సబ్ ఫీచర్

ఆత్మీయత కోల్పోతున్న అనుబంధాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఉదయానే్న అమ్మ పిలిచే ముద్దు పిలుపు మనకు లేదు.. బడికి బండిపై తీసుకెళ్లే నాన్న ఇక లేడు, రాడు అనే విషయాన్ని అర్థం చేసుకోలేని చిన్న వయస్సులో వారిని ఒంటరి వాళ్లను చేసి తమ స్వార్థానికి, తాత్కాలిక సుఖాలకు, సంతోషాలకు తల్లిదండ్రులు తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలు భవిష్యత్ తరానికి బాటలు వేయాల్సిన చిన్నారులను అనాథలుగా మార్చేస్తున్నాయి. దీనికి సమాజంలో పెరుగుతున్న వెర్రిపోకడలు, విచ్చలవిడితనాలే కారణమని చెప్పవచ్చు. పూర్వకాలంలో పెళ్ళి అనే బంధానికి చాలా విలువ, దానికి కట్టుబడి ఉండాలనే తపన ఇద్దరిలోనూ ఉండేది. రానురాను పెళ్లి అనేది ఒక ఈవెంట్‌లా మారిపోయింది. అప్పటివరకూ ఒకరంటే ఒకరికి ఉన్న వల్లమాలిన ప్రేమ పార్కుల్లో, సినిమా థియేటర్లలో, షాపింగ్ మాల్స్‌లోనూ తిరిగినప్పుడు కనిపిస్తుంది. సడన్‌గా అది మూడుముళ్ల బంధంగా మారి మూడుమూర్ల పసుపుతాడుగా మెడలో పడినప్పటి నుండి ఇద్దరిలోనూ వైరుధ్యాలు మొదలవ్వడానికి కారణం ఏమిటి? అప్పటివరకూ ఇద్దరికీ ఒకరిలో ఒకరికి కనపడని లోపాలు ఉన్నట్టుండి తెరమీదకు ఎలా వస్తాయి? ఇద్దరూ ఉద్యోగాలు చేస్తూ, యాంత్రిక జీవనం సాగిస్తున్న నేటి రోజుల్లో వీకెండ్ పార్టీలంటూ పబ్‌లకూ, క్లబ్‌లకూ వెళ్లి సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. అలా కాకుండా వారమంతా కష్టపడిన భార్యాభర్తలు మనసు విప్పి మాట్లాడుకోడానికి దొరికిన ఆ కొద్ది సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోవడంతో మనస్పర్థలు విత్తనంలా మొదలై.. వృక్షంలా మారి చివరకు అర్థం లేని అపార్థాలతో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు నేటి యువజంటలు.

ప్రతికూల వాతావరణంలో పెరిగిన పిల్లలు తమకంటూ ఉన్నత ఆశయాలను ఏర్పర్చుకొని, పరిపక్వత చెందటం మనం చాలా తక్కువ మందిలో చూస్తాం. పైపెచ్చు తల్లిదండ్రుల మితిమీరిన ప్రవర్తన చిన్నతనం నుండి గమనిస్తూ పెరిగిన పిల్లలు యవ్వనంలోకి అడుగుపెట్టగానే తమకంటూ విధి విధానాలను ఏర్పర్చుకోకపోగా జీవితం పట్ల అవగాహన లేకుండా చదువు పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారు. ఇలాంటి దృక్పథంలో ఉన్న పిల్లలకు తల్లిదండ్రులు నీతిబోధలు చేయాలని ప్రయత్నిస్తే అది సముద్రంలో చేరిన నీటిబిందువే అవుతుంది. పైపెచ్చు నువ్వు నాకు చెప్పే స్థాయిలో లేవని తల్లిదండ్రులను ఎదిరించి చెడు సావాసాల వైపు వెళ్లి బంగారం లాంటి జీవితాన్ని, భవిష్యత్‌ను బుగ్గిపాలు చేసుకుంటున్న నేటి యువతరం కథలు ఎన్నో.. ఎనె్నన్నో!

