సబ్ ఫీచర్

అతడొక నిప్పుకణం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు నేతాజీ జయంతి
*
‘‘నాకు మీ రక్తాన్ని ఇవ్వండి. నేను మీకు స్వాతంత్య్రాన్ని ఇస్తాను’’ అని గర్జించింది ఆ కంఠం. ఉత్సాహంతో ఉరకలెత్తుతూ స్వదేశంలోని బ్రిటిష్ ప్రభుత్వంపై యుద్ధానికి సిద్ధమవుతున్న ‘అజాద్ హింద్ ఫౌజ్’ సైనికులను ఉద్దేశించి సుభాష్ చంద్రబోస్ పలికిన పలుకులు ఇవి.
రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్‌వారి తరపున పోరాడి జర్మనీ, ఇటలీ, జపాన్ సైనికులకు చిక్కి జైళ్లలో మగ్గుతున్న భారతీయ ఖైదీలను విడిపించి వారిలో ఆత్మాభిమానాన్ని, దేశభక్తిని రగిలించి, మాతృదేశాన్ని దాస్య శృంఖలాలనుంచి విముక్తురాలిని చేయడానికి గొప్ప సైన్యాన్ని ఏర్పాటు చేశాడు నేతాజీ. ఒకటిన్నర లక్షల పైచిలుకు సైనికులతో ఏర్పడిన ‘అజాద్ హింద్‌ఫౌజ్’ ఆంగ్లేయుల్లో కలవరానికి కారణమైంది. ఆ సైనికులు బోసును ‘నేతాజీ’ అని ఆప్యాయంగా పిలిచేవారు.
వంగ భూమి అనేకమంది దార్శనికులకు, స్వాతంత్య్ర యోధులకు జన్మభూమి. 1904లో రాష్ట్ర విభజన ‘వందేమాతరం’ ఉద్యమానికి నాంది పలికింది. 1897 జనవరి 23న పండిత జానకీనాథ్‌బోసు, ప్రభావతిలకు జన్మించిన చంద్రబోస్ ఆ తరువాత దేశానికి ‘నాయకుడ’య్యాడు. కటక్‌లో ప్రాథమిక విద్య, తల్లిదండ్రుల నుంచి సంస్కారం నేర్చుకున్నాడు. ఆయన చదివిన పాఠశాల ప్రధానాచార్యులు శ్రీ వేణుమాధవ్‌దాస్ ప్రభావం సుభాష్‌పై ఎక్కువ. వివేకానందుడి రచనలు ఆయనకు స్ఫూర్తినిచ్చాయి. కానీ సుభాష్ ఐసీఎస్ చేయాలని తండ్రి కోరిక. కలకత్తాలో ఉన్నత విద్య తరువాత ఐసీఎస్ కోసం ఇంగ్లండ్ బయలుదేరాడు. 9నెలల స్వల్ప వ్యవధిలో ఐసీఎస్ పరీక్షకు తయారై 4వ ర్యాంకు సాధించిన బోస్ ఇంగ్లండులో ఉన్నప్పుడు ప్రపంచ రాజకీయ పరిస్థితులను అధ్యయనం చేశాడు. స్వతంత్ర దేశాలుగా బ్రిటన్, ఫ్రాన్స్ చేస్తున్న ప్రగతి సొంత దేశమైన భారత్‌లో ఎందుకు సాధ్యం కాదన్నది ఆయన మనసును తొలిచివేసేది. ఇక ఆ ఆలోచనల పరంపర స్థిరంగా ఉండనివ్వలేదు. ఐసీఎస్‌కు రాజీమానా చేసి స్వదేశానికి చేరుకున్నాడు. బంగబంధు చిత్తరంజన్ దాసు నాయకత్వంలో స్వతంత్ర పోరాటంలో పాలుపంచుకున్నాడు. అప్పుడే ఆయన భారత జాతీయ కాంగ్రెస్ ప్రచార సారథిగా నియుక్తుడయ్యాడు. స్వరాజ్య సేవాదళ్‌ను ఏర్పాటు చేసి సేవాకార్యక్రమాలు నిర్వహించాడు. ఉద్యమాలలో పాల్గొనడం, నిర్బంధానికి గురవడం మామూలైపోయింది. కాంగ్రెస్ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి సంపూర్ణ స్వరాజ్య సాధన లక్ష్యమని నినదించాడు. 1923 లాహోర్ కాంగ్రెస్‌లో ఆ మేరకు తీర్మానం చేశారు. 1938లో జరిగిన ‘హరిపూర్’ కాంగ్రెస్ నేతాజీ అధ్యక్షతన జరిగింది. దేశంలోని యువత బోసు ఆలోచనలు, మాటలకు ఉత్తేజితులయ్యేది. గాంధీజీ నాయకత్వంలోని మితవాదులకు ఆయన వైఖరి నచ్చేది కాదు. 