సబ్ ఫీచర్

సాయుధ పోరుకాదు.. సాఫ్ట్‌వేర్ ముఖ్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంటింటికీ ఇంటర్నెట్ సౌకర్యం అందుతున్న సమయమిది. ప్రపంచానికి కిటికీలు తెరవడమే ఇంటర్నెట్. ఈ కీలకమైన, విలువైన సాంకేతిక ఆవిష్కరణ ఇప్పుడు ఇంటింటికి చేరడం గొప్ప విప్లవం. అద్భుతం. విప్లవమంటే రక్తం కళ్లచూడ్డం, తుపాకులకు పని కల్పించడం, విధ్వంసం సృష్టించడం, అభివృద్ధిని అడ్డుకోవడం, ఆశలను తుంచేయడం కాదు. కాలానుగుణమైన మార్పును మెజార్టీ ప్రజల ముంగిళ్లలోకి తేవడమే నిజమైన విప్లవ సారాంశం. ఆ పనిని ఇప్పుడు ఇంటర్నెట్ కల్పిస్తోంది.
ఇంటింటికి కాదు ప్రతి చేతికి ఇంటర్నెట్ అందిస్తామని అనేకమంది సర్వీసు ప్రొవైడర్లు ముందుకొచ్చారు. బి.ఎస్.ఎన్.ఎల్. సైతం నడుం బిగించింది. ప్రతివ్యక్తిని సాధికారతవైపుకదిలించేందుకు విశేషంగా కృషి చేస్తున్నది. రిలయన్స్‌వారి ‘జియో’ ఇప్పుడు దేశంలో లక్షలాది గ్రామాలను, వేలాది పట్టణాలు - నగరాలను అనుసంధానం చేస్తూ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని 4జి రూపంలో ప్రజలకు అందజేస్తోంది. ఇదికదా విప్లవమంటే.. ఇదికదా విముక్తి, విమోచన అంటే.
ఈ సాంకేతిక విప్లవం పునాదిగా విద్యావైద్యరంగంలో చోటు చేసుకున్న మార్పులతో, ప్రపంచీకరణతో ప్రజల ఆలోచనల్లో గణనీయమైన మార్పు రావడంతో సామాజిక, ఆర్థిక పరిస్థితులు మారాయి. కొత్త తరాలకు పాత పరిస్థితుల పరిచయం లేకుండాపోయింది. కొత్త తరాలు ప్రపంచంతో పోటీపడుతూ హద్దులను, సరిహద్దులను చెరిపేస్తూ గ్లోబల్ వ్యక్తులుగా తమతమ సృజనను, శక్తిసామర్థ్యాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. దీన్ని మావోయిస్టులు పట్టుకోలేకపోయారు, పట్టుకోవాలన్న ఆసక్తినీ కనబరచడం లేదు.
ఇటీవల ప్రభుత్వానికి లొంగిపోయిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు జంపన్న ఈ విషయాన్ని కొంతవరకు పసిగట్టి దేశంలో గత పది - పదిహేను సంవత్సరాల్లో గణనీయమైన మార్పులు వచ్చాయి. భూస్వాములు ఒకరిద్దరు తప్ప గతంలో మాదిరి కనిపించడం లేదు కాబట్టి ‘అర్ధ భూస్వామ్య - అర్ధ వలస’ అన్న విశే్లషణ సరైంది కాదని ఆ రకమైన విశే్లషణలతో రూపొందించిన