ఒక బిడ్డ కలిగి వాడు పెద్దవుతుంటే వారి మధ్య ప్రేమానురాగాలు పెరగడానికి బదులుగా బిడ్డ బాధ్యతలపై ఇద్దరూ వంతులు వేసుకుంటున్నారు. ఇలాంటి వాతావరణంలో పెరిగిన పిల్లల మానసిక పరిపక్వత ఏవిధంగా ఉంటుంది? సృష్టించే భగవంతుడు ప్రతి ఒక్కరినీ ఏదో ఒక ఉన్నతమైన ఆశయంతోనే జీవం పోస్తాడు. అలాంటప్పుడు దానికి మార్గం చూపించాల్సిన తల్లిదండ్రులే పెడదోవ పడుతుంటే వాళ్లు ఎటెళ్లాలో.. ఎవరికి చెప్పుకోవాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో పెరుగుతున్నారు. ఈ వాతావరణంలో పెరిగిన పిల్లలు సన్మార్గాన్ని ఎంచుకోడానికి బదులు చెడుమార్గానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారన్నది మేధావులు చెబుతున్న మాట.
అగ్నికి ఆజ్యం పోసినట్లు
సోషల్ మీడియా
ఇది నాణానికి ఒకవైపు అయితే, మరోవైపు ఇటీవలి కాలంలో అనేక ప్రసార మాధ్యమాల్లో వస్తున్న క్రైమ్ కథలు, ఆ నేపథ్యంతో వస్తున్న సినిమాలు యువతను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. ప్రసారం చేసే వారిది సదుద్దేశ్యం అయినప్పటికీ దానిలోని నిజాన్ని కాకుండా ఆ కథనంలో అనుసరించిన విధి విధానాలకు ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చి వాటినే అనుసరిస్తున్నవారు కొందరైతే.. వాటికి కొన్ని మార్పుచేర్పులు చేసి నేరాలు, మోసాలు చేయడానికి, ఆర్థిక నేరాలకు పాల్పడటానికి వినియోగిస్తూ తమ నేరచరిత్రకు వారే శ్రీకారం చుట్టుకుంటున్నారు. మరికొందరైతే ఆడపిల్లలను మభ్యపెట్టి లోబర్చుకోడానికీ వెనుకంజ వేయడం లేదు. అగ్నికి ఆజ్యం పోసినట్లు సోషల్ మీడియా కూడా దీనికి మరింత ఊతాన్ని ఇస్తోంది. ఇలాంటి నేరాలకు నెట్టింట్లో మరింత సమాచారం దొరుకుతుంటే నేరాలకు అలవాటుపడ్డ వారు చివరికి హత్యలకు, అత్యాచారాలకూ వెనుకాడడం లేదు.
బంధం గట్టిదైతే బంగారు జీవితం
ఇలాంటి సమాజం నుండి మన భవిష్యత్ తరాన్ని కాపాడుకోవాలంటే ప్రతిఒక్కరూ ముందుకు రావాలి. ముఖ్యంగా మానవతా విలువలను పెంపొందించే దిశగా అవగాహన సదస్సులు నిర్వహించాలి. జీవితం విలువను తెలియజేసేలా ప్రత్యేక శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయాల్సిన కనీస కర్తవ్యం మన ప్రభుత్వానిది. బంధాలకున్న విలువలను ఆ సదస్సుల్లో తెలియజేయాలి. మానవ సంబంధాలు కేవలం డబ్బు సంబంధాలే కావు.. ఆత్మీయతానురాగాలను పరిమళింపజేసే అపురూప అనుబంధాలనేది అర్థమయ్యే రీతిలో చిన్నతనం నుండి వారికి తెలియజెప్పేలా పాఠాలుండాలి. తల్లిదండ్రులు కూడా పిల్లలు తమను ఆదర్శంగా తీసుకునేలా సక్రమమైన మార్గంలో పయనించాలి. తప్పుడు మార్గంలో పయనించాలని ఆలోచన వచ్చినవారు దానికి కారణాలు ఏమిటనేది ముందస్తుగా తమను తాము ప్రశ్నించుకోవాలి. అంతేకాకుండా జీవిత భాగస్వామితో చర్చించి ఏ విషయంలో తమకు అసంతృప్తి కలుగుతోందో వారికి విడమర్చి చెప్పాలి. ఆ మార్గం నుండి బయటపడటానికి వారు ఏవిధంగా ఒకరికొకరు సహకరించుకోగలరో చర్చించుకోవాలి. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలకు తావుండాలి తప్ప, ఆధికత్యను ప్రదర్శించాలనే ఆలోచనలకు ఎవరికి వారు స్వస్తిపలకాలి. అలాంటప్పుడు కొంతమేర సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉంటుంది. అప్పటికీ సమస్య ఒక కొలిక్కి రాకపోతే రిహాబిలిటేషన్ సెంటర్లు, ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్లకు వెళ్ళి తమకున్న సమస్యను నిస్సంకోచంగా చెప్పుకోవాలి. సమస్యల పరిష్కారానికి మానసికవేత్తలు మార్గాన్ని చూపడమే కాకుండా మరింత మానసిక ధైర్యాన్ని పెంపొందించే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. భార్యాభర్తల బంధం విడదీయరానిదిగా ఉండాలి తప్ప, గట్టిగా లాగితే తెగిపోయే దారంలా మారకూడదు. తల్లిదండ్రుల బంధం గట్టిదైతే వారు జన్మనిచ్చిన బిడ్డల బంగారు జీవితం నూరేళ్లూ మూడు పువ్వులు.. ఆరుకాయలుగా విలసిల్లుతుందని చెప్పటం నిర్వివాదాంశం.

-వసుంధర.. 9885620065