సబ్ ఫీచర్

భగవంతుని అనుగ్రహమే.(ప్రసాదం )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతిరోజు భగవంతుడు గురించి, ఆయన లీలలు, మహిమలు, భగవత్త్వం గురించి, ఆధ్యాత్మికానికి సంబంధించి అనేక విషయాల్ని ప్రతిరోజు పాఠకులకు అందించాలనే ఆలోచన రావడం దైవ నిర్ణయం. దైవ ప్రసాదమే. ఏది జరిగినా ఇంకేం జరుగుతున్నా, ప్రతిదీ దైవ నిర్ణయం అని అనుకోవడం, అనుకోగల్గడం ప్రసాదాలన్నింటిలో మహాప్రసాదం.
‘కర్మణ్యే వాధికారస్తే.. ’ అని గీతాకారుడు గీతలో చెప్పాడు. పని, ప్రయత్నం మాత్రం నువ్వు చెయ్యి- దాని నుంచి వచ్చే ఫలితాన్ని ఆశించకు, ఆలోచించకు అని దానర్థం. ఫలితం ఏమొచ్చినా అది భగవత్ నిర్ణయమనుకున్నప్పుడు, అనుభవించగలిగినప్పుడు ప్రతిదీ ‘ప్రసాదమే’ అవుతుంది.
‘ప్రసాదాలు’ అన్నింటిలో ఏది ఉత్కృష్టమైన, మహోన్నతమైన ప్రసాదం అని ప్రశ్నించుకుందాం. ఇదే ప్రశ్నని ఓ మహనీయుణ్ణి ఓ సామాన్య వ్యక్తి అడుగుతాడు. ‘విభూతి’ ప్రసాదం అన్ని ప్రసాదాలలోను మహోన్నతమైనదని ఆ మహనీయుడు సమాధానం చెప్తాడు. ఎందుకు? ఎలా? అని మళ్లీ సందేహం వెలిబుచ్చేడు ఆ సాధారణ వ్యక్తి. సృష్టిలో ఏ పదార్థమైనా, ఎంత విలువైనది అయినా మరెంతో ఉపయోగకరమైనది అయినా క్షణికమైనదే. ఎప్పుడో ఒకప్పుడు నాశనమయ్యేదే. బూడిదయ్యేక దానికి మరో రూపం ఉండదు. మరో రూపంగా మారగలగటం అనేది ఉండదు. అది సత్యం. అచిరమైన, చలనమయ్యే అన్ని ఐశ్వర్యాలు మారే ఆఖరి స్థితి ‘బూడిద’. అంటే ‘విభూతి’. కాబట్టి ‘విభూతి ప్రసాదం’ జీవిత తత్త్వాన్ని బోధించే అందించే మహోన్నత ప్రసాదం అని జ్ఞానబోధ చేస్తాడా మహనీయుడు. ఎంతటి ఉన్నతమైన వివరణ! ఆధ్యాత్మికంగా జీవిత అర్థాన్ని పరమార్థాన్ని, పర అర్థాల్ని విడమరచి చెప్పే, ఎంతటి లోతున్న వివరణ అది! అద్భుతం!!
కొబ్బరి చెక్కో, బెల్లం ముక్కో, వడపప్పో, పానకమో, ప్రసాదం అని పిలవబడే వంకటమో ఏదైనా కావచ్చు. ఆఖరికి వండి వార్చిన అన్నమైనా కావచ్చు. ఏదైనా దానిని భగవంతుడికి నివేదన చేస్తే, భగవత్ శేషమైన.. ఆ అన్నం కాస్తా అన్నప్రసాదమవుతుంది. ముందు చెప్పిన పదార్థాలన్నింటినీ, నైవేద్యంగా భగవంతునికి నివేదన చేసి అర్పణ చేస్తే, పరమ పవిత్రతని ఆపాదించుకుని, దైవ ప్రసాదాలుగా మారిపోతాయి. భగవంతుని అనుగ్రహానికి ప్రతీకలవుతాయి. భక్తులు మనసుల్ని, హృదయాల్ని, మనోభావాల్ని భగవంతుని దరి చేరుస్తాయి. ఆనందాల అమృత తత్త్వాన్ని అందిస్తాయి.