విధానాలను మార్చకుండా అలాగే ప్రయాణం కొనసాగించడం సరికాదని ఒక స్థూల నిర్ణయానికొచ్చారు. ఆ విషయాన్ని బహిరంగంగా ప్రకటించడం ఎంతో కొంత మేలు. అయితే ఆ పార్టీ అధికార ప్రతినిధి అభయ్ మాత్రం జంపన్నను సంవత్సరం క్రితమే బహిష్కరించామని ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. అప్పుడే ఈ ప్రకటనను విడుదల చేస్తే బాగుండేది. వారి వ్యవహారమంతా ఇలానే ఉండటం గమనార్హం. అతను ద్రోహి అని.. శిక్ష తప్పదని హెచ్చరించారు. విప్లవాన్ని తక్కువ అంచనావేశాడని వ్యాఖ్యానించారు. వారి గోప్యత వారి గొంతుకే చుట్టుకుంది. వారి పనివిధానం ఎలా ఉంటుందో దీనివల్ల అర్థమవుతుంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మావోయిస్టులు ప్రభుత్వంతో చర్చలు జరిపిన కాలంనాటికే ప్రపంచ పరిస్థితుల్లో, దేశకాల పరిస్థితుల్లో ఆనూహ్యమార్పులు చోటు చేసుకున్నాయి. టెక్నాలజీ గతంలో ఎప్పుడూ లేనంత విస్తృతమై సామాన్యుడి అరచేతిలోకి చేరింది. ఇంటర్నెట్ సౌకర్యం మనిషి ఆలోచనల సరళినే మార్చేసింది. దినచర్యను పూర్తిగా ప్రభావితం చేసింది. అయినప్పటికీ గ్రామీణ, ఆదివాసీ ప్రాంతాలకు ఆ వాతావరణం అందుబాటులో లేదన్న భావనతో మావోయిస్టులు భూమి పంపకంపైనే ఎక్కువ మక్కువ ప్రదర్శించారు. తమకు అందుబాటులో ఉన్న లెక్కలను ప్రభుత్వం ముందుపెట్టి ఆ డిమాండ్‌ను నెరవేర్చాలని ఒత్తిడి తెచ్చారు. డిజిటల్ ఎకానమీని అసలు పట్టించుకోలేదు.
అప్పటికే వందలాది మంది రైతులు, చేనేత కార్మికులు జీవనం గడవక, గిట్టుబాటుగాక ఆత్మహత్యలు చేసుకున్నారు. అయినప్పటికీ భూమి పంపకంపైనే దృష్టి నిలపడం, దాదాపు వంద సంవత్సరాల పూర్వపు దునే్నవాడికే భూమి అన్న నినాదం ఇవ్వడం, ఎర్రజండాలు పాతడం, గ్రామాల్లో భూస్వాముల వ్యవసాయాన్ని బంద్ చేయించడం వల్ల ఒరిగిందేమిటి? మరిన్ని ఆకలి చావులు, ఉపాధిలేక వలసపోవడం, బతుకు చితికిపోవడం తప్ప ప్రజలకు ఏ రకమైన ప్రయోజనం చేకూరలేదు.
కొంచెం మనసుపెట్టి పరిశీలన చేస్తే, ఆలోచన చేస్తే మావోయిస్టుల దుందుడుకు వ్యవహారం, తొందరపాటు నిర్ణయాలు, అత్యుత్సాహం, ఆవేశంతో ఊగిపోవడం, కాలాన్ని అంచనాకట్టలేని అశాస్ర్తియ వైఖరి స్పష్టంగా కనిపిస్తోంది.