1939లో కాంగ్రెస్ అధ్యక్షులుగా బోసు ఎన్నికవడం చరిత్ర. అయితే గాంధీజీ ప్రతిపాదించిన పట్ట్భా ఓటమిని జీర్ణించుకోలేని మితవాదులు బోసుకు సహకరించకపోవడంతో ఆయన రాజీనామా చేశారు. ఆ తరువాత కాంగ్రెస్‌లో ఉంటూనే ‘్ఫర్వర్డ్‌బ్లాక్’ పేరిట ప్రెషర్‌గ్రూపును ఏర్పాటు చేసి తన ఆశయ సిద్ధికోసం పోరాటం చేశాడు. ఉధృతస్థాయిలో ఉద్యమాలు చేస్తుండటంతో బ్రిటిష్ ప్రభుత్వం కలవరపాటుకు గురై గృహనిర్బంధం చేసింది. వౌల్వీ వేషంలో తప్పించుకుని జర్మనీ చేరిన సుభాష్ మాతృదేశ స్వాతంత్య్రం కోసం జర్మనీ రేడియోను ఆయుధంగా వాడుకున్నాడు. ఆయన ప్రసంగాలు ప్రజలను ఉర్రూతలూగించేవి. బెర్లిన్‌లో ‘ఇండియా ఇండిపెండెన్స్ డే’ ద్వారా రేడియో ప్రసంగాలతో దిశానిర్దేశం చేసేవాడు. జర్మనీ అధ్యక్షుడు హిట్లర్ సహకారంతో ‘అజాద్ హింద్ ఫౌజ్’ను నిర్మించాడు. అక్కడి నుండి జలాంతర్గామిలో ప్రయాణం చేసి జపాన్ చేరుకుని అక్కడి ప్రభుత్వంతో యుద్ధ సహకార ఒప్పందం కుదుర్చుకొన్నాడు. సింగపూర్ కేంద్రంగా తన కార్యకలాపాలు ప్రారంభించాడు. 1943 అక్టోబర్ 21న సింగపూర్‌లో 5వేలమంది భారతీయ ప్రతినిధుల సమక్షంలో నేతాజీ ‘అజాద్ హింద్ ఫౌజ్’ ప్రవాస ప్రభుత్వాన్ని ప్రకటించాడు. ఆ సమావేశంలో ఆయన ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. కెప్టెన్ లక్ష్మీసెహెగల్, ఎస్.ఎ.అయ్యర్, రాస్‌బిహారీ బోస్‌సహా 22మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ ప్రభుత్వాన్ని జపాన్ సహా తూర్పు ఆసియా దేశాలు గుర్తించాయి. ప్రభుత్వం సమర్ధవంతంగా పనిచేసేందుకు 1944లో ప్రవాస భారతీయుల సహకారంతో ఒక ‘బ్యాంకు’ను స్థాపించారు. 1943 అక్టోబర్ 24న నేతాజీ ప్రభుత్వం బ్రిటన్‌పై యుద్ధం ప్రకటించింది. చలో ఢిల్లీ అంటూ బోసు సింహగర్జన చేశాడు. అదే ఏడాది డిసెంబర్‌లో అండమాన్ నికోబార్ దీవులు వీరి అధీనంలోకి వచ్చాయి. తొలిసారిగా త్రివర్ణ పతాకం భారత భూభాగంపై రెపరెపలాడింది. ఆ దీవులకు నేతాజీ ‘స్వరాజ్’, ‘షహీద్’ అని పేరుపెట్టారు.
ఆ తరువాత జాతీయ సేనలు ‘జైహింద్’ అంటూ భారత ఈశాన్య భాగాలైన కోహిమా, కొలాంగ్‌లకు విముక్తిని సాధించిపెట్టాయి. అయితే రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ, జపాన్ లొంగిపోవడంతో బ్రిటిష్ సేనలది పైచేయి అయింది. అజాద్ హింద్ ఫౌజ్ సేనలు వెనక్కి తిరగక తప్పలేదు. సింగపూర్‌లో నేతాజీ మాట్లాడుతూ ‘విధి బలీయమైనది’ అని వ్యాఖ్యానించాడు. సింగపూర్ నుంచి ఆయన ప్రత్యేక విమానంలో ‘టోక్యో’ బయలుదేరాడు. దారిలో ఆయన ప్రయాణించిన విమానం ప్రమాదానికి గురైందని, నేతాజీ మరణించినట్లు జపాన్ రేడియో ప్రకటించింది.
అయితే నేతాజీ మాతృదేశ విముక్తి కోసం చేసిన పోరాటం వృధాకాలేదు. ఆయన కారణంగా దేశంలో స్వాతంత్య్ర కాంక్ష రగిలింది. ఎక్కడికక్కడ యువత స్వాతంత్య్ర పోరాటానికి సిద్ధమయ్యారు. ముంబయిలోని బ్రిటిష్ నావికాదళంలోని భారతీయ సైనికులు తిరుగుబాటుకు ఆ ఉత్సాహమే కారణమైంది. త్యాగము, దేశభక్తి, అనుకున్నది సాధించేవరకు విశ్రమించని కార్యదీక్ష సుభాష్ చంద్రుని జీవితం నుంచి మనం నేర్చుకోదగ్గ అంశాలు. వారి జీవితం నేటి యువతకు స్ఫూర్తి.

-వి.వి.సుబ్బారావు