ఎంతటి పనిలో ఉన్నా ‘ప్రసాదం’ అనగానే ప్రతి ఒక్కరూ భక్తి పారవశ్యంతో పరవశించిపోతారు. పరవళ్ళు తొక్కుతారు. వెంటనే పాదరక్షలు వదలి, రెండు చేతులు శుభ్రం చేసుకుని భక్తితో రెండు చేతులు చాచి వినమ్రంగా ప్రసాదాన్ని అందుకుంటారు. కళ్లకద్దుకుని ఆరగిస్తారు ఎవరైనా! ఎంతటి గొప్పవారైనా! భగవద్దర్శనం చేసుకోవడానికి తాము ఆ పుణ్యక్షేత్రాలకి వెళ్లలేకపోయినా, ఆ ప్రసాదంలోనే ఆ భగవంతుడిని దర్శించుకున్నంతటి అనుభూతికి లోనవురు ప్రతి ఒక్కరూ.
ఇది మాటలకందని ‘ప్రసాదం’ మహత్మ్యం!!
సత్యనారాయణస్వామి వ్రతకథలో ‘ప్రసాదం’ విశిష్టతను వివరించే ఘట్టాలు రెండుంటాయి. మనస్ఫూర్తిగా భక్తిప్రపత్తులతో సత్యనారాయణ స్వామి వ్రతం జరుపుకున్న ఓ అమ్మాయి, వ్యాపారం కోసం విదేశాలకేగిన తన పెనిమిటి వస్తున్నాడన్న వార్త తెలియడంతో పెనిమిటి మీదుండే ప్రేమతో ప్రసాదం ఆరగించకుండా పరుగు పరుగున సముద్ర తీరానికి వెళ్తుంది. ఫలితంగా తన పెనిమిటి ప్రయాణం చేస్తున్న ఆ పడవ అకస్మాత్తుగా సముద్రంలో మునిగిపోతుంది. తల్లిద్వారా ప్రసాదం ఆరగించలేదన్న తన తప్పు తెలుసుకున్న ఆ అమ్మాయి, పశ్చాత్తాపంతో ఇంటికి పరిగెత్తి ‘ప్రసాదం’ కళ్ళకద్దుకుని ఆరగిస్తుంది. ఫలితంగా మునిగిన తన పెనిమిది పడవ సముద్రంమీదకొచ్చి కథ సుఖాంతమవుతుంది.
‘ప్రసాదం’ అనేది కుల మత భేదాలకు, స్థారుూ, స్థానం తేడాలకు, హోదాలు, అంతస్థులకి అతీతమైనదనే సందేశాన్ని, భగవత్ తత్త్వాన్ని విశదపరిచే మరో సంఘటన కూడా సత్యనారాయణ వ్రత కథలో మనకి దర్శనమిస్తుంది.
ఇదీ ప్రసాదం విశిష్టత!
భగవంతుడు గురించి, భక్తి గురించి, భక్తుడి గురించి వివిధ కోణాల్లో అనేక రూపాలలో మొత్తంగా ఆధ్యాత్మిక తత్త్వాన్ని, బోధల్ని, ప్రబోధాల్ని ఎందరెందరో మహిమాన్వితులు వేసిన అడుగుల్లో అడుగు వేస్తూ.. వారందించిన మహత్తరమైన మహా మార్గంలో పయనిస్తూ ఆ మహిమాన్విత రూపాలకు, స్వరూపాలకు మనసా వాచా కర్మణా ప్రణమిల్లుతూ..

- రమాప్రసాద్ ఆదిభట్ల, 9348006669