చర్చలు జరిగిన అనంతరం ఈ దశాబ్దకాలంలో జరిగిన పరిణామాలను వారు పరిగణనలోకి తీసుకోనే లేదు. ఆ ఊపులో, వేడిలో విముక్తి ప్రాంతాలు, బేస్ ఏరియాలు, గెరిల్లా జోన్లు, ప్రజాసైన్యం, ఎర్రకోటపై ఎర్రజెండా ఎంత తొందరగా ఎగరేద్దామా?.. అన్న యావ తప్ప ప్రజల పాత్ర, వాస్తవిక పరిస్థితి, ప్రపంచం నాల్గవ పారిశ్రామిక విప్లవంతో జోరుమీదున్న వైనాన్ని, దావోస్ సదస్సుల్లో ప్రపంచ ఆర్థిక స్థితిగతులకు మార్గదర్శనం చేస్తున్న తీరును పసిగట్టకుండా దునే్నవాడిదే భూమి, మార్కెట్ రహిత ఆర్థిక వ్యవస్థ ద్వారా ప్రజల ముందుకు ఆదర్శ సమాజాన్ని తీసుకొస్తామని తుపాకి, మందుపాతరలు, రాకెట్ లాంచర్లు పేలిస్తే మిగిలింది ఏమిటి?.. హళ్లికి హళ్లి సున్నకు సున్నా మాత్రమే! వేలమంది ఆదివాసీల, అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. చురుకైన, తెలివైన యువత, విద్యార్థుల జీవితాలు అర్థంతరంగా ముగిశాయి. ఇందుకోసమా ఇంకా మావోయిస్టు ఉద్యమాన్ని కొనసాగించడం?.. ఈ ప్రశ్నను వరంగల్ జిల్లాకు చెందిన కొందరు మావోయిస్టులు లేవదియ్యడం వల్ల ఆ పార్టీలో చలనం వస్తుందని ఆశించినవారికి నిరాశే మిగిలింది. గతంలో లొంగిపోయిన దండకారణ్య మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి గూడ్సా ఉసెండీ సైతం ఈ విషయాలనే రేఖామాత్రంగా లేవదీశారు. తాజాగా జంపన్న (ఇద్దరు పూర్వపు వరంగల్ జిల్లాకు చెందినవారు) తన అభిప్రాయాలను, అవగాహనను పార్టీకి తెలిపారు. తన డ్రాఫ్ట్‌తోగాని, చర్చలతోగాని పార్టీ విధానాలు మారే అవకాశం లేదని, ఉండదని పార్టీ ఏరకంగా పనిచేస్తుందో నిశితంగా తెలిసిన వ్యక్తిగా ఘర్షణ పడకుండా ప్రభుత్వానికి లొంగిపోయాడు. దీనివల్ల ఎవరికి నష్టం?.. కచ్చితంగా మావోయిస్టు పార్టీకే. ఇలా కాలయాపన చేస్తూ, పరిస్థితులను, పదిమంది సీనియర్లు వెలిబుచ్చిన అభిప్రాయాలు, ఆలోచనలను సమీక్షించకుండా, కాలానుగుణమైన విధానాలు రూపొందించకుండా కొండపల్లి సీతారామయ్య రూపొందించిన విధానాలను అటుఇటు చేసి ఆధునిక కాలంలో ఆచరణలో పెట్టడానికే మొగ్గుచూపితే అదెలా ఆమోదయోగ్యమవుతుంది?
ప్రపంచాన్ని విశే్లషించే నైపుణ్యం మావోయిస్టుల్లో కొరవడింది. ఇప్పటికీ అమెరికా సామ్రాజ్యవాద దేశమని, ఆ దేశ అధ్యక్షుడు భారత దేశానికొస్తే భారత పౌరులను హతమార్చి తమ కోపాన్ని చల్లార్లుకోవడం చూస్తే వారెలాంటి అధ్యయన రాహిత్యంతో బాధపడుతున్నారో అర్థమవుతోంది. చైనా సైనిక ట్యాంకులను నడిపించి వేలాదిమందిని రక్తపుటేరుల్లో ముంచెత్తింది. తియాన్మన్ స్వేర్‌కు మాయనిమచ్చ తెచ్చింది. ఇదంతా దేనిని సూచిస్తోంది?.. అన్న ఆత్మవిమర్శ చేసుకోవాలిగా?.. చైనా చైర్మన్ మన చైర్మన్ అని నినదించిన పార్టీ నుంచి ఆవిర్భవించిన మావోయిస్టు పార్టీ ఆలోచనలు పూర్తిగా సంకుచితత్వంలోకి వెళ్లాయి.
పాతికేళ్ల క్రితమే బెర్లిన్ గోడ కూలిపోయి, తూర్పు, పశ్చిమ జర్మనీలు ఏకమైన సందర్భంలోనే ప్రపంచంలో రెండు వర్గాల సిద్ధాంతానికి నూకలు చెల్లాయని, ఆధునిక అద్వైతానికి ఆదరణ పెరుగుతోందని, ఆ వెలుగులోనే అశేష కార్మిక - కర్షకులకు మేలు ఎలా చేయగలమని ఆలోచించాల్సిందిపోయి, స్టాలిన్, హిట్లర్‌లకన్నా ఎక్కువ నియంతృత్వాన్ని ఎలా పాదుకొల్పాలన్న యావతో, ఉక్కుపాదంతో పాలించడానికి ఉవ్విళ్లూరడం వివేకవంతమైన ఆలోచన అవుతుందా?
