర్తి.

- మావూరు విజయలక్ష్మి