ప్రజలపై అపారమైన ప్రేమ, వారి అభివృద్ధిపై అంకితభావంగలవారమని చెప్పుకునే మావోయిస్టులు, నక్సలైట్లు భారతదేశ పరిస్థితులను, ప్రజల ‘ఆత్మ’ను పట్టించుకోకుండా, తూర్పుయూరప్, రష్యాలోని పరిణామాలను గమనంలోకి తీసుకోకుండా, చైనా సోషలిస్టు రోడ్డును వదిలి పెట్టుబడిదారి మార్గం అనుసరించిన వైనాన్ని గుర్తించకుండా, నేపాల్ మావోయిస్టులు సాయుధపోరాటం ద్వారా ఆశించిన ‘మార్పు’ తీసుకురాలేమని స్పష్టంగా పేర్కొన్నా చెవిన పెట్టకుండా, కొలంబియాలో అరివీర భయంకరంగా యాభై ఏళ్లకు పైగా గెరిల్లా పోరాటం చేసిన మావోయిస్టులు జన జీవన స్రవంతిలో చేరిన విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా, దండకారణ్యం, దాని చుట్టుపక్కల ఆదివాసీలను, అమాయక ప్రజలను కత్తుల వంతనెపై నడిపించేందుకు అహోరాత్రులు శ్రమించడం వల్ల ప్రజలు ప్రపంచంతో కలిసి నడిచే అవకాశం ఉందా?.. ప్రత్యామ్నాయమన్న ఒక ముద్దుపేరు పెట్టుకుని విశ్రమించని విక్రమార్కుడిలా పనిచేస్తామంటే అదెలా ఆధునికత అవుతుంది?, శాస్ర్తియమవుతుంది? మార్క్స్ వౌలిక విశే్లషణకు 21వ శతాబ్దం సాంకేతిక పరిజ్ఞానం శ్రామిక వర్గానికి కల్పించిన - అందించిన జ్ఞానానికి అసలు పొంతన లేదు. అయినా శ్రామికవర్గ విముక్తి వర్గ రహిత సమాజంలోనే సాధ్యమని 21వ శతాబ్దంలో, నెటిజెన్ల కాలంలో, ప్రపంచం ఒక కుగ్రామం అని భావిస్తున్న తరుణంలో వర్చువల్ వరల్డ్‌లో బతకడం అభ్యాసం చేస్తున్న సమయంలో మావోయిస్టుల పంతం, కాలం చెల్లిన వైఖరి ఏ రకంగా ఉపయుక్తమైంది?
గుడ్సా ఉసెండీ, జంపన్న ఇంకా ఎందరో ఈ విషయమై చర్చ జరగాలని, కాలానుగుణంగా విధానాలు మారాలని సూచించినా మొండిగా, మూర్ఖంగా వ్యవహరించడంవల్ల నష్టపోయేది ప్రజలే.. ఏ ప్రజల కోసమైతే ప్రాణాలను సైతం పణంగా పెట్టామని చెబుతున్నారో ఆ ప్రజలే నష్టపోయే పనులు చేపడితే, దశాబ్దాల పాటు అదే దారిలో పయనిస్తే ఎవరైనా సమర్థిస్తారు?.. ఎలా సంఘీభావం తెలుపుతారు? సాయుధపోరాటం కాదు, నేడు సాఫ్ట్‌వేర్ ప్రజల సమస్యలకు పరిష్కారం చూపే కాలంలో ఉన్నప్పుడు ఆ దిశగా ఆలోచించడమే మేలు కదా? సాయుధ పోరాట పాత్రను సాఫ్ట్‌వేర్ నిర్వహిస్తున్న సంగతి పట్టించుకోకపోతే ఎలా?.. మావోలు ఇంకా పాపం మూటగట్టుకోవడం సబబు కాదుగదా?

వుప్పల నరసింహం 9985781799